సత్యనారాయణను సత్కరిస్తున్న మండలి బుద్ధప్రసాద్, చక్రపాణి తదితరులు
విజయవాడ కల్చరల్: సీనియర్ ఎన్టీఆర్‌తో సన్నిహితంగా ఉన్నవారిని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టేసిందని సినీ నటుడు, టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు కైకాల సత్యనారాయణ చెప్పారు. విజయవాడలో శుక్రవారం మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో సత్కారం అందుకోవడానికి వచ్చిన ఆయన సాక్షితో మాట్లాడారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడినైన తనను సలహాల కోసం టీడీపీ ప్రభుత్వం ఏనాడూ సంప్రదించలేదన్నారు. టీడీపీ ప్రారంభం నుంచి ఎన్టీఆర్‌తో కలసి తిరిగానని, ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడానికి అన్నగారు ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే విధి అనుకూలించక అది సాధ్యం కాలేదన్నారు.
ఆ తర్వాత మచిలీపట్నం నుంచి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచానని తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ తనను నమ్ముకున్నవాళ్లకి ఏదోఒకటి చేశారని గుర్తు చేశారు. నమ్మకద్రోహంతో పదవి పోగొట్టుకొన్న సమయంలోనే ఎన్టీఆర్ గతంలో ఎప్పుడూ లేనంతగా బాధపడ్డారని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రభుత్వ పురస్కారాల వెనక పెద్ద లాబీ ఉండాలని, అది తనకు లేదన్నారు. ప్రభుత్వం నామినేట్ చేయాలని, కారణం అడిగితే పార్టీ సభ్యుడివి అంటారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నం చేసినట్లు తనకు ఎక్కడా కనిపించలేదన్నారు. నేడు పద్మశ్రీ,, పద్మభూషణ్ పురస్కారాలు పొందిన వారు ఏదోఒక పార్టీతో అనుబంధం ఉన్నవారేనన్నారు.
పురస్కారాలు నటీనటుల బాధ్యతను మరింత పెంచుతాయి
పురస్కారాలు నటీనటుల బాధ్యతను మరింత పెంచుతాయని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కేంద్రం సంస్థలు సంయుక్తంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం లో శుక్రవారం కైకాల సత్యనారాయణకు ఆత్మీయ సత్కారం నిర్వహించాయి. ఈ సందర్భంగా కైకాల మాట్లాడుతూ.. నటనను తపస్సులా భావించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment