ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: అమ్మహస్తం పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రెండు నెలలుగా పేదలకు తొమ్మిది రకాల వస్తువులు అందటం లేదు. కేవలం బియ్యం, కిరోసిన్, చక్కెర మాత్రమే సరఫరా అవుతోంది. మార్కెట్‌లో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో గత ప్రభుత్వం 2013 ఏప్రిల్‌లో అమ్మహస్తం పథకం ప్రవేశపెట్టింది. రూ.185కే తొమ్మిది రకాల సరుకులను చౌకడిపోల ద్వారా తెల్లకార్డు దారులకు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. తొమ్మిది రకాలలో అరకిలో పంచదార, పామాయిల్ ప్యాకెట్, కిలో కందిపప్పు, కిలో గోధుమలు, గోధుమపిండి, 250 గ్రాముల కారంపొడి, అరకిలో చింతపండు, 100 గ్రాముల పసుపు, కిలో ఉప్పు ప్యాకెట్ ఉంటాయి. నిత్యవసర వస్తువులను ప్రభుత్వ సరఫరా చేయక, ఇటు బయట ధరలు తగ్గక పేదలు అల్లాడిపోతున్నారు.
ఈ పథకం ప్రారంభం నుంచే అభాసుపాలవుతోంది. నాణ్యత లేని చింతపండు, కందిపప్పు, పురుగులు పట్టిన గోధుమపిండి సరఫరా చేశారు. గతంలో కూడా రెండు నెలల వరకు సరుకులు సక్రమంగా ఇవ్వకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. సరుకులకు అలాట్‌మెంట్ మాత్రం అధికారులు ఇస్తున్నారు. రెండు నెలలుగా గోదాముల్లో ఒకటి, రెండు సరుకులుంటున్నాయి తప్పితే పూర్తి స్థాయిలో ఉండటం లేదు. గతనెలలో కొన్ని మండలాలకు అసలు సరుకులే అందని పరిస్థితి ఉంది. మరికొంతమంది డీలర్లకు నెల చివరి వరకు సరుకులు అందడం లేదు. కేవలం పంచదార, కిరోసిన్, బియ్యం మాత్రమే ఉన్నాయన్న సమాధానం డీలర్ల నుంచి వినపడుతోంది.
జిల్లాలో 2,085 పైగా చౌరధరల దుకాణాలున్నాయి. ఒంగోలు డివిజన్లో 924, కందుకూరు డివిజన్లో 750, మార్కాపురం డివిజన్లో 432 చౌకధరల దుకాణాలున్నాయి. 8,90,507 మంది కార్డుదారులుండగా వాటిలో 6,73,999 తెల్లకార్డుదారులున్నారు. వీరిలో రెండొంతులకు పైగా రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలున్నాయి. వీరంతా ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న నిత్యవసర వస్తువులపై ఆధార పడి జీవిస్తున్నారు. అయితే రెండు నెలలుగా పథకం సక్రమంగా అమలు కావడం లేదు. అసలు సరుకులు వచ్చేదీ లేనిది అధికారుల నుంచి స్పష్టత లేదని డీలర్ల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
డీలర్లు కేవలం బియ్యానికి మాత్రమే డీడీలు తీసినట్లు డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రస్తుతం బియ్యం మాత్రం ట్రాన్స్‌పోర్టు అవుతున్నాయన్నారు. అమ్మహస్తం సరుకులపై పౌరసరఫరాల సంస్థ డీఎం పీవీ కొండయ్య దృష్టికి తీసుకురాగా..గోధుమపిండి, కందిపప్పు, సాల్ట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పామాయిల్ రెండు నెలలుగా రావడంలేదన్నారు. పసుపు, కారం, చింతపండు అనుకున్న మేర డిమాండ్ లేని కారణంగా అందుబాటులో ఉంచలేకపోయామని తెలిపారు.
రిక్తహస్తం
Published Thu, Jun 5 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM
Advertisement