తక్షణం కేంద్ర సాయం అందుతుంది
విశాఖలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి
విశాఖపట్నం/విజయనగరం అర్బన్: హుదూద్ తుపాను తాకిడితో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రను ఆదుకునేలా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన కేంద్ర సాయం తక్షణం అందుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఎక్కువగా ఉందని, ఈసారి ఉత్తరాంధ్ర కోలుకోలేని విధంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తంచేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు బుధవారం విశాఖపట్నం వచ్చిన ఆయన విశాఖ కలెక్టరేట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
శాఖలవారీగా నష్టం, పునర్నిర్మాణానికి ఎంత సమయం పడుతుందనే అంశాలపై రెండున్నర గంటలపాటు సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుపాను బాధితులకు అండగా ఉండేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. దీపావళి పండుగైనా తాను రెండురోజులపాటు ఇక్కడే ఉండేందుకు వచ్చానన్నారు.