క్యూ3లో చైనా వృద్ధి 6.7 శాతం
• మూడు త్రైమాసికాల నుంచి స్థిర వృద్ధి రేటు
• ప్రపంచ ఆర్థికానికి సానుకూల సంకేతాలు!
బీజింగ్: చైనా ఆర్థికాభివృద్ధి ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసికంలో 6.7 శాతంగా నమోదయ్యింది. రియల్టీ మార్కెట్ బాగుండడం, ప్రభుత్వ వ్యయాలు, రుణాల వంటి అంశాలు ఈ స్థిర వృద్ధి తీరుకు కారణం. వృద్ధి తీరు ఊహించినదానికన్నా బాగుందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్) బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వరుసగా మూడు త్రైమాసికాల నుంచీ చైనా ఆర్థికాభివృద్ధి రేటు 6.7 శాతంగా కొనసాగుతోంది.
2016లో జీడీపీ వృద్ధి తీరు 6.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో ఉంటుందని ప్రభుత్వం అంచనావేసింది. తాజా గణాంకాలు ఇందుకు తగిన విధంగానే ఉండడం సానుకూల అంశమని ఎన్‌బీఎస్ వివరించింది. ప్రపంచంలో రెండవ ప్రధాన ఆర్థికవ్యవస్థగా ఉన్న చైనా తాజా జీడీపీ గణాంకాలు అంతర్జాతీయంగా సానుకూల ప్రభావం చూపే వీలుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
క్రూడ్ ఒకేరోజు దాదాపు మూడు శాతం లాభపడ్డానికి కూడా ఈ గణాంకాలూ ఒక కారణమని అంచనాలూ ఉన్నాయి. మూడు క్వార్టర్లను కలిసి చూస్తే... జీడీపీ విలువ 52.997 ట్రిలియన్ యువాన్‌లుగా నమోదయ్యింది. డాలర్లలో ఈ విలువ దాదాపు 7.87 ట్రిలియన్ డాలర్లు. కాగా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలే స్థిర వృద్ధికి కారణమని, దీని పటిష్టతపై సందేహాలు కొనసాగుతాయని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య రియల్టీలో పెట్టుబడులు 5.8 శాతం పెరిగాయి. అమ్మకాలు దాదాపు 27 శాతం పెరిగాయి. హైటెక్, ఎక్యూప్‌మెంట్ తయారీ రంగాలు బాగున్నాయి.