కిరోసిన్ లేక ప‘రేషన్’ | no kerosene to new ration card users of rachabanda three | Sakshi
Sakshi News home page

కిరోసిన్ లేక ప‘రేషన్’

Published Thu, Jan 30 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

no kerosene to new ration card users of rachabanda three

మోర్తాడ్, న్యూస్‌లైన్ : మూడో విడత రబ్చబండలో జారీ చేసిన కొత్త రేషన్‌కార్డుదారులకు  కిరోసిన్‌ను సరఫరా చేయడం లేదు. రేషన్‌కార్డుల తయారీలో జాప్యం కారణంగా కార్డుల స్థానంలో కూపన్‌లను జారీ చేశారు. కిరోసిన్‌కు ప్రత్యేకంగా కూపన్ ఉన్నప్పటికీ సరఫరా చేయడం లేదు. కొత్త రేషన్ వినియోగదారులకు బియ్యం, అమ్మహస్తం సరుకులను సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. కిరోసిన్ కోటాను పెంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉండటంతో ఇప్పట్లో సరఫరా అయ్యే అవకాశం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

 గతేడాది నవంబర్ నెలలో నిర్వహించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 80 వేల కొత్త రేషన్‌కార్డులను జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలో 6,51,310 తెల్ల రంగు కార్డులు ఉన్నాయి. ఇందులో ఎల్‌పీజీ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు నెలకు ఒక లీటర్ కిరోసిన్‌ను పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తోంది. కనెక్షన్‌లేని వారికి రెండు లీటర్ల కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నారు.

ఇప్పటివరకు ఉన్న తెల్ల రంగు రేషన్‌కార్డు వినియోగదారుల్లో 70 శాతం మం దికి ఎల్‌పీజీ  కనెక్షన్‌లు ఉన్నాయి. కేవలం 30 శాతం మందికి  కనెక్షన్‌లు లేవు. జిల్లా వ్యాప్తంగా నెలకు ఎనిమిది లక్షల లీటర్ల కిరోసిన్ సరఫరా అవుతుంది. మార్కెట్‌లో కిరోసిన్ ధర రూ 45 ఉండగా రేషన్ దుకాణాల్లో మాత్రం లీటరుకు రూ15 చెల్లిస్తే  లభిస్తుంది. రేషన్ దుకాణాల్లో లభించే కిరోసిన్‌కు డిమాండ్ భారీ గానే ఉంది.

 కోటా పెంపు కేంద్రం పరిధిలో..
 రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులను జారీ చేసినా సబ్సిడీ కిరోసిన్ కోటాను పెంచడం కేంద్రం పరిధిలో ఉంది. రేషన్‌కార్డుల సంఖ్యను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవనరుల మంత్రిత్వ శాఖకు పంపక పోవడంతో సబ్సిడీ కిరోసిన్ కోటా పెరగలేదు. రేషన్ వినియోగదారుల సంఖ్య పెరిగినప్పుడు అందుకు అనుగుణంగా సబ్సిడీ సరుకుల పరిమాణాన్ని పౌర సరఫరాల శాఖ పెంచా ల్సి ఉంది.

 బియ్యం, అమ్మహస్తం సరుకుల సంఖ్యను పెంచినా కిరోసిన్ పరిమితి పెరగక పోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. బియ్యం, అమ్మహస్తం సరుకులను పొందడానికి రేషన్‌దుకాణాలకు వస్తున్న వినియోగదారులు కిరోసిన్ విషయమై డీలర్లను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కోటాను పెంచంది తాము ఏమీ చేయలేమని డీలర్లు సమాధానమిస్తున్నారు. దీంతో వినియోగదారులు సంతృప్తి చెందడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెరిగిన రేషన్‌కార్డుల సంఖ్యకు అనుగుణంగా కిరోసిన్ కోటాను పెంచాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement