విజయ నూనె విక్రయించరట!
- సర్కారు ఆదేశాలు పట్టించుకోని రేషన్ డీలర్లు
- ప్రైవేటు కంపెనీలవి విక్రయిస్తున్న వైనం
- భారీగా పడిపోయిన ‘విజయ’ అమ్మకాలు..
సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘విజయ పామాయిల్’ను విక్రయించాలన్న ఆదేశాలను రేషన్ డీలర్లు బేఖాతర్ చేస్తున్నారు. ఆయిల్‌ఫెడ్ ద్వారా మార్కెట్లో విక్రయిస్తున్న విజయ నూనెను తిరస్కరిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలతో కుమ్మక్కై విజయ నూనెను డీలర్లు పట్టంచుకోవడం లేదని, లాభార్జనే ధ్యేయంగా డీలర్లు ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు పర్యవేక్షణ లోపం, మామూళ్ల మత్తులో కొందరు అధికారులు ఉండటంతో ‘విజయ’కు చుక్కెదురైందన్న విమర్శలున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం విజయ పామాయిల్‌ను రేషన్ దుకాణాల్లో విక్రయించాలని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ అమలులోకి రాలేదు.
నెలకు 17,600 మెట్రిక్ టన్నులు..
రాష్ట్రంలోని 17,226 రేషన్ దుకాణాల పరిధిలో 88.31 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. ఆ కార్డుల కింద 2.80 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయ నూనెను కార్డుదారులకు నెలకు రెండు లీటర్ల చొప్పున 17,600 మెట్రిక్ టన్నులు విక్రయించడానికి వీలుంటుంది. కానీ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కేవలం 1,342 మెట్రిక్ టన్నులు.. సెప్టెంబర్‌లో 414 మెట్రిక్ టన్నులే విక్రయించారు. అంటే ప్రభుత్వం ఆదేశిస్తే సెప్టెంబర్‌లో కేవలం 2.35 శాతం అమ్మకాలు మాత్రమే చేశారు. ప్రైవేటు కంపెనీల పామాయిల్‌కు కమీషన్ ఎక్కువగా ఉండటంతో డీలర్లు వాటినే విక్రయిస్తున్నారు. ప్రైవేటు పామాయిల్ ప్యాకెట్ విక్రయిస్తే రూ.8 వరకు లాభం వస్తుం డగా.. విజయ పామాయిల్ వల్ల రూ.3 వరకు మాత్రమే లాభం ఉంటుంది. దీనికి తోడు విజయ నూనెను కొనుగోలు చేయాలంటే డీలర్లు ముందుగా డబ్బు చెల్లిం చాలి. ప్రైవేటు కంపెనీలు తర్వాత చెల్లించే వెసులుబాటు కల్పించడంతో డీలర్లు అటువైపు మొగ్గు చూపుతున్నారు.
ఆదేశాలకూ దిక్కులేదు
సర్కారు ఆదేశాలను రేషన్ డీలర్లు పట్టించుకోకపోవడంతో విజయ పామాయిల్ ప్రజలకు చేరడం లేదు. ప్రభుత్వం డీలర్లకు మరోసారి ఆదేశాలు ఇవ్వాలి. డిమాండ్‌కు తగ్గట్లుగా విజయ ఆయిల్‌ను అందించగలం. అవసరమైతే మరో రెండు షిఫ్టులు పెట్టి ప్యాకింగ్ చేయించగలం.
- బి.రాజేశం, మేనేజర్, ఆయిల్‌ఫెడ్