లింకన్ హౌస్ పూణావాలా వశం..
- విలువ రూ.750 కోట్లు
ముంబై: ముంబై రియల్టీ మార్కెట్‌లో కోట్ల విలువచేసే ఒప్పందాలు కొత్తేమీ కాదు. అయితే తాజా డీల్ ఒక రికార్డు. ప్రతిష్టాత్మక, సాంస్కృతిక వారసత్వం కలిగిన లింకన్ హౌస్‌ను పూణేకు చెందిన పారిశ్రామిక వేత్త సైరస్ పూణావాలా అమెరికా నుంచి కొనుగోలు చేశారు. దీని విలువ రూ.750 కోట్లు. దక్షిణ ముంబై బ్రీచ్ క్యాండీ ప్రాంతంలో లింకన్ హౌస్ ఉంది. ఇంతక్రితం దీనిని అమెరికా దౌత్య కార్యాలయంగా వినియోగించింది. పాము కాటుకు చికిత్సలో వినియోగించే ఔషధాన్ని ఉత్పత్తి చేసే సిరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు పూణావాలా అధిపతి. గృహ అవసరాలకోసం ఇంత భారీ మొత్తంలో రియల్టీ డీల్ దేశ ఆర్థిక రాజధానిలో ఇదే తొలిసారి. మలబార్ హిల్ ఏరియాలోని జితా హౌస్‌ను రూ.425 కోట్లుకు కొనుగోలు చేసి రియల్టీ డీల్‌కు సంబంధించి ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారమంగళం బిర్లా గత వారం రికార్డు సృష్టించారు. ఇంతకుమించి మొత్తం డీల్ ఇప్పుడు రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు రెండు ఎకరాల్లో 50,000 చదరపు అడుగుల బిల్టప్-ఏరియాలో లింకన్ హౌస్ ఉంది.
నివాస గృహంగా...
నిజానికి లింకన్ హౌస్ ప్రస్తుతం గ్రేడ్ 3 హెరిటేజ్ ప్రోపర్టీల్లో ఒకటిగా ఉంది. అయితే ఇకమీదట ఈ భవనాన్ని కుటుంబ నివాస గృహంగా పూణావాలా వినియోగించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ డీల్‌పై అమెరికా దౌత్య కార్యాలయం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తన కుమారుడు ఈ డీల్ వ్యవహారాన్ని చూస్తున్నాడని మాత్రం పూణావాలా తెలిపారు. నిజానికి 2011 నుంచీ ఈ ప్రొపర్టీని ఎందుకూ వినియోగించడంలేదు. అమెరికా ఈ భవనం అమ్మకానికి రూ.850 కోట్లు డిమాండ్ చేస్తూ వచ్చింది. భవనం పూర్వ విశేషాలకు వెళితే.. ఇది వాంకెనార్ మహారాజ ప్రతాప్‌సింగ్‌జీ జులా వాంకెనార్‌కు చెందినది. 1957లో దీన్ని అమెరికాకు అద్దెకు ఇచ్చారు. తదనంతరం దీనిని పూర్తిగా విక్రయించారు. లింకన్ హౌస్ పేరుతో దీనిని నగరంలో అమెరికా తన దౌత్య కార్యాలయంగా వినియోగించుకుంటూ వచ్చింది. 2011లో కాన్సులేట్‌ను బీకేసీ ఏరియాలోని కొత్త భవనంలోకి మార్చారు.