తప్పుడు సలహాలు ఇక కుదరవు!! సెబీ కొత్త రూల్స్
ముంబై: సెక్యూరిటీస్ లావాదేవీలపై అనియంత్రిత ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు (ఫిన్ఫ్లుయెన్సర్లు) ఇచ్చే తప్పుడు సలహాలతో తలెత్తే రిస్కులపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై దృష్టి సారించింది. ఫిన్ఫ్లుయెన్సర్లను నియంత్రణ పరిధిలోకి తెస్తూ నిబంధనలను ఆమోదించింది.వీటి ప్రకారం ప్రతిఫలం తీసుకుని కచ్చితమైన రాబడులు వస్తాయంటూ సలహాలిచ్చే వ్యక్తులతో సెబీ నియంత్రణలోని వ్యక్తులు (బ్రోకర్లు మొదలైనవారు) కలిసి పని చేయకూడదు. సాధారణంగా కమీషన్ ప్రాతిపదికన పని చేసే ఫిన్‌ఫ్లుయెన్సర్లకు కొన్నాళ్లుగా తమ ఫాలోయర్ల ఆర్థిక నిర్ణయాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నారు. తామిచ్చే సలహాల విషయంలో ఫిన్ఫ్లుయెన్సర్లు జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు తాజా సెబీ నిబంధనలు ఉపయోగపడనున్నాయి.మరోవైపు, తరచుగా ట్రేడయ్యే షేర్లను డీలిస్ట్ చేయడానికి సంబంధించి ఫిక్సిడ్ ధర ప్రక్రియను ప్రవేశపెట్టాలని సెబీ నిర్ణయించింది. అలాగే, ఇన్వెస్ట్మెంట్, హోల్డింగ్ కంపెనీల (ఐహెచ్సీ) డీలిస్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ఆవిష్కరించింది. ఫిక్స్డ్ ధర విధానంలో డీలిస్టింగ్‌కు ఫ్లోర్ ధర కంటే కనీసం 15 శాతం ప్రీమియంతో ఆఫర్‌ను చేపట్టవలసి ఉంటుంది. డెరివేటివ్స్ నిబంధనలు కఠినతరం.. ఇండివిడ్యువల్ స్టాక్స్‌ను డెరివేటివ్స్ సెగ్మెంట్లో చేర్చడం, తీసివేయడానికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. క్యాష్ మార్కెట్లో పనితీరును బట్టి వాటిని చేర్చడం లేదా తీసివేయడమనేది ఉంటుందని పేర్కొంది. తక్కువ టర్నోవరు ఉన్న స్టాక్స్‌ను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ నుంచి తప్పించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. మరోవైపు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కేటగిరీని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది సెకండరీ మార్కెట్ అడ్వైజరీ కమిటీకి తన నివేదికను సమర్పిస్తుందని సెబీ చీఫ్ మాధవి పురి బచ్ తెలిపారు.