టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతితో టాలీవుడ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా,కామెడీ పాత్రల్లో దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించారాయన. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఉన్న ఇష్టంతో 1959లో ‘సిపాయి కూతురు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.మొదటి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా నిండైన రూపం, కంచు కంఠంతో కైకాల అందరి దృష్టిని ఆకర్షించారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ పోలికలకు దగ్గరగా ఉండడం సత్యనారాయణకు కలిసొచ్చింది.
ఈ విషయం గ్రహించిన ఎన్టీఆర్ కూడా ఆయనకు తన సినిమాల్లో అవకాశాలిచ్చారు. ఇక వీరిద్దరు కలిసి 100సినిమాలకు పైగా నటించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ పోలికలు ఉండటంతో తొలి రోజుల్లో ''రాముడు-భీముడు' వంటి ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా నటించారు.నటనలోనే కాదు.. రాజకీయ రంగంలో కూడా ఆయనతో కలిసి అడుగులేశారు సత్యనారాయణ. 1996లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
ఇక ‘ఉమ్మడి కుటుంబం’ సినిమాలో ఓ పాత్రకోసం ఎన్టీఆర్‌కే సవాల్ విసిరారు కైకాల. అప్పటికే విలన్‌గా రాణిస్తున్న కైకాల ఈ చిత్రంలో సెంటిమెంట్ పాత్ర చేయగలడా అని సందేహంతో కైకాలను వద్దని చెప్పారట ఎన్టీఆర్. దీంతో కైకాల.. రెండు రోజులు షూట్ చేయండి, నేను చేసింది నచ్చకపోతే పంపించేయండి అంటూ ఎన్టీఆర్ కి సవాలు విసిరారు. ఇక చేసేది లేక ఆ పాత్రని కైకాలతో చేయించిన ఎన్టీఆర్.. ఆ తరువాత కైకాల నటన చూసి ప్రశంసించకుండా ఉండలేకపోయారట. ఇలా ఎన్టీఆర్‌తో కైకాల ప్రత్యేక అనుబంధం ఉండేదని గుర్తుచేసుకుంటున్నారు సినీ విశ్లేషకులు.
Comments
Please login to add a commentAdd a comment