న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్టీ మార్కెట్ ఈ ఏడాది మంచి జోరు చూపించింది. చివరి త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో ఇళ్ల విక్రయాలు ఏకంగా రెట్టింపై 10,330 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 4,280 యూనిట్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మొత్తం మీద హైదరాబాద్‌లో మార్కెట్లో 35,370 ఇళ్లు అమ్ముడయ్యాయి. 2021లో అమ్మకాలు 22,240 యూనిట్లతో పోలిస్తే 59 శాతం వృద్ధి నమోదైంది.
2021 చివరి మూడు నెలలతో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది చివరి మూడు నెలల కాలంలో దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు 19 శాతం పెరిగాయి. ఈ వివరాలను హౌసింగ్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ఎనిమిది పట్టణాల్లో మొత్తం మీద 80,770 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 67,890 యూనిట్లుగా ఉన్నాయి. ఇక 2022 మొత్తం మీద ఈ ఎనిమిది పట్టణాల్లో 3,08,940 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2021లో అమ్మకాలు 2,05,940 యూనిట్లుగా ఉన్నాయి. అంటే 50 శాతం వృద్ధి నమోదైంది.
పట్టణాల వారీగా అమ్మకాలు
► అహ్మదాబాద్‌లో ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ మధ్య, క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 23 శాతం అధికంగా 6,640 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాది మొత్తం మీద 62 శాతం అధికంగా 27,310 యూనిట్లు అమ్ముడుపోయాయి.
► బెంగళూరులో అమ్మకాలు డిసెంబర్ క్వార్టర్‌లో 30 శాతం తగ్గి 6,560 యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది మొత్తం మీద 22 శాతం వృద్ధితో 30,470 యూనిట్లు విక్రయమయ్యాయి.
► చెన్నైలో డిసెంబర్ త్రైమాసికంలో 2 శాతం తగ్గి 3,160 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఏడాది మొత్తం మీద 8 శాతం అధికంగా 14,100 యూనిట్లు అమ్ముడయ్యాయి.
► ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో 3 శాతం తగ్గి డిసెంబర్ త్రైమాసికంలో 4,280 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది మొత్తం మీద 7 శాతం వృద్ధితో 19,240 ఇళ్ల విక్రయాలు చోటు చేసుకున్నాయి.
► కోల్‌కతా మార్కెట్లో 18 శాతం క్షీణించి ఇళ్ల అమ్మకాలు 2,130 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఏడాది మొత్తం మీద 8 శాతం పెరిగి
10,740 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో అమ్మకాలు డిసెంబర్ త్రైమాసికంలో 40 శాతం పెరిగాయి. 31,370 యూనిట్లు విక్రయమయ్యాయి. ఈ ఏడాది 87 శాతం అధికంగా 1,09,680 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
► పుణెలో క్యూ4లో ఒక శాతం పెరిగి 16,300 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఏడాది మొత్తం మీద అమ్మకాలు 62,030 యూనిట్లుగా ఉన్నాయి.
కొనుగోలు శక్తిపై ధరల ప్రభావం: నైట్‌ఫ్రాంక్
దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో గృహ రుణ రేట్లు పెరిగిపోవడంతో ఈ ఏడాది ఇళ్ల కొనుగోలు శక్తి గతేడాదితో పోలిస్తే కొంత తగ్గినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ తెలిపింది. అయితే సగటు కుటుంబ ఆదాయం ప్రకారం చూస్తే.. ఇప్పటికీ గృహ రుణాలు పొందే శక్తి వారికి ఉన్నట్టు పేర్కొంది. వార్షిక ప్రాపర్టీ అధ్యయన నివేదికను ‘ద అఫర్డబులిటీ ఇండెక్స్ 2022’ పేరుతో నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. సగటు కుటుంబ ఆదాయంతో ఈఎంఐ మొత్తం నిష్పత్తిని ఈ ఇండెక్స్ ట్రాక్ చేస్తుంటుంది. అలాగే, ఇళ్ల ధరలు, గృహ రుణాల వడ్డీ రేట్లు, కుటుంబ ఆదాయాన్ని విశ్లేషించి ఏటా గణాంకాలు విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది మొత్తం మీద ఆర్‌బీఐ 2.25 శాతం రెపో రేటు పెంపును ఈ నివేదిక ప్రస్తావించింది. దీని కారణంగా గృహ రుణాల రేట్లు పెరగడం, నిర్మాణ సామాగ్రి వ్యయాలు అధికం కావడం వల్ల పెరిగిన ప్రాపర్టీ ధరలతో కొనుగోలు శక్తి క్షీణించినట్టు వివరించింది. కాకపోతే కరోనా ముందు 2019తో పోలిస్తే కొనుగోలు శక్తి ఇప్పటికీ మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. ఎనిమిది పట్టణాల్లో ఒక్క ముంబై ఈ విషయంలో బలహీనంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment