
2029 నాటికి అంచనాలు
న్యూఢిల్లీ: దేశీయంగా రిజిస్టర్డ్ చిన్న, మధ్య తరహా సంస్థల సంఖ్య 2029 నాటికి 9 కోట్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నట్లు ఎంఎస్‌ఎంఈ శాఖ సంయుక్త కార్యదర్శి మెర్సీ ఇపావో తెలిపారు. ప్రస్తుతం ఉద్యమ్, ఉద్యమ్ అసిస్ట్ పోర్టల్స్‌లో నమోదు చేసుకున్న ఎంఎస్‌ఎంఈల సంఖ్య 6 కోట్ల పైగా ఉన్నట్లు పేర్కొన్నారు.
దేశీయంగా చిన్న సంస్థలను సంఘటితం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పరిశ్రమల సమాఖ్య అసోచాం కార్యక్రంలో పాల్గొన్న సందర్భంగా మెర్సీ వివరించారు. పెద్ద సంస్థలతో పోలిస్తే వీటికి బ్యాంకు రుణాల వితరణ వేగంగా పెరుగుతోందని ఆమె వివరించారు. స్థూల దేశీయోత్పత్తిలో ఎంఎస్‌ఎంఈల వాటా 30 శాతంపైగా, తయారీలో 36 శాతం, ఎగుమతుల్లో 45% పైగా ఉంటోంది.
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ..
అంతర్జాతీయంగా ఉత్పత్తుల తయారీ వ్యవస్థలో దేశీ ఎంఎస్‌ఎంఈలు మరింతగా భాగం అయ్యేలా చూడటంపై కసరత్తు చేస్తున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం మరో కార్యక్రమంలో తెలిపారు. సాధారణంగా పెద్ద కంపెనీలతో పోలిస్తే చిన్న సంస్థలపైనే నియంత్రణల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నియంత్రణలను సరళతరం చేయడంపై క్యాబినెట్ కార్యదర్శి సారథ్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటైనట్లు వివరించారు. ఎంఎస్‌ఎంఈల కోసం డీఎక్స్‌ఎడ్జ్ (డిజిటల్ ఎక్సలెన్స్ ఫర్ గ్రోత్ అండ్ ఎంటర్‌ప్రైజ్) ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా సుబ్రహ్మణ్యం ఈ విషయాలు చెప్పారు. చిన్న సంస్థలు పోటీతత్వాన్ని పెంచుకునేందుకు, భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా పటిష్టమయ్యేందుకు ఉపయోగపడే వనరులు ఇందులో ఉంటాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment