‘రీట్స్’తో మార్కెట్‌లోకి 96 బిలియన్ డాలర్ల నిధులు!
ముంబై: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టుల(రీట్స్)కు బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను ప్రోత్సాహకాలతో 96 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 6 లక్షల కోట్లు) విలువైన నిధులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆఫీసులు, రిటైల్, గిడ్డంగులు ఇతరత్రా విభాగాల్లో వాడకంలో ఉన్న వాణిజ్యపరమైన స్థిరాస్తులను రానున్న కొద్ది సంవత్సరాల్లో ‘రీట్స్’ రూపంలో లిస్టింగ్ చేయడం ద్వారా ఈ మేరకు నిధుల ప్రవాహం ఉండొచ్చనేది వారి అభిప్రాయం.
కేపీఎంజీ, నైట్ ఫ్రాంక్, హరియాని అండ్ కో రూపొందించిన సంయుక్త నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 141 కోట్ల చదరపు అడుగుల వాణిజ్య రియల్టీ ఆస్తులను రీట్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా మార్కెట్లో లిస్టింగ్ చేసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇందులో అత్యధిక వాటా ఏడు మెట్రో నగరాలదేనని కూడా తెలిపింది. అయితే, పన్ను సంబంధ అంశాలు, కొన్ని నియంత్రణపరమైన అడ్డంకులు ‘రీట్స్’ విజయవంతానికి సమస్యలు సృష్టించవచ్చని.. దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.
ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం... పెట్టుబడులకు ప్రోత్సాహకరమైన వాతావరణం నేపథ్యంలో రియల్టీ మార్కెట్లో రీట్స్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. బీమా కంపెనీలు కూడా రీట్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆస్కారం కల్పించేలా ఐఆర్‌డీఏ నిబంధనల సడలింపు, ఆస్తుల బదలాయింపునకు రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీలో వన్‌టైమ్ మాఫీ సదుపాయం కల్పించడం వంటివి రీట్స్ విజయవంతానికి కీలకంగా నిలుస్తాయని.. దీనివల్ల ఇన్వెస్టర్ల సంఖ్య కూడా విస్తృతం అవుతుందని నివేదిక సూచించింది.