కొత్తగూడెం, న్యూస్‌లైన్: ‘రియల్’ భూమ్‌తో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం పేదలకు పంచిన అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు ఇప్పటికే చాలా వరకు కబ్జాకు గురికాగా, మిగిలిన వాటినైనా రక్షించే పనిలో పడ్డారు. అయితే ఇప్పటికే బడా బాబుల చేతికి చిక్కిన భూముల వివరాలు అందకపోవడం, సర్వే నంబరలలో మార్పు చేయడంతో వాటి వివరాలు అందించలేక మండలస్థాయి సిబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను మాయం చేసేందుకు బై నంబర్లు సృష్టించడంతో గందరగోళం నెలకొంది.
ప్రభుత్వ భూ వివరాలు సేకరించి రిజిస్ట్రేషన్ శాఖకు అందించాలని రెవెన్యూ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు అందించి అక్రమంగా సాగుతున్న రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాలని రెవెన్యూ చట్టం 22 (ఎ)ను జారీ చేశారు. దీంతో గత నెల రోజులుగా జిల్లాలో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
అన్యాక్రాంతమైన భూములపై తర్జన భర్జన...
జిల్లాలో 46 మండలాలు ఉండగా అందులో 29 మండలాలు ఏజెన్సీలో ఉన్నాయి. ఏజెన్సీ చట్టం ప్రకారం ఇక్కడ కొనుగోలు, అమ్మకాలు నిషేధం. గిరిజనేతరులు క్రయ, విక్రయాలు చేయకూడదనే నిబంధన ఉండడంతో ప్రస్తుతం ఏజెన్సీ పరిధిలో ఉన్న భూముల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగడం లేదు. అయితే ప్రభుత్వ భూములు మాత్రం చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ పరిధిలో ఉన్న భూముల వివరాలను సైతం రిజిస్ట్రేషన్ అధికారులకు అందించాలని ఉన్నతాధికారులు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. దీంతోపాటు మైదాన ప్రాంతంలోని 17 మండలాల్లో అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు సైతం సర్వే నంబర్ల మార్పుతో అన్యాక్రాంతమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉండాల్సిన అసైన్డ్ భూములు సక్రమంగా ఉన్నాయో..? లేదో అనే విషయంపై ఇప్పుడు అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వ భూమి వివరాలు అందించిన తర్వాత తప్పనిసరిగా వాటిని పొజిషన్ చూపించాల్సి రావడంతో అధికారులు ఇప్పుడు ఆ నివేదికల తయారీ పనిలో నిమగ్నమయ్యారు.
నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు...
జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాలను సేకరించాలని నెల క్రితమే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ వివరాలు ఇంకా అందకపోవడంతో ఈ నెలాఖరులోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా నివేదిక తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీనివాస్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రభుత్వ భూముల వివరాలు రిజిస్ట్రేషన్ శాఖకు అందిస్తే.. ఇకపై భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చని చెప్పారు.
భూ ఆక్రమణలకు చెక్
Published Sat, Aug 24 2013 7:06 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
Advertisement
Advertisement