మోసాల చరిత్ర నీది | Motkupalli Narasimhulu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

మోసాల చరిత్ర నీది

Published Tue, May 29 2018 1:56 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Motkupalli Narasimhulu Fires On Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘నమ్మి వెంట ఉన్నందుకు చంద్రబాబు నన్ను మోసం చేశాడు. పార్టీకి దూరం చేసి బలి చేశాడు. నాకు గవర్నర్‌ పదవి ఇప్పిస్తానని మాట తప్పాడు. ఒక్కో రాజ్యసభ సీటును రూ.100 కోట్లకు అమ్ముకున్నాడు’’అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై ఆ పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. టీడీపీ జెండాను ఎన్టీఆర్‌ నుంచి గుంజుకున్న దొంగ చంద్రబాబు అని దుయ్యబట్టారు. పేదోళ్ల జెండాను పెత్తందారులకు అప్పగించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ పగ్గాలను నందమూరి కుటుంబానికి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. పేదోళ్లంతా నందమూరి కుటుంబానికి అండగా ఉంటారే తప్ప చంద్రబాబుకు కాదని అన్నారు. సోమవారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మోత్కుపల్లి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

నీవల్లే ఎన్టీఆర్‌ చనిపోయారు 
చంద్రబాబు చేసిన కుట్రల వల్లే ఎన్టీఆర్‌ చనిపోయారని మోత్కుపల్లి చెప్పారు. ‘‘ఎన్టీరామారావు గారి దయ, ఆశీర్వాదం వల్ల నాలాంటి పేదవాడు రాజకీయాల్లో ఉండగలుగుతున్నారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని ఆయన పార్టీ పెట్టారు. పార్టీ పేదోళ్ల కోసమే కానీ, పెత్తందార్ల కోసం కాదని చెప్పాడు. అలాంటి పార్టీకి నన్ను దూరం చేశారు. ఇప్పుడు నా రాజకీయ జీవితాన్ని బలి తీసుకున్నారు. చంద్రబాబు కుట్రలకు ఎన్టీఆర్‌ బలైపోయారు. ఆయన పేరును రాజకీయాల కోసం వాడుకుంటున్నారే తప్ప మరోటి లేదు.

చివరి వరకు నేను ఎన్టీఆర్‌తోనే ఉన్నా. ఆయన చేయి పట్టుకుని ఉన్నా.. చనిపోయేటప్పుడు రాత్రి 8 గంటల వరకు కూడా నేనున్నా. నాతోపాటు ఇంద్రారెడ్డి, దామోదర్‌రెడ్డి, బుచ్చయ్య చౌదరి, ముద్దుకృష్ణమ నాయుడు ఉన్నారు. ‘తమ్ముళ్లూ నా జెండా గుంజుకున్నాడు. నా పార్టీని గుంజుకున్నాడు. బ్యాంకులో ఉన్న డబ్బు కూడా నాకు రాకుండా చేశాడు. నేనేం చేయాలి’ అని ఎన్టీఆర్‌ ఆవేదన చెందారు. నేను ఇవి రాజకీయాల కోసం చెప్పడం లేదు. నేను పైరవీకారుడిని కాను. ఎన్టీఆర్‌ ఇచ్చిన స్ఫూర్తితోనే బతుకుతున్నా. నా బిడ్డనిచ్చిన పాపానికి ప్రజలు బలైపోతున్నారని ఎన్టీఆర్‌ చెప్పిన నిజాన్ని గుర్తు చేస్తున్నా. చంద్రబాబుకు కావాల్సింది అధికారమే.. ఎన్టీరామారావు గిలగిల కొట్టుకుని చనిపోయింది నీవల్లే..’’ అని అన్నారు. 

అడుగడుగునా మోసాలే.. 
చంద్రబాబు అడుగడుగునా మోసం చేస్తూ నందమూరి వంశాన్ని లేకుండా చేస్తున్నారని మోత్కుపల్లి అన్నారు. ‘‘వెంకటేశ్వరస్వామి నిన్ను పదేళ్లు అధికారానికి దూరం పెట్టినా.. దురదృష్టమేంటో మళ్లీ అధికారంలోకి వచ్చినవ్‌. నాడు అధికారం కోసం, సీఎం పదవి కోసం దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావులను దగ్గర పెట్టుకున్నవ్‌. తర్వాత మోసం చేసి బయటకు పంపినవ్‌. హరికృష్ణని మంత్రిగా చేశాడు. అవసరం కోసం కొన్నాళ్లు ఉంచి ఆయన్ను కూడా పక్కన పెట్టాడు. అడుగడుగునా మోసం చేసి నందమూరి వంశాన్ని లేకుండా చేస్తున్నాడు. బాలకృష్ణను ఏదోలా వాడుకుని ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఉన్నారని అనిపించుకునేందుకే తప్ప ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. వీటన్నింటికీ చంద్రబాబే బాధ్యుడు’’అని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబును ఓడించాలని, ఎన్టీఆర్‌పై అభిమానం ఉన్నవాళ్లెవరూ ఆయనకు ఓటేయవద్దని రెండు చేతులు జోడించి వేడుకున్నారు. 

కులాల మధ్య చిచ్చు పెట్టి.. 
‘‘చంద్రబాబుకు మాల మాదిగల ఓట్లు కావాలి. ఓసారి మాదిగోళ్లు, ఇంకోసారి మాలోళ్లు కావాలి. చెండాలపు కులంలో ఎవరు పుట్టాలని కోరుకుంటారని చెప్పిన ఈయన పేదల కోసం పనిచేస్తున్నానని చెప్పుకునే నటనా చక్రవర్తి’’ అని మోత్కుపల్లి అన్నారు. ‘‘దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ ఏ సీఎం అయినా ఈ దేశంలో మాట్లాడిండా? బీసీలకు, కాపులకు మధ్య కుట్ర చేస్తుండు. కాపులను ఓ పక్క, బీసీలను మరో పక్క ఎగేస్తున్నాడు. కాపులకు రిజర్వేషన్లు సాధ్యమా? ఈయన చేతుల్లో ఉందా..? చివరకు బ్రాహ్మణుల మధ్య కూడా చిచ్చుపెడుతున్నాడు.

చంద్రబాబు ఈ వ్యవస్థకు ముప్పు. చీడ పురుగులా తయారయ్యాడు. అది ఎన్టీఆర్‌ ఇచ్చిన జెండా.. అది నీ సొత్తు కాదు.. నువ్వు చేసుకుంది కాదు. అది మా అందరి జెండా.. పేదోళ్ల జెండా. ఆ జెండాను ఇవ్వాళ పెత్తందారులకు అప్పగించాలని చూస్తున్నాడు. జగన్‌ ఓ జెండా పెట్టుకున్నడు మొగోడు..  పవన్‌ కల్యాణ్‌ ఓ జెండా పెట్టుకున్నాడు మొగోడు.. కానీ నువ్వు గుంజుకున్నవ్‌ ఈ జెండా. ఎన్టీఆర్‌ జెండా దొంగతనం చేసిన దొంగవు నువ్వు. మహానాడులో ఎన్టీఆర్‌ పేరు ఉచ్ఛరించడానికీ నీకు అర్హత లేదు. జగన్‌.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతా అన్నడు. నీకు సిగ్గులేదా? పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్‌ చరిత్ర పెట్టాలని అడిగినా పెట్టవు. నీకు ఎన్టీఆర్‌ అంటే ఈర్ష్య, ద్వేషం. ఆయన బొమ్మ ఎక్కడా ఉండొద్దు. మాసిపోయిన బాబు మొహం తప్ప.. ఎవరి మొహం కనిపించొద్దు’’అని అన్నారు.

నాడు ఆయనపై.. నేడు టీఆర్‌ఎస్‌పై..
నాడు ఎన్టీరామారావుపై కుట్ర పన్నినట్టే ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైనా చంద్రబాబు కుట్ర పన్నారని మోత్కుపల్లి చెప్పారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేశాడు. ఇందులో రేవంత్‌రెడ్డి, చంద్రబాబులిద్దరూ ముద్దాయిలు. ఎన్టీఆర్‌ను ఎలా పతనం చేశారో, కేసీఆర్‌ను అలా బలి చేయాలనుకున్నారు. కానీ కేసీఆర్‌ తెలివైన వాడు కాబట్టి పట్టుకున్నాడు. పట్టపగలు పట్టుకుని వాళ్ల సంగతి తేల్చాడు. రాజ్యాధికారంకోసం పిల్లనిచ్చిన మామను చంపాడు.. అధికారం కోసం ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూడా కూలదోసే ప్రయత్నం చేశాడంటే ఈయన మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోవాలి’’అని అన్నారు. 

ఎంపీ సీట్లను కోట్లకు అమ్ముకున్నాడు 
‘‘చంద్రబాబు 2009–13 వరకు నేను లేనిదే తిండి తినలేదు.. నిద్రపోలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో నీ దగ్గర పురుగు లేకపోయినా నేనున్నా. తోడుగా ఉంటా అన్నవ్‌.. గవర్నర్‌ ఇస్తానన్నవ్‌.. రాజ్యసభ అన్నవ్‌.. చివరికి అమ్ముకున్నవ్‌’’అని మోత్కుపల్లి చెప్పారు. ‘‘కేసీఆర్‌ ఇద్దరు పేదోళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చాడు. గంజి గట్క లేనోళ్లకు ఇచ్చాడు. నువ్వేమో వేల కోట్ల రూపా యల కాంట్రాక్టర్లకు ఒక్కో సీటును రూ.100 కోట్లకు అమ్ముకున్నవ్‌. నువ్వు చేసిన పాపాలన్నింటికీ పరిహారం కావాలంటే క్షమాపణ చెప్పు. పార్టీ పగ్గాలు నందమూరి కుటుంబానికి అప్పగించు. బాలకృష్ణ, హరికృష్ణ లేదంటే జూనియర్‌ ఎన్టీఆర్‌కు అప్పగించు’’అని డిమాండ్‌ చేశారు.  

‘‘జగన్‌ మోహన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌ కలిస్తే నీకు డిపాజిట్లు రావు. జగనేదో పాపాత్ముడు అయినట్టు. ఈయన మాత్రం ఉన్నదంతా అందరికీ పంచినట్టు. ఉన్నది మీరు నలుగురు. మీకు రూ.100 కోట్ల ఇల్లా? హైదరాబాద్‌ వచ్చినప్పుడు పార్క్‌ హోటల్‌లో ఉండి ఎన్ని కోట్లు కిరాయి కట్టినవ్‌? స్పెషల్‌ ఫ్లైట్లలో తిరుగుతున్నవ్‌. ఈ డబ్బులతో ఓ పోలవరం ప్రాజెక్టు వచ్చేది. ఓటుకు రూ.5 వేలు, నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నవ్‌. ఇవన్నీ ఏపీ ప్రజలు గమనించాలి. ఈసారి చంద్రబాబును గెలిపించొద్దు. ఓసారి జగన్‌ను గెలిపించండి. పవన్‌కల్యాణ్‌ను, కమ్యూనిస్టులను గెలిపించండి. ఎన్టీఆర్‌ బలమేంటో నీకు చూపిస్తా. ఆంధ్రాలో నిన్ను ఓడించాలని రథయాత్ర చేస్తా’’అని మోత్కుపల్లి తెలిపారు. 

మోదీ కాళ్లపై పడి బతకలేదా? 
‘‘సిగ్గు లేదా నీకు.. నాలుగేళ్లు మోదీతో జతకడితివి. అడుగడుగునా టీటీడీ లడ్డూ తీసుకెళ్లి, శాలువా కప్పి ఆయన కాళ్ల మీద పడి బతకలేదా’’అని చంద్రబాబును మోత్కుపల్లి ప్రశ్నించారు. ‘నాలుగేళ్లు స్నేహం చేసి హోదా కావాల్నా, ప్యాకేజీ కావాల్నా అంటే ప్యాకేజీ కావాలంటివి. నీ 40 ఏళ్ల అనుభవం ఏమైంది? ప్రత్యేక ప్యాకేజీ కావాలని మోదీని ఎందుకు పొగిడినవ్‌? అసెంబ్లీలో తీర్మానం ఎలా చేశావ్‌? సిగ్గు లేదా? పౌరుషం ఉన్న నాయకుడివి అయితే రాజీనామా చేయాలి. సిగ్గు లేకుండా ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని అంటున్నావు. జగన్, పవన్, కమ్యూనిస్టులూ అందరూ అడుగుతుంటే ఓట్లు ఎక్కడ పోతాయోమోనని యూటర్న్‌ తీసుకున్నడు. మాట మీద నిలబడే వాడే నాయకుడు. చరిత్రలో ఓ నల్లటి పేజీ మాత్రమే నీ కోసం ఉంటుంది. సూర్యచంద్రులున్నంత వరకు ఎన్టీఆర్‌ పేరుంటుంది’’ అని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement