జిల్లాలో అమ్మహస్తం పథకం అమలు అభాసు పాలవుతోంది. సరుకుల్లో నాణ్యత లోపించడం,
బహిరంగ మార్కెట్‌తో పోల్చితే ధరలో పెద్దగా తేడా లేకపోవడం తదితర కారణాల వల్ల కార్డుదారులు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో 9 రకాల సరుకులు కొనేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మూడు నాలుగు రకాల సరుకులే చాలని సరిపుచ్చుకుంటున్నారు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు పథకం అమలు తీరును పరిశీలిస్తే ఇది తెలుస్తోంది.
సాక్షి, నల్లగొండ: చౌకధర దుకాణాల ద్వారా రూ.185కే తొమ్మిది రకాల నాణ్యమైన నిత్యావసర సరుకుల అందించాలన్న సర్కారు లక్ష్యం బెడిసికొడుతోంది. జిల్లాలో గత ఏప్రిల్ 17న అమ్మహస్తం పథకం ప్రారంభమైంది.
పేరుకు గొప్ప పథకంలా కనిపిస్తున్నా.. ఆచరణలో మాత్రం చతికిలబడింది. పథకం ఆరంభం నాడు కార్డుదారుల నుంచి లభించిన ఆదరణ ప్రస్తుతం కరువైంది. జిల్లాలో మొత్తం 2043 రేషన్ దుకాణాల పరిధిలో 9.42 లక్షల బీపీఎల్ కార్డులు ఉన్నాయి. ఇందులో 25 శాతం కార్డుదారులు ప్రతినెలా 9 రకాల వస్తువులు కొనుగోలు చేస్తున్న దాఖలాలు లేవంటే అతిశ యోక్తి కాదు. ఇది కార్డుదారుల నుంచి లభిస్తున్న స్పందనకు అద్దంపడుతోంది.
నాణ్యత నగుబాటు...
రేషన్ దుకాణాల ద్వారా అందించే తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల నాణ్యతను చూసి లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. అక్కడక్కడా పుచ్చులున్న కందిపప్పు, గింజలున్న నల్లని చింతపండు, నాసిరకం గోధుమలు, గోధుమ పిండి, రంగు తప్ప ఘాటులేని కారం పొడి, రుచీపచీ లేని పామాయిల్ ప్యాకెట్లు లబ్ధిదారులను మెప్పించలేకపోతున్నాయి.
కొన్నిచోట్ల సరుకులను చూసి ప్రజలు అమ్మో.. అంటూ ముఖం తిప్పుకుని ఆమడ దూరం పోతున్నారు. దీంతో క్రమంగా ఈ సరుకులు కొనుగోలు చేసే వారి సంఖ్య పడిపోతోంది. తొమ్మిది సరుకుల్లో వినియోగదారులు నాలుగు సరుకులపై మాత్రమే ఆసక్తి కనబర్చుతున్నారు. చక్కర, పామాయిల్, గోధుమ పిండి, అడపాదడపా కందిపప్పు కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన చింతపండు, గోధుమలు, ఉప్పు, కారంపొడి, పసుపు పట్ల పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. నాసిరకంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.
డీలర్ల అనాసక్తి...
పెట్టుబడికి తగ్గట్లు కమీషన్ లేకపోవడం, వచ్చే సరుకుల్లో తరుగుదల ఉండటంతో రేషన్ డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. పైగా రవాణా చేస్తున్న సమయంలో పామాయిల్ ప్యాకెట్లు పగలడంతో మరింత నష్టం వాటిల్లుతోంది. 9 రకాల సరుకులు అమ్మితే డీలర్లకు కమీషన్ రూపంలో అందేది 4.01 రూపాయలు. ఇందులోనే హమాలీ, డీడీ చార్జీలు భరించాలి. ఇవన్నీ పోను ఒక్కో కార్డుదారునికి 9 సరుకులు అమ్మితే సరాసరి *2.50 కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమ్మో.. హస్తం!
Published Sun, Oct 20 2013 3:32 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement