Hudood storms
-
మళ్లీ పాత లెక్కే!
అనంతపురం అగ్రికల్చర్: మళ్లీ పాత లెక్కల ప్రకారమే వ్యవసాయ శాఖ అధికారులు కరువు నివేదిక తయారు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసిన హుదూద్ తుపాను తరువాత గత ఏడాది అక్టోబర్ 12న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 9 జిల్లాకు వర్తింపజేసే పరిస్థితి కనిపించడం లేదు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బాధితులకు ఎంత పరిహారం ఇవ్వాలనే దానిపై కొత్త స్కేల్ ఆఫ్ రిలీఫ్ (పంట నష్ట ఉపశమనం) జిల్లాకు కూడా వర్తిస్తుందని అధికారులు చెబుతూ వచ్చారు. తీరా ఇప్పుడు పాత జీవో ప్రకారమే ముందుకు వెళుతున్నారు. జిల్లాలో పంట నష్టం అంచనాల తయారీలో డిసెంబర్ 10 నుంచే అధికారులు నిమగ్నమయ్యారు. తొలుత పాత స్కేల్ ఆఫ్ రిలీఫ్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. పది రోజుల కిందట కొత్త జీవో ప్రకారం చేయాలంటూ క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు పంపారు. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ పీవీ శ్రీరామమూర్తి కూడా ధ్రువీకరించారు. అయితే.. మళ్లీ పాత స్కేల్‌ఆఫ్ రిలీఫ్ ప్రకారమే నివేదిక తయారు చేయాలంటూ రెండు రోజుల కిందట జిల్లా అధికారుల నుంచి క్షేత్రస్థాయికి ఆదేశాలు వెళ్లాయి. పాత లెక్కల ప్రకారం హెక్టారు వేరుశనగ పంటకు రూ.10 వేల నష్టపరిహారం ఉంది. జీవో9 ప్రకారమైతే రూ.15 వేలుగా నిర్ణయించారు. విశాఖ తుపాను, అనంతపురం జిల్లా కరువు.. రెండింటినీ ప్రకృతి వైపరీత్యాల కిందే పరిగణిస్తున్నారు. అయినా స్కేల్ ఆఫ్ రిలీఫ్ వర్తింపులో స్పష్టత లేదు. దీనివల్ల పంట నష్టం అంచనాల తయారీలో అధికారులు, సిబ్బంది గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పంట నష్టం అంచనాలు కూడా రూ.850 కోట్ల నుంచి రూ.550 కోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని జేడీఏ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతానికి పాత నిబంధనల ప్రకారమే అంచనాలు తయారు చేస్తున్నట్లు జేడీఏ పీవీ శ్రీరామమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. ఒకవేళ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే నష్టపోయిన రైతుల సంఖ్యలో తేడా ఉండదని, అంచనా మొత్తం మాత్రమే మారుతుందని చెప్పారు. పంటలకు ‘స్కేల్ ఆఫ్ రిలీఫ్’ ఇలా... పంట పేరు పాత జీవో ప్రకారం జీవో 9 ప్రకారం (హెక్టారుకు రూ.లలో) (హెక్టారుకు రూ.లలో) వేరుశనగ, వరి, పత్తి 10,000 15,000 మొక్కజొన్న 8,333 12,500 పొద్దుతిరుగుడు 6,250 10,000 పప్పుధాన్యపు పంటలు 6,250 10,000 -
మీ చీకటిలో వెలుగులమై..
హుద్‌హుద్ బాధితుల కోసం చేయీచేయీ కలిపి... తరలివచ్చిన తారా లోకం రోజంతా వినోదాల విందు హుషారెత్తించిన నృత్యాలు ఉల్లాసభరితంగా క్రీడలు సందడిగా మేముసైతం హుదూద్ తుపాను తీవ్రతకు దెబ్బతిన్న విశాఖ ప్రాంతాన్ని ఆదుకునేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కదలి వచ్చింది. బాధితులకు సాయమందించడంలో భాగంగా నిధులు సేకరించేందుకు నటీనటులు ‘మేముసైతం’ అంటూ ముందుకొచ్చారు. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో సంగీత విభావరి, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో సినీతారల క్రీడా పోటీలు నిర్వహించారు. టికెట్ల ద్వారా వచ్చిన నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిచారు. తారల ఆటపాటలతో.. అభిమానుల సందడితో ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. -
రైతు చిత్తు!
‘తెల్లబంగారం'గా ముద్దుగా పిలుచుకునే పత్తి పంట ఈ ఏడాది రైతులను నిలువునా ముంచింది. ఎన్నో ఏళ్లుగా ఆర్థిక భరోసానిస్తున్న పంట ఈ సారి కంట నీరు పెట్టిస్తోంది. కొద్ది రోజుల కిందట సంభవించిన హుదూద్ తుపాను ప్రభావంతో పల్నాట కురిసిన వర్షాలు పత్తి పంటకు ఎసరు తెచ్చాయి. ఆ సమయంలో పడిన వర్షాలు ఆమ్ల గుణం కలిగి ఉండడంవల్ల పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నట్టు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పంటలు కూడా పూర్తిగా ఎండిపోయాయని వాపోతున్నారు. కారంపూడి ఈ ఖరీఫ్‌లో వర్షాలతోపాటు, కాలువలకు సాగర్ జలాలు ఆలస్యంగా రావడంతో ఎక్కువ సంఖ్యలో రైతులు పత్తి సాగు చేపట్టారు. వరికి బదులు మాగాణి భూముల్లో కూడా సాగు చేశారు. ఏపుగా పెరిగిన పైరును చూసి రైతులు ఆనందంగా ఉన్నారు. ఆ సమయంలో హుదూద్ తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసింది. దాని ప్రభావంతో ఇక్కడ కురిసిన వర్షాలకు పత్తి పంట అప్పటివ రకు బాగానే వున్నా క్రమేపి దెబ్బతినడం ప్రారంభించింది. పత్తి మొక్కలు నల్లగా మారి ఆకులు రాలి పోతున్నాయి. చివరకు మొక్కలు మోడు వారుతున్నాయి. మెట్ట భూములతోపాటు నీటి వసతి వున్న నేలల్లో సైతం ఇలా జరుగుతుండడంతో రైతులు సస్య రక్షణ చర్యలు చేపడుతున్నా ఫలితం లేకుండాపోతోంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని రైతాంగం చెపుతోంది. హుదూద్ తుపాను తరువాత పత్తి రైతు పరిస్థితి తలకిందులైంది. పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీరేదారేదంటున్నారు. ఎకరాకు కౌలు కలుపుకుని దాదాపు 43 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇప్పటి వరకు వచ్చిన దిగుబడి మూడు క్వింటాళ్లు మాత్రమే. మరో మూడు క్వింటాళ్ల వరకు రావచ్చంటున్నారు. ఆరు క్వింటాళ్లు రూ. 3,200 చొప్పున అమ్మినా రూ. 19,200 వస్తాయి. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ఈ ఏడాది రెక్కల కష్టానికి తోడు పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయంటున్నారు. పొలం చూడబుద్ధి కావడం లేదు... ఏడెకరాలు వేశా. ఇప్పటికి 8 క్వింటాళ్లు వచ్చింది. తుపాను తరువాత పైరంతా క్రమేణా నల్లగా అయ్యింది. పొలం చూడబుద్ధి కావడం లేదు. ఈ పరిస్థితి ఎప్పుడూ చూడ లేదు. కౌలు ఎకరా 20 వేలు. ఇంక మా పరిస్థితి మీకే అర్థం అవుతుంది. ఇంత కష్టం వున్నా ధర వుందా అంటే అదీ లేదు. పెట్టుబడులు బాగా పెరిగాయి. ధర మాత్రం కొన్నేళ్లుగా అంతే వుంటోంది. - రేళ్ల యల్లారెడ్డి, కౌలురైతు, లక్ష్మీపురం పెట్టుబడులు ఎలా తీర్చాలి ఎకరం 18 వేలు కౌలు. ఐదెకరాలు వేశా. లక్ష దాకా పెట్టుబడి అయ్యింది. ఇప్పటికి ఎకరాకు రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇంకా నాలుగు క్వింటాళ్లు రావచ్చు. ధర చూస్తే రూ.2,950. క్వింటా పత్తి తీసినందుకు కూలీలకు వెయ్యి ఖర్చు. తుపాను తరువాత పైరు రోజు రోజుకు క్షీణించింది. ఆకులు నల్లగా మారి రాలి పోయాయి. పెట్టుబడులు ఎలా తీర్చాలి. - నడికోట చిరంజీవి, కౌలు రైతు, లక్ష్మీపురం సొంత పొలమైనా నష్టమే.. ఈ ఏడాది 13 ఎకరాలు వేశా. నాలుగు లక్షల పెట్టుబడి అయింది. ఇప్పటికి 20 క్వింటాళ్లు వచ్చింది. ఇంకా ఎకరాకు మూడు క్వింటాళ్లు రావచ్చు. గతంలో ఎకరాకు 20 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. తుపాను వర్షం ఏమీ చేయదనుకున్నాం. కాని అప్పుడు కురిసిన వానలో తేడా వుంది. ఇప్పటికీ పంట పరిస్థితిని ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది. వ్యవసాయాధికారులు ఇతరులు ఏమి చేస్తున్నట్లు. సొంత పొలమైనా నష్టం ఈ సారి ఎక్కువగా వుంది. ఈ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. - గోగిరెడ్డి కృష్ణారెడ్డి, రైతు సరస్వతి భూముల కేసులో మరో 23 మంది కోర్టుకు హాజరు పిడుగురాళ్ల: మాచవరం మండలం చెన్నాయపాలెంలో ఇటీవల జరిగిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల కేసులో శనివారం మరో 23 మందిని పోలీసులు కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసులో శుక్రవారం 13 మందిని కోర్టుకు తీసుకెళ్లగా శ నివారం డీఎస్పీ వెంకటేశ్వరనాయక్ ఆధ్వర్యంలో మరో 23 మందిని నిందితులుగా పేర్కొంటూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జికోర్టు జడ్జి ఎస్ సుజాత ముందు హాజరు పరిచారు. నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో మొత్తం ఈకేసులో 92 మందిని కోర్టుకు హాజరు పరిచినట్లయింది. -
బాధితులకు అండగా ఉంటాం
ప్రతి ఒక్కరికి పరిహారమందే వరకు పోరాటం తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రకాష్‌కారత్ పర్యటన స్టీల్‌ప్లాంట్, కంచరపాలెంలలో మొక్కలు నాటిన కారత్ సాక్షి, విశాఖపట్నం: హుదూద్ తుపాను బాధితులకు సీపీఎం అండగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కారత్ భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి పరిహారం అందేవరకు బాధితుల తరపున సీపీఎం పోరాడుతుందన్నారు. జిల్లా, రాష్ర్ట స్థాయిల్లో తమ పార్టీ నేతలు బాధితుల తరపున పోరాడతారని చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ సాయం కోసం కేంద్రంపై తాము ఒత్తిడి తీసుకొస్తామన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం పార్టీ రాష్ర్ట, జిల్లా నాయకులతో కలిసి కారత్ పర్యటించారు. తొలుత హుదూద్‌కు తీవ్రంగా దెబ్బతిన్న స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. ప్లాంట్‌కు జరిగిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు, కార్మికులతో జరిగిన నష్టంపై ఆరా తీశారు. అనంతరం ప్లాంట్ సాంకేతిక శిక్షణా కార్యాలయం ప్రాంగణంలో పార్టీ రాష్ర్ట కార్యదర్శి పి.మధు, జిల్లా కార్యదర్శి నరసింగరావు, ఉద్యోగ, కార్మిక సంఘ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడుతూ ప్లాంట్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా తాము పోరడతామని హామీ ఇచ్చారు. అక్కడ నుంచి కంచరపాలెం చేరుకున్న కారత్కు పార్టీ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి బి.గంగారావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం పైకప్పులు లేచిపోయి..దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన కారత్ బాధితులతో మాట్లాడారు. సర్వస్వం కోల్పోయిన తమను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు టీడీపీ నాయకులు చెప్పిన వారి పేర్లనే జాబితాల్లో రాస్తున్నారని ఆయనకు వారు చెప్పారు. అక్కడ నుంచి కంచరపాలెం హైవేపై ఉన్న పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నేతలతో కలిసి మొక్కలు నాటారు. పార్టీ కార్య కర్తలు, బాధితులనుద్దేశించి మాట్లాడుతూ హుదూద్ తుపాను కనివినీ ఎరుగని నష్టాన్ని మిగిల్చిందని..లక్షలాదిమంది ప్రజలను ఇబ్బందుల పాల్జేసిన ఈ విపత్తును జాతీయవిపత్తుగా ప్రకటించి విశాఖ పునర్నిర్మాణానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని సూచించారు. అధికారులు పక్షపాత ధోరణిని విడనాడి దెబ్బతిన్న ప్రతి ఒక్క బాధితుడికి పరిహారం అందించేందుకు కృషి చేయాలన్నారు. లేకుంటే బాధితుల తరపున సీపీఎం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. పార్టీ జిల్లా నాయకులు కె.లోకనాథం, ఎన్.రామారావు, జే.అయోధ్యరామ్, ఆర్.భాగ్యలక్ష్మి, బొట్టు ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. కారత్కు వినతుల వెల్లువ విశాఖ పర్యటనకు వచ్చేసిన కారత్కు వివిధ వర్గాలకు చెందిన వారు పెద్దఎత్తున వినతులు సమర్పించారు. తొలుత స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.రామారావు, డి.ఆదినారాయణలు స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణానికి కేంద్రం ఆదుకునేలా ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ప్లాంట్‌కు రెండేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని, రైల్వేశాఖ 1000 రేక్స్‌ను ప్రత్యేకంగా కేటాయించాలని, నష్టానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేసేందుకు హైలెవల్ కమిటీని పంపించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని వారు కారత్ను కోరారు. హుదూద్ వల్ల హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్‌కు రూ.500 కోట్ల మేర నష్టంవాటిల్లిందని, నౌక నిర్మాణ ఆర్డర్స్ అన్ని హెచ్ఎస్ఎల్కే ఇప్పించేలా కృషి చేయాలని కోరుతూ హెచ్ఎస్ఎల్ స్టాఫ్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వి.రమణమూర్తి, వి.నాగేశ్వరరావులు కారత్కు వినతిపత్రం సమర్పించారు. -
హుదూద్ బాధితుల కోసం ‘ఇంద్రధనుస్సు’
హుదూద్ బాధితుల సహాయార్థం శ్రీ సుధా ఆర్ట్స్, శ్రీ భవిరి ఆర్ట్స్ క్రియేషన్స్ ఆదివారం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ‘ఇంద్రధనుస్సు’ పేరిట సాంస్కృతిక కార్యక్రవూన్ని నిర్వహిస్తున్నారుు. ఉదయుం 10.00 గంటలకు ప్రారంభవుయ్యే ఈ కార్యక్రవుంలో హరికిషన్, జీవీఎన్ రాజు, భవిరి రవి మల్లెల, సుధాకర్ల మిమిక్రీ, కళాధర్ మైమ్, కె.జనార్దన్ మేజిక్ కార్యక్రమాలు ఉంటాయి. సినీ, టీవీ కళాకారులు పాల్గొనే ఈ కార్యక్రవుంలో ఫన్నీ నృత్యాలు, పసందైన హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. -
చీకటి పల్లెలు
ఇంకా అంధకారంలో4314 గ్రామాలు విశాఖలో పగటివేళ విద్యుత్ సరఫరా కట్ హుదూద్ కు దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ సాక్షి, విశాఖపట్నం : హుదూద్ తుపాను దెబ్బకు విద్యు త్ వ్యవస్థ కుప్పకూలింది. వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపడ్డాయి. లక్షలాది సర్వీసులకు సరఫరా నిలిచిపోయింది. సుమారు రూ.750 కోట్ల నష్టం వాటిల్లింది. అయితేనేం రెండు మూడు రోజుల్లోనే విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాం. ప్రజలకు విద్యుత్ వెలుగులు ఇచ్చాం. ప్రస్తుతం విద్యుత్ సరఫరాను దాదాపుగా అన్ని సర్వీసులకు పునరుద్ధరించేశాం. ఇవి ప్రభుత్వం చెబుతున్న గొప్పలు. కానీ అదే ప్రభుత్వాధికారుల వద్ద ఉన్న లెక్కలు ఈ మాటలు అవాస్తవాలని చెబుతున్నాయి. ఆ లెక్కల ప్రకారం ఇప్పటికీ జిల్లాలో 4 లక్షల 96 వేల 966 సర్వీసులకు విద్యుత్ సరఫరా అందడం లేదు. నగరంలో పగటిపూట విద్యుత్ ఉండడం లేదు. ఒక్క గ్రామంలోనూ పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరించలేదు. కానీ అన్ని సర్వీసులకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పూర్తయినట్లేనని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. ఈ నెల 12వ తేదీన జిల్లాపై విరుచుకుపడిన హుదూద్ తుపాను వల్ల తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) పరిధిలోని 11,28,840 సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇతర జిల్లాలు, డిస్కంల నుంచి నిపుణులైన సిబ్బందిని పంపిస్తే తప్ప పునరుద్ధరణ చర్యలు అసాధ్యమని సంస్థ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. దీంతో చుట్టు పక్కల జిల్లాల నుంచి హుటాహుటిన వేలాది మంది విద్యుత్ శాఖ అధికారులను, సిబ్బంది జిల్లాకు వచ్చారని వెంటనే విద్యుత్ వ్యవస్థను పూర్వస్థితికి తీసుకువచ్చేస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. కానీ వారంతా 18 రోజులు కష్టపడితే 6,31,874 సర్వీసులకు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేలా చేయగలిగారు. తుపాను బారిన పడి అంధకారంలో మగ్గుతున్న 4314 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ చర్యలను అధికారులు పూర్తిగా విస్మరించారు. తుపాను వల్ల 132/33 కేవీ లైన్లు 16 దెబ్బతింటే వాటిలో 14 పునరుద్ధరించారు. 33/11కేవీ లైన్లు 144 దెబ్బతినగా 118 బాగుచేశారు. 33కేవీ ఫీడర్లు 92 పాడైతే 62 సరిచేశారు. 11కేవీ ఫీడర్లు 604 తెగిపోతే వాటిలో 399 అతికించారు. 8320 ఎల్టీ లైన్లలో ఒక్క లైను కూడా గాడిన పడలేదు. విద్యుత్ స్తంభాల పరిస్థితి కూడా అంతే. 33కేవీ విద్యుత్ స్తంభాలు 1564 విరిగిపోయాయి. వాటి స్థానంలో ఇప్పటి వరకూ 352 మాత్రమే కొత్తవి నిలబెట్టారు. 216 స్తంభాలు దెబ్బతిన్నాయి. వాటిలో 30 స్తంభాలే సరిచేశారు. 11కేవీ స్తంభా లు 10270 విరిగిపోతే 4120 కొత్త స్తంభాలు వేశారు. ఈ కేటగిరీలో 896 దెబ్బతింటే కేవలం 35 పనికొచ్చేలా చేశారు. ఎల్టీ స్తంభాలు 6250 విరిగిపోతే 2350 మార్చారు. 1100 వంగిపోతే 115 సరి చేశారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీఆర్) నిర్మాణాలు 9736 కూలిపోతే వాటి స్థానంలో ఒక్క కొత్త నిర్మాణం కూడా జరగలేదు. ట్రాన్స్ఫార్మర్లు(డీటీఆర్స్) 14065 దెబ్బతింటే 7120 మాత్రమే మార్చారు. -
ఆధునికీకరణకు నిధులివ్వాలి
గోవాడ, తుమ్మపాల సుగర్స్‌కు రూ.100 కోట్లు చొప్పున మంజూరు చేయాలి ప్రభుత్వానికి వామపక్ష నేతల డిమాండ్ ఫ్యాక్టరీలను సందర్శించిన బృందం అనకాపల్లి: హుదూద్ తుపాను కారణంగా తీ వ్రంగా నష్టపోయిన గోవాడ, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం రూ.100 కోట్ల చొప్పు న మంజూరు చేయాలని జిల్లా వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. మండలంలోని తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీని బుధవారం సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజె స్టాలిన్, సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాధం, వామపక్ష నేతలు కొండబాబు, రామచంద్రరావు, వీవీఎమ్ రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఫ్యాక్టరీ యంత్రాలను, గొడౌన్, స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీపై వేలాది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. తుపానుకు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. పంటనష్టాన్ని పారదర్శకంగా నమోదు చేయాలన్నారు. గ్రామీ ణ ప్రాంతాలలో 25 కిలోల బియ్యం మూడునెలల పాటు ఉచితంగా ఇవ్వాలన్నారు. జిల్లాలో తుపానుపై నష్టం వివరాలు నమోదు చేసి తమ పార్టీ నేతలకు అందజేస్తామన్నారు. వామపక్ష నేతలు బాలకృష్ణ, కోన లక్షణ్, రాజాన దొరబాబు, ఆడారి అప్పారావు పాల్గొన్నారు. జాతీయ విపత్తుగా పరిగణించాలి చోడవరం: హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా పరిగణించి దెబ్బతిన్న సహకార చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం ఆదుకోవాలని వామపక్షాల బృందం డిమాండ్ చేసింది. సీపీఐ,సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూ డెమొక్రసీ, సీపీఎం లిబరేషన్, ఎం సీపీఐ లకు చెందిన నాయకుల బృందం గోవాడ సహకార చక్కెర కర్మాగారాన్ని బుధవారం సందర్శించింది. ఉత్తరాంధ్ర జిల్లాల ను తుపాను తీవ్రంగా నష్టపరిచినందున జాతీ య విపత్తుగా కేంద్రం పరిగణించాలని బృంద సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక వామపక్షాల నాయకులు రెడ్డిపల్లి అప్పలరాజు, మట్టారమణ, నాగిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. -
వసతి గృహాలకు హుదూద్ నష్టం రూ.2.12 కోట్లు
కూలిన ప్రహరీలు, దెబ్బతిన్న హాస్టళ్లు నష్టం అంచనాలు రూపొందించిన అధికారులు నిధులు మంజూరుకు ప్రభుత్వానికి నివేదిక విశాఖపట్నం : తుపానుకు దెబ్బతిన్న సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు అధికారులు అంచనాలు రూపొందించారు. బీసీ సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన 107 వసతి గృహాలు దెబ్బతిన్నాయని అధికారుల విచారణలో తేలింది. వీటి మరమ్మతులకు రూ.2.12 కోట్లు అవసరమని అంచనాలు వేశారు. బీసీ సంక్షేమశాఖకు చెందిన 40 సొంత భవనాలలోని ప్రీమెట్రిక్ వసతి గృహాలు దెబ్బతిన్నాయి. వసతి గృహాల ఆవరణలోని చెట్లు నేల కూలాయి. పలుచోట్ల ప్రహరీలు కూలిపోయాయి. కిటికీలు, తలుపులు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పైకప్పులు ఈదురు గాలులకు ఎగిరిపోయాయి. ఒక్కో హాస్టల్‌కు రూ.40 వేల నుంచి రూ.8 లక్షల వరకు నిధులు అవసరమని ఇంజినీర్లు అంచనాలు రూపొందించారు. నగరంలోని ఇసుకతోట, పెందుర్తి, జిల్లాలోని యలమంచిలి, పాయకరావుపేట, కె.కోటపాడు, కోరువాడ, భీమిలి, రెడ్డిపల్లి, పద్మనాభం, గొడిచెర్ల, నక్కపల్లి, వేములపూడి, నర్సీపట్నంలలోని వసతి గృహాలు బాగా దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు రూ.1.32 కోట్లు అంచనా కాగా, తక్షణం రూ.1.12 కోట్లు అవసర మని అధికారులు నివేదికలు పంపారు. ఎంవీపీ కాలనీలోని బీసీ సంక్షేమశాఖ కార్యాలయానికి రూ.75 వేల నష్టం వాటిల్లింది. సాంఘిక సంక్షేమ శాఖలో... తుపానుకు జిల్లాలోని 67 ఎస్సీ వసతి గృహాలు దెబ్బతిన్నాయి. నగరంలోని కృష్ణానగర్, భీమిలి, మధురవాడ, చినగదిలి, ఆనందపురం, గాజువాక, పెదగంట్యాడ, చోడవరం, మాడుగుల, పరవాడ, గోపాలపట్నం, పెందుర్తి, కె.కోటపాడు, సబ్బవరం, యలమంచిలి, నర్సీపట్నం, గొలుగొండ, ఎస్.రాయవరం వసతి గృహాలకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వివరాలు సేకరించారు. మిగిలిన చోట్ల స్వల్పంగా నష్టం జరిగింది. అన్ని చోట్ల ప్రహరీలు కూలిపోయాయి. వీటి మరమ్మతుల కోసం కనీసం రూ.80 లక్షలు అవసరమని అంచనాలు వేశారు. తక్షణం రూ.32 లక్షలు కావాలని నివేదికలు సిద్ధం చేశారు. ప్రభుత్వానికి నివేదించాం తుపానుకు దెబ్బతిన్న వసతి గృహాలలో ప్రస్తుతానికి విద్యార్థులకు భోజన, వసతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. వసతి గృహాల మరమ్మతులకు నిధుల కోసం ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. - అన్నపూర్ణమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి, విశాఖపట్నం -
ప్రతిష్ట పాతాళానికి..
ఏయూపై మంత్రి గంటా పెత్తనమేంటి? తుపాను నష్టం రూ.230 కోట్లా!? క్లాసులే జరగనప్పుడు పరీక్షలా? కలకలం రేపిన ఏయూ విభాగాధిపతుల వ్యాఖ్యలు ‘ఏయూపై మంత్రి గంటా పెత్తనమేమిటి?...ఆయన క్యాంపస్‌కు పదేపదే వచ్చి అధికారికంగా నిర్ణయాలు ప్రకటించేయడమేమిటి?... వీసీతో సహా ఏయూ అధికారులు అం తా ఆయనకు సాగిలపడటమేమిటి?... ఏయూ చరి త్రలో ఇంతవరకు ఇలాంటి దుస్థితి దాపురించలేదు. ఇ లా అయితే ఏయూ ప్రతిష్ట దిగజారి అదఃపాతాళానికి పడిపోతుంది’ ‘హుదూద్ తుపాను వల్ల ఏయూకు రూ.230 కోట్లు నష్టం వచ్చిందని ఏ ప్రాతి పదికన ప్రకటించేశారు?, అంత నష్టం ఎక్కడ జరిగింది?. భవనాలు ఏమీ దెబ్బతినలేదు. ల్యాబ్‌లకు నష్టం జరగలేదు. చెట్లు కూలిపోయిన మాట వాస్తవం. కానీ దాన్ని రూ.230 కోట్లుగా లెక్కించలేం కదా? ఆస్తి నష్టం జరగనప్పుడు అంత నష్టమని ఎ లా ప్రకటిస్తారు. దీని వెను క ఉన్న లోగుట్టు ఏమిటి?. దాతల నుంచి కేవలం ధన రూపంలోనే సహా యం కోరడం వెనుక మర్మమేమిటీ?’ ఏయూ విభాగాధిపతుల ఆవేదన ఇదీ. ప్రశ్న ల శరపరంపర ఇదీ. ఏయూ కేంద్రంగా సాగుతున్న అక్రమాలను సూటిగా నిలదీసిన వైనం ఇదీ. గత కొన్నేళ్లలో ఎన్నడూలేని రీతిలో విభాగాధిపతులు ఏయూ వ్యవహారాలపైన విరుచుకుపడ్డారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం ఇలా సాగింది... విభాగాధిపతుల సమావేశమే వేదికగా... ఏయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గాయత్రీదేవీ విభాగాధిపతులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే గాయత్రీదేవీ మాట్లాడుతూ నవంబర్ 10 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. దాంతో విభాగాధిపతులు అందరూ అవాక్కయ్యారు. తమను కనీసం సంప్రదించకుండా పరీక్షల షెడ్యూల్‌ను నిర్ణయించేయడమేమిటని విస్తుపోయారు. కొంతకాలంగా ఏయూ వ్యవహారాలలై ఆగ్రహంతో ఉన్న విభాగాధిపతులు దాంతో ఒక్కసారిగా తమ నిరసనను తెలిపారు. ‘తుపాను అనంతరం క్లాస్‌లు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం. ఇంకా 10 శాతం మంది విద్యార్థులు కూడా క్లాస్‌లకు రావడం లేదు. సిలబస్‌లు పూర్తికాలేదు. అలాంటిది నవంబర్ 10 నుంచి పరీక్షలు ఎలా నిర్వహిస్తారు?. తేదీలను ఖరారు చేసేముందు మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం లేదా?’ అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు ఏయూలో సాగుతున్న అడ్డగోలు వ్యవహారాలను ప్రస్తావిస్తూ అంశాలవారీగా ఇలా నిలదీశారు. మంత్రి గంటా పెత్తనమేమిటీ?... ఏయూ వ్యవహారాలన్నింటినీ మంత్రి గంటా శ్రీనివాసరావు హైజాక్ చేసేస్తున్న తీరును విభాగాధిపతులు తప్పుబట్టారు. ‘అసలు యూనివర్సిటీపై విద్యాశాఖ మంత్రి పెత్తనం ఏమిటి? ఏయూ విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం వీసీకి, పాలకమండలికే ఉంది. విభాగాధిపతులను సంప్రదించి వీసీ పాలకమండలిలో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. వీసీ నేరుగా గవర్నర్‌కే జవాబుదారిగా ఉండాలి. కానీ ఇవేవీ లేకుండా మంత్రి గంటా చీటికిమాటికి క్యాంపస్‌కు వచ్చేసి సమావేశాలు పెట్టడం ఏమిటి?. మన ఇద్దరు ఉన్నతాధికారులు చిత్తందొరా అని వంతపాడటమేమిటి?అని తీవ్రస్థాయిలో నిరసించారు. ఏయూకు రూ.230 కోట్ల నష్టమా?.. హవ్వా! హుదూద్ తుపాను వల్ల ఏయూకు రూ.230 కోట్ల నష్టం వచ్చినట్టు వీసీ జి.ఎస్.ఎన్.రాజు ప్రకటించడాన్ని విభాగాధిపతులు తప్పుబట్టారు. ఏ ప్రాతిపదికన లెక్కించి ఇంత భారీ నష్టం వచ్చినట్టు ప్రకటించారని ప్రశ్నించారు. ‘తుపాను వల్ల ఏయూ భవనాలకుగానీ ల్యాబ్‌లకుగానీ ఎలాంటి నష్టం కలగలేదు. కేవలం నాన్‌టీచింగ్ స్టాఫ్ క్వార్టర్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఆ నష్టం రూ.50 లక్షల వరకు ఉండొచ్చు. ఇతర చిన్నాచితక నష్టం కలిగింది. అంతకుమించి ఏయూ ఆస్తులకు ఎలాంటి నష్టం కలగలేదు. మరి రూ.230 కోట్ల నష్టం అని ఎలా ప్రకటించారు? క్యాంపస్‌లో చెట్లు భారీగా కూలిపోయినమాట వాస్తవం. కానీ ఆ నష్టాన్ని డబ్బురూపేణా అంచనా వేయలేం కదా! కానీ రూ.230 కోట్లు నష్టం ఏర్పడినట్టు ప్రకటించడం వెనుక ఉద్దేశమేమిటి?’అని సందేహం వ్యక్తం చేశారు. ఇంతవరకు నాన్‌టీచింగ్ సిబ్బంది క్వార్ట్ర్స్కు నీరు, విద్యుత్తు సౌకర్యాన్ని పునరుద్ధరించకపోవడాన్నీ ప్రశ్నించారు. ఏయూలో తుపాను నష్టాలను తాము సరిచేస్తామని దాతలు వస్తుంటే మీరు వస్తు రూపేణా ఎలాంటి సహాయం చేయొద్దు... ఆ మొత్తాన్ని ఏయూ అకౌంట్లో వేయమని కోరుతున్నారు?, ఇదెంత వరకు సబబు?.. దాతలే నేరుగా దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులు చేస్తామంటే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?.. దీనివెనుక లోగుట్టు ఏమిటి?’అని కూడా ప్రశ్నించారు. ఇలా విభాగాధిపతులు ఒక్కొక్కరుగా నేరుగా ప్రశ్నల శరపరంపర కురిపించడంతో ఆ సమావేశం ఆద్యంతం వాడిగా వేడిగా సాగింది. విభాగాధిపతులు లేవనెత్తిన అంశాలను వీసీ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గాయత్రీదేవి సమావేశాన్ని ముగించారు. మేమే బాధితులం.. మా జీతాల నుంచి కోతా? తుపాను బాధితులకు ఏయూ ఉద్యోగుల రెండురోజుల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు మంత్రి ప్రకటించడాన్ని కూడా విభాగాధిపతులు తప్పుబట్టారు. ‘తుపాను వల్ల విశాఖలో నివసిస్తున్న ఏయూ ఉద్యోగులు నష్టపోయారు. వారిని ఆదుకోవాలి. ప్రభుత్వం నిధులు ఇవ్వడమే...ఇతర ప్రాంతాల ఉద్యోగులు, దాతల నుంచి విరాళాలు సేకరించడమే చేయాలి. అంతేగానీ తుపాను బాధితులు అయిన ఏయూ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తే ఎలా? అసలు ఈ నిర్ణయాన్ని మంత్రి గంటా ఎలా ప్రకటిస్తారు? అందుకు ఏయూ ఉన్నతాధికారులు ఎలా ఆమోదిస్తారు? అని కడిగిపారేశారు. తాము అసలు జీతాల నుంచి కోతను ఆమోదించేది లేదని తేల్చిచెప్పేశారు. -
ఉపాధికి ఊతం
హుదూద్‌తో కొత్తపనుల గుర్తింపు పెద్దఎత్తున కల్పనకు ప్రణాళిక రైతులకు మేలు సాక్షి, విశాఖపట్నం : హుదూద్ తుపాను ఉపాధి హామీ కూలీలకు ఊతమిస్తోంది. హుదూద్ సృష్టించిన విధ్వంసంతో పెద్ద ఎత్తున పనుల కల్పనకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హూదూద్ తుపానుకు పదిరోజుల ముందు వరకు ఉపాధి హామీ కూలీలకు రోజూ పాతికవేల పనిదినాలు కల్పించేవారు. ఒక పక్క వ్యవసాయ సీజన్..మరొక పక్క హూదూద్ దెబ్బతో ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఒక్క పనిదినాన్నికూడా కల్పించ లేని పరిస్థితి. రానున్న సీజన్లో చేపట్టనున్న పనుల కోసం ప్రణాళిక రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా హూదూద్ విధ్వంసంతో ఉత్తరాంధ్రలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రైతులు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా రైతులను ఆదుకునే లక్ష్యంతో కొత్త పనుల గుర్తించారు. వీటిలో ప్రధానంగా తుపానునేపథ్యంలో పొలాల్లో పేరుకుపోయిన ఇసుకమేటలు తొలగించడం, ధ్వంసమైన పొలం గట్లు, వరదగట్లు పటిష్టపరచడం, ఫీల్డ్ చానల్స్, ఫీడర్ ఛానల్స్‌లో పేరుకుపోయిన డీసిల్టింగ్ తొలగింపు, పొలాల్లో నేలకొరిగిన చె ట్లు తొలగింపు వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. తోటలు.. పొలాల గట్లపై పడిపోయిన చెట్ల స్థానే కొత్త మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఉపాధి హామీలో చేపట్టాలని యోచిస్తున్నారు. మామిడి, జీడి, సపోటా, కొబ్బరి తదతర వాణిజ్య పంటలన్నీ హార్టికల్చర్ ప్రొగ్రామ్ ద్వారా రైతుల తోటల్లో ఉపాధి హామీ పథకంలో నాటనున్నారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్ జరుగుతున్నందున..అది పూర్తి కాగానే ఎన్ని వేల ఎకరాల్లో తోటలు, పొలాల్లో చెట్లు నేలమట్టమయ్యాయో అంచనా వేసి తొలుత వాటిని తొలగించడం..ఆతర్వాత రైతుల సమ్మతితో కూలీలద్వారా వారు సాగు చేసే రకాలకు చెందిన మొక్కలను పెద్ద ఎత్తున నాటేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైన మొక్కలను ఉద్యానవనశాఖ సరఫరా చేస్తుంది. ఉపాధి కూలీల ద్వారా రైతుల పొలాలు, తోటల్లో వాటిని నాటించనున్నారు. హూదూద్ నేపథ్యంలో ఉపాధి హామీ అధికారులు గుర్తించిన పనుల ఆమోదం కోసం జిల్లా కలెక్టర్ యువరాజ్ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి అనుమతిరాగానే ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త పనులతో సంబంధం లేకుండా గతంలో ప్రతిపాదించిన రూ.400కోట్ల విలువైన పనులకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం చేపడుతున్న ప్లానింగ్ ప్రక్రియ పూర్తి కాగానే వీటిని కూడా చేపడతామని జిల్లాడ్వామా పీడీ శ్రీరాములునాయుడు సాక్షికి తెలిపారు. -
పుట్టలు తవ్వి.. పాలు పోసి
హుదూద్ దెబ్బకు పుట్టలు మాయం మట్టిదిబ్బలకు కలుగులు తీసి పూజలు తొలిసారి భక్తులకు వింత అనుభవం సాక్షి, విశాఖపట్నం : హుదూద్ తుపాను ప్రభావం నాగుల చవితిపై కూడా పడింది. తుపానుకు జిల్లాలో వేలాది చెట్లు నేలకొరిగాయి. వాటి కింద పుట్టలు చితికిపోయాయి. ఉన్న కొద్దిపాటి పుట్టలు వృక్ష వ్యర్థాలతో కప్పబడిపోయాయి. పుట్టలు కానరాక జనం అవస్థలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో కృత్రిమ పుట్టలు తవ్వి చవితి చేసుకున్నారు. ఈ ఏడాది బాణాసంచాపై నిషేధం ఉండడంతో పండగ సందడి కానరాలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదనే మాట ప్రతి ఒక్కరి నోటా వినిపించింది. వచ్చే ఏడాది ఈ సమయానికి జిల్లా తిరిగి పచ్చదనాన్ని సంతరించు కుని నాగేంద్రునికి సహజ సిద్ధ ఆవాసాలు ఏర్పడాలని ఆకాంక్షించారు. హుదూద్ వంటి విపత్తుల నుంచి కాపాడమని నాగేంద్రుడిని వేడుకున్నారు. కార్తీకమాసం తొలి సోమవారం నాడే నాగులచవితి రావడంతో శివాలయాలల్లో భక్తులు పోటెత్తారు. కొన్ని శివాలయాల్లో పుట్టలు ఏర్పాటు చేయడంతో ఎక్కువమంది అక్కడే పూజలు చేశారు. సహజసిద్ధంగా ఏర్పడే పుట్టలో పాలుపోయడం పవిత్రంగా భావించే వారు తప్పనిసరై కృత్రిమ పుట్టలతో సర్దుకున్నారు. -
బదిలీలపై సందిగ్ధం
నవంబర్ 11 నుంచి బదిలీలపై నిషేధం ఇప్పటి వరకు ప్రారంభం కాని కసరత్తు తుపాను సహాయక చర్యల్లో అధికారులు బిజీ స్థానచలనాలు కలిగిస్తే నష్టం అంచనాలకు ఆటంకం ప్రభుత్వం గడువు పొడిగించే అవకాశం! విశాఖ రూరల్: ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధత నెలకొంది. హుదూద్ తుపాను నేపథ్యంలో బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది. నవంబర్ 11వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమలులోకి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బదిలీలకు సంబంధించి ఎటువంటి కసరత్తు జరగడం లేదు. పునరావాస, సహాయక కార్యక్రమాలు జరుగుతున్న ఈ తరుణంలో స్థానచలనాలు ఉండే అవకాశం లేదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం బదిలీలకు గడువు పెంచుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా స్థాయి అధికారి నుంచి గ్రామస్థాయి కార్యదర్శి వరకు ప్రతి ఒక్కరినీ బదిలీ చేయాలని ప్రభుత్వం భావించింది. జన్మభూమి కా ర్యక్రమానికి ముందే ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయిస్తూ సెప్టెంబర్‌లోనే బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 20వ తేదీలోగా బదిలీలు పూర్తి చేయాలని అందులో పేర్కొంది. దీంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ నెలాఖరులోనే బదిలీలు చేపట్టాలని భావించి తహశీల్దార్ల పోస్టింగ్‌లకు సంబంధించి జాబితాపై కసరత్తు కూడా చేశారు. ఇంతలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన కారణంగా జాబితాను ప్రకటించలేదు. ఈ సమయంలో ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ నుంచి 20వ వరకు జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశించింది. ఇటువంటి పరిస్థితుల్లో స్థానచలనాలు కలిగిస్తే కొత్తగా మండలాలకు వెళ్లిన అధికారులకు ఆయా ప్రాంతాల్లో సమస్యలపై అవగాహన ఉండే అవకాశముండదని, జన్మభూమి కార్యక్రమం విజయవంతం కాదని భావించి కొత్త జీవో జారీచేసింది. జన్మభూమి తరువాత బదిలీలు చేపట్టాలని ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇంతలో ఈ నెల 12న హుదూద్ తుపాను విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని కలిగింది. ఇప్పటికీ పునరావాస, సహాయక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల కంటే విశాఖలో పరిస్థితులు దారుణంగా ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఇప్పట్లో బదిలీలు చేపట్టే అవకాశం ఉండదని ఉద్యోగవర్గాలు భావిస్తున్నాయి. ఇటువంటి సమయంలో బదిలీలు చేస్తే సహాయ కార్యక్రమాలలో జాప్యం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇక్కడ బదిలీలకు గడువు పొడిగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ బదిలీలపై మరో మూడు, నాలుగు రోజుల్లో ఒక స్పష్టత రావచ్చని భావిస్తున్నారు. -
ఇదేం పరిహారం?
కాఫీ రైతులకు మొక్కుబడి సాయం జీఓను తప్పుబడుతున్న గిరిజనులు ఎకరానికి రూ.10 వేలేనని ఉత్తర్వులు 50 శాతం నిబంధనలతో అందేది నామమాత్రమే హుదూద్ తుపానుకు దెబ్బతిన్న కాఫీ రైతులకు ప్రభుత్వం మొక్కుబడి పరిహారాన్ని ప్రకటించింది. గిరిజన రైతులు 15 ఏళ్ల నుంచి ఫలాశయం పొందుతున్న కాఫీ తోటలు ధ్వంసమై ఆయా కుటుంబాలు వీధిన పడగా ఆదుకోవలసిన వేళ ప్రభుత్వం తూతూమంత్రంగా సాయం ప్రకటిస్తోంది. పలు నిబంధనలతో అతి తక్కువ పరిహార జీఓను విడుదల చేయడాన్ని బాధిత రైతులు తప్పుపడుతున్నారు. పాడేరు: ఏడాదికి ఎకరం కాఫీ, మిరియాల పంటల ద్వారా రూ.లక్ష వరకు ఆదాయం పొందే కాఫీ రైతులను హుదూద్ తుపాను కోలుకోలేని దెబ్బతీసింది. కాఫీ మొక్కలన్నీ నీడ నిచ్చే చెట్ల సంరక్షణలోనే ఎదిగి ఫలసాయాన్ని ఇస్తాయి. తుపానుకు నీడనిచ్చే చెట్లు, వాటికి అల్లుకున్న మిరియాల పాదులన్నీ నేలకూలడంతో కాఫీ రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఏజెన్సీ వ్యాప్తంగా 11 మండలాల పరిధిలో లక్షా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలు ఉండగా 96 వేల ఎకరాల తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నాయి. ఇందులో సుమారు 30 వేల ఎకరాల్లో పంట తుపాను ధాటికి ధ్వంసమైంది. ఫల సాయానికి దగ్గరగా ఉన్న మరో 10 వేల ఎకరాల్లో కాఫీ తోటలు కూడా నాశనమయ్యాయి. నీడనిచ్చే చెట్లు నేలకూలడంతో కాఫీ మొక్కలకు రక్షణ కరువైంది. ఇవన్నీ వాడిపోయి పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి నెలకొంది. విరగ్గాసినా దక్కని ఫలం : ఈ ఏడాది విరగ్గాసిన కాఫీ తోటల్లో ఫల సాయాన్ని నవంబరు మొదటివారంలో సేకరించాల్సిన తరుణంలో హుదూద్ తుపాను గిరిజన రైతుల ఆశలను అడియాసలు చేసింది. కోలుకోలేని దెబ్బను మిగిల్చిన తరుణంలో ప్రభుత్వం ఎకరం పంటకు రూ.లక్ష ఇచ్చినా కాఫీ రైతులకు ఏర్పడిన నష్టాన్ని పూడ్చలేం. అయితే తక్షణ సహాయం కింద ఎకరానికి రూ.లక్ష చెల్లించి మళ్లీ నీడనిచ్చే సిల్వర్‌ఓక్ వృక్షాల పెంపకం, అవి ఎదిగిన తరువాత కాఫీ సాగుకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ఏజెన్సీలో పర్యటించి హెక్టార్ పంటకు రూ.10 వేల నుంచి 20 వేలు మాత్రమే పరిహారం కింద ప్రకటించారు. ఇటీవల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మోదాపల్లి ప్రాంతంలో ధ్వంసమైన కాఫీ తోటలను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వంసమైన కాఫీ తోటలన్నింటిని పరిశీలించి ఎకరానికి రూ.1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాఫీ రైతులకు ఏర్పడిన అపార నష్టాన్ని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన కూడా తీవ్రంగా స్పందించి ఎక రం కాఫీ పంటకు రూ.లక్ష చెల్లించేంత వరకు బాధిత రైతుల తరఫున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అతి తక్కువ పరిహార జీవో ప్రభుత్వం తాజాగా నష్టపరిహారంపై ఉత్తర్వులు జారీచేసింది. పలు నిబంధనలతో అతి తక్కువ పరిహార జీఓను విడుదల చేసి బాధిత కాఫీ రైతులకు మొక్కుబడి సాయాన్నే అందించేందుకు సిద్ధమవడాన్ని గిరిజన రైతులంతా తప్పుపడుతున్నారు. 50 శాతం కాఫీ పంట ధ్వంసమైతేనే నష్టపరిహారం చెల్లిస్తామని జీఓలో పేర్కొనడం బాధిత కాఫీ రైతులను మరింత బాధిస్తోంది. 10 ఏళ్ల దాటిన కాఫీ తోట 50 శాతం పైగా ధ్వంసమైతే ఎకరానికి రూ.10 వేలు, 5 నుంచి 10 ఏళ్ల లోపు తోటకు రూ.ఆరు వేలు, 5 ఏళ్లలోపు గల తోటలకు ఎకరానికి రూ.నాలుగు వేలు అతి తక్కువ పరిహారాన్ని ప్రభుత్వం అమలు చేయడం దారుణమని బాధిత కాఫీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలోని ధ్వంసమైన కాఫీ తోటలను పూర్తిగా తొలగించి కొత్తగా కాఫీసాగు చేపట్టాలంటే మరో ఆరేళ్లపాటు గిరిజన రైతులు అష్టకష్టాలు పడాల్సి ఉంది. ఫలసాయం వచ్చే వరకు రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో ఎకరానికి రూ.లక్ష చెల్లించి అన్ని విధాలా ఆదుకోవలసిన ప్రభుత్వం మొక్కుబడి సాయం ప్రకటించడంతోపాటు 50 శాతం నిబంధనలను అమలు చేయడం కూడా బాధిత కాఫీ రైతులకు అన్యాయం చేయడమేనని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నిండుకుండలు
సరిహద్దు జలాశయాల్లో పుష్కలంగా నీరు బలిమెలలోకి 24 టీఎంసీలు కొత్తగా చేరిక ఏపీవాటాగా 72 టీఎంసీలు నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారుల సమీక్ష సీలేరు/ముంచంగిపుట్టు : జిల్లాను అతలాకుతలం చేసిన హుదూద్ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని జలాశయాలకు మాత్రం మేలు చేసింది. తుపాను కారణంగా జోలాపుట్టు, బలిమెల, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు చేరింది. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల జలవిద్యుత్ కేంద్రాలకు నీరందించే బలిమెల జలాశయంలోకి 24 టీఎంసీల వరదనీరు చేరిందని ఏపీజెన్కో సీలేరు ఇన్చార్జి సూపరింటెండెంట్ టీఎల్ రమేష్‌బాబు తెలిపారు. ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన రిజర్వాయర్, డుడుమ(డైవర్షన్) డ్యామ్‌లోకి భారీగా వరద నీరు చేరింది. తుపాను అనంతరం తొలిసారిగా ఒడిశా బలిమెలలో సరిహద్దు నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల అధికారులు శుక్రవారం సమీక్షించారు. నీటి వినియోగంపై లెక్కలు కట్టారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 124 టీఎంసీల నీరు ఉండగా ఇందులో ఏపీకి 72.8564 టీఎంసీలు, ఒడిశాకు కేవలం 51.4136 టీఎంసీలు నీరు ఉన్నట్టు నిర్ధారించారు. తుపానుకు ముందు 100 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం అదనంగా 24 టీఎంసీలు పెరిగినట్టు లెక్కలు కట్టారు. ఈ నీటితో రానున్న 4 నెలలపాటు విద్యుదుత్పత్తికి ఎటువంటి ఢోకా లేదని జెన్కో అధికారులు వెల్లడించారు. అదే విధంగా మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తికి డిమాండ్ లేదని, 6మిలియన్యూనిట్లు(ఎంయూ) విద్యుదుత్పత్తి అవుతోందని పేర్కొన్నారు. ప్రమాద స్థాయిలో బలిమెల : బలిమెల జలాశయం నిండుగా ఉంది. తుపానుకు ప్రమాదస్థాయికి చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి అడుగు తేడాతో ప్రస్తుతం కళకళలాడుతుంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 1516 అడుగులు. శుక్రవారం సాయంత్రానికి 1515 అడుగులకు చేరుకొంది. మరో అడుగు నీరు చేరితే నీటిని విడిచి పెట్టాల్సిందే. అదే విధంగా జోలాపుట్టు పూర్తిస్థాయి నీటిమట్టం 2750అడుగులు. ప్రస్తుతం 2749.45 అడుగుల నీరుంది. సీలేరులో 1360 అడుగులకు1352.1 అడుగుల నీరు చేరింది. డొంకరాయి 1037 అడుగులకు 1035.4 అడుగుల నీరుంది. స్పిల్‌వే డ్యాం నుంచి డుడుమ(డైవర్షన్) డ్యాంకు ప్రస్తుతం 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డుడుమ డ్యాంలో 2585.9 అడుగుల నీటి మట్టం నమోదైంది. జలవిద్యుత్ కేంద్రంలోని ఆరుజనరేటర్లతో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలి. 1,2,3 జనరేటర్లతో 50 మెగావాట్ల మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. జోలాపుట్టుకు నీరందించే మత్స్యగెడ్డలు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ సమావేశంలో ఏపీ జెన్కో సూపరిండెంట్ ఇంజినీర్ ఈఎల్ రమేష్, ఏడీ భీమశంకరం, ఏడీటీ సురేష్‌తోపాటు ఒడిశా బలిమెల హైడ్రో ప్రాజెక్టు జనరల్ మేనేజర్ పిఎన్ పాండా, డిప్యూటీ మేనేజర్ (ఎలక్రికల్) జ్యోతిబసు, నీటి వనరుల విభాగం ముఖ్య నిర్వహణ ఇంజినీర్ మహంతిదాస్ పాల్గొన్నారు. -
తక్షణం కేంద్ర సాయం అందుతుంది
విశాఖలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి విశాఖపట్నం/విజయనగరం అర్బన్: హుదూద్ తుపాను తాకిడితో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రను ఆదుకునేలా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన కేంద్ర సాయం తక్షణం అందుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఎక్కువగా ఉందని, ఈసారి ఉత్తరాంధ్ర కోలుకోలేని విధంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తంచేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు బుధవారం విశాఖపట్నం వచ్చిన ఆయన విశాఖ కలెక్టరేట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖలవారీగా నష్టం, పునర్నిర్మాణానికి ఎంత సమయం పడుతుందనే అంశాలపై రెండున్నర గంటలపాటు సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుపాను బాధితులకు అండగా ఉండేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. దీపావళి పండుగైనా తాను రెండురోజులపాటు ఇక్కడే ఉండేందుకు వచ్చానన్నారు. -
నేడు తుపాను సాయం రూ.1,000 కోట్లు విడుదల
న్యూఢిల్లీ: హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.1,000 కోట్లను కేంద్రం బుధవారం విడుదల చేయనున్నట్టు సమాచారం. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) నుంచి ఈ నిధులు విడుదల చేస్తున్నట్టుగా సమాచారం అందిందని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో భేటీ అనంతరం టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడుతో కలిసి ఏపీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వాల మాదిరి కాకుండా ప్రధాని హామీ మేరకు రూ.1,000 కోట్ల సాయం వెంటనే విడుదల కానుండడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఈ నిధులను కేటాయిస్తారని కంభంపాటి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రిని కలిశామని, నష్టపోయిన రైతులకు సహాయంతో పాటు పంటల బీమా అందేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు వచ్చిన వెంటనే కేంద్ర బృందాలను పంపుతామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. తుపాను కారణంగా ్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. -
జిల్లాకు చేరిన జగన్
లావేరు: అభిమానం వెల్లువెత్తింది. జన సంద్రం పోటెత్తింది. కష్టాల్లో ఉన్న హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జిల్లాకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. లావేరు మండలంలోని సుభద్రాపురం జంక్షన్ వద్దకు రాత్రి 9.10 గంటలకు చేరుకున్న జగన్‌కు పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ సుజయకృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు, జిల్లా అధ్యక్షులు రెడ్డి శాంతి, నాయకులు గొర్లె కిరణ్‌కుమార్, బల్లాడ జనార్ధనరెడ్డి, మామిడి శ్రీకాంత్, పాలవలస విక్రాంత్, ఎం.వి. పద్మావతి, అంధవరపు సూరిబాబు, శిమ్మ రాజశేఖర్, కె.ఎల్. ప్రసాద్, గుమ్మా నగేష్, రణస్థలం జెడ్పీటీసీ గొర్లె రాజగోపాలరావు, మాజీ ఎంపీపీ దన్నాన రాజినాయుడు, మాజీ జెడ్పీటీసీలు టొంపల సీతారాం, సనపల నారాయణరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రొక్కం బాలకృష్ణలతో పాటు లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల వైఎస్సార్ సీపీ కేడర్ అధిక సంఖ్యలో తరలి వచ్చి జగన్‌కు ఘనస్వాగతం పలికారు. జనసంద్రమైన సుభద్రాపురం జంక్షన్జగన్ రాకతో లావేరు మండలంలోని సుభద్రాపురం జంక్షన్ జనసంద్రమైంది. సుభద్రాపురం జంక్షన్‌కు జగన్ వస్తున్నారని సమాచారం తెలియడంతో సాయంత్రం ఐదు గంటల నుంచే అధిక సంఖ్యలో జనం బారులు తీరారు. జగన్ రాక ఆలస్యమైనప్పటికీ మహిళలు, వృద్ధులు, యువత రాత్రి వరకూ ఎదురుచూసి స్వాగతం పలికారు.శ్రీకాకుళం అర్బన్: జగన్ మోహన్‌రెడ్డి సోమవారం రాత్రి శ్రీకాకుళంలోని ఆర్అండ్ బీ అతిథి గృహానికి చేరుకున్నారు. జిల్లాలో నష్టపోయిన తుపాను బాధితులున మంగళవారం పరామర్శించనున్నారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి సుజయ్‌కృష్ణ రంగారావు, పార్టీ హై పవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం, పార్టీ నాయకులు పాలవలస రాజశేఖరం, పాలవలస విక్రాంత్, గొర్లె కిరణ్, ఎం.వి.పద్మా -
సర్వే..శ్వరా!
శ్రీకాకుళం అగ్రికల్చర్: హుదూద్ తుపాను కారణంగా జిల్లాలో పంటలన్నీ కోల్పోయిన అన్నదాతలు ప్రభుత్వం సాయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే.. ప్రభుత్వం మాత్రం కొత్త కొత్త నిబంధనలు.. ఆంక్షలతో వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. హుదూద్ తీరం దాటి పది రోజులవుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనాలు సిద్ధం కాలేదు. ఇప్పటికీ తొలి రోజు అంచనాలనే అధికారులు చెబుతున్నారు.ఇవీ లెక్కలు: వరి 74351 హెక్టార్లు, మొక్కజొన్న 2680, పత్తి పంట 6090, చెరకు 3818, అపరాలు, ఇతర పంటలు 122 హెక్టార్లు వెరసి.. సుమారు 87,151 హెక్టార్లల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అరటి 1,578, కొబ్బరి 1,082 హెక్టార్లు, జీడిమామిడి 376, బొప్పాయి 38, మామిడి 24 మొత్తం 3,758 హెక్టార్లలోనూ నష్టం వాటిల్లిందనేది అధికారుల అంచనాలు. కానీ జిల్లాలో వరి పంట ఒక్కటే 1.50 లక్షల హెక్టార్ల పైబడి నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. అన్ని పంటలూ అధికారుల అంచనాలకు రెట్టింపులోనే ఉన్నాయని ఆవేదనభరితంగా చెబుతున్నారు. అంచనాల కోసం అధికారుల సర్వే మూడు రోజులుగా గ్రామాల్లో నష్టం అంచనాలకు అధికారులు రైతులతో కలిసి వెళ్తున్నారు. అయితే ప్రభుత్వం ఆదేశాల మేరకు జియోగ్రాఫికల్ సర్వే చేపట్టడంతో ఈ ప్రక్రియ నత్తనడక సాగుతోంది. ఇలా అయితే జిల్లాలో పంట నష్టం అంచనాలు పూర్తి కావాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని అధికారులే చెబుతున్నారు. కారణం.. ఒక్కో రైతుకు చెందిన ఒక సర్వే నంబరు వివరాలను అప్లోడ్ చేయడానికి కనీసం అర్ధగంట సమయం పైబడి పడుతోంది. పంట ఎంతమేరకు పోయినా 50శాతం మాత్రమే చూపుతోందని రైతులు చెబుతున్నారు. దీంతో జియెటాకింగ్ విధానంలో పంటనష్టం సర్వే చేయొద్దని పలు గ్రామాల్లో రైతులు అడ్డుకుంటున్నారు. సవాలక్ష ఆంక్షలు పంట నష్టం అంచనాల తయారీకి ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు విధించింది. రైతు ఆధార్ నంబర్, పేరు.. తదితర కుటుంబ వివరాలతోపాటు మొబైల్ నంబరు తదితర అన్ని వివరాలూ అవసరమని పేర్కొంది. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా జియోమెట్రిక్ విధానంలో సర్వేకు వీలుకాదు. సర్వే నంబర్లు విషయానికోస్తే సర్వే నంబరు, మొత్తం విస్తీర్ణం, ఎంత విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది/ఎన్ని మొక్కలకు నష్టం జరిగింది. పంట కేటగిరి, చిన్నా, సన్నకారు రైతా.. పెద్ద రైతా.. పంట నష్టం శాతం ఎంతఅనేవి నమోదు చేయాలి. ఒకే సర్వే నంబరులో వేర్వేరు రైతులు పంటలు వేస్తే ఒకే సర్వే నంబరులో వేర్వేరు రైతులతో జియోటాకింగ్ విధానంలో వారందరికీ ఫోటోలు తీయాలి. అంతేకాకుండా ఒకే సర్వే నంబరులో ఒకే రైతు వేర్వేరు పంటలు వేసినా అప్పుడు కూడా ఒకే రైతు అన్ని పంటల వద్ద ఫొటోలు తీయించాలి. ఇలా చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఉదాహరణకు శ్రీకాకుళం రూరల్ మండలంలో సుమారు 19 వేలకు పైబడి సర్వే నంబర్లున్నారు. ఒక్కో సర్వే నంబరులో సుమారు 10 నుంచి 20 పైబడి సబ్ డివిజన్లుంటాయి. వీటిలో అన్నదమ్ముల వాటాలు, ఇతరత్రా కారణాల వల్ల ఎ, బీ, సీ వంటి విభజనలు జరిగి ఉంటే మరిన్ని ఉంటాయి. వీటన్నంటికీ రైతులను పెట్టి ఫొటోలు తీయాలంటే కష్టమేనని రైతులు తీవ్రస్థాయిలో మథనపడుతున్నారు. వీటితో పాటు బ్యాంకు పేరు, బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంకు ఖాతా నంబరు, అక్షాంశ.. రేఖాంశాలు, ఫొటో ఉండాలి. ఆధార్, ఫోన్ నంబర్లు లేని రైతులు అనేకం జిల్లాలో ఆధార్‌కార్డులు లేని రైతులు అనేకమంది ఉన్నారు. నేటికీ ఆధార్ కార్డుల కోసం త హశీల్దారు కార్యాలయాల చుట్టూ ప్రద క్షణలు చేస్తున్నారు. అలాంటిది ఆధార్ నంబర్లు అంటే ఎలా సాధ్యమవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, సెల్ఫోన్లు లేనివారు లెక్కలేనంతమంది. దీంతో రైతులను మభ్యపెట్టి పరిహారం ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఈ కుయుక్తులు పన్నుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి -
జగన్ హాజరుకు ప్రత్యేక కోర్టు మినహాయింపు
హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత హాజరు మినహారుుంపునకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వారం రోజులుగా జగన్ హుదూద్ తుపాను బాధితులను పరామర్శిస్తున్నారని, మరికొన్ని రోజులు అక్కడే ఉంటారని, ఈ నేపథ్యంలో మంగళవారం కోర్టు విచారణకు జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నివ్వాలని ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి ఈ ఉత్తర్వులిచ్చారు. -
విశాఖ పునర్నిర్మాణానికి మాస్టర్‌ప్లాన్
ప్రపంచబ్యాంకు, ఏడీబీ నుంచి నిధులకు ప్రయత్నం: ఏపీ సీఎం చంద్రబాబు * ఆస్తి నష్టం అంచనాలకు మించి ఉంది * అందరి సహకారంతోనే ఉత్తరాంధ్రను సాధారణ స్థితికి తెచ్చాం * విద్యుత్తు సంస్థలకు నష్టం రూ.1,400 కోట్లుదాకా ఉంది * అంకితభావంతో పనిచేసిన విశాఖ కలెక్టర్, ఉద్యోగులకు అభినందనలు సాక్షి, హైదరాబాద్/విశాఖ రూరల్: హుదూద్ తుపాను ధాటికి పూర్తిగా దెబ్బతిన్న విశాఖ నగర పునర్నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)ల నుంచి నిధులు తెచ్చేందుకు మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తామ ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖను సుందరవనంగా, ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా తయారు చేస్తామని తెలిపారు. ఆదివారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, అనంతరం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తుపాను కారణంగా అంచనాలకు అందనివిధంగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఆయువు పట్టు లాంటి ఆర్థిక నగరం కుదేలైందని, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించిన స్మార్ట్ సిటీ ఇబ్బందుల్లో ఉందని అన్నారు. తుపాను ఓ నగరాన్ని అల్లకల్లోలం చేసిన సంఘటన ఇటీవలి కాలంలో ఎక్క డా లేదన్నారు. 30 లక్షలమంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. త్వరలో తాను ప్రధాని మోదీని కలిసి నగర పునర్నిర్మాణంపై చర్చిస్తానన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు నీతికి మారుపేరని, నిజాయితీ వీరి వారసత్వంలోనే ఉందని కితాబిచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఆరు రోజులపాటు తాను విశాఖలోనే ఉండి ప్రజ లకు ఇబ్బందులు లేకుండా ఎన్ని చేయాలో అన్ని కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తన బాధ్య త నెరవేర్చానని, సంతోషంగా ఉందని చెప్పారు. మళ్లీ మంగళవారం రాత్రికి విశాఖ వస్తానని, రెండు రోజులిక్కడే ఉండి పరిస్థితులను పూర్తిగా చక్కదిద్దుతానని అన్నారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, పశ్చి మబెంగాల్ రాష్ట్రాలతోపాటు అధికార యం త్రాంగం, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో తుపాను నష్టం నుంచి ఉత్తరాంధ్ర తేరుకునేలా చేయగలిగామని చెప్పారు. తుపాను వచ్చిన రెండోరోజే ప్రధాని మోదీ విశాఖకొచ్చి ప్రజలకు భరోసా కల్పించారన్నారు. ప్రభుత్వరంగానికే భారీ నష్టం తుపాను నష్టం ప్రభుత్వ రంగంలోనే భారీగా ఉందన్నారు. ఒక్క విద్యుత్తు శాఖ నష్టమే రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల వరకు ఉందని తెలిపారు. పెనుగాలులకు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిందన్నారు. 30 వేల విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయని, వేలాది ట్రాన్స్ఫార్మర్లు కుప్పకూలాయని, వందలాది సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని చెప్పారు. ఎన్టీపీసీలో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 10 లక్షల సర్వీసు కనెక్షన్లు ఇవ్వగా, ఇంకా 13 లక్షల కనెక్షన్లను పునరుద్ధరించాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు విద్యుత్ సరఫరా చేస్తామని, 22వ తేదీ నాటికి మండల కేంద్రాల్లో, 25వ తేదీకి జిల్లా మొత్తంగా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. విద్యుత్ రాని ప్రాంతాలు, ఏజెన్సీలో 5 లీటర్ల కిరోసిన్ ఇస్తామన్నారు.పరిశ్రమల పునరుద్ధరణకు ఏడుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు చెప్పారు. పచ్చదనానికి ప్రణాళిక విశాఖలో పచ్చదనం పరిరక్షణకు హార్టీకల్చర్ నిపుణులతో ప్రణాళిక రూపొందిస్తామని సీఎం తెలిపారు. సోమవారం నుంచి చెట్లను ప్రూనింగ్ చేస్తామని చెప్పారు. అందమైన ల్యాండ్ స్కేపింగ్, తుపాన్లను తట్టుకొనేలా చెట్లను వేయడానికి ముంబై నుంచి కన్సల్టెంట్లు వచ్చారని అన్నారు. విశాఖ జిల్లాలో 13 లక్షల కుటుంబాలకు నిత్యావసరాలను అందిస్తామని చెప్పారు. ముకేష్ అంబానీ రూ.11 కోట్ల విరాళం తుపాను బాధితుల సహాయార్థం రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ రూ.11 కోట్లు విరాళంగా ప్రకటించినట్లు సీఎం వెల్లడించారు. 23న కాగడాల ర్యాలీ తుపాను చేసిన గాయాన్ని మరచిపోయేందు కు, విశాఖవాసుల్లో ఆత్మవిశ్వాసం నింపేం దుకు ఈ నెల 23న ఆర్కే బీచ్‌లో ‘తుపాను ను జయిద్దాం’ నినాదంతో కాగడాల ర్యాలీ నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు. పరిస్థితులు చక్కబడ్డాక విశాఖ పునరుద్ధరణకు కృషి చేసిన ఇతర రాష్ట్రాల అధికారులు, సిబ్బందితో భారీ అభినందన సభ నిర్వహిస్తామని చెప్పారు. ఇతర జిల్లాలవారికి విందు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ యువరాజ్‌ను ఆదేశించారు. సహాయక పనుల్లో కష్టపడిన వారిని గుర్తించి అవార్డులిచ్చి సత్కరిస్తామన్నారు. -
హుదూద్ నష్టం రూ. 65 వేల కోట్లు!?
ప్రభుత్వ, ప్రైవేటు, సేవా రంగాల ఆస్తులకు కలిగిన నష్టం విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలను కుదుపు కుది పేసిన హుదూద్ తుపాను కలిగించిన నష్టం అంచనాలకు అందకుండా ఉంది. నష్టా న్ని అంచనాకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తోంది. కాగా హుదూద్ వల్ల కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, సేవా రంగ, ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టంపై ఇప్పటికే ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చింది. తుపాను వల్ల విశాఖపట్నంతోపాటు నాలుగు జిల్లాల్లో 44 మండలాలు దెబ్బతిన్నాయి. అన్నింటా కలిపి దాదాపు రూ.65వేలకోట్లకుపైగా భారీ నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. -
వైఎస్సార్ ఫౌండేషన్ ‘తుపాను నిధి’కి రూ.15 లక్షల విరాళం
హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తుపాను బాధితుల సహాయ నిధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ రూ.15 లక్షలు విరాళం అందజేశారు. ఈ మేరకు శనివారం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు చెక్కు అందజేశారు. - సాక్షి, హైదరాబాద్ -
మరో 3 రోజుల్లో విశాఖకు 80% విద్యుత్తు
-
నేడు జిల్లాలో జగన్ పర్యటన
విశాఖపట్నం సిటీ: హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయన శనివారం అనకాపల్లి దరి తుంపాల గ్రామంలో తుపాను బీభత్సానికి పాడైన చెరకు తోటలను సందర్శిస్తారు. రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారు. తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. పాడేరు దరి మోదపల్లి, ఇరడాపల్లిలోని కాఫీ తోట లు, అరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని నందివలస ప్రాంతాల్లో బాధితులను పరామర్శిస్తారు. తుపాను వల్ల గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవాలని ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారని, జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(కార్యక్రమాలు) తలశిల రఘురాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఉద్యోగ జేఏసీ రూ. 125 కోట్ల విరాళం
హైదరాబాద్: హుదూద్ తుపాను కారణంగా సర్వం కోల్పోయిన బాధితుల్ని ఆదుకునేందుకు ఏపీలోని ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్‌దారులు కలిపి మొత్తం సుమారు రూ. 125 కోట్ల విరాళాన్ని ఇస్తున్నామని జేఏసీ నేతలు ప్రకటించారు. ఉద్యోగుల రెండ్రోజుల మూలవేతనాన్ని సీఎం రిలీఫ్‌ఫండ్‌కు అందిస్తున్నట్లు ఉద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ పి.అశోక్‌బాబు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.