సాక్షి, హైదరాబాద్: ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లలో ఎక్కువగా కనిపించే హైరైజ్ నిర్మాణాలు క్రమంగా హైదరాబాద్‌లోనూ జోరందుకుంటున్నాయి. అత్యంత ఎత్తులో నివాసం ఉండాలని కోరుకునే వాళ్ల సంఖ్య పెరగడం, భవనాల ఎత్తుకు నిబంధనలను లేకపోవటం, స్థలాల కొరత వంటివి నగరంలో ఆకాశహర్మ్యాల పెరుగుదలకు కారణం. గతేడాది హైదరాబాద్‌లో 10, అంతకంటే ఎత్తయిన హైరైజ్ ప్రాజెక్ట్‌లు 57 ప్రారంభం కాగా.. బెంగళూరులో 51, చెన్నైలో 10 ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలలోనే భాగ్యనగరం ప్రథమ స్థానంలో నిలిచిందని అనరాక్ రిపోర్ట్ తెలిపింది.
దేశంలో అత్యధికంగా ముంబైలో 263 , పుణేలో 170 హైరైజ్ ప్రాజెక్ట్‌లు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో ఏటా సగటున 1,400 అపార్ట్‌మెంట్లు నిర్మాణం చేపడితే అందులో సగటున 200 వరకు ఐదు అంతస్తుల పైన ఉండే బహుళ అంతస్తుల నివాస సముదాయాలుంటాయి. ఇందులో నాలుగో వంతు 10 అంతకంటే ఎక్కువ అంతస్తులపైన ప్రాజెక్ట్‌లుంటాయి. 2019లో 236 ఐదు ఫ్లోర్లపైన నివాసాల బహుళ నిర్మాణ ప్రాజెక్ట్‌లు వస్తే.. 2020లో కోవిడ్ లాక్‌డౌన్‌తో 115కి తగ్గాయి. 2021లో మళ్లీ పుంజుకుంది. 2020తో పోలిస్తే గతేడాది హైరైజ్ భవనాల లాంచింగ్స్‌లో 41 శాతం వృద్ధి రేటు నమోదయింది. గతేడాది గ్రేటర్ పరిధిలో 140 ప్రాజెక్ట్‌లకు అనుమతి లభించగా.. ఇందులో 57 హైరైజ్ భవనాలే.
పశ్చిమ హైదరాబాద్‌లోనే..
షేక్‌పేట, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, ఖాజాగూడ, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలలో ఎక్కడ చూసినా ఆకాశహర్మ్యాలే కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో గతేడాది మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. సహజంగానే ఇక్కడ కొలువు ఉండే ఐటీ ఉద్యోగుల నుంచి డిమాండ్ ఉండటంతో ఎకరాల విస్తీర్ణంలో ఆకాశాన్నంటే ఎత్తయిన గృహ సముదాయాలను నిర్మిస్తున్నారు.
జీవనశైలికి అనుగుణంగా..
ముంబై వంటి ప్రాంతాల్లో స్థలాల లభ్యత తక్కువ కాబట్టి వర్టికల్ నిర్మాణాలు సహజమే. హైదరాబాద్‌కు ఆ సమస్య లేదు. ఔటర్ చుట్టుప్రక్కల కొన్ని వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా ఆకాశహర్మ్యాలు పెరగడానికి కారణం సిటీలోనే ఉండాలని ఎక్కువ మంది కోరుకోవటమే అంటున్నారు నిపుణులు. అందుకే బంజారాహిల్స్, సోమాజిగూడ, పంజాగుట్ట, ఉప్పల్, బేగంపేట, సంతోష్‌నగర్, అత్తాపూర్, అప్పా జంక్షన్, బాచుపల్లి, మియాపూర్, సికింద్రాబాద్, బొల్లారం వంటి ప్రాంతాలలో భారీ భవంతులు వస్తున్నాయి. పాత వాటి స్థానంలో ఎత్తయిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి చెంది ఉండటం, మెరుగైన రవాణా సదుపాయాలు, దగ్గర్లో విద్యా, వైద్య సదుపాయాలు ఉండటం అన్నింటికీ మించి సకల సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దుతుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏటేటా ఈ తరహా ఎత్తయిన గృహ సముదాయాలు పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment