ఢిల్లీకి మూడో స్థానం
అంతర్జాతీయ స్థాయి ర్యాంకులు
నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల పెరుగదలలో ముంబై రియల్టీ మార్కెట్ రెండో స్థానం నిలిచింది. ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నట్టు జూన్ త్రైమాసికానికి సంబంధించిన నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 44 ప్రముఖ నగరాల్లోని ఇళ్ల ధరల పెరుగుదల వివరాలను నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. జూన్ త్రైమాసికంలో ఈ నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదల 2.6 శాతానికి పరిమితమైనట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో పెరుగుదల రేటు 4.1 శాతంగా ఉండడం గమనార్హం.
ఇళ్ల ధరల పెరుగుదలలో మనీలా మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 26 శాతం మేర వృద్ధి నమోదైంది. ముంబైలో ఇళ్ల ధరలు 13 శాతం మేర జూన్ త్రైమాసికంలో పెరిగాయి. దీంతో ఏడాది క్రితం ఆరో ర్యాంక్‌లో ఉన్న ముంబై 2కు చేరుకుంది. ఇక ఢిల్లీలో ఇళ్ల ధరలు 10.6 శాతం పెరగడంతో, ఏడాది క్రితం ఉన్న 26వ ర్యాంక్ నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. బెంగళూరులో ఇళ్ల ధరలు జూన్ క్వార్టర్‌లో వార్షికంగా 3.7 శాతం మేర పెరిగాయి. దీంతో 15వ ర్యాంక్ సొంతం చేసుకుంది.
టాప్–10లో ఇవే..
లాస్ ఏంజెలెస్‌లో 8.9 శాతం (4వ ర్యాంక్), మియామీలో 7.1 శాతం (5వ ర్యాంక్), నైరోబీలో 6.6 శాతం (ఆరో స్థానం), మ్యాడ్రిడ్‌లో 6.4 శాతం (ఏడో స్థానం), లిస్బాన్‌లో 4.7 శాతం (ఎనిమిదో స్థానం), సియోల్‌లో 4.6 శాతం (తొమ్మిదో స్థానం), శాన్ ఫ్రాన్సిస్కోలో 4.5 శాతం (10వ స్థానం) చొప్పున జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. దుబాయిలో 2020 సంవత్సరం నుంచి ఇళ్ల ధరలు 124 శాతం పెరగ్గా.. జూన్ క్వార్టర్‌లో 0.3% మేర తగ్గాయి. వియన్నాలో 3.2%, బ్యాంకాక్‌లో 3.9 శాతం చొప్పున ఇదే కాలంలో ఇళ్ల ధరలు తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment