రేషన్‌లో పామాయిల్ పరేషాన్..!
సబ్సిడీ భరించేందుకు కేంద్రం విముఖత
నేడు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్: రేషన్ సరుకుల్లో పామాయిల్‌ను కొనసాగించాలా, వద్దా అన్న అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పామాయిల్ సరఫరాతో ప్రతినెలా పడుతున్న రూ.15 కోట్ల భారాన్ని భరించేందుకు కేంద్రం విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో దాన్ని భరించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ముందుకు వస్తుందా అనేది సందిగ్ధంగా మారింది. దీనిపై బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశ ం ఉంది. సమైక్య రాష్ట్రంలో అమ్మహస్తం పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతినెలా రూ.185కే తొమ్మిది రకాల సరకుల పంపిణీ జరిగేది. ఈ పథకం కింద పంపిణీ చేసే లీటర్ పామాయిల్ సబ్సిడీ భారాన్ని 2013 అక్టోబర్ వరకు భరించిన కేంద్రం ఆ తరువాత చేతులెత్తేసింది. దీంతో ఆ భారం రాష్ర్ట ప్రభుత్వంపై పడింది. తెలంగాణలోనే 15 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించింది.
అమ్మహస్తం పేరు మార్పు.. సరుకుల కుదింపు?
బుధవారం కేబినెట్ భేటీలో ప్రధానంగా ‘అమ్మ హస్తం’ పథకం పేరు మార్పు, పథకంలో అందజేస్తున్న సరుకుల కుదింపుపైనా చర్చ జరుగవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం పథకంలో భాగంగా పంపిణీ చేస్తున్న సరుకుల్లో చింతపండు, కారం, పసుపుపై వినియోగదారుల నుంచి పెద్దగా డిమాండ్ లేదు. 20 శాతం మంది మాత్రమే వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఈ నేపథ్యంలో వీటిని పథకం నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న చక్కెరను అరకేజీ నుంచి కేజీకి, గోధుమలను కిలో నుంచి నుంచి కిలోన్నరకు పెంచే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.