palm oil packets
-
‘అమ్మహస్తం’.. అస్తవ్యస్తం
శంషాబాద్, న్యూస్‌లైన్: ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అమ్మహస్తం పథకం ఏడాది దాటక ముందే అస్తవ్యస్తంగా మారింది. ప్రజలకు అవసరమైన సరకులను సక్రమంగా అందించలేక పోతోంది. నాసిరకం సరుకులు తీసుకోడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో కొన్ని రకాల సరుకులు గోదాములకే పరిమితమవుతున్నాయి. జనవరిలో కార్డుదారులకు ఇవ్వాల్సిన పామాయిల్ ప్యాకెట్లకు మొండిచేయి చూపిన ప్రభుత్వం అప్పట్లో డీలర్లు చెల్లించిన డీడీలను ఫిబ్రవరి నెలకు సర్దుబాటు చేస్తోంది. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన పామాయిల్ కోటాను విడుదల చేయడానికి డీలర్ల నుంచి ఎలాంటి డీడీలను తీసుకోకూడదని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. దీంతో కార్డుదారులకు అందాల్సిన ఒక నెల పామాయిల్ ప్యాకెట్లను పక్కనపెట్టేసినట్లే. పప్పు పరిస్థితి కూడా అలాగే ఉంది. డిమాండ్ ఉన్న చోట కూడా పప్పును సరిగా సరఫరా చేయడం లేదు. పప్పు కోసం రేషన్ డీలర్లు డీడీలను సమర్పించినా ఇంకా కోటా విడుదల కాలేదు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పప్పు కోటా విడుదల ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఆ సరకులు వద్దేవద్దు.. అమ్మహస్తం పథకం ద్వారా అందించే కారంపొడి, పసుపు, చింతపండు తీసుకోడానికి రేషన్ డీలర్లు ససేమిరా అంటున్నారు. ఈ మూ డు వస్తువులు నాసిరకంగా ఉండడంతో దాదా పు మూడునెలలుగా జిల్లాలోని ఆయా గోదాముల్లో సరుకులు మూలుగుతున్నాయి. నాసిరకంగా ఉన్న కారం పొడి గతేడాది జూన్‌లో ప్యా కై ఉన్నాయి. తొమ్మిది నెలల వరకు మాత్రమే వాడాల్సిన కారంపొడి ప్యాకెట్ల గడువు మార్చినెలాఖరుకు ముగియనుంది. ఒక్క శంషాబాద్ గోదాములోనే ఏడు క్వింటాళ్ల కారంపొడి ప్యాకెట్లు మూలనపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కారంపొడి ప్యాకెట్లు పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక పసుపు, చింతపండుల పరిస్థితి అంతే. నాసిరకం సరుకులను జనాలు గుర్తించి దూరం పెడుతున్నా సర్కారు మాత్రం నాణ్యమైన సరుకులు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. -
అమ్మో.. హస్తం!
జిల్లాలో అమ్మహస్తం పథకం అమలు అభాసు పాలవుతోంది. సరుకుల్లో నాణ్యత లోపించడం, బహిరంగ మార్కెట్‌తో పోల్చితే ధరలో పెద్దగా తేడా లేకపోవడం తదితర కారణాల వల్ల కార్డుదారులు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో 9 రకాల సరుకులు కొనేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మూడు నాలుగు రకాల సరుకులే చాలని సరిపుచ్చుకుంటున్నారు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు పథకం అమలు తీరును పరిశీలిస్తే ఇది తెలుస్తోంది. సాక్షి, నల్లగొండ: చౌకధర దుకాణాల ద్వారా రూ.185కే తొమ్మిది రకాల నాణ్యమైన నిత్యావసర సరుకుల అందించాలన్న సర్కారు లక్ష్యం బెడిసికొడుతోంది. జిల్లాలో గత ఏప్రిల్ 17న అమ్మహస్తం పథకం ప్రారంభమైంది. పేరుకు గొప్ప పథకంలా కనిపిస్తున్నా.. ఆచరణలో మాత్రం చతికిలబడింది. పథకం ఆరంభం నాడు కార్డుదారుల నుంచి లభించిన ఆదరణ ప్రస్తుతం కరువైంది. జిల్లాలో మొత్తం 2043 రేషన్ దుకాణాల పరిధిలో 9.42 లక్షల బీపీఎల్ కార్డులు ఉన్నాయి. ఇందులో 25 శాతం కార్డుదారులు ప్రతినెలా 9 రకాల వస్తువులు కొనుగోలు చేస్తున్న దాఖలాలు లేవంటే అతిశ యోక్తి కాదు. ఇది కార్డుదారుల నుంచి లభిస్తున్న స్పందనకు అద్దంపడుతోంది. నాణ్యత నగుబాటు... రేషన్ దుకాణాల ద్వారా అందించే తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల నాణ్యతను చూసి లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. అక్కడక్కడా పుచ్చులున్న కందిపప్పు, గింజలున్న నల్లని చింతపండు, నాసిరకం గోధుమలు, గోధుమ పిండి, రంగు తప్ప ఘాటులేని కారం పొడి, రుచీపచీ లేని పామాయిల్ ప్యాకెట్లు లబ్ధిదారులను మెప్పించలేకపోతున్నాయి. కొన్నిచోట్ల సరుకులను చూసి ప్రజలు అమ్మో.. అంటూ ముఖం తిప్పుకుని ఆమడ దూరం పోతున్నారు. దీంతో క్రమంగా ఈ సరుకులు కొనుగోలు చేసే వారి సంఖ్య పడిపోతోంది. తొమ్మిది సరుకుల్లో వినియోగదారులు నాలుగు సరుకులపై మాత్రమే ఆసక్తి కనబర్చుతున్నారు. చక్కర, పామాయిల్, గోధుమ పిండి, అడపాదడపా కందిపప్పు కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన చింతపండు, గోధుమలు, ఉప్పు, కారంపొడి, పసుపు పట్ల పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. నాసిరకంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. డీలర్ల అనాసక్తి... పెట్టుబడికి తగ్గట్లు కమీషన్ లేకపోవడం, వచ్చే సరుకుల్లో తరుగుదల ఉండటంతో రేషన్ డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. పైగా రవాణా చేస్తున్న సమయంలో పామాయిల్ ప్యాకెట్లు పగలడంతో మరింత నష్టం వాటిల్లుతోంది. 9 రకాల సరుకులు అమ్మితే డీలర్లకు కమీషన్ రూపంలో అందేది 4.01 రూపాయలు. ఇందులోనే హమాలీ, డీడీ చార్జీలు భరించాలి. ఇవన్నీ పోను ఒక్కో కార్డుదారునికి 9 సరుకులు అమ్మితే సరాసరి *2.50 కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పండుగకు పామాయిలేది?
హుజూరాబాద్/జగిత్యాల, న్యూస్‌లైన్ : పండుగకు పిండివంటలు భారమయ్యాయి. రేషన్ దుకాణాల ద్వారా ఇవ్వాల్సిన పామాయిల్ ప్యాకెట్లను పండుగ సమయంలోనే నిలిపివేశారు. ప్రజలు పైసలు వెచ్చించి దుకాణాల్లో నూనె ప్యాకెట్లు కొనుక్కొని ఆర్థికంగా నష్టపోతున్నారు. బతుకమ్మ, దసరా పండుగలకు ప్రతీ ఇంట్లో పిండివంటలు చేసుకోవడం ఆనవాయితీ. ఇందుకు పది రోజుల ముందు నుంచే సన్నద్ధమవుతారు. రేషన్ దుకాణాల ద్వారా వచ్చే పామాయిల్‌ను పేద కుటుంబాలు పిండివంటలకు వినియోగించుకుంటాయి. దీని ధర ఒక్కో ప్యాకెట్‌కు రూ.40 ఉంటుంది. ఈ సారి ప్రభుత్వం పామాయిల్ ప్యాకెట్లు సరఫరా చేయకపోవడంతో చాలా మంది పిండివంటలకు దూరమయ్యారు. కొందరు రూ.80 నుంచి రూ.120 వరకు చెల్లించి దుకాణాల్లో కొనుగోలు చేశారు. గతేడాది పండుగ సమయంలో చక్కెర, పామాయిల్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా... ఈ ఏడాది కూడా అంతే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో సామాన్యులు పిండివంటలకు దూరమయ్యే పరిస్థితులు దాపురించాయి. దీపావళికి కూడా కష్టమే శనివారం సద్దుల బతుకమ్మ, వెంటనే దసరా పండుగ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు పామాయిల్ ప్యాకెట్లు రావడం కష్టమే. మరో 20 రోజుల్లో ఉన్న దీపావళి పండుగకు కూడా పామాయిల్ పంపిణీ అనుమానమే. పామాయిల్ నిల్వలు ఇతర ప్రాంతాల నుంచి కాకినాడ ఓడరేవుకు వస్తాయి. అక్కడినుంచి జిల్లాల గోదాములకు సరఫరా చేస్తారు. జిల్లాలో 16 పీడీఎస్ గోదాములున్నాయి. ఒక్క జగిత్యాల పీడీఎస్ గోదాముకే 60 వేల నూనె ప్యాకెట్లు ప్రతీ నెల అవసరమవుతాయి. ఇదే తీరులో ఒక్కో గోదాంకు 50 వేల నుంచి లక్ష వరకు ప్యాకెట్లు పంపిణీ అవుతాయి. ఈ సారి డీలర్లు డీడీలు కట్టినా నూనె ప్యాకెట్లు పంపిణీ చేయలేదు. ప్రస్తుతం కాకినాడలో పామాయిల్ లేదని, మరో నెల వరకు కూడా ఇదే పరిస్థితి అని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పండగకు పిండివంటలు చేసుకోవడం అనుమానంగానే మారింది. కాకినాడలో నిల్వలు లేకే ఈ పరిస్థితి నెలకొందని, ఈ నెల పామాయిల్ రాలేదని పౌరసరఫరాలశాఖ డీఎం సంపత్‌కుమార్ తెలిపారు.