- పాడేరు ఆర్డీఓకు స్థానచలనం
- మరో నలుగురు ఎస్‌డీసీలకు త్వరలో?
- 51 మంది తహశీల్దార్లకు బదిలీ
- ముగ్గురు తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో భారీగా బదిలీలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ కలెక్టర్ల నుంచి తహశీల్దార్ల వరకు భారీ స్థాయిలో స్థానచలనాలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మూడేళ్లు ఒకే చోట పనిచేసినవారు, లేదా సొంత జిల్లాకు చెందిన వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారుల జాబితా సిద్ధమైంది. పాడేరు ఆర్డీఓ గణపతిరావును బదిలీ చేయగా ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు.
అర్బన్ ల్యాండ్ సీలింగ్ స్పెషల్ ఆఫీసర్ సిహెచ్.నరసింగరావును పశ్చిమగోదావరి జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు మరో నలుగురికి బదిలీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లా పరిషత్ సీఈఓ డి.వి.రెడ్డి, కోనేరు రంగారావు కమిటీ ఎస్‌డీసీ విజయసారధి, ఏపీఐఐసీ ఎస్‌డీసీ నారాయణ, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీస్ ఎస్‌డీసీ సీతామహాలక్ష్మిలకు బదిలీ అవుతున్నట్టు సమాచారం. వీరి బదిలీలకు సంబంధించిన ఫైలు కూడా సిద్ధమైనట్టు తెలిసింది. మరో ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.
51 మంది తహశీల్దార్లకు కూడా..
జిల్లాలో 65 మంది తహశీల్దార్లు ఉన్నారు. వీరిలో నలుగురు ఈ ఏడాది జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో నలుగురు ఈ ఏడాది జూలై పదవీ విరమణ చేయనున్నారు. అయిదుగురు ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ముగ్గురు తహశీల్దార్లు డిప్యుటేషన్‌పై ఇతర శాఖల్లో పనిచేస్తున్నారు. ఒకరు ఏసీబీ దాడులో చిక్కి సస్పెన్షన్‌లో ఉన్నారు. మిగిలిన 51 మంది తహశీల్దార్లు మూడేళ్లు ఒకేచోట పనిచేయడం, సొంత జిల్లాకు చెందిన వారు కావడంతో వీరికి బదిలీ జరగనుంది. వీరిలో 26 మందిని విజయనగరం, 25 మందిని శ్రీకాకుళం పంపించనున్నారు.
ఆ రెండు జిల్లాల నుంచి 51 తహశీల్దార్లు జిల్లాకు రానున్నారు. వీరి జాబితాను వారం రోజుల క్రితమే జిల్లా అధికారులు సీసీఎల్‌ఏకు పంపించారు. వీరి కేటాయింపులకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. తహశీల్దార్లు అందరూ సమ్మెలో ఉండడంతో బదిలీ ఉత్తర్వులు తీసుకొనే అవకాశం లేదు. సమ్మె ముగిసిన తర్వాత వీరు ఉత్తర్వులు తీసుకొని విధుల్లో చేరనున్నాయి. జిల్లాలో ముగ్గురు తహశీల్దార్లు భవాని, గౌతమికుమారి, పద్మలతలకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించింది.