రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మ హస్తం పథకాన్ని ప్రజలు ఆదరించకపోవడంతో కొన్ని సరుకులను సరఫరా చేయకుండా నిలిపివేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు యోచిస్తున్నారు.
మోర్తాడ్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మ హస్తం పథకాన్ని ప్రజలు ఆదరించకపోవడంతో కొన్ని సరుకులను సరఫరా చేయకుండా నిలిపివేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు యోచిస్తున్నారు. దీనిపై క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలన జరుపుతున్నారు. తాజాగా ప్రతినెల గోదాముల్లో మిగిలిపోతున్న సరుకుల వివరాలను జిల్లా పౌర సరఫరాల సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంకు అందజేస్తున్నారు. మిగిలిపోతున్న సరుకుల వివరాలతోపాటు అందుకు గల కారణాలను కూడా అధికారులు విశ్లేషిస్తున్నారు. సరుకుల్లో నాణ్యత లేకపోవడం, మార్కెట్ ధరల కంటే అమ్మ హస్తం పథకంలోనే ధర ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు కొన్ని సరుకులను ఆదరించడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించినట్లు తెలిసింది. అమ్మహస్తం పథకంలో తొమ్మిది నిత్యావసర సరుకులను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రూ. 292 విలువ చేసే సరుకులకు రూ. 107 సబ్సిడీని ప్రభుత్వం భరిస్తూ కేవలం రూ. 185 ధరకు అమ్మ హస్తం పథకంను అమలు చేసింది. అయితే పథకాన్ని ఉగాది పండుగ రోజున అమలు చేయగా ఇప్పటివరకు కొన్ని రకాల సరుకులను వినియోగదారులు తీసుకునేందుకు ఆసక్తిని కనబరచడం లేదు.
దీంతో పౌర సరఫరా శాఖ గోదాముల్లో ఆయా సరుకుల నిల్వలు పేరుకుపోయాయి. చింతపండు, పసుపు, ఉప్పు, మిరప్పొడి నిల్వలు గోదాంలలో అధికంగా పేరుక పోయాయి. జిల్లాలో ఇప్పటి వరకు 6.90 లక్షల తెలుపు రంగు కార్డులు ఉన్నాయి. తాజాగా నిర్వహిస్తున్న రచ్చబండలో 80 వేల తెలుపు రంగు రేషన్ కార్డులు జారీ చేయడానికి కూపన్లను అధికారులు వినియోగదారులకు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఉన్న 6.90 లక్షల తెలుపు రంగు రేషన్ కార్డుల వినియోగదారులకు అమ్మ హస్తం పథకాన్ని అందించడానికి ప్రతినెల ఏర్పాట్లు జరిగాయి. వచ్చేనెల నుంచి తెలుపు రంగు రేషన్ కార్డుల వినియోగదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో అమ్మహస్తం పథకంలో ఇప్పుడే మార్పులు చేస్తే ఎలాంటి గందరగోళం ఉండదని అధికారులు భావిస్తున్నారు.
వచ్చేనెల నుంచి అన్ని గ్రామాల్లో వినియోగదారుల సంఖ్య పెరగనుండటంతో అమ్మ హస్తం పథకంలో తొమ్మిది రకాలకు బదులు ఆరు రకాల సరుకులనే సరఫరా చేసి ధరను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పంచదార, పామోలిన్ ఆయిల్, ఉప్పు, పసుపు, మిరప్పొడి, కందిపప్పు, గోధుమపిండి, గోధుమలు, చింతపండును సరఫరా చేస్తున్నారు. ఇందులో పసుపు, మిరప్పొడి, చింతపండు, ఉప్పును మినహాయించి మిగిలిన సరుకులను సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో చేస్తున్న అధ్యయనంలో తేలిన విషయాల ఆధారంగా పథకంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్ ఒకరు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.