అంతా నాసిరకం
ఉదయగిరి, న్యూస్‌లైన్: నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్న నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అమలులోకి తెచ్చిన అమ్మహస్తం పథకం ముణ్ణాళ్ల ముచ్చటగా మిగిలింది. ఈ పథకం అమలు ఇప్పుడు రేషన్‌డీలర్లకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. నాసిరకమైన సరుకులను కొనుగోలు చేసేందుకు లబ్ధిదారులు వెనకడుగు వేస్తుండగా, ఎలాగైనా అమ్మాల్సిందేనంటూ అధికారులు హుకుం జారీ చేస్తుండటంతో డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం జిల్లాలో ఏటా రూ.535 కోట్లకు పైగా సబ్సిడీ భరాయిస్తోంది. సరుకుల్లో నాణ్యత లేకపోవడంతో ప్రభుత్వం ఖర్చుచేస్తున్న సబ్సిడీ పెద్దలపాలవుతుందే తప్ప పేదలకు ఒనగూరిందేమీ లేదు. జిల్లాలోని 1896 చౌకదుకాణాల ద్వారా 8,95,208 కార్డుదారులకు రేషన్ సరుకులు అందజేస్తున్నారు.
ఈ ఏడాది ఉగాది నాడు ప్రారంభించిన ‘అమ్మహస్తం’ పథకం ద్వారా 9 రకాల సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ సరుకుల కిట్‌లో బియ్యం, కిరోసిన్, అరకిలో చక్కెర, కిలో కందిపప్పు, వంద గ్రాముల పసుపు, 250 గ్రాముల కారం, అరకిలో చింతపండు , కిలో ఉప్పు, కిలో గోధుమపిండి , కిలో నూనె ఉంటాయి. వీటిని సబ్సిడీపై రూ.185కి ఇస్తున్నారు. ఈ సరుకులు ప్యాక్ చేస్తున్న కవర్లు ఆకర్షణీయంగా ఉంటున్నా కందిపప్పు, పసుపు, కారం, చింతపండు, గోధుమపిండి నాసిరకంగా ఉంటున్నాయి. చింతపండులో గింజలు తప్ప పండు కనిపించడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. కారంలో రంపపు పొడి, ఇతరత్రా పొడులు కలుపుతున్నారని, ఇది తింటే రోగాలపాలు కావల్సిందేనని దాని జోలికి వెళ్లడం లేదు. కందిపప్పు ఎంతసేపు ఉడకబెట్టినా ఉడకడం లేదు. గోధుమపిండిలో పురుగులు దర్శనమిస్తున్నాయి.
ఈ విధంగా ఒకటి, రెండు నెలల్లో సరఫరా అవుతున్నాయనుకుంటే పొరపాటే. పథకం ప్రారంభించిన ఈ 8 నెలల నుంచి ఒకటి, రెండు నెలలు తప్ప ఇదే పరిస్థితి కొనసాగుతోందని కొందరు డీలర్లు సైతం ఒప్పుకుంటున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులు బియ్యం, చక్కెర, నూనెను మాత్రం తీసుకెళుతున్నారు. మిగతా సరుకులు నాసిరకంగా ఉన్నాయని లబ్ధిదారులు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసిరకమైన సరుకులు పేదలకు అంటగడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లబోదిబోమంటున్న డీలర్లు
సివిల్ సప్లయీస్ అధికారులు ప్రతి నెలా కచ్చితంగా అమ్మహస్తం సరుకులకు డీడీలు చెల్లించి సరుకులు తీసుకోవాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నారు. సరుకుల్లో నాణ్యత లేకపోవడంతో లబ్ధిదారులు తీసుకోక తాము ఆర్థికంగా నష్టపోతున్నామని డీలర్లు వాపోతున్నారు. ఈ సరుకుల విషయంలో మినహాయింపు ఇస్తే పథకం మొత్తం నీరుగారిపోతుందనే ఉద్దేశంతో డీలర్లు కచ్చితంగా డీడీలు చెల్లించాలనే షరతును అధికారులు పెడుతున్నారు.