rachabanda-3
-
కిరోసిన్ లేక ప‘రేషన్’
మోర్తాడ్, న్యూస్‌లైన్ : మూడో విడత రబ్చబండలో జారీ చేసిన కొత్త రేషన్‌కార్డుదారులకు కిరోసిన్‌ను సరఫరా చేయడం లేదు. రేషన్‌కార్డుల తయారీలో జాప్యం కారణంగా కార్డుల స్థానంలో కూపన్లను జారీ చేశారు. కిరోసిన్‌కు ప్రత్యేకంగా కూపన్ ఉన్నప్పటికీ సరఫరా చేయడం లేదు. కొత్త రేషన్ వినియోగదారులకు బియ్యం, అమ్మహస్తం సరుకులను సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. కిరోసిన్ కోటాను పెంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉండటంతో ఇప్పట్లో సరఫరా అయ్యే అవకాశం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది నవంబర్ నెలలో నిర్వహించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 80 వేల కొత్త రేషన్‌కార్డులను జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలో 6,51,310 తెల్ల రంగు కార్డులు ఉన్నాయి. ఇందులో ఎల్పీజీ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు నెలకు ఒక లీటర్ కిరోసిన్‌ను పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తోంది. కనెక్షన్లేని వారికి రెండు లీటర్ల కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న తెల్ల రంగు రేషన్‌కార్డు వినియోగదారుల్లో 70 శాతం మం దికి ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. కేవలం 30 శాతం మందికి కనెక్షన్లు లేవు. జిల్లా వ్యాప్తంగా నెలకు ఎనిమిది లక్షల లీటర్ల కిరోసిన్ సరఫరా అవుతుంది. మార్కెట్లో కిరోసిన్ ధర రూ 45 ఉండగా రేషన్ దుకాణాల్లో మాత్రం లీటరుకు రూ15 చెల్లిస్తే లభిస్తుంది. రేషన్ దుకాణాల్లో లభించే కిరోసిన్‌కు డిమాండ్ భారీ గానే ఉంది. కోటా పెంపు కేంద్రం పరిధిలో.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులను జారీ చేసినా సబ్సిడీ కిరోసిన్ కోటాను పెంచడం కేంద్రం పరిధిలో ఉంది. రేషన్‌కార్డుల సంఖ్యను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవనరుల మంత్రిత్వ శాఖకు పంపక పోవడంతో సబ్సిడీ కిరోసిన్ కోటా పెరగలేదు. రేషన్ వినియోగదారుల సంఖ్య పెరిగినప్పుడు అందుకు అనుగుణంగా సబ్సిడీ సరుకుల పరిమాణాన్ని పౌర సరఫరాల శాఖ పెంచా ల్సి ఉంది. బియ్యం, అమ్మహస్తం సరుకుల సంఖ్యను పెంచినా కిరోసిన్ పరిమితి పెరగక పోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. బియ్యం, అమ్మహస్తం సరుకులను పొందడానికి రేషన్‌దుకాణాలకు వస్తున్న వినియోగదారులు కిరోసిన్ విషయమై డీలర్లను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కోటాను పెంచంది తాము ఏమీ చేయలేమని డీలర్లు సమాధానమిస్తున్నారు. దీంతో వినియోగదారులు సంతృప్తి చెందడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెరిగిన రేషన్‌కార్డుల సంఖ్యకు అనుగుణంగా కిరోసిన్ కోటాను పెంచాలని పలువురు కోరుతున్నారు. -
‘ఉచితం’ ఉత్తిదేనా!
యాచారం, న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీలు 50 యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగిస్తే ఉచితం అనే మాట ఉత్తుత్తి ప్రచారంగానే మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ ప్రచారార్భాటమే తప్ప ఆచరణలో అమలుకు నోచుకోకపోవడంతో పేదలకు ఏ మాత్రం ప్రయోజన కలగడం లేదు. దీంతో పేదలు 50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తున్నా.. బిల్లులు మాత్రం నెలవారీగా చెల్లిస్తూనే ఉన్నారు. అసలు 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తే బిల్లులు ఉండవని కూడా లబ్ధిదారులకు అవగాహన లేకుండాపోయింది. ప్రభుత్వం గొప్పలకు ప్రచారం చేసుకుంటూ అమలులో మాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతో ఎస్సీ, ఎస్టీలకు శాపంగా మారింది. ఇందిరమ్మ కలల పథకం, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బడ్జెట్ కింద ఎస్సీ, ఎస్టీల గృహ వినియోగానికి సంబంధించి పాత బకాయిలు మాఫీ చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది మార్చి నుంచి పేదలు 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తే ఉప ప్రణాళిక ద్వారా బకాయిలు చెల్లించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మండలంలో ఏడు వేలకుపైగా అర్హులైన ఎస్సీ, ఎస్టీలు ఉండగా.. గత నెల క్రితం నిర్వహించిన రచ్చబండ-3లో మాత్రం కేవలం 1,047 మందికే ఉచిత విద్యుత్ వర్తించేలా ఎంపిక చేశారు. ఇక నుంచి ఎస్సీ, ఎస్టీలు 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తే మాత్రం బిల్లులు చెల్లించనవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. అర్హులైనవారు కేవలం కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తే సరిపోతుందని తెలియజేశారు. చిత్తశుద్ధిలో లోపం.. అమలులో జాప్యం 50 యూనిట్లలోపు విద్యుత్ వాడితే బిల్లులుండవని అధికారులు రచ్చ బండ-3లో చెప్పిన మాటలతో ఎస్సీ, ఎస్టీలు ఎంతగానో సంతోషపడ్డారు. కానీ అధికారుల్లో చిత్తశుద్ధి లోపం కారణంగా అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. మండలంలోని 20 గ్రామాల్లో నెలకు 50 యూనిట్ల విద్యుత్ వినియోగించే ఏడు వేలకుపైగా కుటుంబాలున్నాయి. మంతన్‌గౌరెల్లి, నందివనపర్తి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నల్లవెల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎస్టీ కుటుంబాలున్నాయి. చింతపట్ల, నక్కర్తమేడిపల్లి, యాచారం, చౌదర్పల్లి, మొండిగౌరెల్లి, చింతుల్ల, గునుగల్ తదితర గ్రామాల్లో వందలాది మంది ఎస్సీలు ఉన్నారు. కొన్ని గ్రామాల్లో పేదలు నెలనెలా బిల్లులు చెల్లిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో అధిక బిల్లులు రావడంతో చాలామంది ఎస్సీ, ఎస్టీల బకాయి బిల్లులు రూ. 50 లక్షలకు చేరాయి. అంధకారంలో ఉండలేక కొంతమంది పేదలు మాత్రం నెలవారీగా బిల్లులు చెల్లిస్తున్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితుల కారణంగా పలువురు బిల్లులు చెల్లించడంలో జాప్యంతో వేలాది రూపాయల బకాయిలు అలాగే ఉండిపోతున్నాయి. విద్యుత్ అధికారులు సైతం అర్హులైన పేదలను ఎంపిక చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రచ్చబండ-3 తర్వాత మండలంలో పలు గ్రామాల్లో బిల్లులు తీసే సమయంలో విద్యుత్ సిబ్బంది 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారు కుల ధ్రువీకరణపత్రాలు ఇస్తే సరిపోతుంది. ఇక నుంచి బిల్లులు చెల్లించేది ఉండదు. కానీ 50 యూనిట్ల లోపు మాత్రమే విద్యుత్ వాడుకోవాలి అని అధికారులు గతంలో సూచించారు. అమలులో మాత్రం విఫలమతున్నారు. దీంతో అర్హులైన పేదలు బిల్లులు చెల్లిస్తూనే ఉన్నారు. కొన్నిచోట్ల బకాయిలు అలాగే ఉంటున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలి. -
రచ్చబండ రసాభాస
పార్వతీపురం,న్యూస్‌లైన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో శుక్రవారం నిర్వహించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సవరపు జయమణి మాట్లాడుతుండగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కొయ్యాన శ్రీవాణి, పట్టణ పార్టీ కన్వీనర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, తదితరులు అడ్డుతగులుతూ గతంలో అందజేసిన దరఖాస్తుల ను పరిష్కరించకుండా మళ్లీ రచ్చబండ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయడానికే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆరోపిస్తూ వేదిక వైపు దూసుకొచ్చారు. దీంతో సీఐ బి. వెంకటరావు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకున్నారు. ఈ సమయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో పలువురు నాయకులు,వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఇతర పార్టీల నాయకు లు కూడా వేదికవైపు దూసుకురావడంతో ఎమ్మెల్యే జయమణి కిందకు వచ్చి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ విపక్ష నాయకులు రచ్చబండకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కొయ్యా న శ్రీవాణి, ద్వారపురెడ్డి శ్రీనివాసరావుల తోపాటు 13 మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ తంతు ముగిసిన కొద్దిసేపటి కే వర్షం పడడంతో కార్యక్రమాన్ని తూతూమంత్రంగా ముగించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మరిశర్ల తులసి, తహశీల్దార్ ఎం. శ్రీని వాసరావు, మున్సిపల్ కమిషనర్ వీసీహెచ్ అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. రచ్చకెక్కిన విబేధాలు కొంతకాలంగా అధికార కాంగ్రెస్ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు రచ్చబండ కార్యక్రమంలో బయటపడ్డాయి. ఎమ్మెల్యే వర్గీయులు మంత్రి శుత్రుచర్ల వర్గాన్ని పక్కనబెట్టా రు. శత్రుచర్ల ప్రధాన అనుచరుడైన రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ డెరైక్టర్ మజ్జి కృష్ణమోహన్‌ను కార్యక్రమానికి ఆహ్వానించలేదు. ప్రోటోకాల్ ప్రకారమైనా కృష్ణమోహన్ పేరు ను ఆహ్వానపత్రికలో వేయాలన్నది ఆయన వర్గీయుల వాదన. దీనికితోడు మున్సిపల్ మా జీ చైర్పర్సన్, కాంగ్రెస్ నాయకురాలు నరసిం హప్రియా థాట్రాజ్ కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అలాగే మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ దొడ్డి విజయ్‌కృష్ణ, తదితర కాంగ్రెస్ నాయకులు మాజీ ఫ్లోర్ లీడర్ వారణాశి గున్నై పె చిందులు తొక్కుతూ సభ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అడిగితే అరెస్టే.. ప్రజలు నిలదీసే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ నాయకులు, అధికారులు భారీ ఎత్తు న పోలీసులను మోహరించారు. అయి నప్పటి కీ అధికారులు, పాలకులను ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేశారు. -
21న జిల్లాకు సీఎం రాక
సాక్షి, కడప : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 21వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నారు. ఆ రోజు రాయచోటిలో జరిగే రచ్చబండలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 గంటల వరకు జిల్లాలో ఉంటారు. అనంతరం ఇక్కడి నుంచి చిత్తూరు జిల్లా కలికిరికి బయలుదేరి వెళతారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా కడప ఆర్డీఓ హరిత బుధవారం రాయచోటిలో పర్యటించి సీఎం పాల్గొనే రచ్చబండ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.