సీఎం యోగి మరో కీలక చర్య
లక్నో: ఉత్తరప్రదేశ్ లో నేరాలు నియత్రించే దిశగా యోగి ఆదిత్యనాథ్ సర్కారు కీలక చర్య తీసుకుంది. యాసిడ్ అమ్మకాలు, నిల్వ విధానాలను కఠినతరం చేసింది. యాసిడ్ దాడులు పెరిగిన నేపథ్యంలో సీఎం యోగి నిర్ణయం తీసుకున్నారు. యాసిడ్ అమ్మకాలు, స్టోరేజీకి సంబంధించిన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాహుల్ భట్నానగర్ ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు వెలువరించారు.
యాసిడ్ విక్రయించే వ్యాపారులు తమ దగ్గరున్న స్టాక్ వివరాలను ప్రతి 15 రోజులకొకసారి సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం)లకు తెలపాలి. ‘తప్పుడు వివరాలు సమర్పిస్తే మొత్తం స్టాక్ సీజ్ చేయడంతో పాటు, 50 వేల రూపాయల జరిమానా విధిస్తామ’ని భట్నానగర్ హెచ్చరించారు. ప్రతి నెలా ఏడో రోజు కలెక్టర్లు తప్పనిసరిగా యాసిడ్ విక్రయ దుకాణాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. విక్రయదారులు యాసిడ్ అమ్మకాలకు సంబంధించిన వివరాలు కచ్చితంగా నమోదుచేయాలన్నారు. కొనుగోలు చేసిన వారి పేరు, చిరునామాతో పాటు ఎంతమొత్తంలో యాసిడ్ కొన్నారనే వివరాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు.