బాధితులకే నేరుగా పరిహారం: బాబు
హుదూద్ తుపాను బాధితులకు పరిహారాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని, మధ్యవర్తుల ప్రమేయం ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తుపాను నష్టాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు ఇప్పటికే 152 బృందాలను అన్ని ప్రాంతాలకు పంపామన్నారు. మొత్తం 500 ట్యాబ్‌లను ఈ బృందాలకు ఇచ్చి ఆస్తి నష్టాలను ఫొటో, వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశించామని చెప్పారు. ఆస్తి నష్టం వివరాలను డాక్యుమెంట్ రూపంలో హుదూద్ తుపాను పోర్టల్‌లో ఉంచుతామన్నారు. ఈ సర్వే వివరాలను పోర్టల్‌లో చూడవచ్చని, పొరపాట్లున్నా, అర్హులైన బాధితులు జాబితాలో లేకపోయినా ఈ వెబ్‌సైట్ ద్వారానే ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. విద్యుత్, తాగు నీరు, రోడ్డు రవా ణా, సమాచార వ్యవస్థల పునరుద్ధరణలో ఆశించిన ప్రగతి కనిపిస్తోందన్నారు. రైవాడ కాల్వకు గండిపడటంతో పాటు ముఖ్యమైన పాయింట్లలో పైపులు దెబ్బతిన్నందువల్ల విశాఖ నగరంలో పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయలేకపోయామన్నారు. శనివారం సాయంత్రానికి పనులు పూర్తి చేసి అన్ని ప్రాంతాలకూ నీరిస్తామన్నారు. నగరంలో అన్ని సెల్‌ఫోన్ల సిగ్నల్స్‌ను పునరుద్ధరించామని, ఎయిర్‌టెల్ 30 నిమిషాల ఉచిత టాక్ టైంతో పాటు క్రెడిట్ ప్రాతిపదికన రూ. 50ల టాక్ టైమ్‌ను వినియోగించుకునే వెసులుబాటు కల్పిం చిందని చెప్పారు. తుపాను సహాయక చర్యలను పర్యవేక్షించే క్రమంలో తాను కొందరితో పరుషంగా మాట్లాడానని, తర్వాత క్షమాపణ చెబుతానని బాబు అన్నారు.
నా మాటలు నమ్మితేనే గిరిజనుల అభివద్ధి: బాబు
పాడేరు: గిరిజనులు తన మాట నమ్మితేనే బాగుపడతారని చంద్రబాబు చెప్పారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రచారాలు నమ్మవద్దని అన్నారు. గిరిజనులకు మంచి చేసే కార్యక్రమాలనే చేపడతానని తెలిపారు. కొండ దిగువన ఉన్న గిరిజనులు అంగీకరిస్తే వారిని ఇతర ప్రాంతాలకు తరలించి మోడల్ కాలనీలు నిర్మించి ఇస్తానని చెప్పా రు. ఏజెన్సీలో పరిశ్రమలు ఏర్పడితే మరింత అభివృద్ధి సాధ్యమౌతుందన్నారు. టూరిజం అభివృద్ధి జరిగితే గిరిజనులకు మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. ఏజెన్సీలో కాఫీ సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. తుపాను నష్టాన్ని పరిశీలించేందుకు చంద్రబాబు శుక్రవారం పాడేరు ప్రాంతంలో పర్యటిం చారు. ఏజెన్సీవ్యాప్తంగా 3 కోట్ల సిల్వర్ ఓక్ విత్తనాలను అందుబాటులోకి తెస్తామన్నారు. దెబ్బతిన్న కాఫీ తోటల్లో 11 ఏళ్లుగా కాపు ఉన్నవాటికి ఎకరాకు రూ.25 వేలు, 6 నుంచి 10 ఏళ్లలోపు వాటికి రూ.15 వేలు, 1 నుంచి 6 ఏళ్ల లోపు తోటలకు రూ.10 వేలు పరిహారాన్ని ప్రకటించారు.
విశాఖ నగరానికి కొత్త పేరు
విశాఖ నగరానికి కొత్త పేరు పెట్టే ఆలోచన ఉందని చంద్రబాబు అన్నారు. సరైన పేరు సూచించాలని కోరా రు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు సింగపూర్ నుంచి ఒక బృందం శనివారం సాయంత్రం వస్తోందన్నారు. పట్టణంలో దెబ్బతిన్న చెట్లను ప్రత్యేక ట్రీట్‌మెంట్ పద్ధతిలో ప్రూనింగ్ చేయించి పచ్చదనాన్ని పునరుద్ధరిస్తామన్నారు. భూగర్భ పైపులైన్ వ్యవస్థ ద్వారా విద్యుత్, గ్యాస్, డ్రెయినేజీ, తాగు నీటి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఎంత చేసినా కొందరు విమర్శిస్తూనే ఉన్నారన్నారు. ‘రాహుల్‌గాంధీ వస్తారట! ఇప్పుడెందుకు?’ అన్నారు.