breaking news
Real estate investment trusts
-
రియల్టీలో సిప్ చేద్దామా!
వాణిజ్య ప్రాపరీ్టపై పెట్టుబడి పెట్టాలంటే సామాన్య ఇన్వెస్టర్లకు అయ్యే పనేనా..! ఎక్కడ చూసినా ధరలు గణనీయంగా పెరిగిపోయిన తరుణంలో.. కొనాలంటే పెద్ద మొత్తమే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అయితే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే క్రమానుగత పెట్టుబడి (సిప్) విధానంలో వాణిజ్య ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేయాలన్న ఆకాంక్షలకు ఆచరణ మార్గమే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్లు). వీటిలో ఇన్వెస్ట్ చేయడం ఎలా? వచ్చే ప్రయోజనం ఎంత మేర? తదితర వివరాలను అందించే కథనమే ఇది. రీట్ అంటే...?రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్లు) పేరులో ఉన్నట్టుగానే.. వివిధ రకాల వాణిజ్య ప్రాపరీ్టలపై పెట్టుబడులు పెడుతుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మాదిరే ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమీకరిస్తుంటాయి. వాటిని వాణిజ్య ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేస్తాయి. ఆయా ప్రాపరీ్టలను అద్దెకు, లీజుకు ఇస్తుంటాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి వాటాదారులకు క్రమం తప్పకుండా పంచుతుంటాయి. ఆఫీసులు, మాల్స్, ఇండ్రస్టియల్ పార్క్‌లు, వేర్‌హౌస్‌లు, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్ సెంటర్లు తదితర వసతులపై రీట్లు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే బాండ్లు, గోల్డ్, స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు ఓ పది మంది స్నేహితుల బృందం ఉందనుకుందాం. తలో రూ.10 లక్షలు వేసుకుని రూ.కోటితో ఒక వాణిజ్య భవనాన్ని సమకూర్చుకున్నారు. దాన్ని ఓ కార్పొరేట్ సంస్థ కార్యాలయానికి లీజుకు ఇచ్చారు. లీజు రూపంలో వచ్చే మొత్తం నుంచి 90 శాతాన్ని పది మంది డివిడెండ్ కింద పంచుకుంటారు. రీట్‌లో ఇదే మాదిరి జరుగుతుంది. కాకపోతే రీట్ల నిర్వహణలో ఇలాంటి వాణిజ్య ఆస్తులు పెద్ద సంఖ్యలో ఉంటాయి. అమెరికా, జపాన్ తదితర దేశాల్లో రీట్లకు ఎంతో ఆదరణ ఉంది. కానీ మన దేశంలో వీటిపై అంత అవగాహన లేదు. అందుకే ఇవి పెద్దగా ప్రాచుర్యానికి నోచుకోలేదు. ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలుగా వీటికి తగినంత ప్రచారం కల్పించేందుకు సెబీ తన వంతు కృషి చేస్తోంది. స్టాక్స్, ఫండ్స్ మాదిరే రీట్లు కూడా సెబీ పర్యవేక్షణ కిందకే వస్తాయి. సెబీ నిబంధనల ప్రకారం రీట్లు 80% పెట్టుబడులను అద్దెను సమ కూర్చే ఆస్తులపైనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మరో 20% మేర పెట్టుబడులను నిర్మాణంలోని ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే, వచ్చే అద్దె ఆదాయంలో నిర్వహణ వ్యయాలు, పన్నులు పోను మిగిలిన నికర మొత్తం నుంచి 90 శాతాన్ని ఇన్వెస్టర్లకు పంపిణీ చేయాలి. ప్రయోజనాలు... అద్దె ఆదాయంరీట్లకు లీజు రూపంలో ఆదాయం వస్తుంటుంది. దీన్ని వాటాదారులకు డివిడెండ్ రూపంలో పంపిణీ చేస్తాయి. సాధారణంగా ప్రతి మూడేళ్లకోసారి 15 శాతం అద్దె పెంచాలన్న నిబంధనతో లీజు ఒప్పందాలు చేసుకుంటుంటాయి. దీంతో వాటాదారులకు వచ్చే డివిడెండ్ ఆదాయం కూడా కాలక్రమేణా పెరుగుతూ వెళుతుంది. కొత్త లీజు సమయంలో అప్పటికి పెరిగిన మార్కెట్ ధరల ప్రకారమే ఒప్పందాలు చేసుకుంటుంటాయి. వడ్డీ ఆదాయం రీట్లు తమవద్దనున్న మిగులు నిధులపై వడ్డీ రాబడిని పొందుతుంటాయి. లేదా ప్రాపర్టీ లీజుదారులకు రుణాలు సమకూర్చడం ద్వారా వాటిపై ఆదాయం పొందుతాయి. ఈ రూపంలోనూ వాటాదారులకు ఆదాయం లభిస్తుంది. మన దేశంలో రీట్లు ప్రధానంగా టైర్–1 పట్టణాల్లోని ప్రాపరీ్టలపైనే ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఉన్నాయి. కనుక వీటి ధరలు మరింత పెరిగేందుకు ఆస్కారం ఉంది. పనితీరు భిన్నంస్టాక్స్, బాండ్లు తదితర సాధనాలకు భిన్నంగా రీట్ స్పందన ఉంటుంది. అంటే స్టాక్స్ లేదా బాండ్ల ధరలు పడిపోతే రీట్ల ధరలు కూడా పడిపోవాలనేమీ లేదు. ఆ సమయంలో ఇవి స్థిరంగా ఉండొచ్చు. లేదా లాభాలను ఇవ్వొచ్చు. ఒకవేళ రీట్ల ధరలు కూడా తగ్గినా.. ఇతర సాధనాల స్థాయిలో ఉండదు. ఈ విధంగా పెట్టుబడుల్లో కొంత భాగానికి రిస్క్ తగ్గుతుంది. పెట్టుబడి విలువ వృద్ధిరీట్ల నిర్వహణలోని ప్రాపరీ్టల విలువలు కొంత కాలానికి సహజంగా పెరుగుతుంటాయి. తమ నిర్వహణలోని ఆస్తుల విలువలను ఎప్పటికప్పుడు రీట్లు మదింపు చేసుకోవాలి. దీంతో పెరిగిన ప్రాపరీ్టల విలువ రీట్ యూనిట్ విలువపై ప్రతిఫలిస్తుంది. అలాగే, ఆరి్థకంగా లాభదాయకం లేని, లీజు పరంగా అంత డిమాండ్ లేని ప్రాపరీ్టలను విక్రయించి, డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ప్రాపరీ్టలపై ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇది కూడా పెట్టుబడి విలువ వృద్ధికి, డివిడెండ్ వాటా పెంపునకు దారితీస్తుంది. అంతేకాదు, కొంత మేర రుణాలు తీసుకుని కొత్త ప్రాపరీ్టలపై వెచి్చంచేందుకు సైతం వీటికి వెసులుబాటు ఉంటుంది. కనుక కాలక్రమంలో, కంపెనీ నగదు ప్రవాహాలు, నికర విలువ పెరుగుతున్న కొద్దీ.. కొత్త ప్రాపర్టీలను అదనంగా సమకూర్చుకుంటాయి. ఆ విధంగానూ పెట్టుబడుల విలువ వృద్ధి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. మెరుగైన లిక్విడిటీభౌతిక ప్రాపర్టీ కొనుగోలు చేస్తే విక్రయించడానికి చాలా సమయం తీసుకోవచ్చు. అదే రీట్లను పనిదినాల్లో ఏ రోజు అయినా విక్రయించుకుని, మరుసటి రోజే ఆ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో పొందొచ్చు. ఇవి స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయి ఉంటాయి కనుక లిక్విడిటీ సమస్య ఉండదు.లిస్టెడ్ రీట్లు... బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్, నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్లు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు లిస్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా త్రైమాసికానికి ఒకసారి డివిడెండ్‌ను పంపిణీ చేస్తున్నాయి.ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? రీట్‌లో పెట్టుబడులకు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు తప్పనిసరిగా ఉండాలి. స్టాక్స్‌ను కొనుగోలు చేసినట్టుగానే రీట్ యూనిట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇవి డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. రాబడులు... వాణిజ్య రియల్ ఎస్టేట్‌పై వార్షిక రాబడులు 8–10 శాతం మధ్య ఉంటాయి. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌పై రాబడులు ఒక్కోసారి 15 శాతం స్థాయిలో ఉంటాయి. కానీ, మన దేశంలో రీట్‌లపై ప్రస్తుత రాబడులు 10 శాతం లోపే ఉన్నాయి. మన ఆరి్థక వ్యవస్థ రానున్న రోజుల్లో మరింత విలువను సంతరించుకుంటుందని నిపుణుల అంచనా. దీనికితోడు ఈ మార్కెట్ పరిణతి చెందిన కొద్దీ రీట్‌లపై వార్షిక రాబడులు 10 శాతం, అంతకంటే ఎగువ స్థాయికి చేరుకుంటాయని నిపుణుల అంచనా. 2022–2024 మధ్య రీట్ల నుంచి డివిడెండ్ రాబడి 6–9 శాతం మధ్య ఉన్నట్టు, పెట్టుబడి విలువలో 12–18 శాతం మేర వృద్ధి ఉన్నట్టు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక చెబుతోంది.ఇవి గమనించాలి..→ రీట్లు స్వల్పకాలానికి కాకుండా దీర్ఘకాలం కోసమే (ఐదేళ్లు అంతకుమించిన కాలం) పరిశీలించడం సూచనీయం. అప్పుడు మూలధన పెట్టుబడి వృద్ధి సాధ్యపడుతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ సైక్లికల్‌గా ఉంటుంది. స్వల్పకాలంలో రీట్ల ధరలు స్టాక్స్ మాదిరే ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొంత మేర హెచ్చుతగ్గులకు గురికావచ్చు. → మనదేశంలో ఇప్పటి వరకు కేవలం నాలుగు రీట్లే లిస్ట్ అయి ఉన్నాయి. ఇందులో నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ మాత్రం రిటైల్ మాల్స్ ఆస్తులపైనే అధిక శాతం ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన రీట్లు ఆఫీస్ ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేసేవి. పనితీరు పోల్చి చూసేందుకు పరిమిత అవకాశాలే ఉన్నాయి. → ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా రీట్ల పరిధిలోని ప్రాపరీ్టలలో ఆక్యుపెన్సీ రేషియో (భర్తీ రేటు) చూడాలి. లీజుకు తీసుకున్న కంపెనీలు అన్నీ ఒకే రంగంలో కాకుండా భిన్న రంగాలకు చెందినవి అయితే రిస్క్ వైవిధ్యం అవుతుంది. రీట్ల నిర్వహణలోని ప్రాపరీ్టల నాణ్యత, డిమాండ్ చూడాలి. → ఆర్థిక సంక్షోభ సమయాల్లో, కరోనా వంటి విపత్తుల సమయాల్లో ఆఫీస్ లీజింగ్ మార్కెట్‌పై ప్రభావం పడొచ్చు. అలాంటి సందర్భాల్లో డివిడెండ్ పంపిణీ, మూలధన పెట్టుబడి విలువ ప్రభావితం కావచ్చు. → మన దగ్గర స్టాక్స్‌తో పోలిస్తే రీట్లకు ప్రాచుర్యం తక్కువ. కనుక స్టాక్ ఎక్సే్చంజీల్లో వీటి లిక్విడిటీ (ట్రేడింగ్ వ్యాల్యూమ్) తక్కువగా ఉంటుంది. → తమకు స్థిరమైన ఆదాయం కావాలని కోరుకునే వారు రీట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా తమ మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకు కేటాయించుకోవచ్చన్నది నిపుణుల సూచన. పన్ను బాధ్యత... రీట్ పెట్టుబడులపై డివిడెండ్ రూపంలో వచ్చే ఆదాయంపై పన్ను కొంత భిన్నంగా ఉంది. బ్రూక్‌ఫీల్డ్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్లు రాయితీతో కూడిన పన్ను రేటును ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 115బీఏఏ కింద ఎంపిక చేసుకోలేదు. ఇవన్నీ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)పైనే ఇన్వెస్ట్ చేశాయి. కనుక ఇవి పంపిణీ చేసే డివిడెండ్‌పై పన్ను లేదు. ఒకవేళ ఎస్పీవీలు రాయితీ రేటును ఎంపిక చేసుకుంటే, అప్పుడు అవి పంపిణీ చేసే డివిడెండ్ పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ తనకు వర్తించే శ్లాబు ప్రకారం దీనిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డివిడెండ్‌పై పన్ను వర్తించేట్టు అయితే, రీట్లు 10 శాతం టీడీఎస్ కింద తగ్గించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తాయి. ఇన్వెస్టర్లు తమ వార్షిక పన్ను రిటర్నుల్లో దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సొంత ప్రాపరీ్టలపై రీట్లకు వచ్చే ఆదాయం నుంచి వాటాదారులకు డివిడెండ్ పంపిణీ చేసినా, ఎస్పీవీలకు ఇచ్చిన రుణాలపై రీట్లకు వచ్చే ఆదాయాన్ని వాటాదారులకు పంపిణీ చేసిన సందర్భాల్లోనూ.. ఇన్వెస్టర్ వ్యక్తిగత ఆదాయానికే కలుస్తుంది. ఇక రీట్లలోని పెట్టుబడులకు స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే పన్ను నిబంధనలు వర్తిస్తాయి. విక్రయించినప్పుడు వచ్చే లాభంపై మూలధన లాభాల పన్ను చెల్లించాలి. ఏడాదిలోపు విక్రయించగా వచ్చిన లాభంపై 20 శాతం పన్ను, ఏడాది ముగిసిన తర్వాత విక్రయించినప్పుడు వచి్చన లాభం మొదటి రూ. లక్ష తర్వాత మొత్తంపై 12.5 శాతం చెల్లించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇన్వి ట్స్‌లో పెట్టుబడులు జూమ్..
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఇన్వి ట్స్), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులపై (రీట్స్) మదుపుదార్ల ఆసక్తి పెరుగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వీటిలో రూ. 17,116 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. స్థిరమైన రాబడులు అందిస్తుండటంతో ఈ సాధనాల్లో పెట్టుబడులు 14 రెట్లు పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రైమ్ డేటాబేస్డాట్కామ్ క్రోడీకరించిన గణాంకాల ప్రకారం 2023–24లో రీట్స్, ఇన్వి ట్స్ రూ. 17,116 కోట్లు సమీకరించాయి. 2022–23లో ఇది రికార్డు కనిష్ట స్థాయి రూ. 1,166 కోట్లుగా నమోదైంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఒక ఇన్వి ట్ ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్) కూడా చేపట్టింది. డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ సంస్థ ఓఎఫ్ఎస్ మార్గంలో రూ. 2,071 కోట్లు సమీకరించింది. సెబీ ఇటీవల నిబంధనలను సవరించిన నేపథ్యంలో ఈ విభాగం ఏయూఎం (నిర్వహణలోని ఆస్తులు) 500 మిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరవచ్చని వైజ్ఎక్స్ సీఈవో ఆర్యమాన్ వీర్ తెలిపారు. కొత్తగా వచ్చే పెట్టుబడుల్లో 75 శాతం వాటాతో రహదారుల రంగం ప్రధాన లబి్ధదారుగా ఉండగలదని పేర్కొన్నారు. -
రీట్స్, ఇన్విట్స్ ఇండెక్స్ షురూ
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ.. దేశీయంగా తొలిసారి రియల్ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(ఇన్విట్) ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టయ్యి, ట్రేడయ్యే రీట్స్, ఇన్విట్స్ పనితీరును పరిశీలించేందుకు మదుపరులకు వీలు చిక్కనున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. ఆదాయాన్ని ఆర్జించే రియల్టీ ఆస్తులతో రీట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తులతో ఇన్విట్స్ ఏర్పాటయ్యే సంగతి తెలిసిందే. వీటి ద్వారా ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. దీర్ఘకాలికమైన రియల్టీ ప్రాజెక్టులలో రీట్స్, మౌలిక రంగ ప్రాజెక్టులలో ఇన్విట్స్ పెట్టుబడులు చేపడుతుంటాయి. వీటి ద్వారా ఇన్వెస్టర్లకు విభిన్న మార్గాలలో నిరవధిక ఆదాయానికి అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు నగదు ఆర్జించే ప్రాజెక్టుల ద్వారా నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ ఆర్థిక అవకాశాలుగా రీట్స్, ఇన్విట్స్ గుర్తింపు పొందాయి. కాగా.. ఇండెక్సులో ఫ్రీఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా సెక్యూరిటీలకు వెయిటేజీ ఇవ్వనున్నట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఒక్కో సెక్యూరిటీకి 33 శాతం పరిమితిని అమలు చేయనుంది. ఇండెక్స్ ప్రాథమిక విలువ 1,000కాగా.. త్రైమాసికవారీగా సమీక్షించనుంది. -
‘రీట్స్’తో మార్కెట్లోకి 96 బిలియన్ డాలర్ల నిధులు!
ముంబై: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల(రీట్స్)కు బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను ప్రోత్సాహకాలతో 96 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 6 లక్షల కోట్లు) విలువైన నిధులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆఫీసులు, రిటైల్, గిడ్డంగులు ఇతరత్రా విభాగాల్లో వాడకంలో ఉన్న వాణిజ్యపరమైన స్థిరాస్తులను రానున్న కొద్ది సంవత్సరాల్లో ‘రీట్స్’ రూపంలో లిస్టింగ్ చేయడం ద్వారా ఈ మేరకు నిధుల ప్రవాహం ఉండొచ్చనేది వారి అభిప్రాయం. కేపీఎంజీ, నైట్ ఫ్రాంక్, హరియాని అండ్ కో రూపొందించిన సంయుక్త నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 141 కోట్ల చదరపు అడుగుల వాణిజ్య రియల్టీ ఆస్తులను రీట్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా మార్కెట్లో లిస్టింగ్ చేసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇందులో అత్యధిక వాటా ఏడు మెట్రో నగరాలదేనని కూడా తెలిపింది. అయితే, పన్ను సంబంధ అంశాలు, కొన్ని నియంత్రణపరమైన అడ్డంకులు ‘రీట్స్’ విజయవంతానికి సమస్యలు సృష్టించవచ్చని.. దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం... పెట్టుబడులకు ప్రోత్సాహకరమైన వాతావరణం నేపథ్యంలో రియల్టీ మార్కెట్లో రీట్స్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. బీమా కంపెనీలు కూడా రీట్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆస్కారం కల్పించేలా ఐఆర్డీఏ నిబంధనల సడలింపు, ఆస్తుల బదలాయింపునకు రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీలో వన్‌టైమ్ మాఫీ సదుపాయం కల్పించడం వంటివి రీట్స్ విజయవంతానికి కీలకంగా నిలుస్తాయని.. దీనివల్ల ఇన్వెస్టర్ల సంఖ్య కూడా విస్తృతం అవుతుందని నివేదిక సూచించింది. -
రూ.3,000 కోట్లు సమీకరించనున్న డీఎల్ఎఫ్
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు రీట్స్(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్)ను ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా వాటా విక్రయం, జాయింట్ వెంచర్ల ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నది. రుణ భారం తగ్గించుకోవడానికి, నగదు నిల్వల పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని డీఎల్ఎఫ్ పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీ రుణభారం రూ.20,236 కోట్లుగా ఉంది. సీసీఐ కొరడా: కాగా డీఎల్‌ఎఫ్‌పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మంగళవారం మరోసారి కొరడా ఝులిపించింది. మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న ఈ కంపెనీ దానిని దుర్వినియోగం చేసేలా ప్రవర్తించిందని, దీనికి ప్రాథమికంగా ఆధారాలున్నాయని, ఈ విషయమై సమగ్రంగా దర్యాప్తు జరపాలని, 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఐ ఆదేశాలిచ్చింది. డీఎల్ఎఫ్ యూనివర్శల్‌కు చెందిన గుర్గావ్లోని స్కైకోర్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు సంబంధించి సీసీఐ ఈ ఆదేశాలిచ్చింది. డీఎల్‌ఎఫ్‌పై సీసీఐ ఇలాంటి ఆదేశాలివ్వడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. గుర్గావ్లోనే ఉన్న డీఎల్ఎఫ్ గార్డెన్ సిటీ ప్రాజెక్ట్‌కు సంబంధించి సీసీఐ సోమవారం కూడా ఇదే తరహా దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కేసుల్లో డీఎల్‌ఎఫ్‌దే తప్పంటూ ఇప్పటికే సీసీఐ డీఎల్‌ఎఫ్‌పై సీసీఐ రూ.630 కోట్ల జరిమానా విధించింది. దీనికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉంది.