* వచ్చే నెల నుంచి సరుకులు ఇవ్వబోమని చెబుతున్న అధికారులు
* దాని స్థానంలో కొత్త పథకమంటూ కాలయాపన
సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: తెల్ల రేషన్ కార్డుల ద్వారా పేదలకిచ్చే నిత్యావసర వస్తువులను పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అమల్లో ఉన్న అమ్మహస్తం పథకం కింద ఇస్తున్న సరుకుల్లో చాలావాటికి కోత పెట్టగా వచ్చే నెల నుంచి దాన్ని పూర్తిగా ఎత్తివేయనుంది. అమ్మహస్తం పథకం కింద నాలుగు నెలల వరకూ రూ.185కి అర కేజీ పంచదార, 100 గ్రాముల పసుపు, పావు కేజీ కారం, కేజీ చొప్పున గోధుమలు, గోధుమపిండి, కందిపప్పు, ఉప్పు, పామాయిల్, అర కేజీ చింతపండు పంపిణీ చేసేవారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెమ్మదిగా తగ్గిస్తూ వచ్చింది. నాలుగు నెలలుగా పామాయిల్ పంపిణీ పూర్తిగా నిలిపివేసింది. ఉప్పు, పసుపు, కారం ఇతర వస్తువులకూ కోత పెట్టింది. చివరికి ఈ నెలలో కేవలం పంచదార, కారం మాత్రమే ఇచ్చారు. కొన్నిచోట్ల పంచదార, ఉప్పు ఇతర వస్తువులు కూడా ఇచ్చారు. వచ్చే నెల నుంచి అమ్మహస్తం పథకం ఉండదని, సరుకులు ఏమీ ఇవ్వమని రేషన్ డీలర్లకు పౌరసరఫరాల శాఖాధికారులు చెబుతున్నారు.
కొత్త పథకం పేరుతో కాలయాపన
అమ్మహస్తం పథకం స్థానంలో ఎన్టీఆర్ పేరుతో మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసింది. అయితే ఆ దిశగా ఇప్పటివరకూ ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. కనీసం దానిపై ఎటువంటి కసరత్తు కూడా జరగలేదు. దీంతో వెంటనే కొత్త పథకం ప్రవేశపెట్టే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ కొత్త పథకం అమలు చేసినా అమ్మహస్తం తరహాలో అన్ని సరుకులను ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కేవలం ఎప్పటి మాదిరిగా ఇచ్చే బియ్యం, కిరోసిన్‌తోపాటు చక్కెర, కందిపప్పుకే కొత్త పథకాన్ని పరిమితం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరలున్న సరుకులను ఇప్పటివరకూ తక్కువ ధరకు పొందుతున్న పేదలు మళ్లీ ఇబ్బందుల్లో పడక తప్పేలా లేదు.
పనికి రాకుండా పోయిన కారం, చింతపండు
మరోవైపు పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా గోదాముల్లో నిల్వ ఉంచిన 71.9 మెట్రిక్ టన్నుల కారంపొడి, 33.5 మెట్రిక్ టన్నుల చింతపండు ఏమాత్రం పనికి రాకుండా పోయింది. 2013 మే, జూన్ నెలల కోటాకు సంబంధించి పౌర సరఫరాల కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారుల వినియోగానికి మించి కారంపొడి, చింతపండు, పసుపును కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ ఉంచారు.
ఇందులో భాగంగానే అప్పట్లో 94.90 మెట్రిక్ టన్నుల కారం పొడి, 81.20 మెట్రిక్ టన్నుల చింతపండు, 37.10 మెట్రిక్ టన్నుల పసుపును కొనుగోలు చేశారు. వీటిని సకాలంలో బయట మార్కెట్లో విక్రయించాలనే ఆలోచన రాకపోవడంతో ఫలితంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. చెడిపోకుండా నిల్వ ఉన్న మరో 23 మెట్రిక్ టన్నుల కారంపొడి, 47.7 టన్నుల చింతపండు, 1.1 మెట్రిక్ టన్నుల పసుపును విక్రయించేందుకు ఇటీవల టెండర్ వేశారు. స్పందన లేకపోవడంతో మరోసారి టెండర్‌కు కసరత్తు చేస్తున్నారు.
‘అమ్మహస్తం’ ఎత్తివేత!
Published Mon, Sep 8 2014 3:33 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement