డాలర్‌ డ్రీమ్స్‌ వేటలో.. కటకటాల పాలు! | 43764 Indian migrants caught at US-Canada border | Sakshi
Sakshi News home page

డాలర్‌ డ్రీమ్స్‌ వేటలో.. కటకటాల పాలు!

Dec 5 2024 5:22 AM | Updated on Dec 5 2024 5:22 AM

43764 Indian migrants caught at US-Canada border

కెనడా సరిహద్దుల వద్ద భారీగా పట్టుబడుతున్న భారతీయులు 

అమెరికాలో చొరబడబోయి గతేడాది 40,000 మంది జైలుపాలు 

అమెరికా కలను సాకారం చేసుకునేందుకు భారతీయులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అమెరికాలోకి భారతీయుల అక్రమ వలసలు విపరీతంగా పెరిగినట్టు యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ (యూఎస్‌ సీబీపీ) తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు వాళ్లు ప్రధానంగా కెనడా సరిహద్దులను ఎంచుకుంటున్నారు. కెనడా గుండా అమెరికాలో ప్రవేశిస్తూ అరెస్టవుతున్న వారిలో భారతీయులే 22 శాతం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది! 

యూఎస్‌ సీబీపీ గణాంకాల ప్రకారం 2023 అక్టోబర్‌ నుంచి 2024 సెప్టెంబర్‌ మధ్య కెనడా సరిహద్దు గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2022లో కెనడా గుండా అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన 1,09,535 మందిలో భారతీయులు 16 శాతం కాగా 2023లో వారి సంఖ్య ఇంకా పెరిగింది. ఆ ఏడాది 1,89,402 మందిలో 30,010 మంది భారతీయులున్నారు.

 2024లో 1,98,929 మంది సరిహద్దు దాటేందుకు అక్రమంగా ప్రయత్నించగా వారిలో 43,764 మంది భారతీయులే. లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ వలసదారులతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. అయినా గత నాలుగేళ్లలో కెనడా గుండా అక్రమంగా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిలో అతిపెద్ద సమూహం భారతీయులేనని వాషింగ్టన్‌కు చెందిన ఇమిగ్రేషన్‌ విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా దళాలకు చిక్కకుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్య తెలియదు. 

కెనడా సరిహద్దే ఎందుకు? 
అమెరికాలోకి అక్రమ చొరబాట్లకు భారతీయులు కెనడా సరిహద్దునే ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కెనడా వీసా ప్రక్రియ సులువుగా ఉండటం వాటిలో ముఖ్యమైనది. కెనడా విజిటింగ్‌ వీసా ప్రాసెసింగ్‌ కేవలం 76 రోజుల్లో పూర్తవుతుంది. అదే అమెరికా వీసా ప్రాసెసింగ్‌ కోసమైతే కనీసం ఏడాది వేచి ఉండాల్సిందే. అమెరికాతో కెనడా సరిహద్దు చాలా పొడవైనది. దాంతో అక్కడ రక్షణ తక్కువ. దాంతో అంత సురక్షితమైన మార్గం కానప్పటికీ దీన్నే ఎంచుకుంటున్నారు. 

పంజాబ్‌ నుంచే ఎక్కువ 
ఇలా కెనడా గుండా అమెరికాలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల్లో ఎక్కువ భాగం పంజాబ్, హరియాణాల వాళ్లే ఉంటున్నారు. తర్వాతి స్థానం గుజరాత్‌ది. విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాల కోసం పంజాబీ గ్రామీణ యువత బాగా ఆసక్తి చూపుతోంది. కానీ సరైన విద్యార్హతలు, ఆంగ్ల ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా పర్యాటక, విద్యార్థి వీసాలు పొందడం వీరికి గగనంగా మారుతోంది. ప్రత్యామ్నాయంగా అక్రమంగా సరిహద్దులు దాటించే ముఠాలను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చాలామంది లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు సరిహద్దులు దాటేందుకు అతి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement