అంతటా అప్రమత్తం
- తొమ్మిది ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
- ప్రత్యేకాధికారుల నియామకం
- కలెక్టర్ రఘునందన్‌రావు వెల్లడి
మచిలీపట్నం : హుదూద్ తుపాను ప్రభావంతో ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు శనివారం తెలిపారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. తుపాను పరిస్థితులను అంచనా వేసి రక్షణ చర్యలు తీసుకునేందుకు కలెక్టరేట్, బందరు ఆర్డీవో కార్యాలయంతోపాటు అన్ని ప్రభావిత మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆయా మండలాలకు నియమించిన ప్రత్యేకాధికారులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. తీరప్రాంతంలోని 53 పంచాయతీలు, వాటిలోని 130 శివారు గ్రామాలు తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో 88,257 మంది జనాభా ఉన్నారని పేర్కొన్నారు. తుపాను ప్రభావం అధికంగా ఉండి నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తే 78 పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.
తుపాను ప్రభావిత గ్రామాల్లో బియ్యం, కిరోసిన్‌తో పాటు నిత్యావసర సరుకులను సిద్ధం చేశామని కలెక్టర్ వివరించారు. గ్రామ స్థాయిలో టీమ్‌లను ఏర్పాటు చేసి ఇన్‌చార్జ్‌లను నియమించామని, సెల్‌ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు వారి నుంచి సమాచారం సేకరిస్తామన్నారు. తుపాను ప్రభావంతో గ్రామాల్లోకి నీరు చొచ్చుకురావటంతోపాటు పెనుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలితే వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రహదారులు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేస్తామన్నారు.
తుపాను ప్రభావిత గ్రామాల్లో తాగునీటి ట్యాంకులను నింపామని, పారిశుద్ధ్య చర్యల కోసం బ్లీచింగ్ నిల్వ చేసినట్లు వివరించారు. హుదూద్ తుపాను తీరం దాటే వరకు సముద్రంలో అలల ఉధృతి అధికంగా ఉంటుందని, మంగినపూడి బీచ్, హంసలదీవి బీచ్‌లకు పర్యాటకులను అనుమతించబోమని ఆయన చెప్పారు. ఈ బీచ్‌ల వెంబడి పోలీసు గస్తీని ఏర్పాటు చేశామని తెలిపారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులను తిరిగి రప్పించామని, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ సూచించారు.
మచిలీపట్నంలో ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక
హుదూద్ ప్రభావం పెరగడంతో మచిలీపట్నంలోని గిలకలదిండి హార్బర్ వద్ద శనివారం ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. గిలకలదిండి హార్బర్, మంగినపూడి బీచ్‌లలో చేపల వేటకు ఉపయోగించే బోట్లను నిలిపి ఉంచారు. తుపాను పరిస్థితులపై పోలీసులను అప్రమత్తం చేసేందుకు ఎస్పీ జి.విజయకుమార్ కృత్తివెన్ను తదితర గ్రామాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో చేపలవేటకు ఉపయోగించే వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
విద్యుత్ అధికారులు అప్రమత్తం
హుదూద్ తుపాను వల్ల తీవ్ర ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు చెప్పడంతో విజయవాడ నుంచి ఐదుగురు ఏఈలు, 50 మంది సిబ్బందిని విశాఖపట్నం పంపారు. అవసరమైతే సోమవారం ఉదయం మరికొందరిని పంపడానికి సిద్ధంగా ఉన్నారు. తుపాను కారణంగా మచిలీపట్నంతోపాటు జిల్లాలోని తీరప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేందుకు సిబ్బందిని, సామగ్రిని అందుబాటులో ఉంచారు. ప్రజలకు సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ మోహన్‌కృష్ణ ‘సాక్షి’ కి తెలిపారు.