హుజూరాబాద్/జగిత్యాల, న్యూస్‌లైన్ : పండుగకు పిండివంటలు భారమయ్యాయి. రేషన్ దుకాణాల ద్వారా ఇవ్వాల్సిన పామాయిల్ ప్యాకెట్లను పండుగ సమయంలోనే నిలిపివేశారు. ప్రజలు పైసలు వెచ్చించి దుకాణాల్లో నూనె ప్యాకెట్లు కొనుక్కొని ఆర్థికంగా నష్టపోతున్నారు. బతుకమ్మ, దసరా పండుగలకు ప్రతీ ఇంట్లో పిండివంటలు చేసుకోవడం ఆనవాయితీ.
ఇందుకు పది రోజుల ముందు నుంచే సన్నద్ధమవుతారు. రేషన్ దుకాణాల ద్వారా వచ్చే పామాయిల్‌ను పేద కుటుంబాలు పిండివంటలకు వినియోగించుకుంటాయి. దీని ధర ఒక్కో ప్యాకెట్‌కు రూ.40 ఉంటుంది. ఈ సారి ప్రభుత్వం పామాయిల్ ప్యాకెట్లు సరఫరా చేయకపోవడంతో చాలా మంది పిండివంటలకు దూరమయ్యారు. కొందరు రూ.80 నుంచి రూ.120 వరకు చెల్లించి దుకాణాల్లో కొనుగోలు చేశారు. గతేడాది పండుగ సమయంలో చక్కెర, పామాయిల్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా... ఈ ఏడాది కూడా అంతే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో సామాన్యులు పిండివంటలకు దూరమయ్యే పరిస్థితులు దాపురించాయి.
దీపావళికి కూడా కష్టమే
శనివారం సద్దుల బతుకమ్మ, వెంటనే దసరా పండుగ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు పామాయిల్ ప్యాకెట్లు రావడం కష్టమే. మరో 20 రోజుల్లో ఉన్న దీపావళి పండుగకు కూడా పామాయిల్ పంపిణీ అనుమానమే. పామాయిల్ నిల్వలు ఇతర ప్రాంతాల నుంచి కాకినాడ ఓడరేవుకు వస్తాయి. అక్కడినుంచి జిల్లాల గోదాములకు సరఫరా చేస్తారు. జిల్లాలో 16 పీడీఎస్ గోదాములున్నాయి.
ఒక్క జగిత్యాల పీడీఎస్ గోదాముకే 60 వేల నూనె ప్యాకెట్లు ప్రతీ నెల అవసరమవుతాయి. ఇదే తీరులో ఒక్కో గోదాంకు 50 వేల నుంచి లక్ష వరకు ప్యాకెట్లు పంపిణీ అవుతాయి. ఈ సారి డీలర్లు డీడీలు కట్టినా నూనె ప్యాకెట్లు పంపిణీ చేయలేదు. ప్రస్తుతం కాకినాడలో పామాయిల్ లేదని, మరో నెల వరకు కూడా ఇదే పరిస్థితి అని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పండగకు పిండివంటలు చేసుకోవడం అనుమానంగానే మారింది. కాకినాడలో నిల్వలు లేకే ఈ పరిస్థితి నెలకొందని, ఈ నెల పామాయిల్ రాలేదని పౌరసరఫరాలశాఖ డీఎం సంపత్‌కుమార్ తెలిపారు.
పండుగకు పామాయిలేది?
Published Sat, Oct 12 2013 4:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement