vijaya oil
-
ప్రజలకు ‘విజయ’ మరింత చేరువ కావాలి
రాజేంద్రనగర్ (హైదరాబాద్): నాణ్యతా ప్ర మాణాలతో కూడిన విజయ వంటనూనెలను ప్రజలకు మరింత చేరువ చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్మించనున్న విజయ వంటనూనెల మెగా ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ కర్మాగారం నిర్మాణానికి మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తు తం శివరాంపల్లిలోని ప్యాకింగ్ కేంద్రం మూడు షిఫ్ట్‌లలో నడుస్తోందన్నారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన 3.8 ఎకరాల భూమిని ఆయిల్ ఫెడ్ సంస్థకు కేటాయించామన్నారు. రాబోయే రోజుల్లో ఆధునాతన యంత్రాలతో పూర్తి మైగ్రేడ్ పద్ధతిలో ప్యాకింగ్ స్టేషన్‌ను నిర్మించి ప్రజలకు నాణ్యమైన వంట నూనెలను అందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయిల్ ఫెడ్ సంస్థకు స్థలాన్ని కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నా రు. రూ.25 కోట్ల రూపాయలతో అత్యంత అధునాతనమైన విజయ హైదరాబాద్ మెగా ప్యాకింగ్ కేంద్రం, కీసర తాగునీరు కర్మాగారాలను జనవరి 2024లోపు పూర్తి చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఎండీ, డైరెక్టర్ సురేందర్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటరమణ పాల్గొన్నారు. -
‘విజయా’వారి మాయాబజార్
లీటరు అంటే 755 గ్రాములే! తక్కువ తూకం ప్యాకెట్లను విక్రయిస్తున్న అధికారులు మిగుల్చుకున్న నూనెలను అక్రమంగా అమ్ముకుంటున్న వైనం ఏటా రూ. కోట్లలో అక్రమ సంపాదన.. ఉన్నతాధికారులకూ వాటా! సాక్షి, హైదరాబాద్ ఆయిల్‌ఫెడ్‌లో ఆయిల్ దందా ఏరులై పారుతోంది. వినియోగదారులను మోసగిస్తూ ఇష్టారాజ్యంగా విజయ నూనెలను విక్రయిస్తున్నారు. గతంలో హైదరాబాద్ శివారులోని శివరాంపల్లి ఆయిల్ ప్యాకింగ్ యూనిట్లో కల్తీ వ్యవహారం వెలుగుచూడగా, తాజాగా తక్కువ తూకం ఉన్న ప్యాకెట్లను వినియోగదారులకు అంటగట్టడంపై విమర్శలు వస్తున్నాయి. తూనికలు, కొలతల శాఖ గతంలో అనేకసార్లు కేసులు పెట్టి జరిమానాలు విధించినా దందాను ఏమాత్రం ఆపడంలేదు. ఓవైపు సంస్థ నుంచి జరిమానాలు చెల్లిస్తూ.. మరోవైపు ఇష్టారాజ్యంగా తక్కువ తూకం ప్యాకెట్లను వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ప్యాక్ చేసినవి కావడంతో వినియోగదారులు వాటిని కొలిచి తీసుకోరు. దీన్నే కొందరు అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు సమాచారం. మిగుల్చుకున్న నూనెలను అక్రమంగా అమ్ముకుంటూ నెలకు రూ.లక్షల్లో దందా చేస్తున్నారు. అందులో ఒకటీరెండు వాటాలు ఉన్నతాధికారులకు వెళ్తున్నట్లు ఆరోపణలున్నాయి. కిలోకు 150 గ్రాములు తక్కువ.. విజయ నూనెపై ప్రజల్లో నమ్మకముంది. ప్రభుత్వ సంస్థ ద్వారా విక్రయిస్తున్నందున ప్రజలు గుడ్డిగా నమ్ముతుంటారు. కానీ వారి నమ్మకాన్ని సంస్థలో కొందరు అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆయిల్‌ఫెడ్ సంస్థ నెలకు 2,600 టన్నుల విజయ నూనెలను విక్రయిస్తుంటుంది. అందులో వెయ్యి టన్నులు పామాయిల్, వెయ్యి టన్నులు పొద్దు తిరుగుడు, 500 టన్నులు వేరుశనగ, 100 టన్నుల రైస్‌బ్రాన్ నూనెలు అమ్ముతుంది. వీటిలో 1,100 టన్నుల నూనెలను కృష్ణపట్నంలో, 1,500 టన్నులు శివరాంపల్లి వద్ద ప్యాకింగ్ చేస్తున్నారు. వినియోగదారుల కోసం 15 లీటర్లలో, 15 కేజీల్లో వేర్వేరుగా డబ్బాల్లో విక్రయిస్తున్నారు. ఇక వాస్తవానికి లీటర్ ప్యాకెట్లలో 915–920 గ్రాములతో నూనె విక్రయిస్తున్నారు. అయితే లీటర్ ప్యాకెట్లలో కేవలం 755 గ్రాములే ప్యాకింగ్ చేస్తున్నట్లు ఇటీవల ఆయిల్‌ఫెడ్ అధికారులకు ఫిర్యాదులందాయి. డబ్బాల్లో విక్రయించే నూనెలోనూ తక్కువ తూకమే ఉంటున్నట్లు సమాచారం. శివరాంపల్లిలోనే.. ముఖ్యంగా శివరాంపల్లిలో ప్యాకింగ్ అవుతున్న వాటిలోనే తక్కువ తూకం ఉంటున్నట్లు తేలింది. ఆ సంస్థ వివిధ రకాల నూనెలు నెలకు 2,600 టన్నులు విక్రయిస్తుండగా, తక్కువ తూకంతో దాదాపు 150 టన్నుల వరకు కొందరు అధికారులు మిగుల్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో కేసులు నమోదైనా అధికారుల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదని ఆయిల్‌ఫెడ్ మాజీ ఉద్యోగి, ఆ సంస్థ యూనియన్ మాజీ నాయకుడు నర్సింహారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కేసులు పెడితే సంస్థ తరఫున డబ్బులు చెల్లించి మళ్లీ దందా కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. వాటాలు ఉన్నతాధికారులకూ చేరుతున్నాయని ఆరోపించారు. ఫిర్యాదులు అందలేదు: రాజేశం, మేనేజర్, ఆయిల్‌ఫెడ్ విజయ నూనెలు తక్కువ తూకంతో ప్యాకింగ్ అవుతున్నట్లు తమకు వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఆయిల్‌ఫెడ్ విజయ నూనెల మార్కెటింగ్ మేనేజర్ రాజేశం ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. లీటరు ప్యాకెట్లో 915–920 గ్రాములు ఉంటుందని తెలిపారు. -
తగ్గిన విజయ నూనె ధరలు
వేరుశనగ నూనె రూ.2, పామాయిల్ రూ.1 తగ్గింపు సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ అమలు నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ నూనెల ధరలు తగ్గాయి. మూడు రకాల నూనెలను ధర తగ్గించి వినియోగదారులకు అందించాలని నిర్ణయించినట్లు ఆయిల్‌ఫెడ్ విజయ నూనెల మార్కెటింగ్ మేనేజర్ బి.రాజేశం ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో వేరుశనగ నూనె పాత ధర లీటరుకు రూ.107 ఉండగా, దాన్ని రూ.105కు తగ్గించారు. పామాయిల్ లీటర్‌కు రూ.61 ఉండగా, ఇప్పుడు రూ.60కి చేరింది. రైస్‌బ్రాన్ నూనె ధర రూ.70 ఉండగా, దానిపై 10 పైసలు మాత్రమే తగ్గించారు. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర అన్ని కంపెనీల కంటే తక్కువగా ఉండటంతో అదే ధరను కొనసాగించనున్నట్లు రాజేశం పేర్కొన్నారు. ఆయిల్‌ఫెడ్ విక్రయిస్తున్న వాటిల్లో పామాయిల్ వాటానే 40 శాతంగా ఉంది. చౌక ధర దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఈ నూనెనే సరఫరా చేస్తున్నారు. -
విజయ నూనె విక్రయించరట!
- సర్కారు ఆదేశాలు పట్టించుకోని రేషన్ డీలర్లు - ప్రైవేటు కంపెనీలవి విక్రయిస్తున్న వైనం - భారీగా పడిపోయిన ‘విజయ’ అమ్మకాలు.. సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘విజయ పామాయిల్’ను విక్రయించాలన్న ఆదేశాలను రేషన్ డీలర్లు బేఖాతర్ చేస్తున్నారు. ఆయిల్‌ఫెడ్ ద్వారా మార్కెట్లో విక్రయిస్తున్న విజయ నూనెను తిరస్కరిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలతో కుమ్మక్కై విజయ నూనెను డీలర్లు పట్టంచుకోవడం లేదని, లాభార్జనే ధ్యేయంగా డీలర్లు ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు పర్యవేక్షణ లోపం, మామూళ్ల మత్తులో కొందరు అధికారులు ఉండటంతో ‘విజయ’కు చుక్కెదురైందన్న విమర్శలున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం విజయ పామాయిల్‌ను రేషన్ దుకాణాల్లో విక్రయించాలని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ అమలులోకి రాలేదు. నెలకు 17,600 మెట్రిక్ టన్నులు.. రాష్ట్రంలోని 17,226 రేషన్ దుకాణాల పరిధిలో 88.31 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. ఆ కార్డుల కింద 2.80 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయ నూనెను కార్డుదారులకు నెలకు రెండు లీటర్ల చొప్పున 17,600 మెట్రిక్ టన్నులు విక్రయించడానికి వీలుంటుంది. కానీ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కేవలం 1,342 మెట్రిక్ టన్నులు.. సెప్టెంబర్‌లో 414 మెట్రిక్ టన్నులే విక్రయించారు. అంటే ప్రభుత్వం ఆదేశిస్తే సెప్టెంబర్‌లో కేవలం 2.35 శాతం అమ్మకాలు మాత్రమే చేశారు. ప్రైవేటు కంపెనీల పామాయిల్‌కు కమీషన్ ఎక్కువగా ఉండటంతో డీలర్లు వాటినే విక్రయిస్తున్నారు. ప్రైవేటు పామాయిల్ ప్యాకెట్ విక్రయిస్తే రూ.8 వరకు లాభం వస్తుం డగా.. విజయ పామాయిల్ వల్ల రూ.3 వరకు మాత్రమే లాభం ఉంటుంది. దీనికి తోడు విజయ నూనెను కొనుగోలు చేయాలంటే డీలర్లు ముందుగా డబ్బు చెల్లిం చాలి. ప్రైవేటు కంపెనీలు తర్వాత చెల్లించే వెసులుబాటు కల్పించడంతో డీలర్లు అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఆదేశాలకూ దిక్కులేదు సర్కారు ఆదేశాలను రేషన్ డీలర్లు పట్టించుకోకపోవడంతో విజయ పామాయిల్ ప్రజలకు చేరడం లేదు. ప్రభుత్వం డీలర్లకు మరోసారి ఆదేశాలు ఇవ్వాలి. డిమాండ్‌కు తగ్గట్లుగా విజయ ఆయిల్‌ను అందించగలం. అవసరమైతే మరో రెండు షిఫ్టులు పెట్టి ప్యాకింగ్ చేయించగలం. - బి.రాజేశం, మేనేజర్, ఆయిల్‌ఫెడ్ -
‘కల్తీ’పై సర్కార్‌కు విజయ డీలర్ల మొర
హైదరాబాద్: ‘విజయ’ నూనె కల్తీ కాదని, శుద్ధమైనదేనని ధ్రువీకరించాల్సిం దిగా సర్కారుకు డీలర్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం విజయ నూనెలో కల్తీ ఉన్నట్లు బయటపడటంతో మార్కెట్లో సగానికిపైగా విక్రయాలు తగ్గిపోయినట్లు తెలిసింది. దీంతో డీలర్లు, వ్యాపారులు అధికారులను కలిసి విజయ నూనె లో కల్తీ లేదని ప్రకటన చేయాల్సిందిగా కోరారు. కానీ అధికారులు అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ‘విజయ’ బ్రాండ్‌తో పామాయిల్, సన్‌ఫ్లవర్, వేరుశనగ, రైస్‌బ్రాన్, నువ్వుల నూనెలను విక్రయిస్తున్నారు. స్లన్ఫ్లవర్, శనగ నూనె రోజుకు 50 వేల కేజీలకుపైగా అమ్మకాలు జరుగుతాయి. విక్రయాలకు 240 మంది డీలర్లు ఉన్నారు. పచ్చళ్ల సీజన్ కావడంతో వేరుశనగ నూనెకు భారీ డిమాండ్ ఉంది. దీంతో వ్యాపారులు చాలా బిజీగా ఉన్నారు. కానీ ఒక్కసారిగా కల్తీ జరిగినట్లు బయటపడటం, ఓ అధికారిని సస్పెండ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.