ముందస్తు ఏర్పాట్లు
- ఎన్నికలకు సిద్ధమవుతున్న యంత్రాంగం
- రేపటి నుంచి సిబ్బందికి శిక్షణ తరగతులు
- కేంద్ర, రాష్ట్ర శాఖల నుంచి ఉద్యోగుల వివరాల సేకరణ
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో జిల్లా యం త్రాంగం తలమునకలైంది. నోటిఫికేషన్‌కు ముందు ఎన్నికలు విధులు నిర్వర్తించే సిబ్బంది జాబితాను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సెక్టర్, నోడల్ ఆఫీసర్ల జాబితాను సిద్ధం చేసి అనుమతుల కోసం ఎన్నికల సంఘానికి పంపించింది. ప్రస్తుతం పీఓ, ఏపీఓల తో పాటు ఇతర ఎన్నికల సిబ్బంది నియామకంపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు నియమించిన ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ఈ నెల 4, 5 తేదీలలో శిక్షణ తరగతులు నిర్వహించాలని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగుల వివరాల సేకరణ
ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అన్ని కేంద్ర, రాష్ట్ర శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
జిల్లాలో 3506 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల సంఖ్యకు పది శాతం అధికంగా 3857 మంది పీఓలను, 3857 మంది ఏపీఓలతో పాటు మరో ముగ్గురు సిబ్బందిని నియమించనున్నారు.
ఇప్పటి వరకు 30 రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి 13,996 మంది ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరించారు.
16 కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి 19,020 మంది వివరాలు కలెక్టరేట్‌కు చేరాయి. మరో 15 శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు రావాల్సి ఉంది.
రెండు, మూడు రోజుల్లో అన్ని శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు వచ్చిన వెంటనే వాటిని కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసి ర్యాండమైజ్ చేయనున్నారు.
ఈ ప్రక్రియ పూర్తయితే దాదాపుగా సగం పని ముగిసినట్టేనని అధికారులు చెబుతున్నారు.