Cyrus poonawalla
-
టీపీజీ చేతికి పూనావాలా హౌసింగ్
ముంబై: అనుబంధ సంస్థ పూనావాలా హౌసింగ్ ఫైనాన్స్‌ను పీఈ దిగ్గజం టీపీజీకి విక్రయించినట్లు ఎన్బీఎఫ్సీ పూనావాలా ఫిన్‌కార్ప్ తాజాగా తెలియజేసింది. డీల్ విలువను రూ. 3,900 కోట్లుగా వెల్లడించింది. అయితే ఈ లావాదేవీ నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఉంటుందని వ్యాక్సిన్ల దిగ్గజం సైరస్ పూనావాలా గ్రూప్ కంపెనీ పేర్కొంది. టీపీజీ గ్లోబల్‌కు చెందిన పెర్సూ్యస్ ఎస్జీ ఈ లావాదేవీని చేపట్టనున్నట్లు తెలియజేసింది. వాటాదారులకు విలువ చేకూర్చడంతోపాటు.. కన్జూమర్, ఎంఎస్ఎంఈ ఫైనాన్సింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకు ఈ విక్రయం దోహదపడనున్నట్లు వివరించింది. టెక్నాలజీ ఆధారిత వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు, రానున్న మూడేళ్లలో లోన్‌బుక్‌లో 35–40 శాతం వార్షిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో మొండిబకాయిల(ఎన్పీఏలు)ను 1 శాతంలోపు కట్టడి చేయాలని నిర్దేశించుకున్నట్లు స్పష్టం చేసింది. ఫైనాన్షియల్స్‌కు ప్రాధాన్యత ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్‌కు వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఉన్నదని, వాటాదారులకు విలువను చేకూర్చడంలో పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామని పూనావాలా ఫిన్‌కార్ప్ చైర్మన్ అదార్ పూనావాలా పేర్కొన్నారు. మార్కెట్లో భారీ అవకాశాలరీత్యా తాజా విక్రయం వృద్ధికి మరింత మద్దతునిస్తుందని కంపెనీ ఎండీ అభయ్ భుటాడా అభిప్రాయపడ్డారు. కన్జూమర్, ఎంఎస్ఎంఈపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు వీలు చిక్కుతుందని తెలియజేశారు. తాజా పెట్టుబడుల ద్వారా వృద్ధి మరింత ఊపందుకుంటుందని తెలియజేశారు. 2021 ఫిబ్రవరిలో మ్యాగ్మా ఫిన్‌కార్ప్‌ను రూ. 3,456 కోట్లకు పూనావాలా ఫిన్‌కార్ప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ అదార్ పూనావాలా సంస్థ రైజింగ్ సన్ హోల్డింగ్స్ చేతిలో ఉంది. -
కాక్టైల్ వ్యాక్సిన్ సరైంది కాదు
పుణె: ఒక వ్యక్తికి రెండు వేర్వేరు కంపెనీల కోవిడ్–19 వ్యాక్సిన్లు ఇవ్వడానికి తాను వ్యతిరేకమని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుని అందుకున్న సందర్భంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్ల అవసరం లేదని అన్నారు. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా వ్యాక్సిన్లను మిశ్రమంపై ప్రయోగాలకు అనుమతులు ఇచ్చిన అంశంపై ఆయన మాట్లాడుతూ ‘‘ఇలా రెండు రకాల వ్యాక్సిన్లు ఇచ్చాక మెరుగైన ఫలితాలు రాకపోతే సీరమ్, ఇతర కంపెనీ వ్యాక్సినే మంచిది కాదని అనే అవకాశం ఉంది. అదే విధంగా ఆ కంపెనీ కూడా సీరమ్‌ని నిందించే అవకాశం ఉంటుంది’’అని అన్నారు. రెండు వ్యాక్సిన్ల మిశ్రమాల ఫలితాలపై సరైన డేటా కూడా లేదని పూనావాలా గుర్తు చేశారు. రెడ్ టేపిజం బాగా తగ్గింది కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ టేపిజం, లైసెన్స్ రాజ్ బాగా తగ్గిపోయాయని పూనావాలా కొనియాడారు. అంతకు ముందు పారిశ్రామిక రంగం ఎన్నో గడ్డు రోజుల్ని ఎదుర్కొందని చెప్పారు. అధికారుల నుంచి వేధింపులు, అనుమతులు లభించడంలో జాప్యం వంటి వాటితో పారిశ్రామికవేత్తలు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నారని అన్నారు. గతంలో బ్యూరోక్రాట్లు, ఔషధ నియంత్రణ అధికారుల కాళ్ల మీద పడినంత పని అయ్యేదని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ యుద్ధ ప్రాతిపదికన మార్కెట్లోకి రావడమే దీనికి నిదర్శనమని పూనావాలా చెప్పారు. -
‘కరోనా’తో సైరస్ సంపదకు రెక్కలు!
సాక్షి, ముంబై: టీకాల తయారీలో (వ్యాక్సిన్లు) ప్రపంచ ప్రసిద్ధి పొందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనవాలా సంపద కరోనా రాకతో వేగంగా పరుగులు పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే చివరి నాటికి దిగ్గజ వ్యాపారవేత్తల సంపదపై కరోనా ప్రభావం ఏ మేరకు ఉందన్న వివరాలతో హరూన్ రీసెర్చ్ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నాలుగు నెలల కాలంలో సంపద అత్యంత వేగంగా వృద్ధి చెందిన భారత బిలియనీర్‌గా సైరస్ పూనవాలా మొదటి స్థానంలో ఉన్నారు. అమెజాన్ జెఫ్ బెజోస్ తన సంపదను కరోనా కాలంలో రూ. 1.5 లక్షల కోట్ల మేర పెంచుకుని (14 శాతం వృద్ధి) ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంటే.. ఈ విషయంలో సైరస్ పూనవాలా ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్నట్టు హరూన్ రీసెర్చ్ నివేదిక వివరించింది. టీకాల కంపెనీగా సీరమ్ ఇన్స్టిట్యూట్కు ఉన్న బలమైన వ్యాపార సామర్థ్యాలే పూనవాలా సంపద పెరిగేందుకు దోహదపడుతున్నట్టు తెలిపింది. ఈ ఏడాది మే చివరికి సైరస్ పూనవాలా రూ. 1.12 లక్షల కోట్ల సంపదతో ప్రపంచంలో 86వ స్థానానికి చేరుకున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఏకంగా 57 స్థానాలు ముందుకు వచ్చేశారు. నాలుగు నెలల్లోనే ఆయన సంపద విలువ 25 శాతం పెరగడం గమనార్హం. -
లింకన్ హౌస్ పూణావాలా వశం..
- విలువ రూ.750 కోట్లు ముంబై: ముంబై రియల్టీ మార్కెట్లో కోట్ల విలువచేసే ఒప్పందాలు కొత్తేమీ కాదు. అయితే తాజా డీల్ ఒక రికార్డు. ప్రతిష్టాత్మక, సాంస్కృతిక వారసత్వం కలిగిన లింకన్ హౌస్‌ను పూణేకు చెందిన పారిశ్రామిక వేత్త సైరస్ పూణావాలా అమెరికా నుంచి కొనుగోలు చేశారు. దీని విలువ రూ.750 కోట్లు. దక్షిణ ముంబై బ్రీచ్ క్యాండీ ప్రాంతంలో లింకన్ హౌస్ ఉంది. ఇంతక్రితం దీనిని అమెరికా దౌత్య కార్యాలయంగా వినియోగించింది. పాము కాటుకు చికిత్సలో వినియోగించే ఔషధాన్ని ఉత్పత్తి చేసే సిరమ్ ఇన్స్టిట్యూట్కు పూణావాలా అధిపతి. గృహ అవసరాలకోసం ఇంత భారీ మొత్తంలో రియల్టీ డీల్ దేశ ఆర్థిక రాజధానిలో ఇదే తొలిసారి. మలబార్ హిల్ ఏరియాలోని జితా హౌస్‌ను రూ.425 కోట్లుకు కొనుగోలు చేసి రియల్టీ డీల్‌కు సంబంధించి ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారమంగళం బిర్లా గత వారం రికార్డు సృష్టించారు. ఇంతకుమించి మొత్తం డీల్ ఇప్పుడు రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు రెండు ఎకరాల్లో 50,000 చదరపు అడుగుల బిల్టప్-ఏరియాలో లింకన్ హౌస్ ఉంది. నివాస గృహంగా... నిజానికి లింకన్ హౌస్ ప్రస్తుతం గ్రేడ్ 3 హెరిటేజ్ ప్రోపర్టీల్లో ఒకటిగా ఉంది. అయితే ఇకమీదట ఈ భవనాన్ని కుటుంబ నివాస గృహంగా పూణావాలా వినియోగించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ డీల్‌పై అమెరికా దౌత్య కార్యాలయం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తన కుమారుడు ఈ డీల్ వ్యవహారాన్ని చూస్తున్నాడని మాత్రం పూణావాలా తెలిపారు. నిజానికి 2011 నుంచీ ఈ ప్రొపర్టీని ఎందుకూ వినియోగించడంలేదు. అమెరికా ఈ భవనం అమ్మకానికి రూ.850 కోట్లు డిమాండ్ చేస్తూ వచ్చింది. భవనం పూర్వ విశేషాలకు వెళితే.. ఇది వాంకెనార్ మహారాజ ప్రతాప్‌సింగ్‌జీ జులా వాంకెనార్కు చెందినది. 1957లో దీన్ని అమెరికాకు అద్దెకు ఇచ్చారు. తదనంతరం దీనిని పూర్తిగా విక్రయించారు. లింకన్ హౌస్ పేరుతో దీనిని నగరంలో అమెరికా తన దౌత్య కార్యాలయంగా వినియోగించుకుంటూ వచ్చింది. 2011లో కాన్సులేట్‌ను బీకేసీ ఏరియాలోని కొత్త భవనంలోకి మార్చారు.