న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ రియల్టీ మార్కెట్ జోరు కొనసాగించింది. ఇతర నగరాలతో పోల్చి చూస్తే కొత్త ప్రాజెక్టుల్లో యూనిట్ల అమ్మకాలు ఇక్కడే ఎక్కువగా నమోదయ్యాయి. 2021లో హైదరాబాద్ మార్కెట్లో 25,410 ఇళ్ల యూనిట్లు అమ్ముడు కాగా, అందులో 55 శాతం యూనిట్లు కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లోనివే కావడం గమనార్హం. 2019లో 16,560 యూనిట్ల ఇళ్ల అమ్మకాలతో పోలిస్తే స్వీకరణ రేటు (మొత్తం విక్రయాల్లో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి) పెరిగింది.
ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవల సంస్థ అనరాక్ ఈ మేరకు ఒక నివేదికను గురువారం విడుదల చేసింది. దేశంలోని ఏడు నగరాల్లో 2021లో కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్టుల్లో 35 శాతం ఫ్లాట్స్ వెంటనే అమ్ముడుపోయినట్టు వెల్లడించింది. బ్రాండెడ్ డెవలపర్ల నుంచి కొత్త ప్రాజెక్టులు రావడం, అదే సమయంలో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులకు డిమాండ్ ఏర్పడడం సానుకూలించినట్టు పేర్కొంది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై నగరాలకు సంబంధించిన గణాంకాలకు ఇందులో చోటు కల్పించింది.
నివేదికలోని వివరాలు..
► ఏడు నగరాల్లో 2021లో 2.37 లక్షల యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. ఇందులో 34 శాతం కొత్త ప్రాజెక్టుల్లోనివి ఉన్నాయి. మిగిలిన 66 శాతం యూనిట్లు అంతక్రితం సంవత్సరాల్లో ఆరంభించిన ప్రాజెక్టుల్లోనివి.
► అంతక్రితం 2020లో 7 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 1.38 లక్షలుగా ఉంటే, అందులో కొత్త ప్రాజెక్టులకు సంబంధించినవి 28 శాతం.
► 2019లో అమ్ముడైన 2.61 లక్షల యూనిట్లలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన యూనిట్లు 26 శాతంగా ఉన్నాయి.
► చాలా కాలం తర్వాత కొత్తగా మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లోని ఇళ్లకు డిమాండ్ పెరిగింది. రెడీ టు మూవ్ యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణంగా అనరాక్ పేర్కొంది.
► అయితే ఇప్పటికీ త్వరలో నిర్మాణం
పూర్తయ్యే వాటికి, వెంటనే గృహ ప్రవేశానికి అనుకూలంగా ఉన్న వాటిల్లోనే ఎక్కువ కొనుగోళ్లు నమోదవుతున్నాయి.
► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ కొత్త ప్రాజెక్టుల్లో అమ్మకాల పరంగా తక్కువ రేటును చూపించింది. 2021లో 76,400 యూనిట్లు అమ్ముడుపోతే, అందులో కొత్త ప్రాజెక్టుల్లోనివి 26 శాతంగానే ఉన్నాయి.
► బెంగళూరులో 2021లో 33,080 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో కొత్త ప్రాజెక్టుల్లోని యూనిట్ల అమ్మకాలు 35 శాతం.
► ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో కొత్త ప్రాజెక్టుల్లోని విక్రయాలు మొత్తం విక్రయాల్లో 30 శాతంగా ఉన్నాయి.
ఫిబ్రవరిలో 25 % డౌన్ : నైట్‌ఫ్రాంక్ ఇండియా
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 25 శాతం తగ్గినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. 5,146 యూనిట్లు అమ్ముడుపోయాయని వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఈ గణాంకాలను తన నివేదికలో విడుదల చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రెండో పర్యాయం రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం వల్ల ఇళ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టినట్టు విశ్లేషించింది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడం రూ.25 లక్షల్లోపు బడ్జెట్ ఇళ్లపై ఎక్కువ ప్రభావం చూపించినట్టు తెలిపింది. ఈ విభాగంలో కేవలం 844 ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని నివేదికలో పేర్కొంది.
2021 ఫిబ్రవరిలో ఇదే విభాగంలో 2,888 యూనిట్లకు రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తు చేసింది. 2022 ఫిబ్రవరిలో నాలుగు జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లను పరిశీలించగా.. హైదరాబాద్ జిల్లా పరిధిలో క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూస్తే 64 శాతం క్షీణించాయని తెలిపింది. కానీ, సగటు రిజిస్ట్రేషన్ విలువలో మాత్రం 21 శాతం వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. ‘‘గడిచిన కొన్నేళ్లలో విక్రయ ధరల వృద్ధి పరంగా హైదరాబాద్ దేశంలోనే బలమైన ఇళ్ల మార్కెట్‌గా ఉంది. 2022 మొదటి రెండు నెలల్లో రిజిస్ట్రేషన్లు తగ్గముఖం పట్టాయి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వ్యయాలు పెగడం, వైరస్ కారణంగా ఏర్పడిన నిర్వహణ సమస్యలే ఇందుకు కారణం’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment