‘ఆధార్’ ఉత్తర్వులు అంతా గ్యాస్ | The implementation of government advertising | Sakshi
Sakshi News home page

‘ఆధార్’ ఉత్తర్వులు అంతా గ్యాస్

Published Tue, Feb 4 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM

‘ఆధార్’ ఉత్తర్వులు అంతా గ్యాస్

‘ఆధార్’ ఉత్తర్వులు అంతా గ్యాస్

  •  అమలు కాని ప్రభుత్వ ప్రకటనలు
  •  ఆధార్ ఉండాల్సిందేనంటున్న గ్యాస్ ఏజెన్సీలు
  •  విడుదల కాని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు
  •  వినియోగదారులకు ఆన్‌లైన్ అవస్థలు
  •  కోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు
  • గ్యాస్‌కు ఆధార్ ముడిపెట్టొద్దని న్యాయస్థానం నేరుగా ఆదేశించినా పాలకులకు చీమకుట్టినట్టు ఉండదు.. ఆధార్ అవసరం లేదని ప్రకటనలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఆందుకు సంబంధించిన ఉత్తర్వులను మాత్రం జారీ చేయదు.. ఏమో మాకు అధికారిక ఆదేశాలు రాలేదు ఆధార్ కార్డు ఆన్‌లైన్ చేయించుకోవాల్సిందేనంటూ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల ఒత్తిళ్లు.. వెరసి వినియోగదారులు అటు ఆధార్ ఆన్‌లైన్ చేయించలేక, ఇటు సబ్సిడీ లేకుండా గ్యాస్ సిలిండర్లు కొనుక్కోలేక సతమతమవుతున్నారు.
     
    సాక్షి, మచిలీపట్నం : గ్యాస్ సిలిండర్లు ఆరు ఇస్తామని, కాదు తొమ్మిది సరిపోతాయని, తాజాగా 12కు పెంచుతున్నామని వినియోగదారులను అయోమయానికి గురిచేసే నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రంలోని యూపీఏ సర్కార్ ఆధార్ విషయంలోనూ పొంతన లేకుండా వ్యవహరిస్తోంది. గ్యాస్ సిలిండర్ తదితర సబ్సిడీలకు ఆధార్‌తో ముడిపెట్టొద్దని ఇటీవల న్యాయస్థానాలు సైతం ఆదేశాలు ఇచ్చాయి. తాజాగా గత నెల 30న గ్యాస్‌కు ఆధారం అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసి రోజులు గడుస్తున్నా అది అమలుకు నోచుకోవడం లేదు.

    దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనలు ఉత్త ‘గ్యాసే’నని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సంవత్సర కాలంగా గ్యాస్ వినియోగదారులకు ఆధార్ లింకు సమస్య ఉన్నప్పటికీ సుమారు రెండు నెలలుగా మరింత ఒత్తిడి పెంచారు. దీంతో వినియోగదారులు ఆయా ఏజెన్సీల చుట్టూ, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ లింకు పెట్టిన కేంద్ర ప్రభుత్వం తాము పడుతున్న కష్టాలను చూస్తూ కూడా కనీసం పట్టన ట్టు వ్యవహరిస్తోందని ప్రభుత్వంపై పలువురు వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
     
    వినియోగదారుల ‘గ్యాస్ మంట’...

     
    జిల్లాలో విజయవాడ నగరంతో కలిపి 74 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 11.61 లక్షలు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో ఆధార్ కార్డులు జారీ అయినవి 8,05,298 ఉంటే, 6,54,372 కనెక్షన్లకు మాత్రమే బ్యాంకు ఖాతాను అనుసంధానం చేశారు. మిగిలిన వినియోగదారులకు ఆధార్ లింక్ ప్రధాన సమస్యగా మారింది. గ్యాస్ బుక్ చేసుకుని ఏజెన్సీలకు రూ.1,215 చెల్లిస్తే ఒక్కో సిలిండర్‌కు రూ.750 సబ్సిడీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందన్న మెలికఅనేక అవస్థలు తెచ్చిపెట్టింది.

    ఆధార్ లింక్ ఏర్పాటు చేయకముందు ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోను రూ.414కే గ్యాస్ సిలిండర్ అందేది. ఆధార్ లింక్ ఏర్పడిన తరువాత దాని ధర రూ.1,321కి చేరుకుంది. తాజాగా ఒకటో తేదీ నుంచి క్రూడాయిల్ ధరల తగ్గుదలతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,215 అయ్యింది. ఇప్పటికే ఆధార్ కార్డును అనుసంధానం చేసుకున్న వినియోగదారులకు సైతం గ్యాస్ రాయితీ జమకావడం లేదని పలువురు గగ్గోలు పెడుతున్నారు.
     
    తెరుచుకున్న గ్యాస్ ఏజెన్సీలు...
     
    కేంద్ర ప్రభుత్వ ప్రకటన తరువాత ఐదు రోజులుగా జిల్లాలోని చాలా గ్యాస్ ఏజెన్సీలకు తాళాలు పడ్డాయి. ప్రభుత్వ నిర్ణయం తరువాత ఏ ధరకు విక్రయించాలో తెలియక స్థానిక ఏజెన్సీలకు తాళాలు వేశామని పలు ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. తాజాగా సోమవారం గ్యాస్ ధర తక్కువగా లభిస్తుందని ప్రతి ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరారు. అయినా ఆన్‌లైన్‌లో వచ్చిన ధరలను బట్టి సిలిండర్ ధర రూ.1,215లకు విక్రయిస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగం సైతం పాలకుల తీరుమాదిరిగానే పట్టనట్టు వ్యవహరిస్తోంది.
     
     ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
     ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం చెబుతున్నదానికి, ఆచరణకు పొంతన లేదు. ఆధార్ ఉన్నా సబ్సిడీ సక్రమంగా అందడంలేదు. ఆధార్ లింక్ చేయలేదని మొత్తం ధర వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటన ఆచరణలోకి రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ ప్రకటనలు వినియోగదారుల ఇబ్బందులు తొలగించేలా ఉంటే బాగుంటుంది.
     - మల్లెంపూడి వేదాద్రి, అనాసాగరం
     
     పనులు మానుకుని తిరుగుతున్నాం
     పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే మేము ఆధార్‌లింక్ పుణ్యమా అని గ్యాస్ కంపెనీ, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. పని మానుకుని నెల రోజులుగా తిరుగుతూనే ఉన్నాం. అయినా ప్రయోజనం లేదు. ఆధార్ అక్కర్లేదని ప్రభుత్వం చెప్పింది. అదే మాట గ్యాస్ ఏజెన్సీలను అడిగితే తమకు ఆదేశాలు రాలేదంటూ సబ్సిడీ లేకుండా వసూళ్లు చేస్తున్నారు.
     - షేక్ ఖాలేషా, నందిగామ
     
     ఆదేశాలు రాలేదు : డీఎస్‌వో
     గ్యాస్‌కు ఆధార్ కార్డు లింక్ అక్కర్లేదనే విషయమై అధికారికంగా ఎటువంటి ఆదేశాలూ రాలేదని జిల్లా పౌరసరఫరాల అధికారిణి పీబీ సంధ్యారాణి తెలిపారు. ఈ విషయమై సోమవారం ‘సాక్షి’ ఆమెను వివరణ కోరగా పైవిధంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన పత్రికల్లో చూశామని, వాటికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఏమైనా వచ్చాయా అనే విషయాన్ని గ్యాస్ కంపెనీలతో కూడా సంప్రదించినట్టు ఆమె వివరించారు. ఆదేశాలు వచ్చేవరకు ఆధార్ లింక్ నిబంధన కొనసాగుతుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement