Homes sales in Hyderabad
-
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు డబుల్
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్టీ మార్కెట్ ఈ ఏడాది మంచి జోరు చూపించింది. చివరి త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో ఇళ్ల విక్రయాలు ఏకంగా రెట్టింపై 10,330 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 4,280 యూనిట్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మొత్తం మీద హైదరాబాద్‌లో మార్కెట్లో 35,370 ఇళ్లు అమ్ముడయ్యాయి. 2021లో అమ్మకాలు 22,240 యూనిట్లతో పోలిస్తే 59 శాతం వృద్ధి నమోదైంది. 2021 చివరి మూడు నెలలతో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది చివరి మూడు నెలల కాలంలో దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు 19 శాతం పెరిగాయి. ఈ వివరాలను హౌసింగ్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ఎనిమిది పట్టణాల్లో మొత్తం మీద 80,770 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 67,890 యూనిట్లుగా ఉన్నాయి. ఇక 2022 మొత్తం మీద ఈ ఎనిమిది పట్టణాల్లో 3,08,940 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2021లో అమ్మకాలు 2,05,940 యూనిట్లుగా ఉన్నాయి. అంటే 50 శాతం వృద్ధి నమోదైంది. పట్టణాల వారీగా అమ్మకాలు ► అహ్మదాబాద్‌లో ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ మధ్య, క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 23 శాతం అధికంగా 6,640 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాది మొత్తం మీద 62 శాతం అధికంగా 27,310 యూనిట్లు అమ్ముడుపోయాయి. ► బెంగళూరులో అమ్మకాలు డిసెంబర్ క్వార్టర్లో 30 శాతం తగ్గి 6,560 యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది మొత్తం మీద 22 శాతం వృద్ధితో 30,470 యూనిట్లు విక్రయమయ్యాయి. ► చెన్నైలో డిసెంబర్ త్రైమాసికంలో 2 శాతం తగ్గి 3,160 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఏడాది మొత్తం మీద 8 శాతం అధికంగా 14,100 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 3 శాతం తగ్గి డిసెంబర్ త్రైమాసికంలో 4,280 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది మొత్తం మీద 7 శాతం వృద్ధితో 19,240 ఇళ్ల విక్రయాలు చోటు చేసుకున్నాయి. ► కోల్‌కతా మార్కెట్లో 18 శాతం క్షీణించి ఇళ్ల అమ్మకాలు 2,130 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఏడాది మొత్తం మీద 8 శాతం పెరిగి 10,740 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో అమ్మకాలు డిసెంబర్ త్రైమాసికంలో 40 శాతం పెరిగాయి. 31,370 యూనిట్లు విక్రయమయ్యాయి. ఈ ఏడాది 87 శాతం అధికంగా 1,09,680 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ► పుణెలో క్యూ4లో ఒక శాతం పెరిగి 16,300 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఏడాది మొత్తం మీద అమ్మకాలు 62,030 యూనిట్లుగా ఉన్నాయి. కొనుగోలు శక్తిపై ధరల ప్రభావం: నైట్‌ఫ్రాంక్ దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో గృహ రుణ రేట్లు పెరిగిపోవడంతో ఈ ఏడాది ఇళ్ల కొనుగోలు శక్తి గతేడాదితో పోలిస్తే కొంత తగ్గినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ తెలిపింది. అయితే సగటు కుటుంబ ఆదాయం ప్రకారం చూస్తే.. ఇప్పటికీ గృహ రుణాలు పొందే శక్తి వారికి ఉన్నట్టు పేర్కొంది. వార్షిక ప్రాపర్టీ అధ్యయన నివేదికను ‘ద అఫర్డబులిటీ ఇండెక్స్ 2022’ పేరుతో నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. సగటు కుటుంబ ఆదాయంతో ఈఎంఐ మొత్తం నిష్పత్తిని ఈ ఇండెక్స్ ట్రాక్ చేస్తుంటుంది. అలాగే, ఇళ్ల ధరలు, గృహ రుణాల వడ్డీ రేట్లు, కుటుంబ ఆదాయాన్ని విశ్లేషించి ఏటా గణాంకాలు విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది మొత్తం మీద ఆర్బీఐ 2.25 శాతం రెపో రేటు పెంపును ఈ నివేదిక ప్రస్తావించింది. దీని కారణంగా గృహ రుణాల రేట్లు పెరగడం, నిర్మాణ సామాగ్రి వ్యయాలు అధికం కావడం వల్ల పెరిగిన ప్రాపర్టీ ధరలతో కొనుగోలు శక్తి క్షీణించినట్టు వివరించింది. కాకపోతే కరోనా ముందు 2019తో పోలిస్తే కొనుగోలు శక్తి ఇప్పటికీ మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. ఎనిమిది పట్టణాల్లో ఒక్క ముంబై ఈ విషయంలో బలహీనంగా ఉంది. -
టాప్‌గేర్‌లో హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టాప్‌గేర్‌లో పడింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రికార్డ్ స్థాయిలో గృహ విక్రయాలు జరిగాయి. గతేడాది క్యూ3తో పోలిస్తే 308 శాతం వృద్ధి నమోదయింది. 2021 క్యూ3లో 6,735 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది క్యూ2లో ఇది 3,240 యూనిట్లుగా ఉన్నాయి. త్రైమాసికంతో పోలిస్తే 108 శాతం పెరుగుదల. గతేడాది క్యూ3లో నగరంలో 1,650 గృహ విక్రయాలు జరిగాయి. కొత్త గృహాల ప్రారంభాలు చూస్తే.. 2021 క్యూ3లో 14,690 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. క్యూ2లో 8,850 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. త్రైమాసికంతో పోలిస్తే 66 శాతం వృద్ధి. ఇక గతేడాది క్యూ3లో 4,900 గృహాలు ప్రారంభమయ్యాయి. ఏడాది కాలంతో పోలిస్తే 67 శాతం వృద్ధి రేటు. ► కరోనా మహమ్మారి నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా తేరుకుంటోంది. ఉద్యోగ భద్రత పెరగడం, వర్క్ ఫ్రం ఆఫీస్ మొదలవుతుండటంతో, ఐటీ/ఐటీఈఎస్ రంగాలలో నియామకాలు జోరందుకోవటం, గృహ రుణ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, డెవలపర్ల ఆకర్షణీయమైన పథకాలు.. కారణాలేవైనా నగర రియల్టీ రంగంలో జోష్ నెలకొంది. నిర్మాణ కారి్మకులలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటంతో నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్పై ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇన్వెంటరీ, నిర్మాణంలో ఉన్న గృహాలను విక్రయిం చడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. దీంతో గతేడాది క్యూ3తో పోలిస్తే ఈ ఏడాది క్యూ3లో హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్‌లో 67 శాతం వృద్ధి నమోదయితే, విక్రయాల్లో మాత్రం 308 శాతం పెరుగుదల కనిపించింది. కొనుగోలుదారులు పెద్ద సైజు గృహాల కొనుగోళ్లకు మక్కువ చూపుతున్నారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. దేశవ్యాప్తంగా 62,800 ఇళ్ల విక్రయం.. హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది క్యూ3లో 62,800 ఇళ్లు అమ్ముడుపోయాయి. క్యూ2లో 24,560 యూనిట్లు సేల్ అయ్యాయి. అంటే క్యూ2తో పోలిస్తే 156 శాతం వృద్ధి. ఇక గతేడాది క్యూ3లో చూస్తే 29,520 ఇళ్లు విక్రయమయ్యాయి. అంటే 113 శాతం పెరుగుదల. ► ఇక కొత్త గృహాల ప్రారంభాలు చూస్తే.. ఈ ఏడాది క్యూ3లో మొత్తం 64,560 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. క్యూ2లో 36,260 గృహాలు ప్రారంభమయ్యాయి. అంటే గత త్రైమాసికంతో పోలిస్తే 78 శాతం పెరుగుదల. గతేడాది క్యూ3లో 32,530 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అంటే ఏడాదితో పోలిస్తే 98 శాతం వృద్ధి రేటు. ఈ ఏడాది క్యూ3లోని లాంచింగ్స్లలో రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే మధ్యస్థాయి ఇళ్ల వాటా 41 శాతం, రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉండే ప్రీమియం గృహాల వాటా 25 శాతం, రూ.40 లక్షల కంటే తక్కువ ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్ వాటా 24 శాతంగా ఉన్నాయి. ► నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో 2021 క్యూ3లో ధరలు 3 శాతం మేర పెరిగాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో చ.అ. ధర సగటున రూ.5,760గా ఉంది. గతేడాది క్యూ3లో చ.అ. సగటు ధర రూ.5,600గా ఉండేది. ► ప్రాపరీ్టలను వెతకడం నుంచి మొదలుపెడితే డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతీ దశలోనూ కొనుగోలుదారులు డిజిటల్ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్లైన్ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగింది. పటిష్టమైన ఆన్లైన్ మార్కెటింగ్ బృందం ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుతం నిలబడగలుగుతారు. ఒక్క మన నగరంలోనే.. ఈ ఏడాది క్యూ3లో హైదరాబాద్ మినహా ఏ నగరంలోనూ 130 శాతం వృద్ధి రేటు నమోదు కాలేదు. గతేడాది క్యూ3తో పోలిస్తే ఈ ఏడాది క్యూ3లో నగరంలో ఇళ్ల అమ్మకాలలో 308 శాతం పెరుగుదల కనిపించగా.. ముంబైలో 128 శాతం, చెన్నైలో 113 శాతం, పుణేలో 100 శాతం, కోల్‌కతాలో 99 శాతం, ఎన్సీఆర్లో 97 శాతం, బెంగళూరులో 58 శాతం వృద్ధి రేటు నమోదయింది. -
కోలుకునేది రెండేళ్ల తర్వాతే
సాక్షి, హైదరాబాద్: దేశీయ నివాస విభాగం 2023లో తారా స్థాయికి చేరుకుంటుంది. 3.17 లక్షల గృహాల విక్రయాలు, 2.62 లక్షల లాంచింగ్స్ జరుగుతాయి. ఈ ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 30 శాతం వృద్ధి చెంది 1.8 లక్షలకు చేరుతాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ అంచనా వేసింది. గృహ రుణ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవటం, స్టాక్ మార్కెట్ వృద్ధి, ప్రభుత్వ ప్రోత్సాహకరమైన విధానాలు వంటివి ఈ వృద్ధికి కారణాలని తెలిపింది. కొనుగోలుదారుల్లో పెరుగుతున్న విశ్వాసం, సాంకేతికత, డిజిటల్ మార్కెటింగ్, వినూత్న వ్యాపార పద్ధతులు దేశీయ నివాస రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పుణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాలలో గతేడాది 1,38,344 యూనిట్లు విక్రయమయ్యాయని.. ఈ ఏడాది 1,79,527లకు పెరుగుతాయి. డిమాండ్ మాత్రం కరోనా పూర్వ స్థాయి కంటే దిగువనే ఉంటుందని తెలిపింది. 2019లో అమ్మకాలు 2,61,358 యూనిట్లుగా ఉన్నాయి. 2022లో 2,64,625 యూనిట్లు, 2023లో 3,17,550 గృహాలు విక్రయం అవుతాయని అంచనా వేసింది. 2017 నుంచి వృద్ధి.. నివాస విభాగం 2017 నుంచి ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. 2019 నాటికి తారా స్థాయికి చేరింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా 2020లో డీలా పడింది. గతేడాది రెండో అర్ధ భాగం నుంచి కాస్త మెరుగైన ప్రతిభను కనబర్చినప్పటికీ ఆశించిన స్థాయికి చేరలేదు. 2020లో గృహాల విక్రయాలు 1.38 లక్షలు, లాంచింగ్స్ 1.28 లక్షలకు తగ్గాయి. ఈ ఏడాది డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. గృహాల సప్లయ్ 35 శాతం, విక్రయాలు 30 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేశారు. 2019తో పోలిస్తే మాత్రం సప్లయ్ 28 శాతం, అమ్మకాలు 31 శాతం తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. సప్లయ్ కంటే సేల్స్ ఎక్కువ.. వ్యాక్సినేషన్ వేగవంతం కావటంతో 2023 నాటికి రియల్టీ మార్కెట్ పీక్ దశకు చేరుతుంది. 2019తో పోలిస్తే విక్రయాలలో 22 శాతం, సప్లయ్‌లో 11 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. 2014–16లో గృహాల సప్లయ్ 11,85,000 ఉండగా.. విక్రయాలు 8,90,500లుగా ఉన్నాయి. సేల్స్/సప్లయ్ నిష్పత్తి 0.75 శాతంగా ఉంది. అదే 2017–19 నాటికి సప్లయ్ 5,78,,700 ఉండగా.. అమ్మకాలు 7,20,800లకు పెరిగాయి. నిష్పత్తి 1.25 శాతానికి వృద్ధి చెందింది. నగరంలో సేల్స్ 6 శాతం.. 2023లో జరిగే సేల్స్, లాంచింగ్స్ రెండింట్లోనూ ముంబై, బెంగళూరు నగరాలు ముందంజలో ఉంటాయి. ముంబై సేల్స్‌లో 28 శాతం, లాంచింగ్స్‌లో 30 శాతం వాటాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా బెంగళూరు అమ్మకాలలో 20 శాతం, ప్రారంభాలలో 17 శాతం, ఎన్సీఆర్ వరుసగా 18 శాతం, 15 శాతం, పుణే 15 శాతం, 18 శాతం, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ నగరాలు విక్రయాలలో 6 శాతం, లాంచింగ్స్‌లో 8 శాతం వాటాలను సొంతం చేసుకుంటాయి. -
గృహ విక్రయాల్లో 36 శాతం వృద్ధి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గృహాల అమ్మకాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా పడిపోయిన రియల్టీ పరిశ్రమ తిరిగి పట్టాలెక్కింది. ముంబై మినహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ వృద్ధి నమోదైందని జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. 2019 జనవరి– సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలోని మిగిలిన నగరాల్లో కంటే హైదరాబాద్‌లో గృహాల విక్రయాల్లో ఏకంగా 36 శాతం వృద్ధి కనిపించింది. 2016లో హైదరాబాద్‌లో గృహాల విక్రయాలు 29 శాతం వృద్ధి ఉంది. పెద్ద నోట్ల రద్దు జరిగిన మరుసటి ఏడాది 2017లో వృద్ధి శాతం ఒక్కసారిగా 9 శాతానికి పడిపోయింది. కోల్‌కతాలోనూ అంతే. 2016లో 28 శాతంగా ఉన్న వృద్ధి.. 2017 నాటికి 6 శాతానికి పడిపోయింది. గత రెండేళ్లుగా నగరంలో వాణిజ్య, కార్యాలయాల విభాగంలోకి దేశ, విదేశీ పెట్టుబడులు వస్తుండటంతో.. నివాస విభాగంలోనూ జోరు మొదలైంది. దీంతో 2019 మొదటి తొమ్మిది నెలల కాలంలో వృద్ధి ఏకంగా 36 శాతానికి చేరుకుంది. -
హైదరాబాద్‌లో 4% తగ్గిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో గతేడాది హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 4 శాతం క్షీణించి 16,500కి పరిమితమయ్యాయి. అయితే, తెలంగాణ ఏర్పాటు వల్ల అనిశ్చితి తొలగిపోవడంతో ఈ ఏడాది ఆఖరు నుంచి లేదా వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అమ్మకాలు మళ్లీ పుంజుకోనున్నాయి. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఒక నివేదికలో ఈ విషయాలు తెలిపింది. 2012తో పోలిస్తే 2013లో నివాస గృహాల అమ్మకాలు 4 శాతం క్షీణించినట్లు వివరించింది. అలాగే, 2012లో 19,000 నూతన గృహాలు రాగా.. 2013లో ఇది 15 శాతం క్షీణించి 16,200కి పరిమితమైనట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. అయినప్పటికీ, చెన్నై, పుణె వంటి ఐటీ నగరాలతో పోలిస్తే ఇక్కడ క్షీణత తక్కువేనని తెలిపింది. దేశంలోని మిగతా రెసిడెన్షియల్ మార్కెట్ల తరహాలోనే హైదరాబాద్‌లోనూ మందగమనం కనిపించిందని వివరించింది. ఆర్థిక మందగమనం, అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత.. వంటి అంశాలు అనిశ్చితికి కారణమయ్యాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. హైదరాబాద్‌లో గత రెండేళ్లుగా విక్రయాలు దాదాపు ఒకే స్థాయిలో ఉంటున్నా ధరల విషయంలో పెద్దగా మార్పుల్లేవని వెల్లడించింది. ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతా తదితర టాప్ ఏడు నగరాల్లోని రెసిడెన్షియల్ మార్కెట్లలో ఇప్పటికీ హైదరాబాద్‌లో మాత్రమే అత్యంత అందుబాటు ధరల్లో గృహాలు లభిస్తున్నాయని తెలిపింది. 2009 నుంచి చూస్తే బెంగళూరు, పుణె, చెన్నై వంటి ఐటీ ఆధారిత మార్కెట్లలో సగటున ధరలు 38 శాతం మేర పెరగ్గా.. హైదరాబాద్‌లో 13 శాతం స్థాయిలోనే పెరుగుదల ఉందని నైట్ ఫ్రాంక్ నివేదికలో వివరించింది.