realty market
-
ఇళ్ల ధరల జోరులో ముంబై నంబర్ 2
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల పెరుగదలలో ముంబై రియల్టీ మార్కెట్ రెండో స్థానం నిలిచింది. ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నట్టు జూన్ త్రైమాసికానికి సంబంధించిన నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 44 ప్రముఖ నగరాల్లోని ఇళ్ల ధరల పెరుగుదల వివరాలను నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. జూన్ త్రైమాసికంలో ఈ నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదల 2.6 శాతానికి పరిమితమైనట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో పెరుగుదల రేటు 4.1 శాతంగా ఉండడం గమనార్హం. ఇళ్ల ధరల పెరుగుదలలో మనీలా మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 26 శాతం మేర వృద్ధి నమోదైంది. ముంబైలో ఇళ్ల ధరలు 13 శాతం మేర జూన్ త్రైమాసికంలో పెరిగాయి. దీంతో ఏడాది క్రితం ఆరో ర్యాంక్‌లో ఉన్న ముంబై 2కు చేరుకుంది. ఇక ఢిల్లీలో ఇళ్ల ధరలు 10.6 శాతం పెరగడంతో, ఏడాది క్రితం ఉన్న 26వ ర్యాంక్ నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. బెంగళూరులో ఇళ్ల ధరలు జూన్ క్వార్టర్లో వార్షికంగా 3.7 శాతం మేర పెరిగాయి. దీంతో 15వ ర్యాంక్ సొంతం చేసుకుంది. టాప్–10లో ఇవే.. లాస్ ఏంజెలెస్‌లో 8.9 శాతం (4వ ర్యాంక్), మియామీలో 7.1 శాతం (5వ ర్యాంక్), నైరోబీలో 6.6 శాతం (ఆరో స్థానం), మ్యాడ్రిడ్‌లో 6.4 శాతం (ఏడో స్థానం), లిస్బాన్లో 4.7 శాతం (ఎనిమిదో స్థానం), సియోల్‌లో 4.6 శాతం (తొమ్మిదో స్థానం), శాన్ ఫ్రాన్సిస్కోలో 4.5 శాతం (10వ స్థానం) చొప్పున జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. దుబాయిలో 2020 సంవత్సరం నుంచి ఇళ్ల ధరలు 124 శాతం పెరగ్గా.. జూన్ క్వార్టర్లో 0.3% మేర తగ్గాయి. వియన్నాలో 3.2%, బ్యాంకాక్‌లో 3.9 శాతం చొప్పున ఇదే కాలంలో ఇళ్ల ధరలు తగ్గాయి. -
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు డబుల్
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్టీ మార్కెట్ ఈ ఏడాది మంచి జోరు చూపించింది. చివరి త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో ఇళ్ల విక్రయాలు ఏకంగా రెట్టింపై 10,330 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 4,280 యూనిట్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మొత్తం మీద హైదరాబాద్‌లో మార్కెట్లో 35,370 ఇళ్లు అమ్ముడయ్యాయి. 2021లో అమ్మకాలు 22,240 యూనిట్లతో పోలిస్తే 59 శాతం వృద్ధి నమోదైంది. 2021 చివరి మూడు నెలలతో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది చివరి మూడు నెలల కాలంలో దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు 19 శాతం పెరిగాయి. ఈ వివరాలను హౌసింగ్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ఎనిమిది పట్టణాల్లో మొత్తం మీద 80,770 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 67,890 యూనిట్లుగా ఉన్నాయి. ఇక 2022 మొత్తం మీద ఈ ఎనిమిది పట్టణాల్లో 3,08,940 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2021లో అమ్మకాలు 2,05,940 యూనిట్లుగా ఉన్నాయి. అంటే 50 శాతం వృద్ధి నమోదైంది. పట్టణాల వారీగా అమ్మకాలు ► అహ్మదాబాద్‌లో ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ మధ్య, క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 23 శాతం అధికంగా 6,640 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాది మొత్తం మీద 62 శాతం అధికంగా 27,310 యూనిట్లు అమ్ముడుపోయాయి. ► బెంగళూరులో అమ్మకాలు డిసెంబర్ క్వార్టర్లో 30 శాతం తగ్గి 6,560 యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది మొత్తం మీద 22 శాతం వృద్ధితో 30,470 యూనిట్లు విక్రయమయ్యాయి. ► చెన్నైలో డిసెంబర్ త్రైమాసికంలో 2 శాతం తగ్గి 3,160 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఏడాది మొత్తం మీద 8 శాతం అధికంగా 14,100 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 3 శాతం తగ్గి డిసెంబర్ త్రైమాసికంలో 4,280 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది మొత్తం మీద 7 శాతం వృద్ధితో 19,240 ఇళ్ల విక్రయాలు చోటు చేసుకున్నాయి. ► కోల్‌కతా మార్కెట్లో 18 శాతం క్షీణించి ఇళ్ల అమ్మకాలు 2,130 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఏడాది మొత్తం మీద 8 శాతం పెరిగి 10,740 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో అమ్మకాలు డిసెంబర్ త్రైమాసికంలో 40 శాతం పెరిగాయి. 31,370 యూనిట్లు విక్రయమయ్యాయి. ఈ ఏడాది 87 శాతం అధికంగా 1,09,680 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ► పుణెలో క్యూ4లో ఒక శాతం పెరిగి 16,300 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఏడాది మొత్తం మీద అమ్మకాలు 62,030 యూనిట్లుగా ఉన్నాయి. కొనుగోలు శక్తిపై ధరల ప్రభావం: నైట్‌ఫ్రాంక్ దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో గృహ రుణ రేట్లు పెరిగిపోవడంతో ఈ ఏడాది ఇళ్ల కొనుగోలు శక్తి గతేడాదితో పోలిస్తే కొంత తగ్గినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ తెలిపింది. అయితే సగటు కుటుంబ ఆదాయం ప్రకారం చూస్తే.. ఇప్పటికీ గృహ రుణాలు పొందే శక్తి వారికి ఉన్నట్టు పేర్కొంది. వార్షిక ప్రాపర్టీ అధ్యయన నివేదికను ‘ద అఫర్డబులిటీ ఇండెక్స్ 2022’ పేరుతో నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. సగటు కుటుంబ ఆదాయంతో ఈఎంఐ మొత్తం నిష్పత్తిని ఈ ఇండెక్స్ ట్రాక్ చేస్తుంటుంది. అలాగే, ఇళ్ల ధరలు, గృహ రుణాల వడ్డీ రేట్లు, కుటుంబ ఆదాయాన్ని విశ్లేషించి ఏటా గణాంకాలు విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది మొత్తం మీద ఆర్బీఐ 2.25 శాతం రెపో రేటు పెంపును ఈ నివేదిక ప్రస్తావించింది. దీని కారణంగా గృహ రుణాల రేట్లు పెరగడం, నిర్మాణ సామాగ్రి వ్యయాలు అధికం కావడం వల్ల పెరిగిన ప్రాపర్టీ ధరలతో కొనుగోలు శక్తి క్షీణించినట్టు వివరించింది. కాకపోతే కరోనా ముందు 2019తో పోలిస్తే కొనుగోలు శక్తి ఇప్పటికీ మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. ఎనిమిది పట్టణాల్లో ఒక్క ముంబై ఈ విషయంలో బలహీనంగా ఉంది. -
హైదరాబాద్ మార్కెట్లో అధికంగా ఇళ్ల విక్రయాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్టీ మార్కెట్ మురిసింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 35 శాతం అధికంగా ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. 10,570 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 7,810 ఇళ్ల యూనిట్లు అమ్ముడు కావడం గమనార్హం. బెంగళూరు కంటే కూడా హైదరాబాద్ మార్కెట్ తన సత్తా చాటింది. బెంగళూరులో ఇళ్ల విక్రయాలు 20 శాతం వృద్ధితో 7,890 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 6,550 యూనిట్లు మాత్రమే. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 49 శాతం వృద్ధిని చూశాయి. మొత్తం 83,220 యూనిట్లు విక్రయమైనట్టు ప్రాపర్‌టైగర్ పోర్టల్ ఈ ఏడాది మూడో త్రైమాసికానికి సంబంధించిన నివేదికలో వెల్లడించింది. ఇళ్ల ధరలు పెరిగినా, వడ్డీ రేట్లు పెరిగినా కానీ, గతంలో నిలిచిన డిమాండ్ తోడు కావడంతో ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగినట్టు ప్రాప్ టైగర్ నివేదిక వివరించింది. 2021 సెప్టెంబర్ క్వార్టర్లో దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్లు 55,910గా ఉన్నాయి. అంతేకాదు ఈ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు కరోనా ముందు నాటి గణాంకాలను మించి నమోదు కావడం డిమాండ్ బలంగా ఉన్నట్టు తెలియజేస్తోంది. ప్రతికూలతలను అధిగమించి.. రియల్ ఎస్టేట్ పరిశ్రమ కరోనా మహమ్మారి, తదనంతర అవరోధాలను అధిగమించినట్టు ప్రాప్ టైగర్ డాట్ కామ్ గ్రూపు సీఎఫ్‌వో వికాస్ వాధ్వాన్ తెలిపారు. గృహ రుణాల రేట్లు పెరిగినప్పటికీ ఇళ్లకు డిమాండ్ తగ్గలేదన్నారు. సొంతిల్లు కలిగి ఉండాలన్న ఆకాంక్షే డిమాండ్ పుంజుకోవడానికి కారణంగా పేర్కొన్నారు. మార్కెట్ ధోరణులను పరిశీలిస్తే రానున్న త్రైమాసికాల్లో నివాసిత గృహాలకు సానుకూల డిమాండ్ ఉంటుందని తెలుస్తోందని ప్రాప్ టైగర్ డాట్ కామ్ రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ తెలిపారు. పండుగల తగ్గింపులు, సులభతర చెల్లింపుల ప్లాన్లు ఇవన్నీ కలసి డిమాండ్‌ను బలంగా నిలబెడతాయని అంచనా వేశారు. పట్టణాల వారీగా.. ► ముంబైలో ఇళ్ల విక్రయాలు సెప్టెంబర్ క్వార్టర్లో 28,800 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 14,160 యూనిట్లతో పోలిస్తే రెట్టింపయ్యాయి. ► పుణెలో 55 శాతం పెరిగి 15,700 యూనిట్లు అమ్ముడుపోయాయి. ► అహ్మదాబాద్ మార్కెట్లోనూ 44 శాతం అధికంగా ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. ఇక్కడ 7,880 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ► చెన్నై, కోల్‌కతా మార్కెట్లో అమ్మకాలు క్షీణించాయి. చెన్నై మార్కెట్లో 6 శాతం తగ్గి 4,420 యూనిట్లు, కోల్‌కతా మార్కెట్లో 4 శాతం తగ్గి 2,530 యూనిట్ల అమ్మకాలకు పరిమితమయ్యాయి. -
హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ రియల్టీ మార్కెట్ జోరు కొనసాగించింది. ఇతర నగరాలతో పోల్చి చూస్తే కొత్త ప్రాజెక్టుల్లో యూనిట్ల అమ్మకాలు ఇక్కడే ఎక్కువగా నమోదయ్యాయి. 2021లో హైదరాబాద్ మార్కెట్లో 25,410 ఇళ్ల యూనిట్లు అమ్ముడు కాగా, అందులో 55 శాతం యూనిట్లు కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లోనివే కావడం గమనార్హం. 2019లో 16,560 యూనిట్ల ఇళ్ల అమ్మకాలతో పోలిస్తే స్వీకరణ రేటు (మొత్తం విక్రయాల్లో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి) పెరిగింది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవల సంస్థ అనరాక్ ఈ మేరకు ఒక నివేదికను గురువారం విడుదల చేసింది. దేశంలోని ఏడు నగరాల్లో 2021లో కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్టుల్లో 35 శాతం ఫ్లాట్స్ వెంటనే అమ్ముడుపోయినట్టు వెల్లడించింది. బ్రాండెడ్ డెవలపర్ల నుంచి కొత్త ప్రాజెక్టులు రావడం, అదే సమయంలో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులకు డిమాండ్ ఏర్పడడం సానుకూలించినట్టు పేర్కొంది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై నగరాలకు సంబంధించిన గణాంకాలకు ఇందులో చోటు కల్పించింది. నివేదికలోని వివరాలు.. ► ఏడు నగరాల్లో 2021లో 2.37 లక్షల యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. ఇందులో 34 శాతం కొత్త ప్రాజెక్టుల్లోనివి ఉన్నాయి. మిగిలిన 66 శాతం యూనిట్లు అంతక్రితం సంవత్సరాల్లో ఆరంభించిన ప్రాజెక్టుల్లోనివి. ► అంతక్రితం 2020లో 7 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 1.38 లక్షలుగా ఉంటే, అందులో కొత్త ప్రాజెక్టులకు సంబంధించినవి 28 శాతం. ► 2019లో అమ్ముడైన 2.61 లక్షల యూనిట్లలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన యూనిట్లు 26 శాతంగా ఉన్నాయి. ► చాలా కాలం తర్వాత కొత్తగా మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లోని ఇళ్లకు డిమాండ్ పెరిగింది. రెడీ టు మూవ్ యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణంగా అనరాక్ పేర్కొంది. ► అయితే ఇప్పటికీ త్వరలో నిర్మాణం పూర్తయ్యే వాటికి, వెంటనే గృహ ప్రవేశానికి అనుకూలంగా ఉన్న వాటిల్లోనే ఎక్కువ కొనుగోళ్లు నమోదవుతున్నాయి. ► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ కొత్త ప్రాజెక్టుల్లో అమ్మకాల పరంగా తక్కువ రేటును చూపించింది. 2021లో 76,400 యూనిట్లు అమ్ముడుపోతే, అందులో కొత్త ప్రాజెక్టుల్లోనివి 26 శాతంగానే ఉన్నాయి. ► బెంగళూరులో 2021లో 33,080 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో కొత్త ప్రాజెక్టుల్లోని యూనిట్ల అమ్మకాలు 35 శాతం. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో కొత్త ప్రాజెక్టుల్లోని విక్రయాలు మొత్తం విక్రయాల్లో 30 శాతంగా ఉన్నాయి. ఫిబ్రవరిలో 25 % డౌన్ : నైట్‌ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 25 శాతం తగ్గినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. 5,146 యూనిట్లు అమ్ముడుపోయాయని వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఈ గణాంకాలను తన నివేదికలో విడుదల చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రెండో పర్యాయం రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం వల్ల ఇళ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టినట్టు విశ్లేషించింది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడం రూ.25 లక్షల్లోపు బడ్జెట్ ఇళ్లపై ఎక్కువ ప్రభావం చూపించినట్టు తెలిపింది. ఈ విభాగంలో కేవలం 844 ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని నివేదికలో పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో ఇదే విభాగంలో 2,888 యూనిట్లకు రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తు చేసింది. 2022 ఫిబ్రవరిలో నాలుగు జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లను పరిశీలించగా.. హైదరాబాద్ జిల్లా పరిధిలో క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూస్తే 64 శాతం క్షీణించాయని తెలిపింది. కానీ, సగటు రిజిస్ట్రేషన్ విలువలో మాత్రం 21 శాతం వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. ‘‘గడిచిన కొన్నేళ్లలో విక్రయ ధరల వృద్ధి పరంగా హైదరాబాద్ దేశంలోనే బలమైన ఇళ్ల మార్కెట్‌గా ఉంది. 2022 మొదటి రెండు నెలల్లో రిజిస్ట్రేషన్లు తగ్గముఖం పట్టాయి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వ్యయాలు పెగడం, వైరస్ కారణంగా ఏర్పడిన నిర్వహణ సమస్యలే ఇందుకు కారణం’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. -
ఆకాశమే హద్దుగా కొత్త ఇళ్ల లాంచింగ్స్...! హైదరాబాద్ జోరు మాత్రం తగ్గేదేలే..!
సాక్షి, హైదరాబాద్: కొత్త గృహాల ప్రారంభంలో హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. 2021 నాల్గో త్రైమాసికం (అక్టోబర్ – డిసెంబర్)లో లాంచింగ్స్ లో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని జేఎల్ఎల్ రెసిడెన్షియల్ మార్కెట్ రిపోర్ట్ వెల్లడించింది. అంతకుక్రితం త్రైమాసికంతో పోలిస్తే క్యూ4లో లాంచింగ్స్‌లో 26.1 శాతం వృద్ధి నమోదు కాగా.. పుణేలో 17.6 శాతం, బెంగళూరులో 16.4 శాతం, ముంబైలో 16.1% పెరుగుదల కనిపించిందని వివరించింది. నగరంలో గృహాల అమ్మకాలు కరోనా ముందస్తు స్థాయికి చేరుకున్నాయి. 2019లో 15,805 ఇళ్లు విక్రయం కాగా 2020లో 9,926, 2021లో 15,787 యూనిట్లు అమ్ముడుపోయాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్ పెరగడం, రియల్టీ మార్కెట్ సెం టిమెంట్ బలపడటం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడు తుండటంతో డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారం భం వైపు దృష్టిసారిస్తున్నారు. దేశంలోని ఏడు ప్రధా న నగరాలలో 2021 నాల్గో త్రైమాసికంలో 45,383 అపార్ట్మెంట్లు లాంచింగ్ అయ్యాయి. క్యూ3తో పో లిస్తే ఇది 38% ఎక్కువ. ఇందులో 19 % యూనిట్లు పుణేలో ప్రారంభం కాగా.. బెంగళూరు, హైదరాబాద్ ఒక్కోటి 17% వాటాను కలిగి ఉన్నాయి. -
ఆశలపల్లకీలో 2022
పారదర్శకత, సమాన అవకాశాలు ఉన్న ఏ రంగమైనా సక్సెస్ అవుతుంది. రియల్టీ పరిశ్రమకూ ఇదే వర్తిస్తుంది. గతేడాది ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వెంటాడితే.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌ను మాత్రం యూడీఎస్ భూతం మింగేసింది. అనధికారిక విక్రయాలతో ఆరోగ్యకరమైన మార్కెట్ దెబ్బతిన్నది. సిండికేట్‌గా మారిన కొందరు డెవలపర్లు.. నగర రియల్టీ మార్కెట్‌ను ప్రతికూలంలోకి నెట్టేశారు. ప్రభుత్వంతో పాటూ డెవలపర్ల సంఘాలు, స్టేక్ హోల్డర్లు, నిపుణులు ఒక్క తాటిపైకొస్తేనే హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి నూతన సంవత్సరం! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మాలతో పాటూ బ్యాంకింగ్, సర్వీసెస్ రంగాలన్నీ బాగున్నాయి. కరోనా కాలంలోనూ ఆయా పరిశ్రమ లలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. స్థిరౖ మెన ఆదాయ వృద్ధి నమోదవుతుంది. మరోవైపు ఇతర నగరాల కంటే హైదరాబాద్‌లో జీవన వ్యయం తక్కువ. అందుబాటు ధరలు, కాస్మోపాలిటన్ సిటీ, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతో వ్యక్తిగత ఇన్వెస్టర్లతో పాటు గ్లోబల్ కంపెనీలు హైదరా బాద్ వైపు ఆసక్తిగా ఉన్నాయి. ఇలాంటి శుభ పరిణామంలో సిండికేట్ డెవలపర్లు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తున్నారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ దొరుకుతుందనే విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి తెలిపారు. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ మార్కె ట్ను సృష్టిస్తేనే హైదరాబాద్ రియల్టీ మార్కెట్ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని అభిప్రాయపడ్డారు. 2022 రియల్టీ మార్కెట్‌కు గృహ రుణ వడ్డీ రేట్లు కీలకం కానుందని.. ప్రస్తుతం ఉన్న 6.5 శాతం ఇంట్రెస్ రేటే కొనసాగితే ఈ ఏడాది మార్కెట్‌ను ఎవరూ ఆపలేరని వివరించారు. 2 లక్షల యూనిట్ల వరకు అవసరం.. అర్బన్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టిసారించింది. ఓఆర్ఆర్తో జిల్లా కేంద్రాలకు, మెట్రో రైల్‌తో ప్రధాన నగరంలో కనెక్టివిటీ పెరిగింది. సిటీలో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గింది. దీంతో అందుబాటు ధరలు ఉండే శివారు ప్రాంతాలలో సైతం గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫీస్‌లు పునఃప్రారంభం కావటంతో ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటూ కొత్తవి విస్తరణ చేపట్టాయి. దీంతో ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఇది రానున్న రోజుల్లో గృహాల డిమాండ్‌ను ఏర్పరుస్తుందని ఎస్ఎంఆర్ బిల్డర్స్ సీఎండీ రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. సాధారణంగా హైదరాబాద్‌లో ఏటా 30–40 వేల గృహాలు డెలివరీ అవుతుంటాయి. మరో 70–75 వేల యూనిట్లు వివిధ దశలో నిర్మాణంలో ఉంటాయి. అయితే ఈ ఏడాది అదనంగా 1.5 – 2 లక్షల యూనిట్ల అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం నగరంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న యూనిట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. దీంతో నాణ్యమైన నిర్మాణం, పెద్ద సైజు యూనిట్లకు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ హైదరాబాద్‌తో పాటూ షాద్‌నగర్, శంకర్పల్లి, చేవెళ్ల, ఆదిభట్ల, నాగార్జున్ సాగర్ రోడ్, శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో డిమాండ్ కొనసాగుతుందని వివరించారు. మేడ్చల్, శామీర్‌పేట మార్గంలో ప్రక్క జిల్లాల పెట్టుబడిదారులు చేపట్టే విక్రయాలే ఉంటాయని తెలిపారు. యాదాద్రిని చూపించి వరంగల్ రహదారి మార్కెట్‌ను పాడుచేశారని పేర్కొన్నారు. సగం ధర అంటే అనుమానించండి.. కరోనా తర్వాత నుంచి నైపుణ్య కార్మికుల కొరత ఏర్పడింది. స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు, లేబర్ చార్జీలు రెట్టింపయ్యాయి. దీంతో నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.300–400 వరకు పెరిగింది. రెగ్యులర్ డెవలపరే నిర్మాణాన్ని పూర్తి చేయడమే సాహసంగా మారిన తరుణంలో.. మార్కెట్ రేటు కంటే 40–50 శాతం తక్కువ ధరకు విక్రయిస్తున్నారంటే ఆ డెవలపర్‌ను అనుమానించాల్సిందే. నిర్మాణ అనుమతులు లేకుండా, రెరాలో నమోదు చేయకుండానే విక్రయిస్తున్నారంటే ప్రాజెక్ట్‌ను ఎలా పూర్తి చేయగలుగుతారనేది కొనుగోలుదారులే విశ్లేషించుకోవాలి. ►నిర్మాణ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశహర్మ్యాలు అని ఆర్భాట ప్రచారానికి వెళ్లకూడదు. అంత ఎత్తులో ప్రాజెక్ట్‌ను చేపట్టే ఆర్థిక స్థోమత, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయా అనేది విశ్లేషించుకోవాలి. అంతే తప్ప పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు తొందరపాటు గురైతే తనతో పాటూ కొనుగోలుదారులూ నిండా మునిగిపోతారని ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. నిర్మాణ అనుమతులు వచ్చాక ప్రాజెక్ట్‌లను లాంచింగ్, విక్రయాలు చేయాలి. దీంతో డెవలపర్, కస్టమర్, బ్యాంకర్, ప్రభుత్వం అందరూ హ్యాపీగానే ఉంటారు. బిల్డర్ ప్రొఫైల్‌ను పరిశీలించకుండా, తక్కువ ధరని తొందరపడి కొనొద్దు. ఒమిక్రాన్ ప్రభావం ఉంటుందా? కరోనా తర్వాత ఇంటి అవసరం పెరిగింది. సొంతిల్లు ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో చాలా మంది గృహాల కోసం ఎంక్వైరీలు చేస్తున్నారు. ఇంటి ఎంపికలోనూ మార్పులు వచ్చాయి. వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ విధానం, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో ఇంట్లో ప్రత్యేకంగా గది ఉండాలని కోరుకుంటున్నారు. ప్రశాంత వాతావరణం, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రాజెక్ట్‌లు, పెద్ద సైజు గృహాలను ఎంపిక చేస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉంటుందే కానీ తీవ్రత పెద్దగా ఉండదని ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటంతో నమ్మకం ఏర్పడింది కాబట్టి ఒమిక్రాన్ ప్రభావం మానసికంగా ఉంటుందే తప్ప రియల్టీ మార్కెట్‌పై పెద్దగా భౌతిక ప్రభావం చూపించకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్రిమెంట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దు 100, 200 గజాలను కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్ల కింద రిజిస్ట్రేషన్ చేయకూడదని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి సూచించారు. వేరే దేశంలోని వ్యాపారస్తులు తక్కువ ధరకు వస్తువులను మన దేశానికి ఎగుమతి చేసి విక్రయిస్తుంటే యాంటీ డంప్ డ్యూటీ ఎలాగైతే చెల్లిస్తారో.. అలాగే యూడీఎస్, ప్రీలాంచ్ డెవలపర్ల నుంచి కూడా అధిక పన్నులు వసూలు చేయాలని అభిప్రాయపడ్డారు. యూడీఎస్, ప్రీలాంచ్ డెవలపర్లను కూడా రెరా పరిధిలోకి తీసుకురావాలని కోరారు. -
పాపం.. ఒక్కపూటలో ఐస్‌లా కరిగిన వేలకోట్ల ఆస్తి
Zhang Yuanlin: ఆయనొక బిలియనీర్. కానీ, వ్యాపారంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించలేం కదా. అలా మార్కెట్లో ప్రతికూల ప్రభావం ఆయన కొంప ముంచింది. బిలియనీర్ నుంచి మిలియనీర్‌గా మార్చేసింది. అదీ ఒక్కపూటలో! చైనాలో వరుసబెట్టి కుబేరులందరికీ దాదాపు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. అంత బలమైన కారణం ఏంటంటే.. ఝాంగ్ యువాన్లిన్.. సినిక్ హోల్డింగ్స్ గ్రూప్ చైర్మన్. హాంకాంగ్ బేస్డ్గా రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందాడు ఆయన. నిన్న(సెప్టెంబర్ 20, సోమవారం) పొద్దున వరకు ఆయన ఆస్తుల విలువ 1.3 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ, మధ్యాహ్నం కల్లా 250 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే దాదాపు 83 శాతం ఆస్తి ఐస్‌లా కరిగిపోయిందన్న మాట. ఇందుకు కారణం.. చైనా రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలడమే. ఝాంగ్ యువాన్లిన్ 2010లో ఒంటరిగా ఈ కంపెనీ స్థాపించాడు ఝాంగ్ యువాన్లిన్. తన తెలివితేటలతో పైకొచ్చాడు. 2019లో హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్ లిస్ట్‌లో, 2020లో చైనా కుబేరుల జాబితాలో నిలిచాడు ఝాంగ్. ఈ ఏడాది మొదట్లో విడుదలైన ఫోర్బ్స్ ధనికుల జాబితాలో.. ఫస్ట్ టైం చోటు కూడా సంపాదించుకున్నాడు. కానీ, ఆ ఆనందం నీరుకారడానికి ఎంతో టైం పట్టలేదు. చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే డిఫాల్ట్ ప్రచారం, హాంకాంగ్‌లో వ్యాపారాన్ని నిలిపివేయడం.. తదితర కారణాలతో సినిక్ హోల్డింగ్స్ షేర్లు 87 శాతం పతనం అయ్యాయి. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం 2021 సంవత్సరం అతిపెద్ద నికర విలువ క్షీణత కలిగిన 10 మంది బిలియనీర్లలో ఆరుగురు చైనాకు చెందిన వాళ్లే. వాళ్లలో అలీబాబా హెడ్ జాక్ మా కూడా ఉన్నాడు. ఈ సంవత్సరం ఆయన సుమారు 6.9 బిలియన్ డాలర్ల(45 వేల కోట్లకుపైనే) సంపదను కోల్పోయారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 18లోపు 9.5 శాతం 246 మిలియన్ల బాండ్‌ను సినిక్ హోల్డింగ్స్ గ్రూప్ చెల్లించాల్సి ఉండగా.. అంతకంటే ముందే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. తాజా పరిణామాలతో భారీ సంఖ్యలో ఇన్వెస్టర్లు, సప్లయర్స్.. సినిక్ ఆఫీసుల ఎదుట నిరసనలకు దిగారు. వాళ్లలో చాలామంది మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కంపెనీ చెల్లించాల్సి ఉందని చెప్తున్నారు. అయితే ఈ పరిణామాలన్నీ కేవలం ఆయన కంపెనీ మీద మాత్రమే చూపించలేదు. మొత్తం చైనా రియల్ ఎస్టేట్ రంగమే కుదేలు అయ్యింది. Evergrande పతనం నేపథ్యంలో రియాల్టీ రంగంపై ఈ ప్రభావం ఎంతకాలం కొనసాగుతుందో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఆర్థిక నిపుణులు. దేశంలోని ప్రైవేట్ రంగ కంపెనీలపై పట్టు సాధించడం కోసం డ్రాగన్ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ "సాధారణ శ్రేయస్సు" (కామన్ ప్రాస్సరటీ) పేరుతో తీసుకువచ్చిన విధానం వల్ల చైనా బిలియనీర్ క్లాస్‌లో భారీ ఆటుపోట్లు సంభవిస్తున్నాయి. ఇక చైనా జీడీపీలో పాతిక భాగం కంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్ వాటా ఉంది. ఈ తరుణంలో తాజా కుదేలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చదవండి: పాపం.. ఏకంగా రూ. 1.98 లక్షల కోట్ల నష్టం అతనికి! -
రియల్టీ భవిష్యత్తు ఏంటో?
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికం నిరాశపరిచింది. కరోనా రెండో దశ వ్యాప్తి చెందడంతో రియల్టీ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నదని నైట్‌ఫ్రాంక్–ఫిక్కీ–నరెడ్కో సర్వే వెల్లడించింది. వచ్చే ఆరు నెలలలో ఆశాజనక రియల్టీ మార్కెట్‌పై డెవలపర్లు గంపెడాశలతో ఉన్నారని 29వ ఎడిషన్ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ క్యూ2–2021 తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 57గా ఉన్న సెంటిమెంట్ స్కోర్ క్యూ2 నాటికి 35కి పడిపోయిందని పేర్కొంది. అయితే గతేడాది క్యూ2లో ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి చేరిన 22 స్కోర్‌తో పోలిస్తే ప్రస్తుత క్షీణత తీవ్రత తక్కువేనని తెలిపింది. ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్‌ను పరిశీలిస్తే.. ఈ ఏడాది క్యూ1లో 57గా ఉండగా.. క్యూ2 నాటికి స్వల్పంగా తగ్గి 56 స్కోర్‌కు చేరిందని.. అయినా ఇది ఆశావాద జోన్లోనే కొనసాగుతుందని పేర్కొంది. రియల్టీ మార్కెట్లో సెంటిమెంట్ స్కోర్ 50ని దాటితే ఆశావాదం జోన్‌గా, 50గా ఉంటే తటస్థం, 50 కంటే తక్కువగా ఉంటే నిరాశావాద జోన్‌గా పరిగణిస్తుంటారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం, నిరంతర ఆర్థిక కార్యకలాపాల మీద ఆధారపడి భవిష్యత్తు రియల్టీ సెంటిమెంట్ స్కోర్ ఆశాజనకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. కరోనాతో రియల్టీ మార్కెట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. నివాస, కార్యాలయ విభాగాలకు అంతర్లీన డిమాండ్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది క్యూ2లో సర్వే పాల్గొన్న 40 శాతం మంది ఆఫీసు లీజు కార్యకలాపాలు వచ్చే ఆరు నెలల కాలంలో మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. క్యూ1లో ఇది 34 శాతంగా ఉంది. అలాగే 21 శాతం మంది ఆఫీస్ అద్దెలు పెరుగుతాయని.. 40 శాతం మంది స్థిరంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. 2021 క్యూ2లో 50 శాతం మంది వచ్చే 6 నెలల్లో నివాస విక్రయాలు, లాంచింగ్స్‌లో వృద్ధి నమోదవుతుందని ఆశిస్తున్నారని సర్వే వెల్లడించింది. -
58402 గృహాలు, 23.93 ఆఫీస్ స్పేస్!
సాక్షి, హైదరాబాద్: దశాబ్ధ క్రితం వరకూ మన దేశంలో రియల్టీ మార్కెట్‌ను ముంబై, ఎన్సీఆర్ ఉత్తరాది నగరాలు శాసించేవి. కానీ, దక్షిణాది నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలల్లో ఐటీ హబ్ ఎంట్రీతో మన దేశంతో పాటూ విదేశీ ఇన్వెస్టర్లను లాగిపడేశాయి. భౌగోళిక స్వరూపం, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలు, స్థలాలు, స్థానికంగా బలమైన ప్రభుత్వ నిర్ణయాలతో ఈ మూడు నగరాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుందని వెస్టియన్ గ్లోబల్ సర్వీసెస్ ఆసియా పసిఫిక్ సీఈఓ శ్రీనివాస్ రావు తెలిపారు. ►2018లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో 23.93 మిలియన్ చ.అ. కార్యాలయాల లావాదేవీలు జరిగాయి. ఇందులో 58 శాతం అంటే 13.83 మిలియన్ చ.అ. లావాదేవీలు బెంగళూరులో జరగ్గా.. హైదరాబాద్‌లో 27 శాతం, చెన్నైలో 15 శాతం జరిగాయి. ► 2018లో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ ఏడాది ప్రతి త్రైమాసికంలో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ వృద్ధి చెందుతూ వచ్చింది. క్యూ4లో బెంగళూరులో 2.7 మిలియన్ చ.అ. లావాదేవీలు జరగ్గా.. హైదరాబాద్‌లో 2.6 మిలియన్ చ.అ. లీజింగ్‌లు జరిగాయి. క్యూ3తో పోలిస్తే ఇది 40 శాతం వృద్ధి. ► ఈ మూడు నగరాల్లో 2018లో కొత్తగా 14.74 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో బెంగళూరులో 7.52 మిలియన్ చ.అ. (51 శాతం) వాటా కాగా.. హైదరాబాద్ 31 శాతం, చెన్నై 18 శాతం వాటా ఉంది. నగరంలో క్యూ4లో 2 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్.. అది కూడా గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే ఈ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. ఏడాదిలో 58,402 గృహాలు.. 2018లో హైదరా బాద్, బెంగళూ రు, చెన్నై నగరాల్లో 58,402 గృహాలు ప్రారంభమయ్యా యి. ఇందులో 49% అంటే 28,676 యూని ట్లు బెంగళూరులో లాంచింగ్ కాగా.. హైదరాబాద్‌లో 25%, చెన్నైలో 26% ప్రారంభమ య్యాయి. ఇందులో ఎక్కువగా రూ.35–80 లక్షల లోపు ధర ఉన్న అఫడబుల్, మధ్య స్థాయి గృహాలే ఎక్కువగా ఉన్నాయి. -
క్యూ3లో చైనా వృద్ధి 6.7 శాతం
• మూడు త్రైమాసికాల నుంచి స్థిర వృద్ధి రేటు • ప్రపంచ ఆర్థికానికి సానుకూల సంకేతాలు! బీజింగ్: చైనా ఆర్థికాభివృద్ధి ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసికంలో 6.7 శాతంగా నమోదయ్యింది. రియల్టీ మార్కెట్ బాగుండడం, ప్రభుత్వ వ్యయాలు, రుణాల వంటి అంశాలు ఈ స్థిర వృద్ధి తీరుకు కారణం. వృద్ధి తీరు ఊహించినదానికన్నా బాగుందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వరుసగా మూడు త్రైమాసికాల నుంచీ చైనా ఆర్థికాభివృద్ధి రేటు 6.7 శాతంగా కొనసాగుతోంది. 2016లో జీడీపీ వృద్ధి తీరు 6.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో ఉంటుందని ప్రభుత్వం అంచనావేసింది. తాజా గణాంకాలు ఇందుకు తగిన విధంగానే ఉండడం సానుకూల అంశమని ఎన్బీఎస్ వివరించింది. ప్రపంచంలో రెండవ ప్రధాన ఆర్థికవ్యవస్థగా ఉన్న చైనా తాజా జీడీపీ గణాంకాలు అంతర్జాతీయంగా సానుకూల ప్రభావం చూపే వీలుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. క్రూడ్ ఒకేరోజు దాదాపు మూడు శాతం లాభపడ్డానికి కూడా ఈ గణాంకాలూ ఒక కారణమని అంచనాలూ ఉన్నాయి. మూడు క్వార్టర్లను కలిసి చూస్తే... జీడీపీ విలువ 52.997 ట్రిలియన్ యువాన్లుగా నమోదయ్యింది. డాలర్లలో ఈ విలువ దాదాపు 7.87 ట్రిలియన్ డాలర్లు. కాగా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలే స్థిర వృద్ధికి కారణమని, దీని పటిష్టతపై సందేహాలు కొనసాగుతాయని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య రియల్టీలో పెట్టుబడులు 5.8 శాతం పెరిగాయి. అమ్మకాలు దాదాపు 27 శాతం పెరిగాయి. హైటెక్, ఎక్యూప్మెంట్ తయారీ రంగాలు బాగున్నాయి. -
లింకన్ హౌస్ పూణావాలా వశం..
- విలువ రూ.750 కోట్లు ముంబై: ముంబై రియల్టీ మార్కెట్లో కోట్ల విలువచేసే ఒప్పందాలు కొత్తేమీ కాదు. అయితే తాజా డీల్ ఒక రికార్డు. ప్రతిష్టాత్మక, సాంస్కృతిక వారసత్వం కలిగిన లింకన్ హౌస్‌ను పూణేకు చెందిన పారిశ్రామిక వేత్త సైరస్ పూణావాలా అమెరికా నుంచి కొనుగోలు చేశారు. దీని విలువ రూ.750 కోట్లు. దక్షిణ ముంబై బ్రీచ్ క్యాండీ ప్రాంతంలో లింకన్ హౌస్ ఉంది. ఇంతక్రితం దీనిని అమెరికా దౌత్య కార్యాలయంగా వినియోగించింది. పాము కాటుకు చికిత్సలో వినియోగించే ఔషధాన్ని ఉత్పత్తి చేసే సిరమ్ ఇన్స్టిట్యూట్కు పూణావాలా అధిపతి. గృహ అవసరాలకోసం ఇంత భారీ మొత్తంలో రియల్టీ డీల్ దేశ ఆర్థిక రాజధానిలో ఇదే తొలిసారి. మలబార్ హిల్ ఏరియాలోని జితా హౌస్‌ను రూ.425 కోట్లుకు కొనుగోలు చేసి రియల్టీ డీల్‌కు సంబంధించి ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారమంగళం బిర్లా గత వారం రికార్డు సృష్టించారు. ఇంతకుమించి మొత్తం డీల్ ఇప్పుడు రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు రెండు ఎకరాల్లో 50,000 చదరపు అడుగుల బిల్టప్-ఏరియాలో లింకన్ హౌస్ ఉంది. నివాస గృహంగా... నిజానికి లింకన్ హౌస్ ప్రస్తుతం గ్రేడ్ 3 హెరిటేజ్ ప్రోపర్టీల్లో ఒకటిగా ఉంది. అయితే ఇకమీదట ఈ భవనాన్ని కుటుంబ నివాస గృహంగా పూణావాలా వినియోగించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ డీల్‌పై అమెరికా దౌత్య కార్యాలయం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తన కుమారుడు ఈ డీల్ వ్యవహారాన్ని చూస్తున్నాడని మాత్రం పూణావాలా తెలిపారు. నిజానికి 2011 నుంచీ ఈ ప్రొపర్టీని ఎందుకూ వినియోగించడంలేదు. అమెరికా ఈ భవనం అమ్మకానికి రూ.850 కోట్లు డిమాండ్ చేస్తూ వచ్చింది. భవనం పూర్వ విశేషాలకు వెళితే.. ఇది వాంకెనార్ మహారాజ ప్రతాప్‌సింగ్‌జీ జులా వాంకెనార్కు చెందినది. 1957లో దీన్ని అమెరికాకు అద్దెకు ఇచ్చారు. తదనంతరం దీనిని పూర్తిగా విక్రయించారు. లింకన్ హౌస్ పేరుతో దీనిని నగరంలో అమెరికా తన దౌత్య కార్యాలయంగా వినియోగించుకుంటూ వచ్చింది. 2011లో కాన్సులేట్‌ను బీకేసీ ఏరియాలోని కొత్త భవనంలోకి మార్చారు. -
‘రీట్స్’తో మార్కెట్లోకి 96 బిలియన్ డాలర్ల నిధులు!
ముంబై: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల(రీట్స్)కు బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను ప్రోత్సాహకాలతో 96 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 6 లక్షల కోట్లు) విలువైన నిధులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆఫీసులు, రిటైల్, గిడ్డంగులు ఇతరత్రా విభాగాల్లో వాడకంలో ఉన్న వాణిజ్యపరమైన స్థిరాస్తులను రానున్న కొద్ది సంవత్సరాల్లో ‘రీట్స్’ రూపంలో లిస్టింగ్ చేయడం ద్వారా ఈ మేరకు నిధుల ప్రవాహం ఉండొచ్చనేది వారి అభిప్రాయం. కేపీఎంజీ, నైట్ ఫ్రాంక్, హరియాని అండ్ కో రూపొందించిన సంయుక్త నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 141 కోట్ల చదరపు అడుగుల వాణిజ్య రియల్టీ ఆస్తులను రీట్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా మార్కెట్లో లిస్టింగ్ చేసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇందులో అత్యధిక వాటా ఏడు మెట్రో నగరాలదేనని కూడా తెలిపింది. అయితే, పన్ను సంబంధ అంశాలు, కొన్ని నియంత్రణపరమైన అడ్డంకులు ‘రీట్స్’ విజయవంతానికి సమస్యలు సృష్టించవచ్చని.. దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం... పెట్టుబడులకు ప్రోత్సాహకరమైన వాతావరణం నేపథ్యంలో రియల్టీ మార్కెట్లో రీట్స్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. బీమా కంపెనీలు కూడా రీట్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆస్కారం కల్పించేలా ఐఆర్డీఏ నిబంధనల సడలింపు, ఆస్తుల బదలాయింపునకు రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీలో వన్‌టైమ్ మాఫీ సదుపాయం కల్పించడం వంటివి రీట్స్ విజయవంతానికి కీలకంగా నిలుస్తాయని.. దీనివల్ల ఇన్వెస్టర్ల సంఖ్య కూడా విస్తృతం అవుతుందని నివేదిక సూచించింది. -
గృహ రుణం మరింతగా..
రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు తగ్గొచ్చన్న సంకేతాలు కనిపిస్తుండటంతో రియల్టీ మార్కెట్లో మళ్లీ కాస్త హడావుడి కనిపిస్తోంది. కొనుగోలుదారులకు అందుబాటు రేటులో ఇళ్లను అందించేందుకు డెవలపర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు మరింత ఎక్కువ రుణం పొందేందుకు వెసులుబాటు కల్పిస్తూ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కూడా తన వంతు తోడ్పాటు అందించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మధ్యతరగతి వర్గాల సొంతిల్లు కల మరింత సులువుగా సాకారమయ్యేలా తోడ్పడే తాజా పరిణామాల గురించి వివరించేదే ఈ ప్రాఫిట్ కథనం. మధ్యతరగతి వర్గాల వారి సొంతింటి కల సాకారానికి ఎదురయ్యే అనేకానేక అడ్డంకుల్లో ఇంటి ధర ఒకటి. సరే.. ఏదో రకంగా ఈఎంఐలు వగైరా లెక్కలు వేసుకుని మనకు అందుబాటు రేటులో ఉండే ఇల్లు చూసుకున్నా.. డౌన్‌పేమెంటు సమకూర్చుకోవడమనేది మరో పెద్ద సమస్య. అసలే ఆదాయాలు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు భారీ స్థాయిలో డౌన్పేమెంట్లు కట్టలేక... సొంతింటి నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది కొందరికి. ఇలాంటి వారికే ఊరటనిస్తూ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) తాజాగా లోన్ టు వేల్యూ (ఎల్టీవీ) నిష్పత్తి నిబంధనలను సడలించింది. గృహ రుణాలకు సంబంధించి ప్రాపర్టీ విలువలో 90 శాతం దాకా లోన్ పొందేలా వీలు కల్పించింది.దీని ప్రకారం హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇకపై రూ. 20 లక్షలకు పైగా ఖరీదు చేసే ప్రాపర్టీలకు కూడా 90 శాతం దాకా రుణం ఇవ్వొచ్చు. అయితే, ఈ రుణానికి మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీ నుంచి బీమా ఉండాలి. గతంలో ఎల్టీవీ.. ఇప్పటిదాకా రూ. 20 లక్షల దాకా గృహ రుణాలకు సంబంధించి ఎల్టీవీ నిష్పత్తి ప్రకారం ప్రాపర్టీ విలువలో 90 శాతం దాకా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు రుణం ఇచ్చేవి. అదే రూ. 20 లక్షలు నుంచి రూ. 75 లక్షల దాకా రుణాలపై ఎల్టీవీ నిష్పత్తి 80 శాతంగాను, అంతకు మించితే 75 శాతంగాను ఉండేది. ఉదాహరణకు చెప్పాలంటే.. గతంలో రూ. 50 లక్షల ఇల్లు కొనాలనుకుంటే రూ. 10 లక్షల పైచిలుకు డౌన్‌పేమెంట్ సమకూర్చుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే రూ. 20 లక్షలు మించిన గృహాలపై 80 శాతం దాకా మాత్రమే రుణం లభించేది. ఇక దీనికి తోడు జీతం సంబంధిత పరిమితులు వగైరాలు కూడా కలుపుకుంటే వచ్చే రుణ మొత్తం మరింత తగ్గిపోయి డౌన్‌పేమెంట్ మరింత అధికంగా కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు.. ప్రస్తుతం మార్టిగేజ్ గ్యారంటీ ప్రోగ్రాం కింద రూ. 20 లక్షలకు పైబడిన రుణాలకు కూడా 90% దాకా ఎల్టీవీ తీసుకునే అవకాశం లభిస్తుంది. దీని వల్ల అదే రూ. 50 లక్షల ఇంటికి సుమారు పది శాతం డౌన్‌పేమెంట్ సమకూర్చుకుంటే సరిపోతుంది. అంటే.. దాదాపు రూ. 5 లక్షలు సర్దుబాటు చేసుకుంటే చాలు. మొత్తం మీద.. ఎన్‌హెచ్‌బీ చేసిన సవరణల వల్ల గతానికి, ప్రస్తుతానికి ఒక చిన్న మార్పు వచ్చింది. గతంలో రుణ గ్రహీత, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ మధ్య మాత్రమే లావాదేవీ జరిగేది. ప్రస్తుతం మరింత అధిక లోన్ పొందాలంటే మూడో పక్షమైన మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీ కూడా తోడవుతుంది. ఇక, ఇక్కడ చెప్పుకోతగ్గ విషయం మరొకటుంది. హెచ్ఎఫ్సీ అధిక రుణం ఇస్తుంది కదా అని కాస్త ఎక్కువ డౌన్‌పేమెంట్ కట్టగలిగే స్తోమత ఉన్నా కట్టకుండా రుణమే తీసుకుంటే ఆ తర్వాత అధిక వడ్డీలు కూడా కట్టుకోవాల్సి వస్తుందన్నది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత వరకూ డౌన్‌పేమెంట్ మొత్తం ఎక్కువ ఉండేలా చూసుకుంటే.. అధిక రుణం, వడ్డీల భారం తగ్గించుకోవచ్చు. ఏదైతేనేం.. ప్రస్తుతం పండుగ సీజన్ అనీ, మరొకటని బ్యాంకులు గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజులు తగ్గిం చడం, ప్రీ పేమెంట్ చార్జీలు రద్దు చేయడం, ఉచితంగా వ్యక్తిగత ప్రమాద బీమా సదుపాయం అంటూ వివిధ ఆఫర్లతో ఊరిస్తున్నాయి. వీటికి సంబంధించి ఏయే బ్యాంకులు ఏమేం ఆఫర్లు ఇస్తున్నాయన్నది బేరీజు వేసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. మార్టిగేజ్ గ్యారంటీ.. దీన్నే మార్టిగేజ్ బీమా అని కూడా అంటారు. ఈ బీమా పాలసీ తీసుకుంటే .. ఒకవేళ గృహ కొనుగోలుదారు గానీ రుణం తిరిగి చెల్లించలేక చేతులెత్తేసిన పక్షంలో హౌసింగ్ ఫైనాన్స్ సంస్థకు (హెచ్ఎఫ్సీ) సదరు బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. ఆ రకంగా హెచ్ఎఫ్సీ ఇచ్చిన రుణాలకు కాస్త భరోసా ఉంటుంది. అందుకే, మరికాస్త అధిక మొత్తం రుణం ఇవ్వడానికి హెచ్ఎఫ్సీలు ముందుకు రాగలవు. దేశీయంగా తొలి మార్టిగేజ్ గ్యారంటీ సంస్థ అయిన ఇండియా మార్టిగేజ్ గ్యారంటీ కార్పొరేషన్‌ను స్వయంగా ఎన్హెచ్బీనే 2012లో ఏర్పాటు చేసింది. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లే ఈ మార్టిగేజ్ బీమాను తీసుకునే వారు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సందర్భాన్ని బట్టి హెచ్ఎఫ్సీ సైతం ఈ ప్రీమియం భారం తనపై వేసుకున్నా.. దాన్ని అంతిమంగా రుణగ్రహీతకే బదలాయించే అవకాశాలు ఉన్నాయి. -
ఒప్పందం మేరకే రుణమివ్వాలి
రియాల్టీ రంగంపై బ్యాంకులకు స్పష్టం చేసిన ఫోరం ఐసీఐసీఐకి మొట్టికాయ సాక్షి, హైదరాబాద్: రియల్టర్, వినియోగదారుడు, బ్యాంకు చేసుకున్న ఒప్పందం మేరకు నిర్మాణ దశకు అనుగుణంగా మాత్రమే రుణం మొత్తాన్ని విడుదల చేయాలని రాష్ట్ర వినియోగదారుల ఫోరం బ్యాం కులకు స్పష్టం చేసింది. అలా కాకుండా రియల్టర్ పరపతి మేరకు నిర్మాణ దశను పట్టించుకోకుండా విడుదల చేసిన మొత్తాన్ని విని యోగదారుని నుంచి వసూలు చేసే అధికారం బ్యాంకులకు ఉండదని తేల్చిచెప్పింది. వినియోగదారునితో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా, నిర్మాణ దశను పరిశీలించకుండా హిల్‌కౌంటీ యాజమాన్యానికి రూ.63.90లక్షలు విడుదల చేసిన ఐసీఐసీఐ తీరుపై ఫోరం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి బ్యాంకు రుణం మంజూరు చేయడాన్ని సేవల్లో లోపంగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒప్పందానికి విరుద్ధంగా విడుదల చేసిన రుణానికి ఈఎంఐలను వసూలు చేసే హక్కు సదరు బ్యాంకుకు ఉండదని తెలిపింది. అయితే పిటిషనర్ బ్యాంకును ప్రతివాదిగా పేర్కొనని కారణం గా.. రూ.63.90 లక్షలను 12 శాతం వడ్డీతో, పరిహారంగా మరో రూ.లక్షను నాలుగు వారాల్లో చెల్లించాలని మేటాస్ హిల్‌కౌంటీ యాజమాన్యాన్ని ఆదేశించింది. హిల్‌కౌంటీతో చేసుకున్న ఒప్పందం మేరకు తాను ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణం తీసుకొని డబ్బు చెల్లించినా ఫ్లాట్ నిర్మాణం పూర్తి చేయలేదని, తాను చెల్లించిన రూ.63.90 లక్షలను తిరిగి ఇప్పించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన కృష్ణచైతన్య దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఫోరం ఈ మేరకు తీర్పునిచ్చింది. 2009 ఫిబ్రవరి నాటికి నిర్మాణం పూర్తిచేసి అప్పగించాల్సి ఉందని, అయితే సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు అరెస్టుతో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందని పిటిషనర్ ఆరోపించారు. -
భూ ఆక్రమణలకు చెక్
కొత్తగూడెం, న్యూస్‌లైన్: ‘రియల్’ భూమ్‌తో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం పేదలకు పంచిన అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు ఇప్పటికే చాలా వరకు కబ్జాకు గురికాగా, మిగిలిన వాటినైనా రక్షించే పనిలో పడ్డారు. అయితే ఇప్పటికే బడా బాబుల చేతికి చిక్కిన భూముల వివరాలు అందకపోవడం, సర్వే నంబరలలో మార్పు చేయడంతో వాటి వివరాలు అందించలేక మండలస్థాయి సిబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను మాయం చేసేందుకు బై నంబర్లు సృష్టించడంతో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ భూ వివరాలు సేకరించి రిజిస్ట్రేషన్ శాఖకు అందించాలని రెవెన్యూ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు అందించి అక్రమంగా సాగుతున్న రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాలని రెవెన్యూ చట్టం 22 (ఎ)ను జారీ చేశారు. దీంతో గత నెల రోజులుగా జిల్లాలో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అన్యాక్రాంతమైన భూములపై తర్జన భర్జన... జిల్లాలో 46 మండలాలు ఉండగా అందులో 29 మండలాలు ఏజెన్సీలో ఉన్నాయి. ఏజెన్సీ చట్టం ప్రకారం ఇక్కడ కొనుగోలు, అమ్మకాలు నిషేధం. గిరిజనేతరులు క్రయ, విక్రయాలు చేయకూడదనే నిబంధన ఉండడంతో ప్రస్తుతం ఏజెన్సీ పరిధిలో ఉన్న భూముల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగడం లేదు. అయితే ప్రభుత్వ భూములు మాత్రం చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ పరిధిలో ఉన్న భూముల వివరాలను సైతం రిజిస్ట్రేషన్ అధికారులకు అందించాలని ఉన్నతాధికారులు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. దీంతోపాటు మైదాన ప్రాంతంలోని 17 మండలాల్లో అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు సైతం సర్వే నంబర్ల మార్పుతో అన్యాక్రాంతమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉండాల్సిన అసైన్డ్ భూములు సక్రమంగా ఉన్నాయో..? లేదో అనే విషయంపై ఇప్పుడు అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వ భూమి వివరాలు అందించిన తర్వాత తప్పనిసరిగా వాటిని పొజిషన్ చూపించాల్సి రావడంతో అధికారులు ఇప్పుడు ఆ నివేదికల తయారీ పనిలో నిమగ్నమయ్యారు. నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు... జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాలను సేకరించాలని నెల క్రితమే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ వివరాలు ఇంకా అందకపోవడంతో ఈ నెలాఖరులోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా నివేదిక తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీనివాస్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రభుత్వ భూముల వివరాలు రిజిస్ట్రేషన్ శాఖకు అందిస్తే.. ఇకపై భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చని చెప్పారు. -
కెన్యా రియల్టీలోకి రిలయన్స్
కెన్యా రియల్టీ మార్కెట్లోకి ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రవేశించింది. డెల్టా కార్పొరేషన్‌తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్, డెల్టా కార్ప్ ఈస్ట్ ఆఫ్రికా లిమిటెడ్(డీసీఈఏఎల్-ఈ జేవీలో రిలయన్స్‌కు 58.8 శాతం వాటాలున్నాయి) ద్వారా హౌసింగ్, ఆఫీస్ ప్రాపర్టీస్ డెవలప్ చేస్తోంది. కెన్యాలో రూ.200 కోట్ల విలువైన భూములను ఈ కంపెనీ కొనుగోలు చేసిందని డెల్టా కార్ప్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇప్పటికే చౌక ధరల రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఒక ఆఫీస్ బ్లాక్ ప్రాజెక్ట్‌ను ఈ జేవీ పూర్తి చేసింది. నైరోబీలోని 10 ప్రైమ్ ప్లాట్లను కొనుగోలు చేసిన డీసీఈఏఎల్ 12 లక్షల చదరపుటడుగుల కమర్షియల్, రెసిడెన్షియల్ అసెట్స్‌ను డెవలప్ చేయనున్నది. జయదేవ్ మోడీ నేతృత్వంలోని డెల్టా కార్ప్ భారత్, శ్రీలంక, కెన్యాల్లో గేమింగ్, ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ, రియల్టీ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. డెల్టా కార్ప్ అధినేత మోడీ, ముకేష్ అంబానీలు మంచి స్నేహితులు.