నీరుగారిన అమ్మ హస్తం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అమ్మ హస్తం పథకం ద్వారా చౌకధరకే నిత్యావసర సరుకులు అందుతాయని, వీటితో నెలంతా సాఫీగా గడచిపోతుందని ఆశించిన పేద, బడుగు వర్గాలకు నిరాశే మిగిలింది. సరైన కసరత్తు చేయకుండా గత ప్రభుత్వం హడావుడిగా, ఆర్భాటంగా ప్రారంభించిన ఈ పథకం ఆచరణలో విఫలమవటం వారి పాలిట శాపంగా మారింది. ఏడాది గడిచినా పథకం అమలులో ఎలాంటి మెరుగుదల లేకపోగా.. రానురాను పరిస్థితి దయనీయంగా మారుతుండటంతో రేషన్‌కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ పథకం ద్వారా 185 రూపాయలకు కిలో కందిపప్పు, కిలో గోధుమలు, కిలో గోధుమ పిండి, అర కిలో పంచదార, కిలో ఉప్పు, 250 గ్రాముల కారం, అర కిలో చింతపండు, లీటరు పామాయిల్, 100 గ్రాముల పసుపు అందించాలి.
జిల్లాలో 7,78,462 తెలుపు రంగు, అం త్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులందరికీ సరుకులు అందించాలి.
ఆది నుంచి ఈ పథకం సరిగా అమలు కాలేదు. ప్రారంభంలో 25 శాతం మందికి, రెండో నెల 30 శాతం మంది లబ్ధిదారులకు సరుకులు అందజేశారు. మూడో నెల నుంచి 50 శాతం మందికి అందివ్వాలనుకున్నా.. అలా జరగలేదు. ఏ ఒక్క నెలా పూర్తిగా 9 రకాల సరుకులను అందించలేదు.
ప్రస్తుతం పంచదార, కందిపప్పు మాత్రమే అందజేస్తున్నారు. దీనిపై లబ్ధిదారులు మండిపడుతుండటంతో కొన్ని గ్రామాల్లోని డీలర్లు సరుకులు విడిపించడం లేదు. దీనివల్ల వివాదాలు తలెత్తుతున్నాయి.
రెండు నెలలుగా జిల్లాకు ఒక్క పామాయిల్ ప్యాకెట్ కూడా రాలేదు, లబ్దిదారులు ప్రధానంగా పామాయిల్‌ను కొనుగోలు చేస్తారు. రానున్న రెండు నెలలు కూడా పామాయిల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొత్తగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని ఏంచేస్తుందనేదానిపై స్పష్టత లేదు.
రేషన్‌కార్డుదారులకు కిరోసిన్ కూడా సరిగా అందటం లేదు. జిల్లాకు కేటాయించిన కోటాలో 90 శాతం మాత్రమే విడుదల చేస్తున్నారు. జిల్లాకు 15 లక్షల కిలో లీటర్ల కిరోసిన్ అవసరం కాగా 13 లక్షల కిలోలీటర్లే విడుదల చేస్తున్నారు. దీంతో ముందువచ్చిన వారికి ముందు ప్రాతిపదకన డీలర్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో చాలా గ్రామాల్లో డీలర్లు, లబ్ధిదారుల మధ్య గొడవలు, వివాదాలు రేగుతున్నాయి.
రేషన్ సరుకుల పంపిణీకి ఆధార్ నంబ ర్‌తో తాజాగా మళ్లీ లింకు పెట్టారు. ఆధార్ నంబర్ ఇవ్వనివారికి ఈ నెల కోటా నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఆధార్ నమోదు ప్రక్రియ 85 శాతం మేరే పూర్తయింది. దీంతో మిగిలిన వారికి రేషన్ సరుకులు ఇవ్వటం లేదు. వీరిలో చాలామంది ఆధార్ కేంద్రాల్లో వివరాలు నమోదు చేయించుకున్నా కార్డులు మాత్రం ఇంతవరకు రాలేదు.