⇒ బినామీ పేర్లతో భూకబ్జాకు పాల్పడుతున్న రెవెన్యూ యంత్రాంగం
⇒ ఇటీవల పుల్లంపేటలో బయటపడిన వ్యవహారమే నిదర్శనం
⇒ మరి కొన్నిచోట్ల భూఆక్రమణల్లో వీఆర్వోలు, ఇతర అధికారులు
⇒ వివాదాస్పదమవుతున్న ఆక్రమణల వ్యవహారం
⇒ పలుచోట్ల భూములు, స్థలాలు లాగేసుకుంటున్న తమ్ముళ్లు
⇒ ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తేనే ఫలితం
సాక్షి, కడప/ పుల్లంపేట: ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ లేకుండా పోతోంది. ఒకపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భూకబ్జాలకు పా ల్పడుతుండగా, వారికి తామేమీ తక్కువ కాదన్నట్లు జిల్లాలో పనిచేస్తున్న కొంతమంది రెవెన్యూ అధికారులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఏకంగా కొంతమంది అధికారులు బినామీ పేర్లతో భూములను పోగుచేసుకోవడం వివాదాస్పదమవుతోంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇలాంటి వ్యవహారాలు అక్కడక్కడా వెలుగుచూస్తున్నా ఉన్నతాధికారులు కొరఢా ఝళిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
బినామీల పేరుతో అక్రమణలు
జిల్లాలో ఒకప్పుడు ఎక్కడచూసినా బంజరు భూమి కనిపించేది. పెరిగిపోయిన ప్రజావసరాల దృష్ట్యా రానురాను భూమి తరిగిపోయింది. అయితే ఇదే అదునుగా కొంతమంది అక్రమాలకు తెరలేపారు. బినామీలుగా బంధువులను, అనుకూలమైన వారిని ఎంపిక చేసుకుని ఏదో ఒకచోట పాగా వేస్తున్నారు. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి ఇలా చేస్తుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పుల్లంపేట, పోరుమామిళ్ల, కాశినాయన, మైలవరం ఇలా అనేకచోట్ల రెవెన్యూ యంత్రాంగం అందినకాడికి ఆక్రమించుకునే పనిలో పడినట్లు ఆ శాఖలోనే చర్చ జరుగుతోంది.
ఆన్‌లైన్ పేరుతో దోపిడీ
జిల్లాలో విలువైన భూములున్న ప్రాంతాల్లో తహసీల్దార్లు ఆన్‌లైన్ దోపిడీకి తెరలేపుతున్నారు. ఎంతోకొంత ముట్టజెప్పందే భూములను ఆన్‌లైన్‌లో ఎక్కించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బద్వేలు నియోజకవర్గంతోపాటు కమలాపురం, రాయచోటి, మైదుకూరు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఆన్‌లైన్ పేరుతో దోపిడీ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏది ఏమైనా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే తప్ప అనేక అంశాలు బయటపడవు. కొత్తగా వచ్చిన డీఆర్వోనైనా ఆక్రమణలు, భూకబ్జాలాంటి వ్యవహారాలపై ప్రత్యేక పరిశీలన జరిపితే కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
అధికారి.. అడ్డదారి
Published Sun, Feb 26 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM
Advertisement
Advertisement