Actress Roja Ramani Interesting Comments About NT Rama Rao Movies, Deets Inside - Sakshi
Sakshi News home page

Roja Ramani: నేను ఎన్టీఆర్‌ కాళ్ల మీద పడి ఏడుస్తుంటే రాఘవేంద్రరావు చూస్తూ నిలబడ్డారు

Published Sat, Apr 29 2023 11:22 AM | Last Updated on Sat, Apr 29 2023 1:12 PM

Actress Roja Ramani About NT Rama Rao Movies - Sakshi

నటిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా తెలుగు చిత్రసీమలో రాణించింది రోజా రమణి. బాలనటిగా భక్తప్రహ్లాదతో అబ్బురపరిచిన ఆమె ఆ తర్వాతి కాలంలో హీరోయిన్‌గానూ అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్‌గా బిజీ అవుతున్న సమయంలో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. తెలుగు హిట్స్‌ అయిన ఆడపడుచు, లవకుశ, సతీ అనసూయ ఒరియా రీమేకుల్లో హీరో చక్రపాణితో కలిసి నటించింది రోజా రమణి. వీరిద్దరూ కలిసి నటించిన కవి సామ్రాట్‌ ఉపేంద్ర బంజు అక్కడ పెద్ద హిట్‌.

వీరి స్నేహం ప్రేమగా మారడం, దాన్ని పెద్దలు ఆశీర్వదించడంతో పెళ్లి జరిగిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు. అందులో ఒకరు తరుణ్‌ హీరోగా ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన కొంతకాలం వరకు కుటుంబానికే పెద్ద పీట వేస్తూ సినిమాలకు దూరమైంది రోజా రమణి. నటించడం మానేసినా 1984 నుంచి డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మారి స్క్రీన్‌పై తన గొంతు పలికించింది. దాదాపు 300 మంది హీరోయిన్లకు గాత్రదానం చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో దివంగత నటుడు నందమూరి తారక రామారావు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

'నందమూరి తారకరామావు అంటే నాకు ఎంతో అభిమానం. ఆయనతో నటించడం నా అదృష్టం. ఆయనతో మొదటిసారి 'తాతమ్మ కల' చేశాను. ఈ చిత్రంలో ఆయన నటించి, దర్శకత్వం వహించడమే కాక స్వయంగా నిర్మించారు. ఆయనతో నాలుగైదు సినిమాలు చేశాను. డ్రైవర్‌ రాముడు సినిమాలో ఏమని వర్ణించను.. పాట చాలా పెద్ద హిట్‌. ఈ సినిమాలో నేను కళ్లు లేని అమ్మాయిగా, ఆయనకు చెల్లిగా నటించాను. ఆ పాట చివర్లో నేను చిన్న బిట్‌ పాడుతూ ఎన్టీఆర్‌ కాళ్ల మీద పడి ఏడుస్తూ ఉండిపోయాను. డైరెక్టర్‌ రాఘవేంద్రరావు మమ్మల్ని చూసి ఎమోషనలై కట్‌ చెప్పకుండా సీన్‌లో లీనమైపోయారు.

ఓ సంఘటన నాకింకా గుర్తుంది. విజయవాడ కృష్ణా బ్యారేజ్‌ మీద షూటింగ్‌ జరుగుతోంది.. సూసైడ్‌ చేసుకోవడానికి పరుగెత్తుతున్నాను. నా వెనకాల హరికృష్ణ గారు ఆగు, చెల్లెమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నడిరోడ్డు మీద ఎన్టీ రామారావు డైరెక్షన్‌ చేస్తున్నారు. వేలాదిమంది జనం గుమిగూడి షూటింగ్‌ చూస్తున్నారు. నేను బ్యారేజీ రెయిలింగ్‌ దగ్గర కాస్త హైట్‌ కోసం ఖాళీ క్యాన్ల మీద నిలబడ్డాను. ఆ క్యాన్లు ఊగిపోతుండటంతో రామారావు వెంటనే వచ్చి నేను పడిపోకుండా నా కాళ్లు పట్టుకుని యాక్ట్‌ చేయమన్నారు. కాస్త అజాగ్రత్తగా ఉన్నా నిజంగా అక్కడ సూసైడ్‌ జరుగుతుందని ఆయన భయపడ్డారు. అందుకే ఆయనే స్వయంగా వచ్చి వేలాది మంది జనం ముందు ఏమాత్రం ఆలోచించకుండా కాళ్లు పట్టుకున్నారు. ఆయన చేసిన పనికి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి' అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది రోజా రమణి.

చదవండి: ఆ హీరోతో డేటింగ్‌.. మరో హీరోతో లవ్‌ అంటూ రూమర్స్‌.. ఎట్టకేలకు క్లారిటీ
ఆ ఓటీటీలోకి రానున్న ఏజెంట్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement