amma hastam scheme
-
‘అమ్మహస్తం’ ఎత్తివేత!
* వచ్చే నెల నుంచి సరుకులు ఇవ్వబోమని చెబుతున్న అధికారులు * దాని స్థానంలో కొత్త పథకమంటూ కాలయాపన సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: తెల్ల రేషన్ కార్డుల ద్వారా పేదలకిచ్చే నిత్యావసర వస్తువులను పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అమల్లో ఉన్న అమ్మహస్తం పథకం కింద ఇస్తున్న సరుకుల్లో చాలావాటికి కోత పెట్టగా వచ్చే నెల నుంచి దాన్ని పూర్తిగా ఎత్తివేయనుంది. అమ్మహస్తం పథకం కింద నాలుగు నెలల వరకూ రూ.185కి అర కేజీ పంచదార, 100 గ్రాముల పసుపు, పావు కేజీ కారం, కేజీ చొప్పున గోధుమలు, గోధుమపిండి, కందిపప్పు, ఉప్పు, పామాయిల్, అర కేజీ చింతపండు పంపిణీ చేసేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెమ్మదిగా తగ్గిస్తూ వచ్చింది. నాలుగు నెలలుగా పామాయిల్ పంపిణీ పూర్తిగా నిలిపివేసింది. ఉప్పు, పసుపు, కారం ఇతర వస్తువులకూ కోత పెట్టింది. చివరికి ఈ నెలలో కేవలం పంచదార, కారం మాత్రమే ఇచ్చారు. కొన్నిచోట్ల పంచదార, ఉప్పు ఇతర వస్తువులు కూడా ఇచ్చారు. వచ్చే నెల నుంచి అమ్మహస్తం పథకం ఉండదని, సరుకులు ఏమీ ఇవ్వమని రేషన్ డీలర్లకు పౌరసరఫరాల శాఖాధికారులు చెబుతున్నారు. కొత్త పథకం పేరుతో కాలయాపన అమ్మహస్తం పథకం స్థానంలో ఎన్టీఆర్ పేరుతో మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసింది. అయితే ఆ దిశగా ఇప్పటివరకూ ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. కనీసం దానిపై ఎటువంటి కసరత్తు కూడా జరగలేదు. దీంతో వెంటనే కొత్త పథకం ప్రవేశపెట్టే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ కొత్త పథకం అమలు చేసినా అమ్మహస్తం తరహాలో అన్ని సరుకులను ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కేవలం ఎప్పటి మాదిరిగా ఇచ్చే బియ్యం, కిరోసిన్‌తోపాటు చక్కెర, కందిపప్పుకే కొత్త పథకాన్ని పరిమితం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలున్న సరుకులను ఇప్పటివరకూ తక్కువ ధరకు పొందుతున్న పేదలు మళ్లీ ఇబ్బందుల్లో పడక తప్పేలా లేదు. పనికి రాకుండా పోయిన కారం, చింతపండు మరోవైపు పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా గోదాముల్లో నిల్వ ఉంచిన 71.9 మెట్రిక్ టన్నుల కారంపొడి, 33.5 మెట్రిక్ టన్నుల చింతపండు ఏమాత్రం పనికి రాకుండా పోయింది. 2013 మే, జూన్ నెలల కోటాకు సంబంధించి పౌర సరఫరాల కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారుల వినియోగానికి మించి కారంపొడి, చింతపండు, పసుపును కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ ఉంచారు. ఇందులో భాగంగానే అప్పట్లో 94.90 మెట్రిక్ టన్నుల కారం పొడి, 81.20 మెట్రిక్ టన్నుల చింతపండు, 37.10 మెట్రిక్ టన్నుల పసుపును కొనుగోలు చేశారు. వీటిని సకాలంలో బయట మార్కెట్లో విక్రయించాలనే ఆలోచన రాకపోవడంతో ఫలితంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. చెడిపోకుండా నిల్వ ఉన్న మరో 23 మెట్రిక్ టన్నుల కారంపొడి, 47.7 టన్నుల చింతపండు, 1.1 మెట్రిక్ టన్నుల పసుపును విక్రయించేందుకు ఇటీవల టెండర్ వేశారు. స్పందన లేకపోవడంతో మరోసారి టెండర్‌కు కసరత్తు చేస్తున్నారు. -
‘అమ్మహస్తం’.. అస్తవ్యస్తం!
ఘట్కేసర్ టౌన్: అమ్మహస్తం పథకం ప్రజలకు మొండిచెర్య చూపుతోంది. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు రూ. 185కే ఉప్పు, కారం, చింతపండు, గోధుమలు, గోధుమపిండి, పామాయిల్, పంచదార, కందిపప్పు, పసుపు సరుకులను అందించాలని గత ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఉగాది పండుగకు ప్రారంభమైన ఈ పథకం ఏడాదిలోపే నీరుగారిపోరుుంది. తొమ్మిది సరుకులు అందించాల్సి ఉన్నా కేవలం పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పామాయిల్, కందిపప్పు, గోధుమలు అందడం లేదు. ఆరు నెలలుగా పామాయిల్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. నాణ్యత లేని సరుకులు.. అవ్ము హస్తం పథకం కింద ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత కరువైంది. దీంతో లబ్ధిదారులు ఈ సరుకులను తీసుకెళ్లడం లేదు. కాలం చెల్లిన చింతపండు, పురుగులు తిరుగుతున్న గోధుమపిండి, వినియోగించలేని విధంగా ఉన్న కారం పొడి, పసుపు, ఉప్పు సరుకులు సరఫరా అవుతుండటంతో వినియోగదారులు రేషన్ దుకాణాలకు బదులు బయుట సరుకులు కొనుగోలు చేయుడంతో పేదలకు ఆర్థికభారం తప్పడం లేదు. రేషన్ దుకాణాల్లో కిలో గోధుమలు రూ.7కు లభిస్తుండగా మార్కెట్లో రూ. 15, పామాయిల్ రూ.40కిగాను రూ. 65-70లు, కందిపప్పురేషన్ దుకాణంలో రూ. 50లు ఉండగా మార్కెట్లో రూ. 70- 75లకు లభిస్తోంది. వూర్కెట్లో సరుకులు కొనుగోలు చేస్తుండటంతో జిల్లా లో ఉన్న 10.8 లక్షల తెల్ల రేషన్ కార్డు వినియోగదారులపై రూ. కోట్లాడి భా రం పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని పేదలు కోరుతున్నారు. -
రేషన్‌లో పామాయిల్ పరేషాన్..!
సబ్సిడీ భరించేందుకు కేంద్రం విముఖత నేడు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్: రేషన్ సరుకుల్లో పామాయిల్‌ను కొనసాగించాలా, వద్దా అన్న అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పామాయిల్ సరఫరాతో ప్రతినెలా పడుతున్న రూ.15 కోట్ల భారాన్ని భరించేందుకు కేంద్రం విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో దాన్ని భరించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ముందుకు వస్తుందా అనేది సందిగ్ధంగా మారింది. దీనిపై బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశ ం ఉంది. సమైక్య రాష్ట్రంలో అమ్మహస్తం పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతినెలా రూ.185కే తొమ్మిది రకాల సరకుల పంపిణీ జరిగేది. ఈ పథకం కింద పంపిణీ చేసే లీటర్ పామాయిల్ సబ్సిడీ భారాన్ని 2013 అక్టోబర్ వరకు భరించిన కేంద్రం ఆ తరువాత చేతులెత్తేసింది. దీంతో ఆ భారం రాష్ర్ట ప్రభుత్వంపై పడింది. తెలంగాణలోనే 15 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించింది. అమ్మహస్తం పేరు మార్పు.. సరుకుల కుదింపు? బుధవారం కేబినెట్ భేటీలో ప్రధానంగా ‘అమ్మ హస్తం’ పథకం పేరు మార్పు, పథకంలో అందజేస్తున్న సరుకుల కుదింపుపైనా చర్చ జరుగవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం పథకంలో భాగంగా పంపిణీ చేస్తున్న సరుకుల్లో చింతపండు, కారం, పసుపుపై వినియోగదారుల నుంచి పెద్దగా డిమాండ్ లేదు. 20 శాతం మంది మాత్రమే వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఈ నేపథ్యంలో వీటిని పథకం నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న చక్కెరను అరకేజీ నుంచి కేజీకి, గోధుమలను కిలో నుంచి నుంచి కిలోన్నరకు పెంచే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. -
రిక్తహస్తం
ఆదిలాబాద్ టౌన్ : అమ్మహస్తం పథకం నిలిచింది. వినియోగదారులకు పంపిణీ చేయాల్సిన తొమ్మిది రకాల సరుకుల జాడ లేదు. రూ.185 ధరకే నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు తలపెట్టిన అమ్మహస్తం పథకానికి ప్రభుత్వం మంగళం పాడింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే సాధారణ సరుకులైన బియ్యం, కిరోసిన్, చక్కెరతోపాటు అదనంగా కారం, పసుపు, చింతపండు, పామాయిల్, గోధుమపిండి, గోధుమలు, ఉప్పు తదితర సరుకులు రూ.185కే అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కిరణ్ హంగు ఆర్భాటాలతో ప్రవేశపెట్టిన పథకం ప్రస్తుతం కథ ముగిసింది. దీంతో అదనపు సరుకుల పంపిణీ పూర్తిగా నిలిచిపోవడంతో సాధారణ సరుకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అటకెక్కినట్టేనా! జిల్లాలో 7.05 లక్షల మంది రేషన్‌కార్డుల దారులు ఉన్నారు వీరందరికి నెలవారీగా సరకులు పంపిణీ చేస్తున్నారు. అమ్మహస్తం పథకంలో భాగంగా ఈ కార్డుదారులకు ప్రతినెల తొమ్మిది రకాల సరుకు అందజేయాలి. కాగా అమ్మహస్తం సరుకుల్లో నాణ్యత కొరవడంతో కార్డుదారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. నాణ్యమైన సరుకులు అందిస్తామంటూ అప్పటి ప్రభుత్వం, నేతలు ప్రగల్భాలు పలికినప్పటికీ క్షేత్రస్థాయిలో సరుకులపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఫలితంగా రేషన్ డీలర్లు క్రమంగా ఈ సరుకులను పక్కన పెట్టారు. కేవలం బియ్యం, చక్కెర, పామాయిల్ సరుకులకు మాత్రమే డీడీలు కట్టి స్టాకు తెప్పించుకోవడంతో మిగతా సరుకుల ప్రాధాన్యం క్రమంగా పడిపోయింది. కేవలం బియ్యం, చక్కెర, పామాయిల్ మాత్రమే అందజేస్తూ వచ్చారు. బహిరంగ మార్కెట్లో ఈ వస్తువుల ధరలు రెట్టింపు ఉండడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిల్వలు ముక్కిపోయి అమ్మహస్తం పథకం కింద జిల్లాకు కేటాయించిన సరుకులు చింతపండు, కారం, ఉప్పు, గోధుమలు, గోధుమపిండి తదితర సరుకులకు డిమాండ్ లేకుండపోయింది. రేషన్ డీలర్లు సరుకులు తీసుకపోవడంతో వాటిని పౌరసరఫరాల శాఖ అధికారులు గోదాంల్లోనే నిల్వ ఉంచారు. దీంతో కొన్ని సరకులు ముక్కిపోవడంతో ప్రభుత్వానికి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెలకు సంబంధించి జిల్లాకు వచ్చిన స్టాకులో చింతపండు ఈనెల 14,848 ప్యాకెట్లు, పసుపు నిల్వ 130, కారం 1,92,764, ఉప్పు 64 వేలు, చక్కెర 90 వేలు, గోధుమలు 44 వేలు, గోధుమపిండి 50 వేల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సరుకులన్నీ కార్డుదారులందరికీ సరిపోవు. కేవలం బియ్యం, చక్కెర మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. వినియోగదారులు సరుకుల కోసం అడిగితే స్టాక్ లేదంటూ తప్పించుకుంటున్నారు. మూడు నెలల నుంచి పామాయిల్ బంద్ రేషన్ కార్డుదారులకు కిలో చొప్పున అందించే పామాయిల్ కొరత జిల్లాలో తీవ్రంగా ఉంది. మూడు నెలల నుంచి కార్డుదారులకు అందడంలేదు. జిల్లాకు 7.05 లక్షల కార్డుదారులకు పామాయిల్ ప్యాకెట్లు అవసరం. ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డు దారులకు పామాయిల్ పంపిణీ కావడం లేదు. తాజాగా ఈ నెలలో కూడా పామాయిల్ సరాఫరా నిలిచింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అమ్మహస్తం సరుకులు తీసుకోవడం లేదు.. - జిల్లా పౌరసరఫరాల మేనేజర్ అమ్మహస్తం సరుకులను కార్డుదారులు తీసుకెళ్లడం లేదు. దీంతో డీలర్లు ఆ వస్తువులకు సంబంధించి డీడీలు కట్టడంలేదు. గోదాముల్లో ఉన్న సరుకులను డీడీలు కట్టిన వారికి పంపిణీ చేస్తున్నాం. మూడు నెలల నుంచి పామాయిల్ రావడం లేదు. పామాయిల్ వచ్చిన వెంటనే వినియోగదారులకు అందజేస్తాం. -
అమ్మహస్తానికి మంగళం!
సాక్షి, రాజమండ్రి :రాష్ర్టం విడిపోయింది.. ప్రభుత్వం మారిపోయింది.. ఇక ఎలాగూ ఈ పథకం ఎత్తివేస్తారని అనుకున్నారో ఏమో! ఎటువంటి ఉత్తర్వులూ లేకుండానే అమ్మహస్తం పథకానికి అధికారులు చెల్లుచీటీ చెప్పేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించింది. దీనికింద మొత్తం తొమ్మిది సరుకులు ఇవ్వాల్సి ఉండగా.. మూడు నెలలుగా రెండు మూడు సరుకులు మాత్రమే పంపిణీ చేశారు. చివరకు ఈ నెల నుంచి మొత్తం పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు. తెల్లకార్డుదారులకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు చౌకగా అందించడం అమ్మహస్తం పథకం లక్ష్యం. దీని ద్వారా పామాయిల్ లీటరు; కందిపప్పు, గోధుమలు, గోధుమపిండి, ఉప్పు కిలో చొప్పున; పంచదార ఒకటిన్నర కిలో; కారం పావుకిలో; పసుపు 100 గ్రాములు; చింతపండు అరకిలో కలిపి రూ.185కే ఇస్తున్నట్టు ప్రకటించారు. సకాలంలో అన్ని సరుకులూ ఇవ్వకపోవడం, ఇచ్చినవి కూడా నాణ్యత లేకపోవడంతో ప్రవేశపెట్టిన ఆరు నెలలకే ఈ పథకం నీరుగారింది. తొలుత కారం, పసుపు, చింతపండు పంపిణీ నిలుపు చేశారు. గత మార్చి నుంచి ఉత్పత్తి కొరత పేరుతో పామాయిల్ పంపిణీ పూర్తిగా నిలిపివేశారు. మరోపక్క పురుగులు పట్టిన గోధుమ పిండి, గోధుమలు పంపిణీ చేస్తుండడంతో వాటిని తీసుకునేందుకు కార్డుదారులు నిరాకరించారు. ప్రస్తుతం కందిపప్పు, పంచదార మినహా మిగిలిన ఏడు రకాల సరుకుల పంపిణీని పూర్తిగా నిలిపివేశారు. ఇక మావల్ల కాదు.. ఇకపై అమ్మహస్తం సరుకులు పంపిణీ చేయలేమని పౌర సరఫరాల అధికారులు చేతులెత్తేశారు. పామాయిల్ కూడా మరో రెండు మూడు నెలల వరకూ వచ్చే అవకాశాలు లేవని వారు చెబుతున్నారు. తమ డిపోలో కార్డుల సంఖ్య ఆధారంగా కావల్సిన సరుకుల కోసం డీలర్లు నెలాఖరులోగా పౌర సరఫరాల శాఖ పేరిట ముందుగా డీడీలు తీయాలి. ఆ సొమ్ము అందిన తరువాత.. తరువాతి నెల మొదటి వారంలో డీలర్లకు సరుకులు పంపిణీ చేస్తారు. కాగా, ‘అమ్మహస్తం’ సరుకులకు సంబంధించి డీడీలు తీయవద్దంటూ ఇప్పటికే డీలర్లకు అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకం ఎత్తివేశారని, ఇకపై కందిపప్పు, పంచదార మినహా మిగిలిన సరుకులు ఇవ్వరని కార్డుదారులకు రేషన్ డీలర్లు చెప్పేస్తున్నారు. కాగా మరోపక్క చౌకబియ్యం పంపిణీపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నేత ఎన్టీ రామారావు కిలో రూ.2 బియ్యం పథకం అమలు చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ పథకాన్ని కార్డుదారులకు భారంగా మార్చేశారు. తొలుత రూ.3.25కు, తరువాత రూ.5కు పెంచేశారు. మహానేత వైఎస్ హయాంలో కిలో రూ.2 బియ్యం అమలు చేశారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతో దీని ధర మళ్లీ పెంచే అవకాశం ఉందని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. -
అమ్మహస్తం ఆగింది!
అదనపు సరుకులకు చెక్ బియ్యం, చక్కెర, గోధుమపిండి, కిరోసిన్ మాత్రమే పంపిణీ డిమాండ్ లేనందునే సరఫరా నిలిచిందంటున్న అధికారులు అతి తక్కువ ధరకే నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు తలపెట్టిన అమ్మహస్తం పథకానికి సర్కారు మంగళం పాడింది. రోజువారీ అవసరాల్లో ప్రధానమైన తొమ్మిది రకాల సరుకులను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అందించే సాధారణ సరుకులైన బియ్యం, కిరోసిన్, చక్కెరతో పాటు అదనంగా కారం, పసుపు, చింతపండు, పామాయిల్, గోధుమపిండి తదితర సరుకులను రూ.185కే అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం హంగు, ఆర్భాటాలతో ప్రవేశపెట్టిన ఈ పథకం కథ ప్రస్తుతం ముగిసింది. దీంతో అదనపు సరుకుల పంపిణీ పూర్తిగా నిలిచిపోవడంతో సాధారణ సరుకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నాలుగు ‘కట్’.. జిల్లాలో 10.78లక్షల రేషన్ కార్డుదారులకు నెలవారీగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అమ్మహస్తం పథకంలో భాగంగా ఈ కార్డుదారులకు ప్రతినెల తొమ్మిది రకాల సరుకులు ఇస్తున్నారు. అయితే అమ్మహస్తం సరుకుల్లో నాణ్యత కొరవడడంతో కార్డుదారులు ఆదినుంచి కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. నాణ్యమైన సరుకులు అంది స్తున్నామంటూ అప్పటి నేతలు ప్రగల్భాలు పలికినప్పటికీ.. క్షేత్ర స్థాయిలో మాత్రం సరుకుల పట్ల తీవ్ర వ్యతి రేకత ఎదురైంది. ఫలితంగా రేషన్ డీలర్లు క్రమంగా ఈ స్టాకును పక్కనపెట్టారు. బాగా డిమాండ్ ఉన్న బియ్యం, కిరోసిన్, చక్కెర, ఆటా, పామాయిల్ సరుకులకు మాత్రమే డీడీలు క ట్టి స్టాకు తెప్పించుకోవడంతో అదనపు సరుకుల ప్రాధాన్యం క్రమంగా పడిపోయింది. నిల్వలు ముక్కిపోయి... అమ్మహస్తం పథకం కింద జిల్లాకు కేటాయించిన కారం, పసుపు, చింతపండు సరుకులకు డిమాండ్ లేకుండా పోయి ంది. ఈ నేపథ్యంలో ఈ స్టాకును రేషన్ డీలర్లు తీసుకోకపోవడంతో వాటిని పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లా గోదాముల్లో నిల్వ చేశారు. దీంతో క్రమంగా ఈ స్టాకు గోదాముల్లో ముక్కిపోయి పాడవడంతో భారీ నష్టమే సంభవించింది. దాదాపు 2లక్షల కారంపొడి ప్యాకెట్లు పాడైనట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అదనపు సరుకుల సంగతి పక్కనబెట్టి సాధారణ సరుకులైన బియ్యం, చక్కెర, కిరోసిన్, గోధుమలు, పిండి మాత్రం పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు 17వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 7వందల మెట్రిక్ టన్నుల గోధుమలు, గోధుమపిండి, 550 మెట్రిక్ టన్నుల చక్కెర కోటాను ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరవేశారు. పామాయిల్ ‘నిల్’.. రేషన్ కార్డుదారులకు కిలో చొప్పున అందించే పామాయిల్‌కు కొరత ఏర్పడింది. పామాయిల్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా నిల్చిపోయింది. జిల్లాలో నెలకు 1,078 మెట్రిక్ టన్నుల పామాయిల్ స్టాకు అవసరం. అయితే ఏప్రిల్ నెలతోనే పామాయిల్ సరఫరాకు కాలం చెల్లడంతో కార్డుదారులకు అందలేదు. ఏప్రిల్ నెలలో అందుబాటులో ఉన్న స్టాకు పంపిణీ చేయగా.. ఆ తర్వాత ఎన్నికల తంతు మొదలు కావడంతో పామాయిల్ కథకు తెరపడింది. తాజాగా ఈ నెలలో కూడా పామాయిల్ పంపిణీ నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై పామాయిల్ సరఫరా ఆధారపడి ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. -
రిక్తహస్తం
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: అమ్మహస్తం పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రెండు నెలలుగా పేదలకు తొమ్మిది రకాల వస్తువులు అందటం లేదు. కేవలం బియ్యం, కిరోసిన్, చక్కెర మాత్రమే సరఫరా అవుతోంది. మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో గత ప్రభుత్వం 2013 ఏప్రిల్‌లో అమ్మహస్తం పథకం ప్రవేశపెట్టింది. రూ.185కే తొమ్మిది రకాల సరుకులను చౌకడిపోల ద్వారా తెల్లకార్డు దారులకు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. తొమ్మిది రకాలలో అరకిలో పంచదార, పామాయిల్ ప్యాకెట్, కిలో కందిపప్పు, కిలో గోధుమలు, గోధుమపిండి, 250 గ్రాముల కారంపొడి, అరకిలో చింతపండు, 100 గ్రాముల పసుపు, కిలో ఉప్పు ప్యాకెట్ ఉంటాయి. నిత్యవసర వస్తువులను ప్రభుత్వ సరఫరా చేయక, ఇటు బయట ధరలు తగ్గక పేదలు అల్లాడిపోతున్నారు. ఈ పథకం ప్రారంభం నుంచే అభాసుపాలవుతోంది. నాణ్యత లేని చింతపండు, కందిపప్పు, పురుగులు పట్టిన గోధుమపిండి సరఫరా చేశారు. గతంలో కూడా రెండు నెలల వరకు సరుకులు సక్రమంగా ఇవ్వకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. సరుకులకు అలాట్మెంట్ మాత్రం అధికారులు ఇస్తున్నారు. రెండు నెలలుగా గోదాముల్లో ఒకటి, రెండు సరుకులుంటున్నాయి తప్పితే పూర్తి స్థాయిలో ఉండటం లేదు. గతనెలలో కొన్ని మండలాలకు అసలు సరుకులే అందని పరిస్థితి ఉంది. మరికొంతమంది డీలర్లకు నెల చివరి వరకు సరుకులు అందడం లేదు. కేవలం పంచదార, కిరోసిన్, బియ్యం మాత్రమే ఉన్నాయన్న సమాధానం డీలర్ల నుంచి వినపడుతోంది. జిల్లాలో 2,085 పైగా చౌరధరల దుకాణాలున్నాయి. ఒంగోలు డివిజన్లో 924, కందుకూరు డివిజన్లో 750, మార్కాపురం డివిజన్లో 432 చౌకధరల దుకాణాలున్నాయి. 8,90,507 మంది కార్డుదారులుండగా వాటిలో 6,73,999 తెల్లకార్డుదారులున్నారు. వీరిలో రెండొంతులకు పైగా రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలున్నాయి. వీరంతా ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న నిత్యవసర వస్తువులపై ఆధార పడి జీవిస్తున్నారు. అయితే రెండు నెలలుగా పథకం సక్రమంగా అమలు కావడం లేదు. అసలు సరుకులు వచ్చేదీ లేనిది అధికారుల నుంచి స్పష్టత లేదని డీలర్ల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. డీలర్లు కేవలం బియ్యానికి మాత్రమే డీడీలు తీసినట్లు డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రస్తుతం బియ్యం మాత్రం ట్రాన్స్‌పోర్టు అవుతున్నాయన్నారు. అమ్మహస్తం సరుకులపై పౌరసరఫరాల సంస్థ డీఎం పీవీ కొండయ్య దృష్టికి తీసుకురాగా..గోధుమపిండి, కందిపప్పు, సాల్ట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పామాయిల్ రెండు నెలలుగా రావడంలేదన్నారు. పసుపు, కారం, చింతపండు అనుకున్న మేర డిమాండ్ లేని కారణంగా అందుబాటులో ఉంచలేకపోయామని తెలిపారు. -
నీరుగారిన అమ్మ హస్తం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అమ్మ హస్తం పథకం ద్వారా చౌకధరకే నిత్యావసర సరుకులు అందుతాయని, వీటితో నెలంతా సాఫీగా గడచిపోతుందని ఆశించిన పేద, బడుగు వర్గాలకు నిరాశే మిగిలింది. సరైన కసరత్తు చేయకుండా గత ప్రభుత్వం హడావుడిగా, ఆర్భాటంగా ప్రారంభించిన ఈ పథకం ఆచరణలో విఫలమవటం వారి పాలిట శాపంగా మారింది. ఏడాది గడిచినా పథకం అమలులో ఎలాంటి మెరుగుదల లేకపోగా.. రానురాను పరిస్థితి దయనీయంగా మారుతుండటంతో రేషన్‌కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పథకం ద్వారా 185 రూపాయలకు కిలో కందిపప్పు, కిలో గోధుమలు, కిలో గోధుమ పిండి, అర కిలో పంచదార, కిలో ఉప్పు, 250 గ్రాముల కారం, అర కిలో చింతపండు, లీటరు పామాయిల్, 100 గ్రాముల పసుపు అందించాలి. జిల్లాలో 7,78,462 తెలుపు రంగు, అం త్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులందరికీ సరుకులు అందించాలి. ఆది నుంచి ఈ పథకం సరిగా అమలు కాలేదు. ప్రారంభంలో 25 శాతం మందికి, రెండో నెల 30 శాతం మంది లబ్ధిదారులకు సరుకులు అందజేశారు. మూడో నెల నుంచి 50 శాతం మందికి అందివ్వాలనుకున్నా.. అలా జరగలేదు. ఏ ఒక్క నెలా పూర్తిగా 9 రకాల సరుకులను అందించలేదు. ప్రస్తుతం పంచదార, కందిపప్పు మాత్రమే అందజేస్తున్నారు. దీనిపై లబ్ధిదారులు మండిపడుతుండటంతో కొన్ని గ్రామాల్లోని డీలర్లు సరుకులు విడిపించడం లేదు. దీనివల్ల వివాదాలు తలెత్తుతున్నాయి. రెండు నెలలుగా జిల్లాకు ఒక్క పామాయిల్ ప్యాకెట్ కూడా రాలేదు, లబ్దిదారులు ప్రధానంగా పామాయిల్‌ను కొనుగోలు చేస్తారు. రానున్న రెండు నెలలు కూడా పామాయిల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొత్తగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని ఏంచేస్తుందనేదానిపై స్పష్టత లేదు. రేషన్‌కార్డుదారులకు కిరోసిన్ కూడా సరిగా అందటం లేదు. జిల్లాకు కేటాయించిన కోటాలో 90 శాతం మాత్రమే విడుదల చేస్తున్నారు. జిల్లాకు 15 లక్షల కిలో లీటర్ల కిరోసిన్ అవసరం కాగా 13 లక్షల కిలోలీటర్లే విడుదల చేస్తున్నారు. దీంతో ముందువచ్చిన వారికి ముందు ప్రాతిపదకన డీలర్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో చాలా గ్రామాల్లో డీలర్లు, లబ్ధిదారుల మధ్య గొడవలు, వివాదాలు రేగుతున్నాయి. రేషన్ సరుకుల పంపిణీకి ఆధార్ నంబ ర్తో తాజాగా మళ్లీ లింకు పెట్టారు. ఆధార్ నంబర్ ఇవ్వనివారికి ఈ నెల కోటా నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఆధార్ నమోదు ప్రక్రియ 85 శాతం మేరే పూర్తయింది. దీంతో మిగిలిన వారికి రేషన్ సరుకులు ఇవ్వటం లేదు. వీరిలో చాలామంది ఆధార్ కేంద్రాల్లో వివరాలు నమోదు చేయించుకున్నా కార్డులు మాత్రం ఇంతవరకు రాలేదు. -
‘అమ్మహస్తం’.. అస్తవ్యస్తం
శంషాబాద్, న్యూస్‌లైన్: ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అమ్మహస్తం పథకం ఏడాది దాటక ముందే అస్తవ్యస్తంగా మారింది. ప్రజలకు అవసరమైన సరకులను సక్రమంగా అందించలేక పోతోంది. నాసిరకం సరుకులు తీసుకోడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో కొన్ని రకాల సరుకులు గోదాములకే పరిమితమవుతున్నాయి. జనవరిలో కార్డుదారులకు ఇవ్వాల్సిన పామాయిల్ ప్యాకెట్లకు మొండిచేయి చూపిన ప్రభుత్వం అప్పట్లో డీలర్లు చెల్లించిన డీడీలను ఫిబ్రవరి నెలకు సర్దుబాటు చేస్తోంది. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన పామాయిల్ కోటాను విడుదల చేయడానికి డీలర్ల నుంచి ఎలాంటి డీడీలను తీసుకోకూడదని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. దీంతో కార్డుదారులకు అందాల్సిన ఒక నెల పామాయిల్ ప్యాకెట్లను పక్కనపెట్టేసినట్లే. పప్పు పరిస్థితి కూడా అలాగే ఉంది. డిమాండ్ ఉన్న చోట కూడా పప్పును సరిగా సరఫరా చేయడం లేదు. పప్పు కోసం రేషన్ డీలర్లు డీడీలను సమర్పించినా ఇంకా కోటా విడుదల కాలేదు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పప్పు కోటా విడుదల ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఆ సరకులు వద్దేవద్దు.. అమ్మహస్తం పథకం ద్వారా అందించే కారంపొడి, పసుపు, చింతపండు తీసుకోడానికి రేషన్ డీలర్లు ససేమిరా అంటున్నారు. ఈ మూ డు వస్తువులు నాసిరకంగా ఉండడంతో దాదా పు మూడునెలలుగా జిల్లాలోని ఆయా గోదాముల్లో సరుకులు మూలుగుతున్నాయి. నాసిరకంగా ఉన్న కారం పొడి గతేడాది జూన్‌లో ప్యా కై ఉన్నాయి. తొమ్మిది నెలల వరకు మాత్రమే వాడాల్సిన కారంపొడి ప్యాకెట్ల గడువు మార్చినెలాఖరుకు ముగియనుంది. ఒక్క శంషాబాద్ గోదాములోనే ఏడు క్వింటాళ్ల కారంపొడి ప్యాకెట్లు మూలనపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కారంపొడి ప్యాకెట్లు పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక పసుపు, చింతపండుల పరిస్థితి అంతే. నాసిరకం సరుకులను జనాలు గుర్తించి దూరం పెడుతున్నా సర్కారు మాత్రం నాణ్యమైన సరుకులు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. -
కిరోసిన్ లేక ప‘రేషన్’
మోర్తాడ్, న్యూస్‌లైన్ : మూడో విడత రబ్చబండలో జారీ చేసిన కొత్త రేషన్‌కార్డుదారులకు కిరోసిన్‌ను సరఫరా చేయడం లేదు. రేషన్‌కార్డుల తయారీలో జాప్యం కారణంగా కార్డుల స్థానంలో కూపన్లను జారీ చేశారు. కిరోసిన్‌కు ప్రత్యేకంగా కూపన్ ఉన్నప్పటికీ సరఫరా చేయడం లేదు. కొత్త రేషన్ వినియోగదారులకు బియ్యం, అమ్మహస్తం సరుకులను సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. కిరోసిన్ కోటాను పెంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉండటంతో ఇప్పట్లో సరఫరా అయ్యే అవకాశం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది నవంబర్ నెలలో నిర్వహించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 80 వేల కొత్త రేషన్‌కార్డులను జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలో 6,51,310 తెల్ల రంగు కార్డులు ఉన్నాయి. ఇందులో ఎల్పీజీ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు నెలకు ఒక లీటర్ కిరోసిన్‌ను పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తోంది. కనెక్షన్లేని వారికి రెండు లీటర్ల కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న తెల్ల రంగు రేషన్‌కార్డు వినియోగదారుల్లో 70 శాతం మం దికి ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. కేవలం 30 శాతం మందికి కనెక్షన్లు లేవు. జిల్లా వ్యాప్తంగా నెలకు ఎనిమిది లక్షల లీటర్ల కిరోసిన్ సరఫరా అవుతుంది. మార్కెట్లో కిరోసిన్ ధర రూ 45 ఉండగా రేషన్ దుకాణాల్లో మాత్రం లీటరుకు రూ15 చెల్లిస్తే లభిస్తుంది. రేషన్ దుకాణాల్లో లభించే కిరోసిన్‌కు డిమాండ్ భారీ గానే ఉంది. కోటా పెంపు కేంద్రం పరిధిలో.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులను జారీ చేసినా సబ్సిడీ కిరోసిన్ కోటాను పెంచడం కేంద్రం పరిధిలో ఉంది. రేషన్‌కార్డుల సంఖ్యను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవనరుల మంత్రిత్వ శాఖకు పంపక పోవడంతో సబ్సిడీ కిరోసిన్ కోటా పెరగలేదు. రేషన్ వినియోగదారుల సంఖ్య పెరిగినప్పుడు అందుకు అనుగుణంగా సబ్సిడీ సరుకుల పరిమాణాన్ని పౌర సరఫరాల శాఖ పెంచా ల్సి ఉంది. బియ్యం, అమ్మహస్తం సరుకుల సంఖ్యను పెంచినా కిరోసిన్ పరిమితి పెరగక పోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. బియ్యం, అమ్మహస్తం సరుకులను పొందడానికి రేషన్‌దుకాణాలకు వస్తున్న వినియోగదారులు కిరోసిన్ విషయమై డీలర్లను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కోటాను పెంచంది తాము ఏమీ చేయలేమని డీలర్లు సమాధానమిస్తున్నారు. దీంతో వినియోగదారులు సంతృప్తి చెందడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెరిగిన రేషన్‌కార్డుల సంఖ్యకు అనుగుణంగా కిరోసిన్ కోటాను పెంచాలని పలువురు కోరుతున్నారు. -
సరుకుల్లేవ్.. సర్దుకోండి
సత్తెనపల్లిరూరల్, న్యూస్‌లైన్: కొత్త ఏడాది, సంక్రాంతి పండగ నెలలో కూడా పేదలకు ‘రేషన్’ అందడం లేదు. సరుకుల్లేవ్ సర్దుకోండని అధికారులు చెపుతుండడంతో సంక్రాంతి పండగను ఎలా నెట్టుకురావాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. అధికారుల ఉదాశీన వైఖరితో సరుకులు లేక గ్రామాల్లోని రేషన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. కేవలం బియ్యం, కిరోసిన్ మాత్రమే సరఫరా చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గత ఏడాది అట్టహాసంగా ఆరంభించిన అమ్మహస్తం పథకం ద్వారా అందించే సరుకుల్లో కేవలం పామాయిల్ మాత్రమే పంపిణీ చేసి సరిపెడుతున్నారు. ఈ పథకం ద్వారా అందించే తొమ్మిది రకాల సరుకుల్లో రెండు నెలలుగా కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. పామాయిల్ కూడా గత నెలలో సగం దుకాణాలకు మాత్రమే సరఫరా కాగా, మిగిలిన దుకాణాలకు ఈ నెలలో సరఫరా చేస్తామని అధికారులు చెపుతున్నారు. మిగిలిన సరుకుల్లో నాణ్యత లేకపోవటంతో తీసుకొనేందుకు కార్డుదారులు ముందుకు రావటం లేదు. దీంతో దుకాణదారులు అదే రీతిలో సిద్ధమవుతున్నాయి. డీలర్లకు భారంగా మారిన పంపిణీ.... ప్రజా పంపిణీ వ్యవస్థ సరుకులు అరకొరగానే సరఫరా కావటంతో పంపిణీ చేయడం డీలర్లకు భారంగానే మారింది. సత్తెనపల్లి రూరల్ మండలంలో మొత్తం 71 నిత్యావసర చౌక దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 34,186 కుటుంబాలు రాయితీపై నిత్యావసర సరుకులను పొందుతున్నాయి. ప్రతి నెలా 16,17 తేదీల్లోపు డీలర్లు సరుకులకు సంబంధించి బ్యాంకు డి.డి లు చెల్లించాలి. అనంతరం నెల ఆరంభంలో సరుకులను సరఫరా చేస్తారు. డిసెంబర్ నెలకు సంబంధించిన సరుకుల కోసం నవంబర్‌లో డి.డి లు చెల్లించారు. గోదాములకు పూర్తి స్థాయిలో సరుకులు రాకపోవటంతో సగం మంది డీలర్లకు మాత్రమే సరుకులు సరఫరా చేశారు. మిగిలిన వారికి నేటికీ సరుకులు రాలేదు. ఇక జనవరి నెలకు సంబంధించిన సరుకులకు గత నెలలోనే డి.డి లు చెల్లించారు. నెల ప్రారంభమై పది రోజులు దాటుతున్నా నేటికీ దుకాణాలకు సరుకులు చేరలేదు. పేద, మధ్య తరగతి కుటుంబాలపైనే భారం.. రేషన్ దుకాణాల్లో సరుకులు లేకపోవడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు బహిరంగ మార్కెట్‌కు వెళ్లక తప్పేలాలేదు. సంక్రాంతి పండగ నాడు కొద్దిగానైనా పిండి వంటలు చేసుకొందామనుకునే సగటు కుటుంబాలపై భారం పడుతోంది. మార్కెట్లో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకటంతో పండగ జరుపుకోవటం ఇబ్బందికరంగానే మారింది. రేషన్ దుకాణాలకు నిత్యవసర వస్తువుల సరఫరా లేకపోయినా అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం బియ్యం, కిరోసిన్‌తోనే సరిపెట్టుకోవాలంటూ చెప్పటంపై డీలర్లూ పెదవివిరుస్తున్నారు. డి.డి లు కట్టించటంలో ఉన్న హడావుడి సరుకులు అందించటంలో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పథకాల పేరుతో తమను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతోందని డీలర్లు వాపోతున్నారు. -
పామాయిల్ లేనట్టే!
కర్నూలు, న్యూస్‌లైన్: తెల్లరేషన్ కార్డుదారులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గత ఏడాది ఉగాది పర్వదినం నుంచి ప్రారంభించిన అమ్మహస్తం పథకం జిల్లాలో మసకబారింది. రూ.185కే తొమ్మిది రకాల సరుకులను ప్యాకెట్ రూపంలో అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించినా ఆచరణలో విఫలమయ్యారు. జిల్లాలో సరుకుల కొరత ఏర్పడటంతో అధికారులు తల పట్టుకున్నారు. తూకాల్లో మోసాలను అరికట్టే లక్ష్యంతో అమ్మహస్తంలో ఇచ్చే సరుకులన్నీ ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేసేందుకు నిర్ణయించినా అమలులో చిత్తశుద్ధి లోపించింది. కారం, పసుపు, చింతపండులో నాణ్యత కొరవడటంతో వెనక్కు పంపుతూ జాయింట్ కలెక్టర్ కన్నబాబు మూడు రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదిక పంపారు. బియ్యం, కిరోసిన్ మినహా మిగిలిన సరుకులకు డీడీలు కట్టవద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్లకు చెప్పడంతో అమ్మహస్తం పథకం పట్ల డీలర్లు కూడా ఆసక్తి చూపని పరిస్థితి. డీడీలు కట్టాల్సిన మొత్తం పెరిగిపోవడం, నాణ్యత లేని సరుకులు సరఫరా చేస్తుండటంతో డీలర్లు డీడీలు తీసేందుకు వెనుకంజ వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో నాణ్యత కలిగిన చింతపండు అర కిలో రూ.28లకే లభిస్తుండటంతో చౌకడిపోల్లో రూ.30లకు సరఫరా చేస్తుండటం.. నాసిరకం కావడంతో కార్డుదారులు తిరస్కరిస్తున్నారు. అదేవిధంగా పసుపు 100 గ్రాములు చౌక డిపోలో రూ.10లకు విక్రయిస్తుండగా బహిరంగ మార్కెట్లో రూ.8లకే లభిస్తోంది. 250 గ్రాముల కారం చౌకడిపోలో రూ.20లకు సరఫరా చేస్తుండగా, బహిరంగ మార్కెట్లో రూ.18లకే లభిస్తుండటంతో కార్డుదారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. అలాగే కందిపప్పు, గోధుమ పిండి కూడా నాసిరకంగా ఉంటున్నాయి. నెలల తరబడి గోధుమ పిండి నిల్వ ఉండటంతో ప్యాకెట్లలో పురుగులు పట్టి ముగ్గిపోయిన వాసన వస్తోంది. సంక్రాంతికి సర్కార్ షాక్ సంక్రాంతి పండగకు రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది. నాసిరకం సరుకుల పంపిణీతో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం తాజాగా పామాయిల్ సరఫరా చేయలేక చేతులెత్తేసింది. దీంతో పండగవేళ సామాన్యులకు పిండి వంటలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. పెరిగిన ధరలతో నిత్యావసర సరుకులు కొనలేక పేద, మధ్యతరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రేషన్ సరుకులలో కోత పెడుతుండటంపై కార్డుదారులు మండిపడుతున్నారు. రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే అన్ని సరుకులకు సంబంధించి ప్రతి నెల 15 నుంచి 20వ తేదీ లోపు డీడీలు చెల్లించాలి. జనవరి కోటాకు సంబంధించి పామాయిల్‌తో పాటు కారం, పసుపు, చింతపండు తదితర నిత్యావసర సరుకులకు డీడీలు తీయవద్దంటూ అధికారులే ఆదేశించారు. గత నెలలోనూ కోతే... జిల్లాలో ప్రభుత్వం ప్రతి నెల 2,411 రేషన్ దుకాణాల ద్వారా 11.50 లక్షల పామాయిల్ ప్యాకెట్లను పేదలకు అందజేస్తోంది. గత నెలలో పూర్తి కోటా ప్రకారం పామాయిల్ సరఫరా చేయలేదు. 20 శాతం కోత విధించి సరఫరా చేయడంతో కర్నూలు నగరంలోనే దాదాపు 40 దుకాణాలకు పామాయిల్ చేరలేదు. రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న 9 వస్తువులలో 5 రకాలు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయి. అలాగే గోధుమలు కూడా పుచ్చుపట్టడంతో కొనుగోలు చేయడానికి కార్డుదారులు ఆసక్తి చూపడం లేదు. సరుకుల నాణ్యతలో డొల్ల, సరఫరాలో జాప్యం జరుగుతుండటంతో ‘అమ్మహస్తం’ నీరుగారుతోంది. -
అంతా నాసిరకం
ఉదయగిరి, న్యూస్‌లైన్: నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్న నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అమలులోకి తెచ్చిన అమ్మహస్తం పథకం ముణ్ణాళ్ల ముచ్చటగా మిగిలింది. ఈ పథకం అమలు ఇప్పుడు రేషన్‌డీలర్లకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. నాసిరకమైన సరుకులను కొనుగోలు చేసేందుకు లబ్ధిదారులు వెనకడుగు వేస్తుండగా, ఎలాగైనా అమ్మాల్సిందేనంటూ అధికారులు హుకుం జారీ చేస్తుండటంతో డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం జిల్లాలో ఏటా రూ.535 కోట్లకు పైగా సబ్సిడీ భరాయిస్తోంది. సరుకుల్లో నాణ్యత లేకపోవడంతో ప్రభుత్వం ఖర్చుచేస్తున్న సబ్సిడీ పెద్దలపాలవుతుందే తప్ప పేదలకు ఒనగూరిందేమీ లేదు. జిల్లాలోని 1896 చౌకదుకాణాల ద్వారా 8,95,208 కార్డుదారులకు రేషన్ సరుకులు అందజేస్తున్నారు. ఈ ఏడాది ఉగాది నాడు ప్రారంభించిన ‘అమ్మహస్తం’ పథకం ద్వారా 9 రకాల సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ సరుకుల కిట్‌లో బియ్యం, కిరోసిన్, అరకిలో చక్కెర, కిలో కందిపప్పు, వంద గ్రాముల పసుపు, 250 గ్రాముల కారం, అరకిలో చింతపండు , కిలో ఉప్పు, కిలో గోధుమపిండి , కిలో నూనె ఉంటాయి. వీటిని సబ్సిడీపై రూ.185కి ఇస్తున్నారు. ఈ సరుకులు ప్యాక్ చేస్తున్న కవర్లు ఆకర్షణీయంగా ఉంటున్నా కందిపప్పు, పసుపు, కారం, చింతపండు, గోధుమపిండి నాసిరకంగా ఉంటున్నాయి. చింతపండులో గింజలు తప్ప పండు కనిపించడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. కారంలో రంపపు పొడి, ఇతరత్రా పొడులు కలుపుతున్నారని, ఇది తింటే రోగాలపాలు కావల్సిందేనని దాని జోలికి వెళ్లడం లేదు. కందిపప్పు ఎంతసేపు ఉడకబెట్టినా ఉడకడం లేదు. గోధుమపిండిలో పురుగులు దర్శనమిస్తున్నాయి. ఈ విధంగా ఒకటి, రెండు నెలల్లో సరఫరా అవుతున్నాయనుకుంటే పొరపాటే. పథకం ప్రారంభించిన ఈ 8 నెలల నుంచి ఒకటి, రెండు నెలలు తప్ప ఇదే పరిస్థితి కొనసాగుతోందని కొందరు డీలర్లు సైతం ఒప్పుకుంటున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులు బియ్యం, చక్కెర, నూనెను మాత్రం తీసుకెళుతున్నారు. మిగతా సరుకులు నాసిరకంగా ఉన్నాయని లబ్ధిదారులు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసిరకమైన సరుకులు పేదలకు అంటగడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబోదిబోమంటున్న డీలర్లు సివిల్ సప్లయీస్ అధికారులు ప్రతి నెలా కచ్చితంగా అమ్మహస్తం సరుకులకు డీడీలు చెల్లించి సరుకులు తీసుకోవాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నారు. సరుకుల్లో నాణ్యత లేకపోవడంతో లబ్ధిదారులు తీసుకోక తాము ఆర్థికంగా నష్టపోతున్నామని డీలర్లు వాపోతున్నారు. ఈ సరుకుల విషయంలో మినహాయింపు ఇస్తే పథకం మొత్తం నీరుగారిపోతుందనే ఉద్దేశంతో డీలర్లు కచ్చితంగా డీడీలు చెల్లించాలనే షరతును అధికారులు పెడుతున్నారు. -
నాణ్యమైన సరుకులు అందించాలి : జేసీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్: అమ్మహస్తం పథం కింద లబ్ధిదారులకు నాణ్యమైన తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ ఆదేశించారు. జేసీ బుధవారం తన చాంబర్లో పౌరసరఫరాల శాఖ గోదాముల ఇన్‌చార్జ్‌లు, డీలర్లు, డిప్యూటీ తహసీల్దార్లతో సమావేశమై మాట్లాడారు. అమ్మహస్తం కింద నాణ్యమైన సరుకులను మాత్రమే చౌకధర దుకాణాలకు చేరవేయాలని, ఈ విషయంలో అలసత్వాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అవసరానికి తగినట్లుగా ముందే ట్రాన్సుపోర్టుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. డిమాండ్ అవసరాలను బట్టి కందిపప్పు, చక్కెర, గోధుమలు వినియోగదారులకు అందించాలని కోరారు. మండల గోదాముల స్థాయిలో స్టాకు వివరాలను ఎప్పటికపుడు సెల్‌ఫోన్ ద్వారా ఆన్లైన్లో తెలియజేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆన్లైన్ ద్వారా స్టాకు వివరాలు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్, ఎండీకి నివేదికలు పంపాలని ఆదేశించారు. 17 గోదాములకు గాను 5 గోదాముల స్థాయిలో ఆన్లైన్ ద్వారా స్టాకు వివరాలు పర్యవేక్షిస్తున్నామని, మిగిలిన వారందరూ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. దీపం పథకం కింద సాధారణ కోటాగా 14,400 మంజూరుకాగా, 7253 గ్రౌండింగ్ పూర్తిచేశామని, మిగిలిన 7220 దీపం కనెక్షన్ల గ్రౌండింగ్‌కై చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్ సీడింగ్ కార్యక్రమంలో రాష్ట్రంలో 4వ స్థానంలో ఉన్నామని త్వరలో పెండింగ్‌లో ఉన్న ఆధార్ సీడింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో డీఎస్వో నాగేశ్వర్రావు, ఏఎస్వో వెంకటేశ్వర్లు, ప్రద్యుమ్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘అమ్మ హస్తం’కు తగ్గుతున్న ఆదరణ
మోర్తాడ్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మ హస్తం పథకాన్ని ప్రజలు ఆదరించకపోవడంతో కొన్ని సరుకులను సరఫరా చేయకుండా నిలిపివేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు యోచిస్తున్నారు. దీనిపై క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలన జరుపుతున్నారు. తాజాగా ప్రతినెల గోదాముల్లో మిగిలిపోతున్న సరుకుల వివరాలను జిల్లా పౌర సరఫరాల సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంకు అందజేస్తున్నారు. మిగిలిపోతున్న సరుకుల వివరాలతోపాటు అందుకు గల కారణాలను కూడా అధికారులు విశ్లేషిస్తున్నారు. సరుకుల్లో నాణ్యత లేకపోవడం, మార్కెట్ ధరల కంటే అమ్మ హస్తం పథకంలోనే ధర ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు కొన్ని సరుకులను ఆదరించడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించినట్లు తెలిసింది. అమ్మహస్తం పథకంలో తొమ్మిది నిత్యావసర సరుకులను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రూ. 292 విలువ చేసే సరుకులకు రూ. 107 సబ్సిడీని ప్రభుత్వం భరిస్తూ కేవలం రూ. 185 ధరకు అమ్మ హస్తం పథకంను అమలు చేసింది. అయితే పథకాన్ని ఉగాది పండుగ రోజున అమలు చేయగా ఇప్పటివరకు కొన్ని రకాల సరుకులను వినియోగదారులు తీసుకునేందుకు ఆసక్తిని కనబరచడం లేదు. దీంతో పౌర సరఫరా శాఖ గోదాముల్లో ఆయా సరుకుల నిల్వలు పేరుకుపోయాయి. చింతపండు, పసుపు, ఉప్పు, మిరప్పొడి నిల్వలు గోదాంలలో అధికంగా పేరుక పోయాయి. జిల్లాలో ఇప్పటి వరకు 6.90 లక్షల తెలుపు రంగు కార్డులు ఉన్నాయి. తాజాగా నిర్వహిస్తున్న రచ్చబండలో 80 వేల తెలుపు రంగు రేషన్ కార్డులు జారీ చేయడానికి కూపన్లను అధికారులు వినియోగదారులకు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఉన్న 6.90 లక్షల తెలుపు రంగు రేషన్ కార్డుల వినియోగదారులకు అమ్మ హస్తం పథకాన్ని అందించడానికి ప్రతినెల ఏర్పాట్లు జరిగాయి. వచ్చేనెల నుంచి తెలుపు రంగు రేషన్ కార్డుల వినియోగదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో అమ్మహస్తం పథకంలో ఇప్పుడే మార్పులు చేస్తే ఎలాంటి గందరగోళం ఉండదని అధికారులు భావిస్తున్నారు. వచ్చేనెల నుంచి అన్ని గ్రామాల్లో వినియోగదారుల సంఖ్య పెరగనుండటంతో అమ్మ హస్తం పథకంలో తొమ్మిది రకాలకు బదులు ఆరు రకాల సరుకులనే సరఫరా చేసి ధరను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పంచదార, పామోలిన్ ఆయిల్, ఉప్పు, పసుపు, మిరప్పొడి, కందిపప్పు, గోధుమపిండి, గోధుమలు, చింతపండును సరఫరా చేస్తున్నారు. ఇందులో పసుపు, మిరప్పొడి, చింతపండు, ఉప్పును మినహాయించి మిగిలిన సరుకులను సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో చేస్తున్న అధ్యయనంలో తేలిన విషయాల ఆధారంగా పథకంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్ ఒకరు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
‘అమ్మో’హస్తం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: అమ్మహస్తం సరుకులను చూసి కార్డుదారులు ‘అమ్మో’హస్తం అంటూ హడలిపోతున్నారు. కేవలం 185 రూపాయలకే 9 రకాల నిత్యావసర సరుకులు ఇంటిల్లిపాదికి అందించి వారి ఆకలి తీరుస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరును కార్డుదారులు ఎండగడుతున్నారు. ఆర్భాటంగా ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ అందులోని వస్తువుల నాణ్యత డొల్లగా ఉండటంతో కార్డుదారులు వాటిని అయిష్టంగానే తీసుకుంటున్నారు. అందులో కూడా కేవలం మూడు వస్తువులను మాత్రమే వినియోగించుకుంటూ మిగతా ఆరు వస్తువులను పక్కన పడేస్తున్నారు. కొంతమంది ప్రత్యామ్నాయంగా వాటిని వినియోగిస్తుండగా, ఎక్కువ మంది చెత్తబుట్టల్లో వేస్తున్నారు. ఉగాది రోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తే దసరా నాటికి దాని సత్తా ఏమిటో తేలిపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత వచ్చిన పాలకులు ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా ప్రారంభించలేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. దాంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అమ్మహస్తం పేరుతో ప్రజలకు చేరువ కావాలని నిర్ణయించుకున్నారు. ఎంత హడావిడిగా ఈ పథకాన్ని ప్రారంభించారో అంతే తొందరగా ప్రజలు కూడా దీనిని తిప్పికొట్టారు. జిల్లాలోని చౌకధరల దుకాణాల ద్వారా 8 లక్షల 31 వేల మంది కార్డుదారులకు ప్రతినెలా అమ్మహస్తం పథకం కింద 9 రకాల నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. కేజీ కందిపప్పు రూ 50, లీటర్ పామాయిల్ * 40, కేజీ గోధుమపిండి * 16.50, కేజీ గోధుమలు * 7, అరకేజీ పంచదార * 6.75, కేజీ ఉప్పు * 5, పావుకేజీ కారంపొడి * 20, అరకేజీ చింతపండు * 30, వందగ్రాములు పసుపు * 10 చొప్పున విక్రయిస్తున్నారు. 9 రకాల వస్తువులు *185కు అందిస్తున్నారు. ఇప్పటికే కేజీ రూపాయి బియ్యం చౌకధరల దుకాణాల ద్వారా అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి నాలుగు కేజీల చొప్పున బియ్యం విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బియ్యంతోపాటు 9 రకాల నిత్యావసర వస్తువులు అందిస్తుండటంతో ఆ కుటుంబంలో ఆకలి ఉండదన్న ఆలోచనతో ప్రభుత్వం అమ్మహస్తం ప్రవేశపెట్టినప్పటికీ పేదలు మాత్రం ఆకలో రామచంద్రా అంటూ అలమటిస్తూనే ఉన్నారు. ఒకవైపు నిత్యావసర సరుకులు ఉన్నప్పటికీ వాటిని ఆహారంగా తీసుకునే పరిస్థితులు లేకపోవడంతో మార్కెట్లో లభించే సరుకులను కొని కడుపు నింపుకుంటున్నారు. ప్యాకింగ్‌పై ఉన్న శ్రద్ధ నాణ్యతపై ఏదీ... అమ్మహస్తం పథకానికి సంబంధించిన ప్యాకింగ్‌పై ఉన్న శ్రద్ధ వస్తువుల నాణ్యతలో చూపడం లేదు. ఏ ప్యాక్‌ను చూసినా ప్రభుత్వ ప్రచారం తప్పితే అందులో నాణ్యత లేదన్నది తేలిపోతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పథకం ప్రచారానికే కోట్లాది రూపాయలు వెచ్చించారు. ప్రజల ఆకలి తీర్చే ఆహారాన్ని మాత్రం పట్టించుకోవడం మానేశారు. అమ్మహస్తంలో డొల్లతనం బయటపడుతున్నా దానిని నియంత్రించే చర్యలు చేపట్టడం లేదు. కేజీ కందిపప్పు * 50కు ఇస్తున్నప్పటికీ అందులో పప్పుకు పోటీగా రాళ్లు కనిపిస్తుంటాయి. చింతపండులో మెత్తని పదార్థం కంటే పిక్కలే ఎక్కువగా దర్శనమిస్తాయి. కారంపొడి ప్యాకెట్లో రంగు తప్పితే రుచి మాటే ఉండదు. పంచదారలో తీపి కంటే వగరే ఎక్కువగా ఉంటుంది. పసుపు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది. 9 రకాల సరుకుల్లో ఒక్కదానిలో కూడా నాణ్యత లేకపోవడం పథకం ఏ విధంగా అమలవుతుందో అనేదానికి అద్దం పడుతోంది. అమ్మహస్తం కష్టంగా ఉంది పావులూరి ఉమ, గృహిణి, కేశవరాజుకుంట, ఒంగోలు అమ్మహస్తం పథకంలోని నిత్యావసర సరుకులు కష్టంగా ఉపయోగించుకుంటున్నాం. * 185కే 9 రకాల నిత్యావసర సరుకులు వస్తాయని ప్రకటించడంతో ఎంతో ఆశగా చౌకధరల దుకాణాలకు వెళ్లి తెచ్చుకున్నాం. ఆ తరువాత వాటిలో నాణ్యతను చూస్తే కళ్లు తిరిగినంత పనైంది. ప్రతిసారీ ఇబ్బందే వీధిపల్లి లీలావతి, గృహిణి, గద్దలగుంట, ఒంగోలుఅమ్మహస్తం పథకాన్ని ప్రారంభించిన నాటినుంచి సరుకులు తెచ్చుకుంటున్నాం. ప్రతిసారీ ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ప్రతినెలా సరుకులు తీసుకుంటున్నప్పటికీ ఏ ఒక్క నెలలోనూ సరుకు నాణ్యంగా ఉండటం లేదు. -
గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణకు రూ.280 కోట్లు
హైదరాబాద్:గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణకు రూ.280 కోట్లు కేటాయించడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు. దీనిలో భాగంగా గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణకు రూ.280 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అమలవుతున్న పథకాలపై కూడా కేబినెట్ పెద్దలు చర్చించారు. అమ్మహస్తం పథకం రాష్ట్రంలో ఏవిధంగా అమలవుతుందనే అంశాన్ని ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. గిరిజన సంక్షేమశాఖలో 143 ట్రైబల్‌వెల్పేర్ ఆఫీసర్లు, 388 వార్డెన్ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపడమే కాకుండా, ఏడు కొత్త పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వరల్డ్ బ్యాంక్ నుంచి 1000 కోట్ల రుణ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆర్‌అండ్‌బీకు 468 కోట్లు, పంచాయతీరాజ్‌కు 532 కోట్లు కేటాయించారు. ఈ సమావేశానికి ఇద్దరు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఆరుగురు సీమాంద్ర ప్రాంతానికి చెందిన మంత్రులు గైర్హాజరయ్యారు. ఇక సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు సమర్పించిన గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టి.జి.వెంకటేష్, గల్లా అరుణకుమారి, సి.రామచంద్రయ్య, అహ్మదుల్లా తదితరులు సమావేశానికి దూరంగా ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన గీతారెడ్డి, దానం నాగేందర్ కూడా భేటీకి హాజరు కాలేదు.