
సాంకేతిక నైపుణ్యం.. శిల్పకళా వైభవం కలగలిసిన అద్భుత కట్టడం
భక్తుల స్వహస్తాలతో అభిషేకించే బ్రహ్మసూత్ర లింగం
వెయ్యేళ్ల కిందటి నిర్మాణం
చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య ఓం నమఃశివాయ స్మరణతో మారుమోగే అద్భుత దేవాలయమే శ్రీ ఛాయా సోమేశ్వరాలయం. సోమవారం వచ్చిందంటే భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం అద్భుత నిర్మాణ శైలికి నిలయం. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న నల్లగొండ పట్టణానికి సమీపంలోని పానగల్ వద్ద ఉన్న ఛాయా సోమేశ్వరాలయం శివరాత్రి సందర్భంగా మహోత్సవాలకు సిద్ధం అవుతోంది.
ఎక్కడైనా సూర్యకాంతి, విద్యుత్తు దీపాల వెలుతురులో ఏర్పడే ఛాయ (నీడ) గమనాన్ని బట్టి మారడం సహజం. కానీ ఇక్కడ శివలింగంపై పడే ఛాయ సూర్యుని గమనంతో సంబంధం లేకుండా స్తంభాకారంలో నిశ్చలంగా ఉండటం విశేషం. సూర్యరశ్మితో సంబంధం లేకుండా, వర్షం పడినా, ఆకాశం మేఘావృతమైనా ఆ నీడ ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నివేళలా ఒకేలా ఉంటుంది.
అందుకే ఇది ఛాయా సోమేశ్వరాలయంగా ప్రసిద్ధి పొందింది. రాజసం ఉట్టిపడే అద్భుత శిల్ప కళాసంపద, కాకతీయుల నాటి శిల్ప కళారీతులు శ్రీఛాయాసోమేశ్వర స్వామి సొంతం. ఈ ఆలయంలోని ఎంతో విశేషమైన బ్రహ్మసూత్ర లింగాన్ని భక్తులే స్వయంగా అభిషేకించడం మరోప్రత్యేకత. ఆ శివలింగాన్ని ఒక్కసారి తాకితే వేయి లింగాలను దర్శించిన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.
వెయ్యేళ్ల కిందటి అద్భుత కట్టడం...
భారతీయ వాస్తు, శిల్పకళా చాతుర్యంలో సాంకేతిక విజ్ఞానాన్ని మిళితం›చేసి ఆలనాటి కుందూరు చోళులు ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. పానగల్‌ను రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల సామంత రాజులైన కుందూరు చాళుక్య రాజు ఉదయ భానుడు ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. తమ ఆరాధ్యదైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాల్లో దీంతో పాటు సమీపంలోనే పచ్చల సోమేశ్వరాలయం కూడా నిర్మించారు. శివలింగం చుట్టూ పచ్చని వజ్రాలను పొదగడంతో ఆలయం అంతా పచ్చని వెలుతురు వెదజల్లేదని చెబుతారు.
మూడు గర్భాలయాలు...
చతురస్రాకారంలో ఉండే ఈ ఆలయంలో మూడు గర్భగుడులు ఉంటాయి. అందుకే దీనిని త్రికూటాలయంగా పేర్కొంటారు. మరోవైపు ఉపాలయాలు ఇక్కడ ఉన్నాయి.
స్తంభాలపై రామాయణ, మహాభారతాలు...
గుడి ఆవరణ మొత్తం 18 స్తంభాలతో ఉంటుంది. అందులో పడమరన ఉన్న సోమేశ్వరుడి ఆలయం ముందు 8 స్తంభాలు ఉంటాయి. వాటిల్లో ఏ స్తంభం నీడ శివలింగంపై పడుతుందన్నది ఇక్కడి రహస్యం. మరోవైపు ఆయా స్తంభాలపై రామాయణ, మహాభారతాలు విగ్రహ రూపంలో ఉండటం విశేషం. నాలుగు స్తంభాలపై ఉండే మండపం పైభాగంలో అష్టదిక్పాలకులు, మూడు గర్భ గుడుల ముందు గజలక్ష్మి కొలువై ఉంటుంది. అయితే సూర్యభగవానుడి భార్య ఛాయాదేవి పరమ శివుని ప్రార్థించి శివుని వరంతో ఛాయగా ఉన్నట్లు భావిస్తారు.
ప్రతి సోమవారం, పర్వదినాల్లో ప్రత్యేక పూజలు
ఆలయంలో ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూజలు కొనసాగుతాయి. ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు చేస్తారు. తొలి ఏకాదశితో పాటు నిత్యాభిషేకాలు, కార్తీక పౌర్ణమి, దసరా, మహాశివరాత్రి, ఉగాది వంటి పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆరుద్ర నక్షత్రం, అమావాస్య రోజుల్లోనూ విశేషంగా భక్తులు వస్తారు. మహాశివరాత్రి సందర్భంగా యజ్ఞాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, శివ పార్వతీ కళ్యాణం, అగ్నిగుండాలు, తెప్పొత్సవాలను నిర్వహిస్తారు.
ఉదయ సముద్రం నీరే కోనేరులోకి పక్కనే ఉన్న ఉదయ సముద్రం చెరువులోని నీరే కోనేరులోకి రావడం ఇక్కడ విశేషం. దానికి ప్రత్యేకంగా పాయ అంటూ లేకపోయినా నీరు కోనేరులోకి రావడం ప్రత్యేకత. ఇప్పటికీ నీటి తడి (చెమ్మ) శివలింగం ఉన్న గర్భగుడిలో ఉంటుంది.
– ప్రధాన అర్చకుడు ఉదయ్‌కుమార్
.
– చింతకింది గణేశ్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment