![Chicken Price Low Price In Kamareddy District](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/555.jpg.webp?itok=qtZxsB4e)
పేపర్ ధర కన్నా కిలోకు రూ.30 తక్కువ
స్కిన్, స్కిన్‌లెస్ ఏదైనా సరే..
కామారెడ్డి మార్కెట్‌లో రసవత్తర పోటీ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోరోజువారీ ధరల ప్రకారం చికెన్ అమ్మకాలు సాగుతుంటే, కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాత్రం మార్కెట్ రేట్ కన్నా కిలోకు రూ.30 తక్కువకు విక్రయిస్తుంటారు. ఎక్కడా కనిపించని పోటీ కామారెడ్డిలోనే ఉంటుంది. నాలుగైదేళ్ల కిందట మొదలైన పోటీ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఇక్కడి దుకాణాల నిర్వాహకులు పేపర్ రేట్ కన్నా రూ.30 తక్కువ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ విక్రయాల్లో పోటీ పడుతుంటారు.
ఇక్కడ తక్కువ ధరకు దొరుకుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి మరీ చికెన్ కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లకు క్వింటాళ్ల కొద్దీ చికెన్ కొనుగోలు చేస్తారు. సాధారణంగా పేపర్‌లో వచ్చే ధరల ప్రకారమే రాష్ట్రమంతటా చికెన్ అమ్ముతారు. అక్కడక్కడా ఐదో, పదో రూపాయలు తగ్గించి అమ్ముతారు. కానీ కామారెడ్డిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. కొందరు పేపర్ ధర కన్నా కిలోకు రూ.30 తక్కువకు అమ్ముతుండగా, ఇంకొందరు రూ.35 నుంచి రూ.40 తక్కువ కూడా విక్రయిస్తుంటారు.
గురువారం పేపర్ ధర ప్రకారం స్కిన్‌తో చికెన్ ధర కిలోకు రూ.181 ఉండగా, కామారెడ్డిలో రూ.150కి అమ్మారు. అంటే కిలోకు రూ.31 తక్కువగా విక్రయించారు. అలాగే స్కిన్‌లెస్ చికెన్ కిలో పేపర్ ధర ప్రకారం రూ.206 ఉండగా, కామారెడ్డిలో రూ.180కి అమ్మారు. అంటే కిలోకు రూ.26 తక్కువకు అమ్మినట్లు స్పష్టమవుతోంది. లైవ్ బర్డ్ ధర కిలోకు రూ.128 ఉండగా, ఇక్కడ రూ.120కి అమ్ముతారు. మొత్తంగా ఏ దుకాణానికి వెళ్లినా మార్కెట్ ధర కన్నా తక్కువకే దొరుకుతుంది.
టన్నుల కొద్దీ అమ్మకాలు..
కామారెడ్డి మార్కెట్‌లో నిత్యం 10 టన్నుల నుంచి 15 టన్నుల వరకు చికెన్ అమ్ముతుంటారు. ఆదివారం రోజైతే 40 టన్నుల నుంచి 50 టన్నుల వరకు అమ్ముడవుతోంది. వివిధ పౌల్ట్రీ సంస్థలు ఇక్కడ హోల్‌సేల్‌గా షాపులకు కోళ్లను సప్లై చేస్తాయి. కొందరు చికెన్ సెంటర్ల నిర్వాహకులకు సొంతంగా పౌల్ట్రీఫామ్‌లు కూడా ఉన్నాయి.
ఇక్కడ కార్పొరేట్ సంస్థలకు చెందిన కోళ్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయని వ్యాపారులు తెలిపారు. వ్యాపారుల మధ్యన నెలకొన్న పోటీ మూలంగా కొనుగోలుదారులకు తక్కువ ధరకు చికెన్ లభిస్తోంది. రెగ్యులర్‌గా చికెన్ కొనుగోలు చేసే హోటళ్లు, రెస్టారెంట్‌లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు మరింత తక్కువ ధరలకు అమ్ముతామని వ్యాపారులు చెబుతున్నారు.
చుట్టుపక్కల మండలాల్లో ఎక్కువ ధరలకు..
కామారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల ఉన్న మండలాలు, గ్రామాల్లో పేపర్ ధరకే చికెన్ అమ్ముతారు. కొన్ని చోట్ల పేపర్ ధర కన్నా ఎక్కువకే అమ్ముతుంటారు. కామారెడ్డి లో ధరలు తక్కువగా ఉన్నాయని, ఇక్కడ ఎక్కువ ఎందుకని ఎవరైనా వినియోగదారులు చుట్టుపక్కల మండలాల్లో వ్యాపారులను ప్రశ్నిస్తే.. అక్కడి ధర అక్కడే, ఇక్కడి ధర ఇక్కడే అని విక్రయదారులు చెబుతారు. ఈ నేపథ్యంలో కిలో, రెండు కిలోలు తీసుకునేవాళ్లు అందుబాటులో ఉన్న దుకాణాల్లో ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తారు. అదే పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగల కోసం ఎక్కువ మొత్తంలో చికెన్ అవసరమైనపుడు మాత్రం కామారెడ్డిలో కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ మొత్తంలో కొంటే మరింత తక్కువ ధరకు ఇస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది ఆటోలు, వ్యాన్లలో వచ్చి చికెన్ తీసుకుని వెళుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment