చంద్రబాబు నరహంతకుడు | Motkupalli Narasimhulu Criticised Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నరహంతకుడు

Published Wed, May 30 2018 4:00 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Motkupalli Narasimhulu Criticised Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఆ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు వరుసగా రెండోరోజు మాటల తూటాలు పేల్చారు. చంద్రబాబు నరహంతకుడని, ఆయన అంతటి నీతిమాలిన రాజకీయ నాయకుడు ప్రపంచంలో లేడని మండిపడ్డారు. తనను పార్టీ నుంచి బహిష్కరించడంపై మంగళవారం బేగంపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై కోర్టుల్లో స్టే ఉన్న కేసులను మళ్లీ తెరవాలని, ఆయనపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్రం విచారణ జరిపిస్తే సత్యహరిశ్చంద్రుడి తమ్ముడినని చెప్పుకునే బాబు బండారం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. 

నీ జీవితం కుట్రల నిలయం 
‘నిన్న నా గొంతు కోసేశారు. ఎన్టీఆర్‌ గొంతు కోసినట్టే ఆయన శిష్యుడినయిన నా గొంతు కూడా చంద్రబాబు కోసేశాడు. కనీసం ఉరితీసే ముందయినా చివరి కోరిక అడుగుతారు. ఆ అవకాశం కూడా నాకు చంద్రబాబు ఇవ్వలేదు’’అని మోత్కుపల్లి అన్నారు. ‘‘నువ్వు ఎన్టీఆర్‌పై కుట్ర చేసి గద్దె దింపావ్‌... నరహంతకుడివి నువ్వు. రాజకీయాల్లో నీ అంత నీతిమాలిన వ్యక్తి ఈ దునియాలో లేడు. నీ జీవితమే కుట్రలకు, మోసాలకు నిలయం. ఎన్టీఆర్‌ మనుషులు 20 మంది నీ బాధకు చనిపోయారు. చంద్రబాబు వేధించడం వల్లే ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయాడు. నేనాయన్ని పదవి అడిగిన్నా.. ప్రమాణం చేయి. నా మాటలు బంద్‌ చేస్తా. అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటా. నిన్ను నేను ఏ పదవి అడిగిన? నీ దగ్గర నేను ఆశించింది ఏంటి? గవర్నర్‌ పదవి ఇవ్వమని నేనడిగానా? నువ్వేమైనా ప్రధానివా? రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి బంధువైన గరికపాటి మోహన్‌రావుకు అమ్ముకున్నవ్‌.

ఆత్మను అమ్ముకుని బతికే నీచుడు చంద్రబాబు అని ఎన్టీఆర్‌ చెప్పారు. గవర్నర్‌ ఎలాగూ రాదు కాబట్టి ఆ పదవి ఇస్తానని చెప్పాడు. నేను లేకపోతే ఇంట్లోంచి బయటకు రాని పిరికిపందవు నువ్వు. పనికిమాలిన నాయకులతో నన్ను తిట్టిస్తున్నవ్‌. మగాడివైతే నాతో నువ్వు మాట్లాడు. మోదీ దగ్గరికెళ్లి అరుణ్‌జైట్లీ, కేసీఆర్‌ కాళ్లు పట్టుకోలేదా? కేసీఆర్‌ గురించి మాట్లాడాలంటే గజగజ వణుకుతున్నవ్‌. పదేళ్లు ఇక్కడే ఉండి పార్టీని కాపాడతానని చెప్పిన నువ్వు అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా సర్దుకుని పోయినవ్‌. నువ్వు పోయింది అమరావతి కోసం కాదు. కేసీఆర్‌ ఒక్క లాత్‌ కొడితే అక్కడ పడ్డవ్‌. తెలంగాణలో పార్టీని సర్వనాశం చేసినవ్‌. నా మీద ఏమైనా మాట్లాడితే పురుగులు పడి చస్తవ్‌. నేనెవరికీ అన్యాయం చేయలే. నువ్వు నాకు అన్యాయం చేసినవ్‌. సిగ్గు లేదా నీకు. నువ్వు కులగజ్జి ఉన్నోడివి. రేవంత్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు నేను మాదిగ వ్యక్తినని నా మీద చర్యలు తీసుకుంటవా?’’అని మోత్కుపల్లి ప్రశ్నించారు. 

నువ్వు నన్ను సస్పెండ్‌ చేసేదేంది? 
‘దుర్మార్గుడివి, పాపాత్ముడివి, దుష్టుడివి అయినా నీతోనే ఉండాలనుకున్నా. ఎన్టీఆర్‌ని చంపినా ఆయన పెట్టిన జెండా కోసం నీతోనే ఉండాలనుకున్నా. నీ కోసం నన్ను వాడుకుని ప్రపంచమంతా నన్ను చెడ్డోడిని చేసిండు. నువ్వు నన్ను సస్పెండ్‌ చేసేదేంది? తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిన్ను సస్పెండ్‌ చేశారు’’అని బాబును మోత్కుపల్లి దుయ్యబట్టారు. ‘‘ఆంధ్ర ప్రజలు కూడా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. నిన్ను పాతాళంలో బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నరు. నువ్వొక చవటవి. నువ్వొక దిగజారిన నాయకుడివి. బ్రోతల్‌ హౌజ్‌ నడిపినట్టు నడుపుతున్న రాజకీయ విధానం నీది. నేను పార్టీని విలీనం చేయమన్ననా? నువ్వే పార్టీని ఓటుకు కోట్లు కేసప్పుడే టీఆర్‌ఎస్‌లో విలీనం చేసినవ్‌. నీ మనస్సాక్షే నీకు ఏదో ఒకరోజు గుణపాఠం చెపుతుంది’’అని అన్నారు. 

నీ వల్లే రాజకీయ వ్యవస్థ దెబ్బతింది 
‘‘చంద్రబాబూ.. నీకు స్నేహానికి విలువే తెలియదు. నువ్వు లేకపోయినా జగన్‌ ప్రత్యేక హోదా తెస్తాడు. వేరే పార్టీ వాళ్లు తెస్తరు. నాలుగేళ్లు నువ్వు ఏం పొడిచినవని నీకు 25 సీట్లు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు’’అని మోత్కుపల్లి ప్రశ్నించారు. ‘‘ఇప్పటికే ఎన్నికల కోసం నియోజకవర్గానికి రూ.25 కోట్లు పంపినవ్‌. నీ వల్లనే డబ్బు ప్రభావం వచ్చింది. రాజకీయ వ్యవస్థ దెబ్బతిన్నది నీ వల్లే. ఎన్నికలలో చంద్రబాబు నాయకత్వంలో పెట్టినంత ఖర్చు ఏ నాయకుడి ఆధ్వర్యంలో పెట్టలేదు. వాజ్‌పేయిని ప్రధాని నేనే చేసిన అంటడు. మోదీని నేనే చేసిన అంటడు. అబ్దుల్‌కలాంను రాష్ట్రపతిని నేనే చేసినా అంటడు. సిగ్గు లేదా నీకు? ఇన్ని చేసినోడివి ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు తీసుకురాలేదు’’అని నిలదీశారు. 

సింగపూర్, దుబాయ్‌లో దాస్తున్నవ్‌ 
‘నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నవో తెలియదా? సింగపూర్, దుబాయ్‌లో, అమెరికాలో దాస్తున్నావ్‌’అని మోత్కుపల్లి అన్నారు. ‘‘కాపులు, బీసీలు, దళితులు, బ్రాహ్మణులు, ఎన్టీఆర్‌ కుటుంబంలో పంచాయతీలు పెట్టినవ్‌. అన్ని కులాల్లో పంచాయతీలు పెట్టినవ్‌. కొద్దిరోజుల్లోనే నేను వెంకటేశ్వరస్వామి మెట్లెక్కుతా. బాబును ఓడించి వస్తా. నేనెన్నడూ నా గురించి అడగలేదు. ఈ దొంగ చంద్రబాబును రాజకీయంగా బొందపెట్టమని ప్రార్థిస్తున్నా.. నాకు మోకాళ్ల నొప్పులున్నా ఏడుకొండల మెట్లెక్కి వస్తా. ఒక్క మెట్టు మీద నేను చచ్చినా ఫర్వాలేదు. వెంకటేశ్వరస్వామీ.. అతడిని ఓడించు. నీ భక్తుడయిన ఎన్టీఆర్‌ ఆత్మకు శాంతి కలిగించు’’అని వ్యాఖ్యానించారు. 

కమ్మ కులస్తులారా.. బాబును ఓడించండి! 
‘‘కమ్మ కులస్తులారా.. ఒక్కసారి చంద్రబాబును ఓడించండి. మరోసారి నందమూరి కుటుంబీకులను గెలిపిద్దాం. దళితులు, ఎన్టీఆర్‌ అభిమానులు ఎవరూ చంద్రబాబుకు ఓటేయొద్దు. ఎన్టీరామారావు అల్లుడు కావడంతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అదృష్టం. ఆ రోజు సంబంధం కుదిరించింది ఎవరో. వాడి బొంద కాలా. ఆ పెళ్లి కుదిర్చి మమ్మల్ని, ప్రజల్ని చంపారు. నన్ను ఏ రాత్రి ఏం చేస్తాడోనని భయముంది. చంద్రబాబుతో నాకు భయముంది. కేంద్రం ఈ మొనగాడిపై సీబీఐ విచారణ చేయాలె. మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. జగన్‌ ఏమన్నా మంత్రా, ముఖ్యమంత్రా? ఆయన తీసుకునేటప్పుడు నువ్వు ఏమైనా చూశావా? నీ కొడుకు చేసేది ఎవరైనా చూస్తున్నారా. మీ ఇద్దరు కలిసి అమెరికా, సింగపూర్, దుబాయ్‌ పోతుంటే ఎవరైనా పట్టుకున్నారా? అందుకే కేంద్రాన్ని అడుగుతున్నా. చంద్రబాబుపై సీబీఐ ఎంక్వైరీ వేయండి. స్టేలున్న 29 కేసులను రీఓపెన్‌ చేయండి. ఈయన బండారం బయటపడుతుంది. నా జీవితమంతా ధారపోసినా ఈ భ్రష్టుడి కోసం. ఈ వెధవ కోసం. నీకు దిక్కు లేకపోతే దిక్కు నిలబడ్డా. సిగ్గుమాలినోడా. విశ్వాస ఘాతకుడా? నీతిమంతుల ముందు ఈ పాపాల భైరవుడు నిలబడలేడు’’అని మోత్కుపల్లి అన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement