
పంజాబ్ హరియాణా హైకోర్టు వ్యాఖ్య
తల్లికి రూ.5వేల మనోవర్తిపై కుమారుడి పిటిషన్ కొట్టివేత
చండీగఢ్: వృద్ధురాలైన తల్లికి మనోవర్తిగా(Maintenance) నెలకు రూ.5 వేలు ఇవ్వాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై పంజాబ్ హరియాణా హైకోర్టు(Punjab & Haryana High Court) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కలియుగంలో జరుగుతున్న విపరీతాలకు ఇదో ఉదాహరణ అంటూ వ్యాఖ్యానించింది. సంగ్రూర్ కుటుంబ న్యాయస్థానంలో మూడు నెలల్లోగా రూ.50 వేలు డిపాజిట్ చేయాలంటూ పిటిషనర్‌ను ఆదేశించింది. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.. అది చాలా తక్కువ మొత్తమని తెలిపింది.
మనోవర్తి మొత్తం పెంచాలంటూ పిటిషనర్ తల్లి ప్రత్యేకంగా ఎలాంటి విజ్ఞాపన చేయలేదని కూడా పేర్కొంది. 77 ఏళ్ల వృద్ధురాలి భర్త 1992లోనే చనిపోయారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. ఒక కుమారుడు చనిపోయాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆమెకున్న సుమారు 30 ఎకరాల భూమిని పిటిషనర్ అయిన మరో కుమారుడు, చనిపోయిన కుమారుడి పిల్లలు పంచుకున్నారు. 1993లో మనోవర్తి కింద వృద్ధురాలికి రూ.లక్ష ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె కూతురు వద్దే ఉంటోంది. తన పోషణ భారం కుమార్తె మోయాల్సి రావడంతో వృద్ధురాలు సంగ్రూర్ కుటుంబ కోర్టును ఆశ్రయించారు.
తల్లి తన వద్ద ఉండటం లేదు కాబట్టి, మనోవర్తి తాను ఇవ్వాల్సిన పనిలేదని కుమారుడు వాదించాడు. తోసిపుచి్చన న్యాయస్థానం నెలకు రూ.5 వేల చొప్పున అందజేయాలంటూ ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశాడు. విచారణ సందర్భంగా న్యాయస్థానం..‘తన తల్లికి వ్యతిరేకంగా సాక్షాత్తూ కుమారుడే ఈ పిటిషన్ వేయడం చూసి మేం షాక్‌కు గురయ్యాం. తండ్రి నుంచి ఆస్తి సంక్రమించినప్పటికీ, ఎలాంటి ఆదాయ వనరుల్లేని వయో వృద్ధురాలైన తల్లిని పెళ్లయి మెట్టినింట్లో ఉంటున్న ఆమె కుమార్తె వద్ద వదిలేయడం దురదృష్టకరం. కలియుగంలో జరిగే వైపరీత్యాలకు ఈ కేసు సిసలైన ఉదాహరణ’అని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment