శంషాబాద్, న్యూస్‌లైన్: ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అమ్మహస్తం పథకం ఏడాది దాటక ముందే అస్తవ్యస్తంగా మారింది. ప్రజలకు అవసరమైన సరకులను సక్రమంగా అందించలేక పోతోంది. నాసిరకం సరుకులు తీసుకోడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో కొన్ని రకాల సరుకులు గోదాములకే పరిమితమవుతున్నాయి.
జనవరిలో కార్డుదారులకు ఇవ్వాల్సిన పామాయిల్ ప్యాకెట్‌లకు మొండిచేయి చూపిన ప్రభుత్వం అప్పట్లో డీలర్లు చెల్లించిన డీడీలను ఫిబ్రవరి నెలకు సర్దుబాటు చేస్తోంది. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన పామాయిల్ కోటాను విడుదల చేయడానికి డీలర్ల నుంచి ఎలాంటి డీడీలను తీసుకోకూడదని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. దీంతో కార్డుదారులకు అందాల్సిన ఒక నెల పామాయిల్ ప్యాకెట్లను పక్కనపెట్టేసినట్లే. పప్పు పరిస్థితి కూడా అలాగే ఉంది. డిమాండ్ ఉన్న చోట కూడా పప్పును సరిగా సరఫరా చేయడం లేదు. పప్పు కోసం రేషన్ డీలర్లు డీడీలను సమర్పించినా ఇంకా కోటా విడుదల కాలేదు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పప్పు కోటా విడుదల ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.
ఆ సరకులు వద్దేవద్దు..
అమ్మహస్తం పథకం ద్వారా అందించే కారంపొడి, పసుపు, చింతపండు తీసుకోడానికి రేషన్ డీలర్లు ససేమిరా అంటున్నారు. ఈ మూ డు వస్తువులు నాసిరకంగా ఉండడంతో దాదా పు మూడునెలలుగా జిల్లాలోని ఆయా గోదాముల్లో సరుకులు మూలుగుతున్నాయి. నాసిరకంగా ఉన్న కారం పొడి గతేడాది జూన్‌లో ప్యా కై ఉన్నాయి. తొమ్మిది నెలల వరకు మాత్రమే వాడాల్సిన కారంపొడి ప్యాకెట్ల గడువు మార్చినెలాఖరుకు ముగియనుంది.
ఒక్క శంషాబాద్ గోదాములోనే ఏడు క్వింటాళ్ల కారంపొడి ప్యాకెట్లు మూలనపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కారంపొడి ప్యాకెట్లు పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక పసుపు, చింతపండుల పరిస్థితి అంతే. నాసిరకం సరుకులను జనాలు గుర్తించి దూరం పెడుతున్నా సర్కారు మాత్రం నాణ్యమైన సరుకులు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.
‘అమ్మహస్తం’.. అస్తవ్యస్తం
Published Sat, Feb 1 2014 5:38 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement