Palm oil packet
-
విజయ నూనె విక్రయించరట!
- సర్కారు ఆదేశాలు పట్టించుకోని రేషన్ డీలర్లు - ప్రైవేటు కంపెనీలవి విక్రయిస్తున్న వైనం - భారీగా పడిపోయిన ‘విజయ’ అమ్మకాలు.. సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘విజయ పామాయిల్’ను విక్రయించాలన్న ఆదేశాలను రేషన్ డీలర్లు బేఖాతర్ చేస్తున్నారు. ఆయిల్‌ఫెడ్ ద్వారా మార్కెట్లో విక్రయిస్తున్న విజయ నూనెను తిరస్కరిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలతో కుమ్మక్కై విజయ నూనెను డీలర్లు పట్టంచుకోవడం లేదని, లాభార్జనే ధ్యేయంగా డీలర్లు ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు పర్యవేక్షణ లోపం, మామూళ్ల మత్తులో కొందరు అధికారులు ఉండటంతో ‘విజయ’కు చుక్కెదురైందన్న విమర్శలున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం విజయ పామాయిల్‌ను రేషన్ దుకాణాల్లో విక్రయించాలని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ అమలులోకి రాలేదు. నెలకు 17,600 మెట్రిక్ టన్నులు.. రాష్ట్రంలోని 17,226 రేషన్ దుకాణాల పరిధిలో 88.31 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. ఆ కార్డుల కింద 2.80 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయ నూనెను కార్డుదారులకు నెలకు రెండు లీటర్ల చొప్పున 17,600 మెట్రిక్ టన్నులు విక్రయించడానికి వీలుంటుంది. కానీ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కేవలం 1,342 మెట్రిక్ టన్నులు.. సెప్టెంబర్‌లో 414 మెట్రిక్ టన్నులే విక్రయించారు. అంటే ప్రభుత్వం ఆదేశిస్తే సెప్టెంబర్‌లో కేవలం 2.35 శాతం అమ్మకాలు మాత్రమే చేశారు. ప్రైవేటు కంపెనీల పామాయిల్‌కు కమీషన్ ఎక్కువగా ఉండటంతో డీలర్లు వాటినే విక్రయిస్తున్నారు. ప్రైవేటు పామాయిల్ ప్యాకెట్ విక్రయిస్తే రూ.8 వరకు లాభం వస్తుం డగా.. విజయ పామాయిల్ వల్ల రూ.3 వరకు మాత్రమే లాభం ఉంటుంది. దీనికి తోడు విజయ నూనెను కొనుగోలు చేయాలంటే డీలర్లు ముందుగా డబ్బు చెల్లిం చాలి. ప్రైవేటు కంపెనీలు తర్వాత చెల్లించే వెసులుబాటు కల్పించడంతో డీలర్లు అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఆదేశాలకూ దిక్కులేదు సర్కారు ఆదేశాలను రేషన్ డీలర్లు పట్టించుకోకపోవడంతో విజయ పామాయిల్ ప్రజలకు చేరడం లేదు. ప్రభుత్వం డీలర్లకు మరోసారి ఆదేశాలు ఇవ్వాలి. డిమాండ్‌కు తగ్గట్లుగా విజయ ఆయిల్‌ను అందించగలం. అవసరమైతే మరో రెండు షిఫ్టులు పెట్టి ప్యాకింగ్ చేయించగలం. - బి.రాజేశం, మేనేజర్, ఆయిల్‌ఫెడ్ -
రిక్తహస్తం
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: అమ్మహస్తం పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రెండు నెలలుగా పేదలకు తొమ్మిది రకాల వస్తువులు అందటం లేదు. కేవలం బియ్యం, కిరోసిన్, చక్కెర మాత్రమే సరఫరా అవుతోంది. మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో గత ప్రభుత్వం 2013 ఏప్రిల్‌లో అమ్మహస్తం పథకం ప్రవేశపెట్టింది. రూ.185కే తొమ్మిది రకాల సరుకులను చౌకడిపోల ద్వారా తెల్లకార్డు దారులకు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. తొమ్మిది రకాలలో అరకిలో పంచదార, పామాయిల్ ప్యాకెట్, కిలో కందిపప్పు, కిలో గోధుమలు, గోధుమపిండి, 250 గ్రాముల కారంపొడి, అరకిలో చింతపండు, 100 గ్రాముల పసుపు, కిలో ఉప్పు ప్యాకెట్ ఉంటాయి. నిత్యవసర వస్తువులను ప్రభుత్వ సరఫరా చేయక, ఇటు బయట ధరలు తగ్గక పేదలు అల్లాడిపోతున్నారు. ఈ పథకం ప్రారంభం నుంచే అభాసుపాలవుతోంది. నాణ్యత లేని చింతపండు, కందిపప్పు, పురుగులు పట్టిన గోధుమపిండి సరఫరా చేశారు. గతంలో కూడా రెండు నెలల వరకు సరుకులు సక్రమంగా ఇవ్వకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. సరుకులకు అలాట్మెంట్ మాత్రం అధికారులు ఇస్తున్నారు. రెండు నెలలుగా గోదాముల్లో ఒకటి, రెండు సరుకులుంటున్నాయి తప్పితే పూర్తి స్థాయిలో ఉండటం లేదు. గతనెలలో కొన్ని మండలాలకు అసలు సరుకులే అందని పరిస్థితి ఉంది. మరికొంతమంది డీలర్లకు నెల చివరి వరకు సరుకులు అందడం లేదు. కేవలం పంచదార, కిరోసిన్, బియ్యం మాత్రమే ఉన్నాయన్న సమాధానం డీలర్ల నుంచి వినపడుతోంది. జిల్లాలో 2,085 పైగా చౌరధరల దుకాణాలున్నాయి. ఒంగోలు డివిజన్లో 924, కందుకూరు డివిజన్లో 750, మార్కాపురం డివిజన్లో 432 చౌకధరల దుకాణాలున్నాయి. 8,90,507 మంది కార్డుదారులుండగా వాటిలో 6,73,999 తెల్లకార్డుదారులున్నారు. వీరిలో రెండొంతులకు పైగా రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలున్నాయి. వీరంతా ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న నిత్యవసర వస్తువులపై ఆధార పడి జీవిస్తున్నారు. అయితే రెండు నెలలుగా పథకం సక్రమంగా అమలు కావడం లేదు. అసలు సరుకులు వచ్చేదీ లేనిది అధికారుల నుంచి స్పష్టత లేదని డీలర్ల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. డీలర్లు కేవలం బియ్యానికి మాత్రమే డీడీలు తీసినట్లు డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రస్తుతం బియ్యం మాత్రం ట్రాన్స్‌పోర్టు అవుతున్నాయన్నారు. అమ్మహస్తం సరుకులపై పౌరసరఫరాల సంస్థ డీఎం పీవీ కొండయ్య దృష్టికి తీసుకురాగా..గోధుమపిండి, కందిపప్పు, సాల్ట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పామాయిల్ రెండు నెలలుగా రావడంలేదన్నారు. పసుపు, కారం, చింతపండు అనుకున్న మేర డిమాండ్ లేని కారణంగా అందుబాటులో ఉంచలేకపోయామని తెలిపారు. -
నీరుగారిన అమ్మ హస్తం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అమ్మ హస్తం పథకం ద్వారా చౌకధరకే నిత్యావసర సరుకులు అందుతాయని, వీటితో నెలంతా సాఫీగా గడచిపోతుందని ఆశించిన పేద, బడుగు వర్గాలకు నిరాశే మిగిలింది. సరైన కసరత్తు చేయకుండా గత ప్రభుత్వం హడావుడిగా, ఆర్భాటంగా ప్రారంభించిన ఈ పథకం ఆచరణలో విఫలమవటం వారి పాలిట శాపంగా మారింది. ఏడాది గడిచినా పథకం అమలులో ఎలాంటి మెరుగుదల లేకపోగా.. రానురాను పరిస్థితి దయనీయంగా మారుతుండటంతో రేషన్‌కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పథకం ద్వారా 185 రూపాయలకు కిలో కందిపప్పు, కిలో గోధుమలు, కిలో గోధుమ పిండి, అర కిలో పంచదార, కిలో ఉప్పు, 250 గ్రాముల కారం, అర కిలో చింతపండు, లీటరు పామాయిల్, 100 గ్రాముల పసుపు అందించాలి. జిల్లాలో 7,78,462 తెలుపు రంగు, అం త్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులందరికీ సరుకులు అందించాలి. ఆది నుంచి ఈ పథకం సరిగా అమలు కాలేదు. ప్రారంభంలో 25 శాతం మందికి, రెండో నెల 30 శాతం మంది లబ్ధిదారులకు సరుకులు అందజేశారు. మూడో నెల నుంచి 50 శాతం మందికి అందివ్వాలనుకున్నా.. అలా జరగలేదు. ఏ ఒక్క నెలా పూర్తిగా 9 రకాల సరుకులను అందించలేదు. ప్రస్తుతం పంచదార, కందిపప్పు మాత్రమే అందజేస్తున్నారు. దీనిపై లబ్ధిదారులు మండిపడుతుండటంతో కొన్ని గ్రామాల్లోని డీలర్లు సరుకులు విడిపించడం లేదు. దీనివల్ల వివాదాలు తలెత్తుతున్నాయి. రెండు నెలలుగా జిల్లాకు ఒక్క పామాయిల్ ప్యాకెట్ కూడా రాలేదు, లబ్దిదారులు ప్రధానంగా పామాయిల్‌ను కొనుగోలు చేస్తారు. రానున్న రెండు నెలలు కూడా పామాయిల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొత్తగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని ఏంచేస్తుందనేదానిపై స్పష్టత లేదు. రేషన్‌కార్డుదారులకు కిరోసిన్ కూడా సరిగా అందటం లేదు. జిల్లాకు కేటాయించిన కోటాలో 90 శాతం మాత్రమే విడుదల చేస్తున్నారు. జిల్లాకు 15 లక్షల కిలో లీటర్ల కిరోసిన్ అవసరం కాగా 13 లక్షల కిలోలీటర్లే విడుదల చేస్తున్నారు. దీంతో ముందువచ్చిన వారికి ముందు ప్రాతిపదకన డీలర్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో చాలా గ్రామాల్లో డీలర్లు, లబ్ధిదారుల మధ్య గొడవలు, వివాదాలు రేగుతున్నాయి. రేషన్ సరుకుల పంపిణీకి ఆధార్ నంబ ర్తో తాజాగా మళ్లీ లింకు పెట్టారు. ఆధార్ నంబర్ ఇవ్వనివారికి ఈ నెల కోటా నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఆధార్ నమోదు ప్రక్రియ 85 శాతం మేరే పూర్తయింది. దీంతో మిగిలిన వారికి రేషన్ సరుకులు ఇవ్వటం లేదు. వీరిలో చాలామంది ఆధార్ కేంద్రాల్లో వివరాలు నమోదు చేయించుకున్నా కార్డులు మాత్రం ఇంతవరకు రాలేదు.