Kaikala Satyanarayana Film Career And Special Bonding With NTR - Sakshi
Sakshi News home page

Kaikala Satyanarayana: కైకాల.. లక్ష నక్షత్రాల నటుడు

Published Sat, Dec 24 2022 9:52 AM | Last Updated on Sat, Dec 24 2022 12:49 PM

Kaikala Satyanarayana Film Career And Bonding With Ntr - Sakshi

నటుడు తెలిసిపోయాక నటన తెలియడమే బాకీ ఉంటుంది. అదే ముఖం... ప్రతి పాత్రా పోషించాలి. అదే రూపం... ప్రతి వేషం పండించాలి. అదే మాట... ప్రతి రసం చిందించాలి. అదే బాట... ప్రతి అడుగు కొత్తగా పడుతుండాలి. తెర మీద నవ రసాలు పోషించడానికి ఐదు దశాబ్దాల పాటు బహురపిగా వరిన అసామాన్య ప్రతిభా సంపన్నుడు కైకాల. తన అభినయంతో, వాచకంతో, కర్కశత్వంతో, కనికరంతో ప్రేక్షకులను భయపెట్టాడు. బాధ పెట్టాడు. నవ్వించాడు. ఏడ్పించాడు. అంతిమంగా తెలుగువారి ఇంటి మనిషిగా మారిపోయాడు. హీరోలు సూపర్‌ స్టార్లే. కాదనం. కాని ప్రేక్షకుల నుంచి అత్యధిక స్టార్లు పొందినవాడు కైకాల. నిజంగా అతడు లక్ష నక్షత్రాల నటుడు.

యముడు తెలుగువాడు. అతడు అచ్చు మన కైకాల సత్యనారాయణలాగా ఉంటాడు. కన్ఫర్మ్‌. ఎలానో తర్వాత తెలుసుకుందాం. ∙∙ గిరాకీ సందర్భాలు, గీటురాయి సందర్భాల్లోనే మనమంటే ఏంటో తెలుస్తుంది. 1976. ఒకేసారి ఇండస్ట్రీలో రెండు పెద్ద సినిమాలు. ‘దాన వీర శర కర్ణ’. ‘కురుక్షేత్రం’. ఒక సినిమా ఎన్టీఆర్‌ది. ఒక సినిమా కృష్ణది. హోరాహోరి పోటాపోటీ. ఇటు మేకప్‌ అటు అంటకూడదని పంతం. ఇటు కాస్ట్యూమ్‌ అటు కనపడకడదని ఆదేశం. ఈ సెట్‌ మీద నుంచి ఆ సెట్‌ మీదకు వాలలేక కాకులన్నీ కకావికలం అయిపోయాయి. అలాంటి సందర్భంలో కైకాల సత్యనారాయణ మాత్రం తాపీగా ఉన్నాడు. రెండు సినిమాల్లోనూ ఉన్నాడు. ‘అదెలా బ్రదర్‌. ఆ సినిమా వదలుకోండి’ అన్నాడు ఎన్టీఆర్‌. ‘వాళ్లు ముందు అడ్వాన్స్‌ ఇచ్చారు సార్‌’ అన్నాడు కైకాల. ఎన్టీఆర్‌ ఆలోచనలో పడ్డాడు. ‘దాన వీర శర కర్ణ’లో భీముడి వేషం– కైకాలే వేయాలి. ‘తప్పదా బ్రదర్‌?’ ‘తప్పదు సార్‌’ మరుసటి రోజు ఇండస్ట్రీలో న్యూసు. రెండు సినిమాల్లోనూ నటించడానికి కైకాలకు ఎన్టీఆర్‌ స్పెషల్‌ పర్మీషన్‌ ఇచ్చాడట. ఏమిటతని గొప్ప?

ఎస్వీఆర్‌కు దీటుగా కైకాల..
‘అరివీర భయంకరుడగు కురురాజునకు ప్రతిజోడు భీమబలుడగు భీమసేనుడు. ఉభయులూ గదా యుద్ధ ప్రదర్శన గావింప మేము ఆదేశించుచున్నాము’ ‘దానవీరశూర కర్ణ’లో ద్రోణాచార్యుడైన రాజనాల ఆదేశం అందగానే గదతో బరిలో దూకిన సింహం– సుయాధనుడు ఎన్టీఆర్‌. గదా యుద్ధం మొదలైంది. షాట్‌లో గదతో కొడుతున్నట్టు అభినయిస్తే చాలు. కాని ఎన్టీఆర్‌కు ఆవేశం వస్తే నిజమైన బలమే చూపిస్తాడు. అందుకే గదను శక్తి కొద్ది విసురుతున్నాడు. బలం కొద్ది బాదుతున్నాడు. మరొకడైతే వేషం వదిలి పారిపోయేవాడే. కాని ఎదుర్కొంటున్నది కైకాల. పులిలా కదులుతున్నాడు. గదకు గద.. బలానికి బలం.. జబ్బకు జబ్బ. ఉద్విగ్నమైన ఆ భీమ సుయోధనుల పోరాటం కౌరవ సభకే కాదు ప్రేక్షకులకు కూడా వణుకు పుట్టించింది. కరతాళధ్వనులు. ఒకప్పుడు ఆకారంలో ఆహార్యంలో ఎన్టీఆర్‌ను నిలువరించగలిగినవాడు ఎస్వీఆర్‌. ఇప్పుడు? కైకాల. ఎన్టీఆర్‌ కైకాలను ఎందుకు వదలుకోలేకపోయాడో ఇండస్ట్రీకి ఆధారంతో సహా అర్థమైంది. కైకాల నటుడుగా మరో మెట్టు ఎదిగాడు. 

మెస్‌ టికెట్లకు కూడా డబ్బులివ్వలేదు
ఎన్టీఆర్, ఏ.ఎన్‌.ఆర్‌. ఒక గొప్ప కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌ ఆ జిల్లాలోనే పుట్టాడు. ఎస్వీ రంగారావు. ఆ గాలి సోకకుండా ఉండటం కష్టం. గుడివాడకు దాపున కౌతారంలో పుట్టిన సత్యనారాయణ స్కూల్, కాలేజీ రోజుల్లోనే నాటకాలు వేసేవాడు. అందంగా ఉండేవాడు. బుగ్గలు తగు వత్రం ఉండటం చేత హావభావాలు పలికేవి. ఎన్టీఆర్‌కు తమ్ముడిలా ఉన్నావని పోలిక ఒకటి. డిగ్రీ అయిపోయాక కుటుంబానికి ఉన్న కలపడిపో నడుపుకుంట కూచుంటే జీవితం వెళ్లమారిపోతుంది. కాని నటన అనే పురుగు కుట్టింది. అది రైలెక్కు... రైలెక్కు అని చెవిలో రొద కూడా పెట్టసాగింది. రైలెక్కించింది.

1956– తన 21వ ఏట మద్రాసుకు చేరుకున్నాడు సత్యనారాయణ. పెద్ద నగరం. తెలియని భాష. తెలియనట్టు ఉన్న తెలుగువారు. ప్రోత్సహించినవారు తోడు రాలేదు. మెస్‌ టికెట్లకు డబ్బులివ్వలేదు. వేషాలూ ఇప్పించలేదు. అవన్నీ తానే సమకూర్చుకోవాలి అని అర్థమయ్యాక ఉక్కిరి బిక్కిరిగా అనిపింంది సత్యనారాయణకు. కొన్ని దెబ్బలు కుంగదీశాయి. కొన్ని చరుపులు నేలకు కరిచేలా చేశాయి. హీరోగా తొలి సినిమా ‘సిపాయి కూతురు’ ఫ్లాప్‌ అయ్యింది. వేషాలు తెల్లముఖం వేశాయి. చివరకు? తెర మీద మాయలనూ మంత్రాలను నమ్మే దర్శకుడు విఠలాచార్య నిజ జీవితంలో మాత్రం సత్యనారాయణను పరిశీలించి చూసి అతడిలోని టాలెంట్‌ను నమ్మాడు. విఠలాచార్య వల్ల సత్యనారాయణ కేరెక్టర్‌ ఆర్టిస్టుగా మారాడు. కాదు కాదు విలన్‌గా. ‘నవగ్రహ పూజా మహిమ’లో మొదటిసారి విలన్‌ వేషం కట్టాడు. విఠలాచార్య నమ్మకం సరైనదే. ఆ తర్వాతి కాలంలో అతడు ఇండస్ట్రీని ఏలబోతున్నాడు.

‘నిప్పులాంటి మనిషి’ ఎస్వీఆర్‌ మెచ్చిన సత్యనారాయణ
పోలికలతో చెప్తే సరిపోతుంది. హిందీలో ప్రాణ్‌తో సమానమైనవాడు కైకాల సత్యనారాయణ. ప్రాణ్‌ కూడా విలన్‌. కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌. కామెడీ చేస్తాడు. ఏ హీరోకైనా దీటుగా నటిస్తాడు. సత్యనారాయణ ఇండస్ట్రీకి వచ్చే వేళకు ఎస్వీఆర్‌ రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్నాడు. రాజనాల విలన్‌గా ఏలుతున్నాడు. కాని రాజనాల విలనీ మాత్రమే చేయగలడు. కేరెక్టర్లకు నప్పడు. నాగభూషణం డైలాగ్‌ ఆర్టిస్టే కాని ఫైటింగ్‌లకు పనికి రాడు. ఫైటింగ్‌లు చేస్త నటన కూడా చేస్త ఇతర పాత్రలు కూడా పండించే ప్రాణ్‌ వంటి వాడే ఇప్పుడు ఇండస్ట్రీకి కావాలి. ఆ వాడు– కైకాల. ఈ సంగతి ఎస్వీ రంగారావే కనిపెట్టాడు. ‘జంజీర్‌’ను తెలుగులో ‘నిప్పులాంటి మనిషి’గా రీమేక్‌ చేస్తుంటే ప్రాణ్‌ కేరెక్టర్‌ను నిర్మాతలు ఎస్వీఆర్‌నే వేయమన్నారు. ఆయన ‘జంజీర్‌’ చూసి ‘ఈ వేషాన్ని ఇప్పుడు నేను వేయలేను. ఎనర్జీ కావాలి. సత్యనారాయణతో చేయించండి’ అన్నాడు. సత్యనారాయణ ‘షేర్‌ఖాన్‌’ వేషం వేశాడు. ‘నిప్పులాంటి మనిషి’లో నిప్పులాంటి కేరెక్టర్‌. సత్యనారాయణ ఇప్పుడు నటుడిగా పూర్తిగా స్థిరపడ్డాడు. అతణ్ణే ముఖ్యపాత్రగా చేసి సినిమాలు తీస్తున్నారు.

‘దేవుడే దిగివస్తే’, ‘తాయారమ్మ– బంగారయ్య’, ‘పార్వతీ పరమేశ్వరులు’, ‘నా పేరే భగవాన్‌’, ‘వ వూళ్లో మహా శివుడు’, ‘మొరటోడు’.. రావు గోపాలరావు, సత్యనారాయణ, అల్లురామలింగయ్య ఫార్ములా టీమ్‌గా మారారు. కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి ఈ టీమ్‌ను ఎక్కువగా ఉపయోగించారు. ‘వేటగాడు’లో రావు గోపాలరావు ప్రాసల పరోటాలు విసిరితే పై నుంచి కింద వరకు ఒకే రంగు డ్రస్సు వేసుకుని కనిపించే సత్యనారాయణ నవ్విస్తాడు.∙∙ కొన్నిసార్లు నటులు పాత్రలను వెతుక్కుంటూ వెళతారు. కొన్నిసార్లు పాత్రలు నటులను వెతుక్కుంటూ వస్తాయి.

రచయిత డి.వి.నరసరాజు యముణ్ణి మెయిన్‌ రోల్‌గా తీసుకుని ‘యమగోల’ స్క్రిప్ట్‌ రాశాడు. ఎన్టీఆర్‌ చేత యముడి వేషం, బాలకృష్ణ చేత హీరో వేషం వేయించాలని  ప్లాన్‌. కాని స్క్రిప్ట్‌ విన్న ఎన్టీఆర్‌ యముడి పాత్రలోని కామెడీ టచ్‌కు పగలబడి నవ్వి ‘హీరో పాత్ర నేను వేస్తాను. యముడి వేషం సత్యనారాయణ చేస్తాడు’ అన్నాడు. అలా తెలుగు తెర మీద మరెవరికీ వీలవని, మరెవరూ మెప్పించలేని, తనకు మాత్రమే సరిపోయిన, తనకే అద్భుతంగా కుదిరిన యముడి పాత్ర సత్యనారాయణకు దక్కింది. ‘యముండా’ డైలాగ్‌ ఇంటింటా మోగింది.

యముడంటే కైకాల సత్యనారాయణే..
సాధారణంగా యముడంటే అందరికీ భయం. కాని సత్యనారాయణ వల్ల తెలుగువారికి ఆ భయం పోయింది. సినిమాల్లో యముడు సత్యనారాయణ వల్ల ప్రియమైన వాడుగా మారిపోయాడు. ‘యమగోల’ను తమిళంలో శివాజీ గణేశన్‌తో రీమేక్‌ చేశారు. యముడి వేషం ఏకంగా శివాజీ గణేశనే చేశాడు. ఫ్లాప్‌ అయ్యింది. ఎందుకంటే యముడు తెలుగువాడు. తెలుగుదనం ఉన్నవాడు. సత్యనారాయణతనం ఉన్నవాడు. అందుకే ఇక్కడ నచ్చినట్టుగా అక్కడ నచ్చలేదు. ఇదే సినిమా హిందీలో జితేంద్రతో రీమేక్‌ చేస్తే యముడి వేషం గ్రేట్‌ యాక్టర్‌ ప్రేమ్‌నాథ్‌ వేశాడు. రిజల్ట్‌ డిటో. ఆ తర్వాత సత్యనారాయణ యముడిగా చేసిన ‘యముడికి మొగుడు’ తమిళంలో రజనీకాంత్‌తో రీమేక్‌ అయ్యింది.యముడి వేషం పాపులర్‌ ఆర్టిస్ట్‌ విను చక్రవర్తి చేశాడు. ఫ్లాప్‌. సత్యనారాయణ యముడిగా చేసిన ‘యమలీల’ తమిళంలో కార్తిక్‌ హీరోగా రీమేక్‌ చేస్తే యముడిగా కమెడియన్‌ గౌండర్‌మణి వేశాడు. ఫ్లాప్‌. ‘యమలీల’ హిందీ రీమేక్‌లో యముడు ఖాదర్‌ఖాన్‌. ఫ్లాప్‌. యముడు తెలుగువాడు. అతడు అచ్చు సత్యనారాయణలాగా ఉంటాడు. ఇది కన్ఫర్మ్‌. సత్యనారాయణ తర్వాత తెలుగులో యముడిగా వేసినవారు ఎవరూ తెలుగువారికి నచ్చలేదు.

ఇక మీదట నచ్చబోరు. కైకాల ఒక పాత్రను అలా తన పేరుతో తెలుగువారికి కానుకగా ఇచ్చాడు. ఈ సీన్‌ చూడండి– ‘యమగోల’లో భూలోకం వచ్చి నగరమంతా బలాదూరు తిరిగాక ఆకలికి యముడి డైలాగ్‌: ఏమది... కడుపులో ఒక మాదిరిగా ఉన్నది. దానికి చిత్రగుప్తుడైన అల్లు జవాబు: నాకు రెండు మాదిరులుగా ఉన్నది ప్రభూ. ప్రేక్షకులకు వచ్చే నవ్వు జీవితకాలం స్మరణకొస్తుంటుంది. మంచి దర్శకులు మంచి పాత్రను రాసుకుని ఆ పాత్రను మంచి నటుడు చేస్తుంటే తెగ ఎంజాయ్‌ చేస్తారు. ఆ నటుడికి మరిన్ని మంచి పాత్రలు రాస్తారు. కె.విశ్వనాథ్‌ కైకాలను ఉత్తమంగా తన పాత్రల కోసం ఉపయోగించాడు. కైకాల ఎబిలిటీస్‌ని బయటకు తెచ్చాడు. తెలివైన ప్రేక్షకుల ఇంటెలెక్చువల్‌ లెవల్స్‌కు కైకాలను మేచ్‌ చేశాడు.

తిడుతూ ఉత్తరాలు రాసినవాళ్లే
'శారద’, ‘జీవనజ్యోతి’, ‘సిరిసిరి మువ్వ’, ‘శుభలేఖ’, ‘జననీ జన్మభమి’, ‘శ్రుతిలయలు’, ‘సత్రధారులు’... వీటన్నింటిలో కొత్త సత్యనారాయణను చస్తాం. ‘శుభలేఖ’లో  పొలిటీషియన్‌ ఆదిశేషయ్యగా కటువుగా ఉంటూనే సొంత కొడుకుల పట్ల ఎనలేని ప్రేమ ఉన్నవాడిగా ప్రతి మాటను రెండుసార్లు పలికే మేనరిజంతో సత్యనారాయణ గొప్పగా నటిస్తాడు. ‘శారద’లో శారద అన్నయ్యగా వేసిన పాత్రకు వచ్చిన పేరు తెలియంది కాదు. విలన్‌గా చూసి అప్పటి వరకూ ‘ఆ సత్తిని కత్తితో పొడవాలి.. అతని చేతులిరగా.. కాళ్లిరగా’ అని శాపనార్థాలు పెట్టిన ఆడవాళ్లు ‘శారద’ తర్వాత కైకాలలో అన్నను చూసుకోవడం మొదలుపెట్టారు. తిడుతూ ఉత్తరాలు రాసినవాళ్లే ‘జీవితంలో మీలాంటి అన్నయ్య మాకు లేడనేది కొరతగా ఉందండీ’ అని రాశారు. ‘దేవుడు చేసిన మనుషులు’, ‘జ్యోతి’, ‘బ్రహ్మం గారి చరిత్ర’, ‘ఇల్లాలి కోరికలు’, ‘మండే గుండెలు’, ‘అన్వేషణ’... ఈ సినిమాల్లోని సత్యనారాయణ సవాలు చేసేలా నటించే సత్యనారాయణ. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, శోభన్‌బాబుల తరం వెళ్లింది. సత్యనారాయణ ఉన్నాడు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్‌ తరం వచ్చింది. సత్యనారాయణ ఉన్నాడు.

ఎన్టీఆర్‌ నుంచి మహేశ్‌ బాబు వరకు..
జూనియర్‌ ఎన్టీఆర్, మహేశ్‌బాబు తరం వచ్చింది. సత్యనారాయణ కొనసాగాడు. ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘సమర సింహారెడ్డి’, ‘మురారి’, ‘అరుంధతి’ సత్యనారాయణ పాత్రలు చేస్తనే వెళ్లాడు. ఆయన నటించిన చివరి చిత్రం ‘మహర్షి’ అయినా దాదాపు చివరి చిత్రంగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్‌ బయోపిక్‌ ‘కథానాయకుడు’ సినిమానే. తనకెంతో ఇష్టమైన ఎన్టీఆర్‌ బయోపిక్‌లో సత్యనారాయణ హెచ్‌.ఎం.రెడ్డి పాత్రను పోషించడం ప్రకృతి మెచ్చే ముగింపుగా చెప్పుకోవచ్చు. సత్యనారాయణ ఒక అచ్చమైన నటుడు అని తెలుగువారు ఎందుకు చెప్పుకోవాలంటే ఆయన ఇతర భాషలకు సూట్‌ కాడు. కాలేడు. ఆయన రూపం, మాట, బాడీ లాంగ్వేజ్‌ అన్నీ తెలుగుదనం నిండినవే. కొన్ని రకాల వృక్షాలు, పక్షులు, కొన్ని రకాల గిరులు, కొన్ని జలపాయలు కొన్ని ప్రాంతాలలోనే ఉంటాయి. మన్నుతాయి. ఆ ప్రాంతం వారికే సొంతమవుతాయి. అలా తెలుగువారికి సొంతమైనవాడు కైకాల సత్యనారాయణ. స్వర్గం, నరకం ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. కాని సత్యనారాయణ మరణంతో స్వర్గపురికి అభినవ యముడిని సాగనంపుతున్న అనుభూతి వత్రం తెలుగు వారికే సొంతమైంది. కైకాల సత్యనారాయణకు సగౌరవ నివాళి. తల వొంచి వీడ్కోలు.
- ఖదీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement