‘‘హుదూద్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది... రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’’ అని కలెక్టర్ టి.చిరంజీవులు అధికారులను ఆదేశించారు.
రాంనగర్ : ‘‘హుదూద్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది... రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’’ అని కలెక్టర్ టి.చిరంజీవులు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ తన చాంబర్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా సమర్థంగా పనిచేయాలన్నారు. ప్రజలకు వైద్య సౌకర్యం అందించేందుకు 108 వాహనాలను సిద్ధం చేయాలన్నారు. తహసీల్దార్లు, ఇతర అధికారులు సెలవులో వెళ్లరాదని, విధిగా హెడ్‌క్వార్టర్లలోనే పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తి నీటిసామర్థ్యంతో చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని, బలహీనంగా ఉన్నవాటిని ముందస్తుగానే గుర్తించి ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని ఇరిగేషన్ ఇంజినీర్లను ఆదేశించారు.
సోమవారం భారీ వర్షాలు కురిస్తే పాఠశాలలకు అవసరమైతే సెలవు ప్రకటించాలని డీఈఓకు సూచించారు. పట్టణాలలో మురుగుకాల్వలు, పెద్ద డ్రెయినేజీలు చెత్తాచెదారంతో నిండి కాలనీలు జలమయం కాకుండా ఉండేందుకు ముందస్తుగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశిం చారు. ముఖ్యంగా రైల్వేట్రాక్ వెంట భారీగా వరద నీరు ప్రవహించడాన్ని గుర్తించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాద హెచ్చరికలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రజలనుంచి సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 1800-425-1442 నంబర్‌తో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏైవైనా సమస్యలు, సమాచారం ఉంటే ఈ నంబర్‌కు ఫోన్‌చేసి చెప్పాలని కోరారు.